కాటలోనియా రిఫరెండం: 'కొన్ని రోజుల్లోనే స్వాతంత్ర్య ప్రకటన'

ఫొటో సోర్స్, Getty Images
మరికొన్నిరోజుల్లోనే స్పెయిన్ నుంచి కాటలోనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంటుందని ఆ ప్రాంత ముఖ్యనాయకుడు బీబీసీకి తెలిపారు.
స్పెయిన్ నుంచి విడిపోవడం కోసం కాటలోనియాలో ఆదివారం రిఫరెండం నిర్వహించిన విషయం తెలిసిందే.
రిఫరెండం అనంతరం కాటలోనియా అధ్యక్షుడు, ఆ ప్రాంత ముఖ్య నాయకుడు కార్ల్స్ పుయిగ్డెమంట్ తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. కాటలోనియా స్వాతంత్ర్య ప్రకటనపై తమ ప్రభుత్వం ఈ వారం చివరిలోపు లేదా వచ్చే నెల ప్రారంభంలో నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.
కాగా, కాటలోనియా రిఫరెండంపై స్పెయిన్ రాజు ఫెలిపే స్పందిస్తూ.. ఓటింగ్ నిర్వహకులు చట్టానికి అతీతులుగా భావించుకుంటున్నారని విమర్శించారు. స్పెయిన్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. దేశం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
రిఫరెండం నేపథ్యంలో స్పానిష్ పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో 900 మందికి గాయాల్యాయి.
దీంతో ఆదివారం ఓటింగ్ సమయంలో స్పానిష్ పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ కాటలోనియాలోని వేలాదిమంది ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో 33 మంది పోలీసులకు గాయాలైనట్లు స్థానిక వైద్యాధికారులు తెలిపారు.
కాటలోనియా అధ్యక్షుడు కార్ల్స్ పుయిగ్డెమంట్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''తమ ప్రభుత్వం కాటలోనియా స్వాతంత్ర్యంపై ఈ వారం చివర్లో లేదా వచ్చే నెల మొదట్లో నిర్ణయం తీసుకుంటుంది'' అని చెప్పారు.
అయితే, స్పానిష్ ప్రభుత్వం కాటలోనియా పాలనలో జోక్యం చేసుకొని ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకుంటే ఏం చేస్తారని ప్రశ్నించగా .. 'ఆ పొరపాటు అన్నింటినీ మార్చేస్తుంది'' అని బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
మాడ్రిడ్ ప్రభుత్వానికి(స్పెయిన్) తమ పరిపాలనకు మధ్య ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు జరగలేదని పుయిగ్డెమంట్ తెలిపారు.
కాటలోనియా ఘటన కేవలం స్పెయిన్ అంతర్గత వ్యవహారం అని యూరోపియన్ యూనియన్ పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించారు.
స్పెయిన్ రాజు మాట్లాడిన కొన్నిగంటల్లోనే ఆయన మీడియా ముందుకు వచ్చారు.
కాగా, రిఫరెండంపై స్పెయిన్ రాజు ఫెలిపే జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. రిఫరెండం పేరుతో ఓటింగ్ నిర్వహించిన కాటలోనియా నాయకులు దేశం పట్ల అమర్యాదగా వ్యవహరించారని చెప్పారు. రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను వారు ఉల్లఘించారన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఈ రోజు కాటలోనియా సమాజం విడిపోయిందని'' అని చెప్పారు. కాటలోనియాలో నిర్వహించిన ఓటింగ్ వల్ల సుసంపన్న ఈశాన్య స్పెయిన్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని తెలిపారు. ఈ ప్రభావం స్పెయిన్ పై కూడా ఉంటుందన్నారు.
అయితే, ఇలాంటి అవరోధాలను స్పెయిన్ అధిగమిస్తుందని నొక్కిచెప్పారు.
మరోవైపు, కేంద్రప్రభుత్వం కూడా రిఫరెండం రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)








