'ఈరోజు శానిటరీ ప్యాడ్స్ అడుగుతారు.. రేపు కండోమ్స్ అడుగుతారు' అన్న వ్యాఖ్యలపై బిహార్ ఐఏఎస్ ఆఫీసర్ విచారం

హర్జోత్ కౌర్

ఫొటో సోర్స్, WOMEN DEVELOPMENT CORPORATION BIHAR

ఫొటో క్యాప్షన్, హర్జోత్ కౌర్
    • రచయిత, విష్ణు నారాయణ్
    • హోదా, బీబీసీ కోసం

బిహార్ కేడర్‌కు చెందిన మహిళా ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. శానిటరీ ప్యాడ్‌లు, టాయిలెట్‌ల గురించి పట్నా విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన విచిత్రమైన సమాధానాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో, మహిళా శిశు అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ హర్జోత్ కౌర్ బమ్రా ఎవరనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

మంగళవారం బిహార్ రాజధాని పట్నాలో మహిళా శిశు అభివృద్ధి సంస్థ, యునిసెఫ్, సేవ్ ది చిల్డ్రన్, ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థల సహకారంతో "సశక్త్ బేటీ, సమృద్ధి బిహార్: టూవర్డ్స్ ఎన్‌హాన్సింగ్ ది వాల్యూ ఆఫ్ గర్ల్ చైల్డ్" అనే అంశంపై రాష్ట్రం స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు.

లింగ అసమానతలను రూపుమాపేందుకు ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. ఈ వర్క్‌షాప్‌కు మురికివాడల్లో నివసించే విద్యార్థులను కూడా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా, మహిళా శిశు అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ బమ్రాను విద్యార్థినిలు కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి ఆమె విచిత్రమైన సమాధానాలు ఇచ్చారు.

హర్జోత్ కౌర్ చెప్పిన జవాబులు చాలామందికి అసౌకర్యాన్ని కలిగించాయి. పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

హర్జోత్ కౌర్‌

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, హర్జోత్ కౌర్‌

ప్రశ్న-జవాబు

వర్క్‌షాప్‌లో 'మురికివాడల్లో నివసిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు, సంబంధిత శాఖ అధికారుల మధ్య చర్చ ' అని ఒక సెషన్ జరిగింది.

ఈ సెషన్‌లో విద్యార్థినిలు సంబంధిత డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ హర్జోత్ కౌర్‌ను శానిటరీ ప్యాడ్స్ గురించి అడిగారు.

'ప్రభుత్వం డ్రెస్‌ నుంచి స్కాలర్‌షిప్‌ వరకు అన్నీ ఇస్తోంది. 20, 30 రూపాయలకు విస్పర్ (శానిటరీ ప్యాడ్స్ ప్కాకెట్) ఇవ్వలేరా?' అని వాళ్లు అడిగారు.

దీనికి హర్జోత్ కౌర్ స్పందిస్తూ, "ఈరోజు 20, 30 రూపాయలకు నాప్కిన్స్ అడుగుతారు. రేపు పొద్దున్న జీన్స్ అడుగుతారు. ఆ తరువాత, షూస్ అడుగుతారు. కుటుంబ నియంత్రణ సమయం వచ్చేసరికి, కండోమ్స్ కూడా ఫ్రీగా ఇవ్వమని అడుగుతారు" అన్నారు.

పాఠశాలలో బాత్రూం తలుపులు విరిగిపోయానని, విరిగిన భాగాల్లోంచి ఇతరులు తమను చూసే అవకాశం ఉందని విద్యార్థినిలు చెప్పగా, "మీ ఇంట్లో మీకు ప్రత్యేకంగా మరుగుదొడ్డి ఉందా? ప్రతిచోటా అన్నీ ప్రత్యేకంగా కావాలంటే ఎలా?" అని హర్జోత్ కౌర్ జవాబిచ్చారు.

అక్కడితో ఆమె ఆగలేదు.

"ఓట్ల కోసం ప్రభుత్వం వస్తుంది కదా, అప్పుడు?" అంటూ ప్రశ్నించారు విద్యార్థినిలు.

"ఓట్లు వెయ్యకండి. పాకిస్తాన్ లాగ మారిపోండి" అన్నారు హర్జోత్ కౌర్.

సెషన్ ముగిసిన అనంతరం అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో విద్యార్థినిలు మాట్లాడారు. ప్రభుత్వం తమ అభిప్రాయాలు వింటుందని ఆశించామని, మా మాటలను అనవసర వాదనలుగా కొట్టిపారేస్తారు తప్ప పట్టించుకోరని విద్యార్థినిలు నిరాశ వ్యక్తం చేశారు.

కాగా, హర్జోత్ కౌర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయ్యాయి.

దాంతో, హర్జోత్ కౌర్ మీడియాతో మాట్లాడారు.

"మీడియాలో జరుగుతున్న చర్చ అసందర్భంగా ఉంది. తప్పుదారి పట్టించే వార్తలు వస్తున్నాయి. మొత్తం కార్యక్రమం వీడియోను మహిళ, శిశు అభివృద్ధి సంస్థ హ్యాండిల్‌పై విడుదల చేస్తాం. మీరే స్వయంగా చూడొచ్చు" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, కన్నతల్లికి మళ్లీ పెళ్లి చేసిన కూతురు

హర్జోత్ కౌర్ ఎవరు?

హర్జోత్ కౌర్ బమ్రా బిహార్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి (1992 బ్యాచ్). బిహార్ ప్రభుత్వానికి అనుబంధంగా, మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

గతంలో మైన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి అధిపతిగా కూడా పనిచేశారు.

పశుసంవర్థక శాఖలో కార్యదర్శిగా వ్యవహరించారు. హర్జోత్ కౌర్ భర్త దీపక్ కుమార్ కూడా ఐఏఎస్ అధికారి.

విద్యాశాఖలో అప్పర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన జేఎన్‌యూ పూర్వ విద్యార్థి.

హర్జోత్ కౌర్ వ్యాఖ్యలపై వివాదం

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఈ మొత్తం వ్యవహారంపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని హర్జోత్ కౌర్‌ను కోరారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌, విషయం తెలిసిన వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

"నేను వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పాను. మహిళా సాధికారతకు మేం సహాయం అందిస్తున్నాం. నేను ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తున్నాను. ఈ విషయంలో కచ్చితంగా చర్య తీసుకుంటాం" అని బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ అన్నారు.

అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో హర్జోత్ కౌర్ మరొక పత్రికా ప్రకటన ఇచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"నా మాటలు ఏ అమ్మాయి మనోభావాలనైనా దెబ్బతీసినట్లయితే క్షమించండి. ఎవరినీ కించపరిచే, అవమానించే ఉద్దేశం లేదు. విద్యార్థినిలు ముందుకు సాగేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం" అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, అంబులెన్స్ డ్రైవర్‌గా సేవలందిస్తున్న మంజీత్ కౌర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)