స్మార్ట్ వే: ఈ రోడ్డు స్మార్ట్‌ఫోన్ వాడేవారికి మాత్రమే..!

ఫొటో సోర్స్, Getty Images
స్మార్ట్ ఫోన్ వినియోగదారులవి మామూలు కష్టాలు కావు. రోడ్డు మీద నడిచేప్పుడు ఎదురుగా ఏ వాహనాలు వస్తున్నాయో చూసుకోవాలి. వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లకు బదులివ్వాలి. ఫేస్‌బుక్ అప్‌డేట్స్‌పైన ఓ కన్నేయాలి. హెడ్‌ఫోన్స్‌లో రెహమాన్‌దో, ఇళయరాజాదో సంగీతం వింటూనే ఈ పనులన్నీ చేయాలి. ఇన్ని పనులు ఒకేసారి చేస్తున్నప్పుడు చూసీచూడకుండా ఏ వాహనానికో అడ్డం పడటం మామూలే!
అంతేకాదు.. వారు ఫోన్లో మునిగిపోయిన సమయంలో వారి వల్ల ఇతరులు ఇబ్బందిపడే సందర్భాలూ ఉంటాయి.
చైనాలోని షియాన్ ప్రావిన్స్ ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదార్ల సమస్యల్ని గుర్తించింది. అందుకే వాళ్ల కోసం ప్రత్యేకంగా ఓ రోడ్డునే ఏర్పాటుచేసింది. షియాన్‌లోని ఓ భారీ షాపింగ్ మాల్ దగ్గర ఈ చిన్న రోడ్డుని ఏర్పాటు చేసినట్టు చైనాకు చెందిన ‘షాంగ్జీ ఆన్‌లైన్ న్యూస్’ పేర్కొంది.
ఆ రోడ్డుకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులేశారు. ఇది ఫోన్ చూసుకుంటూ నడిచేవారికోసం అని స్పష్టంగా తెలిసేలా స్మార్ట్ ఫోన్ బొమ్మలు కూడా గీశారు.

ఫొటో సోర్స్, The Paper
ఒక్కోసారి కొందరు ఫుట్‌పాత్‌పైనే వాహనాలు నిలుపుతుంటారు. ఫోన్లతో బిజీగా ఉంటూ చూసుకోకుండా వాహనాలను ఢీకొడుతుంటారు. ఇలాంటివన్నీ నివారించేందుకే నెల రోజులుగా ఓ కొత్త రోడ్డును ఏర్పాటు చేయమని కోరుతున్నామని, దానికి అధికారులు స్పందించి ఈ ఏర్పాటు చేశారని షాపింగ్ మాల్ యాజమాన్యం చెబుతోంది.
చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఫోన్లలో నిమగ్నమయ్యేవాళ్లను ‘ఫబ్బర్స్’ అంటారు. ఈ రోడ్డుని చూసి ఫబ్బర్లంతా చాలా సంతోషిస్తున్నారు.
‘ఫోన్లను చూస్తూ ఫుట్‌పాత్‌పైన నడిచే పాదచారులకు కూడా భద్రత లేకుండా పోయింది. అందుకే ఈ ప్రత్యేక రోడ్డు బాగా పనికొస్తుంది’ అని షియావీ అనే వ్యక్తి అన్నారు.
‘ఈ తరం కుర్రాళ్లకు వేగం ఎక్కువ. క్షణం కూడా ఖాళీగా ఉండరు. ఫోన్లను విడిచి అసలే ఉండలేరు. అలాంటి వారు దీన్ని చాలా ఇష్టపడతారు’ అని హు షుయా అనే మరో వ్యక్తి తెలిపారు.
అయితే ఈ రోడ్డుని విమర్శించేవాళ్లూ లేకపోలేదు. చైనాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ ‘సీనా వీబో’లో కొందరు దీనిపైన కామెంట్ చేస్తున్నారు. ‘అప్పట్లో ఓపియమ్ స్మోకింగ్‌కు జనాలు బానిసలైనట్లే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు బానిసలవుతున్నారు’ అని ఒక యూజర్ అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








