టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: ‘ఫాం హౌస్‌లో ముందే సీసీ కెమెరాలు పెట్టాం... నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం’

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణలో రాజకీయాలు చాలా వాడివేడిగా ఉన్నాయి.

'ఎమ్మెల్యేల కొనుగోలు' వ్యవహారం కేంద్రంగా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారం హైదరాబాద్ నుంచి దిల్లీకి దాకా వెళ్లింది.

‘‘ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కాల్‌ రికార్డులు’’ అంటూ ఆడియో టేపులు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.

ఈ ఆడియో టేపులు నిజమైనవని, తామే విడుదల చేశామని అటు పోలీసులుగానీ, ఇటు ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానీ ధృవీకరించ లేదు.

ఇటు బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. టీఆర్‌ఎస్ పార్టీ హైకోర్టుకు వెళితే ఈడీ, కేంద్ర ఎన్నికల కమిషన్ తలుపులు తట్టింది బీజేపీ.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

ఫొటో సోర్స్, Facebook/TRS Party

ఆడియో టేపుల హడావుడి

ఈరోజు మీడియాలో బాగా నలుగుతున్న అంశం... ఆడియో టేపులు. 'ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కాల్ రికార్డులు' అంటూ ఆడియో రికార్డ్సింగ్ మీడియాలో ప్రసారమయ్యాయి.

ఆ టేపుల్లో 'రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్‌లు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో మాట్లాడుతున్నారు' అని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుతో పాటు డబ్బులు ఎంత ఇవ్వాలి? ఎందరు ఎమ్మెల్యేలు వస్తారు? వంటి అంశాల మీద సంభాషణలు జరిగాయని కూడా వార్తలు వస్తున్నాయి.

కానీ, పోలీసులు ఇంత వరకు ఎటువంటి కాల్ రికార్డ్స్‌ను విడుదల చేసినట్లు ప్రకటించ లేదు.

తెలంగాణ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణ హైకోర్టు

హై కోర్టులో విచారణ

మొయినాబాద్‌లోని ఫాం హౌస్‌లో అదుపులోకి తీసుకొన్న రామచంద్ర భారతి, సింహయాజీ, నంద కుమార్‌లను గురువారం రాత్రి అవినీతి నిరోధక బ్యూరో(ఏసీబీ) కోర్టులో సైబరాబాద్ పోలీసులు ప్రవేశపెట్టారు. కానీ రిమాండ్‌కు తరలించడానికి కోర్టు నిరాకరించింది. దాంతో వారిని విడుదల చేయాల్సి వచ్చింది.

ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆదేశాలను నేడు తెలంగాణ హైకోర్టులో సైబరాబాద్ పోలీసులు సవాల్ చేశారు. రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. నిందితులను 24 గంటల పాటు హైదరాబాద్ విడిచి వెళ్ల వద్దని ఆదేశించిన హైకోర్టు విచారణను శనివారానికి వాయిదా వేసింది.

‘‘ఫాంహౌస్‌లో ముందే సీసీ కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థను అమర్చారా?' అని హై కోర్టు విచారణ సందర్భంగా పోలీసులను ప్రశ్నించింది. ఈ వ్యవహారం గురించి ముందుగానే తెలియడంతో 'ఫాంహౌస్‌లో సీసీ కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థను అమర్చి నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం’’ అని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.

బీజేపీ జెండాలతో కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీకి చేరిన వ్యవహారం

'టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు' వ్యవహారం దిల్లీకి చేరింది.

బీజేపీకి వ్యతిరేకంగా 'టీఆర్‌ఎస్ కుట్ర' చేస్తోందంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు రాజీవ్ చంద్రశేఖర్, అరుణ్ సింగ్. అంతేకాదు సీబీఐ విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

ఫొటో సోర్స్, Facebook/Raghunandan Rao Madhavaneni

ఈడీకి ఫిర్యాదు

'టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు' వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడీకీ ఫిర్యాదు చేశారు. 'ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చండి' అని ఈడీని ఆయన కోరారు.

'డబ్బులు ఇవ్వడం ఎంత నేరమో తీసుకోవడం కూడా నేరమే. ఆ ఎమ్మెల్యేలను ఎందుకు విచారించరు? వారి ఫోన్లను ఎందుకు సీజ్ చేయరు?' అని రఘునందన్ ప్రశ్నించారు.

