ప్యారడైజ్ పేపర్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

ప్యారడైజ్ పేపర్స్ తక్కువ పన్నులు లేదా పన్ను బాధలు లేని దేశాలలో పెట్టిన పెట్టుబడుల వివరాలను భారీ ఎత్తున బహిర్గతం చేశాయి. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పత్రాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఈ పత్రాలలో - రాజకీయ నాయకులు, సెలిబ్రిటీలు, అకౌంటెంట్లు, బహుళజాతి కంపెనీలు, న్యాయసంస్థలు పన్నుల నుంచి తప్పించుకోవడానికి బెర్మూడా, బహమాస్ ద్వీపంలాంటి తక్కువ పన్ను ఉన్న దేశాలను ఉపయోగించుకున్నాయని వెల్లడైంది.
గతంలో పనామా పేపర్లను బహిర్గతం చేసిన జర్మన్ వార్తాపత్రిక 'సుదైషీ జైటుంగ్' వీటిని కూడా సంపాదించింది. పన్నులకు స్వర్గధామాలను ఫ్రెంచిలో 'పారాదిస్ ఫిస్కల్' అని పిలుస్తారు. ఆ పేరుతో వీటిని 'ప్యారడైజ్ పేపర్స్' అని పిలుస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్యారడైజ్ పేపర్స్ ద్వారా బయటపడ్డ సంచలన అంశాలు:
- పన్నులను తగ్గించుకోవడానికి ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఆపిల్, జెర్సీ అనే తక్కువ పన్నులున్న ద్వీపాన్ని ఉపయోగించుకుంది.
- ఫార్ములా -1 ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ తన లగ్జరీ జెట్ విమానంపై రూ.140 కోట్ల మేర పన్ను మినహాయింపు పొందినట్లు ప్యారడైజ్ పేపర్లు వెల్లడిస్తున్నాయి.
- బ్రిటిష్ రాణి ప్రైవేట్ ఎస్టేట్ రూ.85 కోట్ల మేర విదేశాలలో పెట్టుబడి పెట్టినట్లు తేలింది. దాంతోపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రైట్‌హౌస్ అనే కంపెనీలో కొంత పెట్టుబడి పెట్టినట్లు ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.
- రష్యా అధ్యక్షుడు పుతిన్ అల్లునికి చెందిన కంపెనీలో ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు పెట్టుబడులు పెట్టారు.
- పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా 'ఐల్ ఆఫ్ మ్యాన్' ద్వీపం చట్టం తీసుకువచ్చిందని ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రధానాధికారి ఒకరు విదేశీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మిలియన్ల డాలర్లు ఎగవేసినట్లు తేలింది.
అయితే కథ ఇంటితో ముగియలేదు. రాబోయే రోజుల్లో ప్యారడైజ్ పేపర్ల ద్వారా మరికొంత మంది నల్లకుబేరుల వివరాలు బహిర్గతం కానున్నాయి.
ప్యారడైజ్ పత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
మొత్తం 1.34 కోట్ల పత్రాలు వీటి ద్వారా వెల్లడయ్యాయి. సాంకేతికంగా చెప్పాలంటే ఆ సమాచారం 1,400 జిగాబైట్ల రూపంలో ఉంది.
దీనిలో 68 లక్షల పత్రాలు ఆఫ్‌షోర్ న్యాయసేవలు అందిస్తున్న 'అప్లిబి’ మరియు కార్పొరేట్ సేవలు అందిస్తున్న 'ఎస్టెరా' నుంచి వెల్లడయ్యాయి. ఈ రెండూ అప్లిబి పేరిట కలిసే పని చేసినా, 2016లో ఎస్టెరా స్వతంత్ర కంపెనీగా అవతరించింది.
మిగతా 60 లక్షల పత్రాలు ప్రధానంగా కరీబియన్ దీవులలో నమోదైన కార్పొరేట్ సంస్థల నుంచి వెల్లడయ్యాయి. వెల్లడైన రహస్య పత్రాలలో 1950 నుంచి 2016 నాటి వరకు సమాచారం ఉంది.

అప్లిబి అంటే ఏమిటి?
అప్లిబి కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలు, ధనవంతులు విదేశాలలో పెట్టుబడులు కంపెనీలు స్థాపించేందుకు, రిజిష్టర్ చేసుకునేందుకు సహకరిస్తుంది.
బెర్మూడాలో స్థాపించిన ఈ కంపెనీ 1890ల నుంచి పని చేస్తోంది. డొల్ల కంపెనీల స్థాపనలో పేరొందిన పది సంస్థలలో అప్లిబి ఒకటి. అప్లిబి ఖాతాదారుల జాబితాలో ప్రథమ స్థానం అమెరికాది.
ఆ జాబితాలో సుమారు 31 వేలకు పైగా అమెరికా అడ్రస్‌లు, 14వేలకు పైగా యూకే అడ్రస్‌లు ఉన్నాయి.
ప్యారడైజ్ పేపర్లను ఎవరు బహిర్గతం చేశారు?
2016లో పనామా పేపర్ల తరహాలోనే జర్మనీ వార్తాపత్రిక 'సుదైషీ జైటుంగ్' ఈ పత్రాలను సంపాదించింది. అయితే భద్రతా కారణాల రీత్యా ఆ పత్రాలను తమకు అందిజేసిన వారి వివరాలను వెల్లడించలేమని పేర్కొంది.
ఈ పత్రాలపై ఎవరు పని చేస్తున్నారు?
బీబీసీ పనోరమా, గార్డియన్, న్యూయార్క్ టైమ్స్‌లాంటి సుమారు 100 మీడియా గ్రూపులు సభ్యులుగా ఉన్న అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల వ్యవస్థ 'ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్' (ఐసీఐజె) ఈ ప్రాజెక్టుపై పని చేస్తోంది.

పన్నుల స్వర్గధామం అంటే ఏమిటి?
దీనికి ఖచ్చితమైన అర్థం చెప్పడం కష్టం. మీడియా, ప్రజల్లో వీటిని 'పన్నుల స్వర్గధామం' అని పిలుస్తుండగా, ఆర్థిక పరిభాషలో వీటిని 'ఆఫ్‌షోర్ ఫైనాన్షియల్ సెంటర్' (ఓఎఫ్‌సీ) అని పేర్కొంటున్నారు.
ఆస్తులు, లాభాలపై స్వదేశంలో కన్నా తక్కువ పన్నులు ఉండే ప్రాంతాలే పన్నుల స్వర్గధామాలు.
చాలాసార్లు చాలా చిన్న దేశాలలో వీటిని నెలకొల్పుతారు. ఇవి చాలా రహస్యంగా పని చేస్తాయి. ప్రధానంగా అమెరికా, యూకేలాంటి దేశాలు ఇలాంటి ఓఎఫ్‌సీ సేవలను అందిస్తున్నాయి.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









