శ్రీలంక: మహిళలకు మద్య విక్రయాలపై నిషేధం ఎత్తివేతకు సిరిసేన తిరస్కరణ

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంకలో మహిళలకు కూడా పురుషుల తరహాలోనే మద్యం కొనుగోలు చేసే హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణ చర్యను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కొట్టివేశారు.
మహిళలు బార్లలో పనిచేయటానికి కూడా అనుమతించే ఆ చర్యను ఉపసంహరించుకోవాలని తాను ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు ఆయన ఒక సభలో పేర్కొన్నారు.
ఈ చర్య గురించి తనకు వార్తాపత్రికల ద్వారా మాత్రమే తెలిసిందని ఆయన చెప్పారు.
మద్యం విషయమై 1955 నాటి చట్టం మహిళల పట్ల వివక్షాపూరితంగా ఉందని అంగీకరిస్తూ.. దానిని సవరిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
ఈ సవరణను దేశాధ్యక్షుడు రద్దు చేయటం మీద విమర్శలు వ్యక్తమయ్యాయి. లింగ సమానత్వం విషయాన్ని అధ్యక్షుడు పరిగణనలోకి తీసుకోవటం లేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
‘‘ఇది పాతకాలపు లింగ వివక్షాపూరిత చట్టం గురించిన అంశం మాత్రమే కాదు.. పాతకాలపు లింగ వివక్షాపూరిత వ్యవస్థకు సంబంధించిన అంశం. ఆ వ్యవస్థలోని నియంత్రణ సాధనాల్లో ఈ చట్టం మరొకటి మాత్రమే’’ అని శ్రీలంక బ్లాగర్ ఒకరు వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సంస్కరణ ప్రభావం ఎలా ఉండేది?
అరవై ఏళ్లుగా ఉన్న ఆ చట్టం పూర్తిగా కఠినంగా అమలుకాకపోతున్నప్పటికీ.. దానిని సవరించటానికి చేసిన ప్రయత్నాన్ని శ్రీలంక మహిళలు ఆహ్వానించారు.
ఈ సంస్కరణ అమలైనట్లయితే.. 18 ఏళ్లు దాటిన మహిళలు ఆరు దశాబ్దాల్లో మొదటిసారిగా చట్టబద్ధంగా మద్యం కొనుగోలు చేసేందుకు అవకాశం లభించివుండేది.
అలాగే.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే మద్యం అమ్మటానికి అనుమతి ఉంది. దీనిని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ పొడిగిస్తూ సవరించాలని ప్రభుత్వం ప్రయత్నించింది.

ఫొటో సోర్స్, AFP
దేశాధ్యక్షుడు ఎందుకు జోక్యం చేసుకున్నారు?
శ్రీలంకలో మెజారిటీ జనాభా బౌద్ధులు. దేశంలో మహిళలు మద్యం కోనుగోలు చేయటంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలన్న సర్కారు నిర్ణయాన్ని ప్రముఖ బౌద్ధ గురువులు తీవ్రంగా విమర్శించారు. ఇంకా ఎక్కువ మంది మహిళలు మద్యానికి వ్యసనపరులవుతారని, అది శ్రీలంక కుటుంబ సంస్కృతిని ధ్వంసం చేస్తుందని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ చర్య మీద విమర్శలు తనకు అర్థమయ్యాయని.. మహిళలు మద్యం కొనుగోలు చేయటంపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఇచ్చిన అధికారిక ప్రకటనను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని తాను ఆదేశించానని సిరిసేన తాజాగా ఒక సభలో పేర్కొన్నారు.
అధ్యక్షుడు సిరిసేన మద్యవ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీలంక మహిళలు మద్యం తాగటం విపరీతంగా పెరుగుతోందంటూ ఆయన గతంలో ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సవరణను సిరిసేన కొట్టివేయటం మీద పెద్దగా ఆశ్చర్యం వ్యక్తంకాలేదు.
అయితే.. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణను ఇలా అకస్మాత్తుగా కొట్టివేయటం.. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయని సూచిస్తోందని వ్యాఖ్యాతలు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు శ్రీలంకలో ఎంతమంది మహిళలు మద్యం తాగుతారు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2014 నాటి లెక్కల ప్రకారం.. శ్రీలంకలో మద్యం తాగని పురుషుల సంఖ్య 56.9 శాతంగా ఉంటే.. మద్యం ముట్టని మహిళల సంఖ్య 80.5 శాతంగా ఉంది.
పదిహేనేళ్ల వయసు దాటిన మహిళల్లో వేయి మందికి ఒక్కరి కన్నా తక్కువ మాత్రమే అధిక మోతాదులో మద్యం తాగేవారు ఉన్నారు. అదే పురుషుల్లో చూస్తే వేయి మందిలో 8 మంది అధికంగా మద్యం సేవిస్తుంటారు.
మద్యపానం శ్రీలంక సంస్కృతికి విరుద్ధమని ఆ దేశ మహిళలు చాలా మంది భావిస్తుంటారని, కాబట్టి వారు మద్యపానానికి దూరంగా ఉంటారని శ్రీలంక బీబీసీ ప్రితినిధి ఆజం అమీన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