ప్రమాణం చేస్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్

ఫొటో సోర్స్, Facebook/Bandi Sanjay Kumar

యాదగిరి గుట్టలో ప్రమాణం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గురువారం నాడు చెప్పినట్లుగానే శుక్రవారంనాడు యాదగిరి గుట్టకు చేరి దేవాలయంలో ప్రమాణం చేశారు.

'టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు' వ్యవహారానికి 'బీజేపీ'కి సంబంధం లేదని ఆయన అన్నారు.

ఫామ్‌హౌస్ చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్న వ్యక్తులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఫామ్‌హౌస్ చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్న వ్యక్తులు

వివాదం ఏంటి?

'టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది' అనేది ఆరోపణ.

ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలతో మోయినాబాద్ ఫాం హౌస్‌లో 26వ తేదీ రాత్రి రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్‌లను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపుర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావులను పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టారని పోలీసులు తెలిపారు.

ఈమరకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమకు ఫిర్యాదు చేశారని వారు వెల్లడించారు.

'సెప్టెంబర్ 26న దిల్లీకి చెందిన సతీశ్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ ఇద్దరూ టచ్‌లోకి వచ్చారు. టీఆర్ఎస్ వదిలి బీజేపీలో చేరితే రూ.100 కోట్ల డబ్బు, కేంద్ర ప్రభుత్వం నుంచి సివిల్ కాంట్రాక్టులు, పెద్ద పదవులు ఇస్తాం. చేరకపోతే సీబీఐ, ఈడీ కేసులు పెడతాం అని వారు అన్నారు.

అది అనైతిక చర్య కాబట్టి నేను డీల్‌లోకి వెళ్లలేదు. కానీ అక్టోబర్ 26న మళ్లీ కాంటాక్ట్ చేశారు. ఫామ్ హౌస్‌కు వస్తే చర్చిద్దామని, ఇతర టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వస్తే వారికి రూ.50 కోట్లు చొప్పున ఇస్తామన్నారు. వారు టీఆర్ఎస్‌లోనే ఉండి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టాలని, టీఆర్ఎస్‌ను అస్థిరపరచాలని చెప్పారు' అంటూ ఈ ఫిర్యాదులో రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అందించిన సమాచారంతో హైదరాబాద్ నగర శివారులోని ఒక ఫాంహౌస్‌లో సోదాలు నిర్వహించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి మీడియాకు తెలిపారు.

'ముగ్గురు వ్యక్తులు వచ్చి తమను ప్రలోభ పెడుతున్నారని, డబ్బు ఇవ్వజూపారని, కాంట్రాక్టులు, పదవులు ఎరవేసి పార్టీ ఫిరాయించాలని ప్రలోభ పెట్టినట్లు ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు.

ఆ సమాచారం ఆధారంగా ఈ రోజు ఫామ్ హౌస్ మీద రెయిడ్ చేస్తే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు. ఇందులో ప్రధానంగా రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ, ఈయన ప్రస్తుతం ఫరీదాబాద్ టెంపుల్‌లో ఉంటున్నారు. ఈయన దిల్లీలో కూడా ఉంటారు. ఈయనే ఇక్కడ వీళ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కనపడుతోంది. ఆయనతోని సింహయాజీ అనే తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా వచ్చారు.

వీరిద్దరినీ ఇక్కడ హైదరాబాద్‌లో ఉండే నందకుమార్ సన్నాఫ్ శంకరప్ప ఇక్కడకు తీసుకొచ్చారు. వారంతా కలిసి ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టేందుకు సంప్రదింపులు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద మేం ఈ రోజు రెయిడ్ నిర్వహించాం' అని ఆయన వివరించారు.

అయితే ఇదంతా 'అబద్ధం' అని, మునుగోడులో ఓడిపోతారని తెలిసి టీఆర్‌ఎస్ ఈ 'కుట్ర'కు తెరతీసిందని బీజేపీ విమర్శించింది. 'ఫాం హౌస్' ఘటనకు తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు.

వీడియో క్యాప్షన్, 72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం: ‘మా ఇంట్లో ఒకపూట కూరగాయల ఖర్చు రూ.1200, నాన్ వెజ్ ఖర్చు రూ.5 వేలు.. సిలిండర్ 4 రోజుల్లో అయిపోతుంది’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)