‘కాటలోనియా వేర్పాటుకు 90 శాతం మంది మద్దతు’

ఫొటో సోర్స్, Reuters
స్పెయిన్ నుంచి వేరుపడేందుకు కాటలోనియాలో ఆదివారం నిర్వహించిన రెఫరెండంలో ప్రజల స్వతంత్ర కాంక్ష ప్రస్ఫుటమైంది. 42.3 శాతం మంది ఓటింగులో పాల్గొనగా 90 శాతం మంది స్వాతంత్ర్యానికి మద్దతుగా ఓటేసినట్లు కాటలోనియా అధికారులు వెల్లడించారు.
రెఫరెండం చట్ట విరుద్ధమని స్పెయిన్ రాజ్యాంగ ధర్మాసనం చెప్పడం, ప్రభుత్వం కూడా ఓటింగును అడ్డుకునేందుకు భారీఎత్తున పోలీసులను రంగంలోకి దించడంతో ఘర్షణలు చెలరేగాయి.
పోలింగు కేంద్రాల్లోకి పోలీసులు వెళ్లి బ్యాలట్ పెట్టెలను, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ 42.3 శాతం మంది రెఫరెండంలో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'పార్లమెంటుకు పంపిస్తా'
కాటలోనియా అధ్యక్షుడు కార్లెస్ ప్యుగ్డిమాంట్ ఈ సందర్భంగా ఇతర నేతలతో కలిసి మాట్లాడుతూ.. ''స్వతంత్ర దేశంగా అవతరించే హక్కును కాటలోనియా గెలుచుకుంది'' అన్నారు.
ఈ ఫలితాలను తన ప్రభుత్వం కాటలోనియా పార్లమెంటుకు పంపనుందని, కాటలోనియా ప్రజల సార్వభౌమత్వం కొలువైన అక్కడ దీనిపై సరైనవిధంగా స్పందిస్తారని చెప్పారు.
అంతకుముందు స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్ దీనిపై స్పందిస్తూ ఈ రెఫరెండంతో ప్రజాస్వామ్యాన్ని పరిహసించారని అన్నారు.
రెఫరెండం తరువాత ఆదివారం సాయంత్రం కాటలోనియాలోని బార్సిలోనా నగరంలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. జెండాలు పట్టుకుని కాటలోనియా జాతీయ గీతం పాడుతూ ర్యాలీలు తీశారు. ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
రెఫరెండం సందర్భంగా చోటుచేసుకున్న హింసలో 800మందికి పైగా గాయపడినట్లు కాటలోనియా ప్రభుత్వం ప్రకటించింది. 12 మంది పోలీసులు గాయపడినట్లు స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది.
ఎంతమంది ఓటేశారు?
2300 పోలింగ్ కేంద్రాల్లో 319 కేంద్రాలను పోలీసులు మూసివేశారని కాటలోనియా ప్రభుత్వం చెబుతుండగా 92 కేంద్రాలను మూసివేయించినట్లు స్పెయిన్ ప్రభుత్వం చెప్తోంది.
కాటలోనియా జనాభా 75 లక్షలు కాగా అందులో 53.4 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. వారిలో 22.6 లక్షల మంది ఓటేశారని కాటలోనియా ప్రభుత్వం ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకీ రెఫరెండం?
యూరప్‌లోని ఒక ముఖ్యమైన దేశం స్పెయిన్ నుంచి వేరుపడటానికి కాటలోనియా సన్నద్ధమవుతోంది. కాటలోనియా వేర్పాటువాద ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీన (ఆదివారం) రెఫరెండం నిర్వహించింది. వేర్పాటు వాదులు రెండు రోజుల ముందు బార్సిలోనాలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఇవికూడా చూడండి

ఫొటో సోర్స్, Getty Images
రెఫరెండంలో ప్రశ్న ఏమిటి?
ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన రెఫరెండం నిర్వహించేందుకు కాటలోనియా పార్లమెంటు సెప్టెంబర్ 6వ తేదీన ఒక చట్టం చేసింది.
''కాటలోనియా ఒక స్వతంత్ర గణతంత్ర దేశంగా మారాలని మీరు కోరుకుంటున్నారా?'' అన్న ప్రశ్నతో ఆ రెఫరెండం నిర్వహిస్తారు. దానికి సమాధానంగా బ్యాలట్ పేపర్ మీద 'అవును' లేదా 'లేదు' అని చెప్పే బాక్సుల్లో ఏదో ఒక దాని మీద ఓటేస్తే సరిపోతుంది.
దీని ఫలితాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, కాటలోనియా ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటించిన రెండు రోజుల్లోగా పార్లమెంటు వేదికగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించి తీరాలని సదరు వివాదాస్పద చట్టంలో నిర్దేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పెయిన్ ఎలా స్పందించింది?
కానీ స్పెయిన్ అవిభాజ్య దేశమని ఆ దేశ రాజ్యాంగం చెప్తోంది. ఈ రెఫరెండం చట్టవిరుద్ధమని ప్రధానమంత్రి మారియానో రజోయ్ ఖండించారు. కాటలోనియాకు ఇప్పటికే బాస్క్ కంట్రీ, గలాసియాల వంటి ఇతర ప్రాంతాల తరహాలో విస్తృత స్వయం ప్రతిపత్తి ఉందని, ఇక వేర్పాటు ఎందుకని స్పెయిన్ సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కాటలోనియా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని స్పెయిన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కానీ స్పెయిన్ సర్కారే ఏకపక్షంగా ఉంటోందని కాటలన్ జాతీయవాదుల ఆరోపణ.
ఈ రెఫరెండం చట్టవ్యతిరేకమని దానిని నిలిపివేయాలని స్పెయిన్ కోర్టులు ఆదేశించాయి. స్పెయిన్ లోని ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది పోలీసులను కాటలోనియాలో మోహరించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








