DSP Surender Singh: డీఎస్పీని ట్రక్కుతో తొక్కించి హత్య, అసలేం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

డీఎస్పీ హత్య

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, శుభం కిశోర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హరియాణాలోని నూహ్ జిల్లా పచ్‌గావ్ గ్రామంలో మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత కూడా రోడ్లపై ప్రజలు మాట్లాడుకుంటూ కనిపించారు.

మిగతా గ్రామాల్లా ఇక్కడ రోడ్లు నిర్మానుష్యంగా లేవు. ఏదో అనుకోని ఘటన జరిగిందని చూస్తే తెలిసిపోతుంది.

ఆ రోజు మధ్యాహ్నం జరిగిన ఘటన గురించి ఇక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

గురుగ్రామ్‌కు పక్కనే ఉండే నూహ్ జిల్లా తావడూ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని పచ్‌గావ్ గ్రామంలో తావడూ డిప్యూటీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సురేందర్ సింగ్ బిష్ణోయిని ఓ ట్రక్కుతో తొక్కించి హత్య చేశారు.

పత్రాలు చెక్ చేస్తుండగా సురేంద్ర పైనుంచి ఆ ట్రక్కు వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశామని వెల్లడించారు.

డీఎస్పీ హత్య

ఫొటో సోర్స్, ANI

సురేందర్ హత్య తర్వాత ఈ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ గ్రామాన్ని పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. రాత్రి కూడా పోలీసు వాహనాలు ఇక్కడకు వస్తూ పోతూ కనిపించాయి.

ఈ కేసు విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదేశాలు జారీచేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మరోవైపు గ్రామ ప్రజలు కూడా ఈ ఘటనపై చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా ఈ గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే, మంగళవారం రాత్రి మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేందుకు చాలా మంది సిద్ధంగాలేమని చెప్పారు.

మొహమ్మద్ వారిస్
ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ వారిస్

''ఇలాంటి పరిస్థితి ముందెన్నడూ లేదు''

బీబీసీ బృందాన్ని చూసిన తర్వాత ఒక వృద్ధ మహిళ మాట్లాడేందుకు ముందుకు వచ్చారు. అయితే, ఆమె తన వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు.

''ఇదే గ్రామంలో 50ఏళ్ల నుంచీ ఉంటున్నాను. ఇలాంటి ఉద్రిక్త వాతావరణం ముందెన్నడూ కనిపించలేదు. మేం పోలీసులకు సహకరిస్తున్నాం. అసలు ఒక పోలీసుని ఎలా హత్య చేస్తారు?''అని ఆమె అన్నారు.

కొందరు గ్రామస్థులు పోలీసులకు సహకరిస్తున్నామని చెబుతున్నారు. అయితే, మరికొందరు పోలీసులంటే తమకు భయమని అంటున్నారు.

''గ్రామంలో అందరూ విచారంతో ఉన్నారు. పిల్లలు కూడా భోజనం చేయడం లేదు. అందరిలోనూ భయం గూడుకట్టుకుని ఉంది. ఈ నేరానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్ష పడాలి''అని గ్రామస్థుడు మొహమ్మద్ వారిస్ చెప్పారు.

కెమెరా కాంతి చూసిన వెంటనే పక్కనే ఉండే ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేకపోతే పోలీసులు వస్తారు అని హెచ్చరించారు.

డీఎస్పీ హత్య

ఫొటో సోర్స్, ANI

లైను

హరియాణాలో డీఎస్పీ హత్య

లైను

డీఎస్పీ సురేందర్ సింగ్ బిష్ణోయ్‌పై నుంచి మంగళవారం ఓ ట్రక్కు వెళ్లిపోయింది. దీంతో ఘటనాస్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

అక్రమ మైనింగ్ జరుగుతోందన్న ఫిర్యాదుపై మరో ఇద్దరు పోలీసులతో కలిసి ఘటనాస్థలానికి మధ్యాహ్నం 12 గంటలకు తనిఖీల కోసం సురేందర్ వెళ్లారు.

1994లో ఏఎస్ఐగా సురేందర్ సింగ్ విధుల్లోకి చేరారు. తావడూ డీఎస్పీగా పనిచేస్తున్న ఆయన మరో నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది.

సురేందర్ సింగ్‌కు అమరుడి హోదా ఇస్తామని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.

సురేందర్ సింగ్ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.

లైను
హమిద్ హుస్సేన్
ఫొటో క్యాప్షన్, హమిద్ హుస్సేన్

పోలీసు కారు చూసి పరుగులు

కొంచెం దూరం ముందుకు వెళ్లిన తర్వాత మరికొంతమంది మాకు ఎదురుపడ్డారు. అందులో ఒక వ్యక్తి కష్టంమీద నడుస్తున్నారు. అయితే, పోలీసుల కారు కనిపించగానే అందరితోపాటు ఆయన కూడా పరిగెత్తి వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఆ కారు వెళ్లిపోయిన తర్వాత, మళ్లీ వారు వెనక్కి వచ్చారు.

''ఇక్కడ అందరూ భయపడుతున్నారు. మహిళలు, పిల్లలను చుట్టుపక్కల గ్రామాల్లోని బంధువుల ఇళ్లకు పంపించేస్తున్నారు''అని హమిద్ హుస్సేన్ చెప్పారు.

సగం కంటే ఎక్కువ మంది ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారని మరో వ్యక్తి వివరించారు.

డీఎస్పీ హత్య

ఫొటో సోర్స్, ANI

ఆ హత్య తర్వాత, గ్రామానికి చెందిన ఆరు-ఏడు మందిని పోలీసులు తమతో తీసుకెళ్లారని మరికొందరు చెప్పారు.

అయితే, కేవలం ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నామని పోలీసుల అధికార ప్రతినిధి కృష్ణ కుమార్ బీబీసీతో చెప్పారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

పచ్‌గావ్‌ను అనుకుని ఉండే ఆరావళి పర్వతాల పరిసరాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఘటన స్థలానికి సురేంద్ర వెళ్లారని పోలీసులు చెప్పారు.

సురేంద‌ర్‌తోపాటు మరో ఇద్దరు పోలీసులు, ఒక డ్రైవర్, ఒక గన్‌మ్యాన్ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: ‘‘పోలీసువైతే యూనిఫాం ఏది? ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు’’

అక్రమ తవ్వకాల సమస్య..

అక్రమ తవ్వకాల సమస్య తమకేమీ కొత్తకాదని గ్రామస్థులు బీబీసీతో చెప్పారు. ఎప్పటినుంచో స్థానిక మీడియాలో దీనిపై వార్తలు వస్తున్నాయని, గత కొన్ని నెలలుగా పోలీసులు నిఘా పెంచారని వివరించారు.

గ్రామానికి చెందిన చాలా మందికి ఆ అక్రమ తవ్వకాలతో సంబంధముందని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు.

మరికొంత మందితో మేం మాట్లాడేందుకు ముందుకు వెళ్లినప్పుడు, అర్ధరాత్రి తెరచివున్న ఒక దుకాణం దగ్గర రెండు వాహనాలు ఆగాయి. ఆ వాహనాలను చూసిన వెంటనే చాలా మంది పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు.

ఆ వాహనాల నుంచి కొందరు పోలీసులు బయటకు వచ్చారు. ఒక ఫోటోను చూపిస్తూ.. దీనిలో కనిపించే వ్యక్తిని మీరు చూశారా? అని ప్రశ్నించారు.

వారి హోదా ఏమిటని? మేం ప్రశ్నించాం. ఆ ఫోటోలో ఉండే వ్యక్తి ఎవరని అడిగాం. అయితే, వారు సమాధానం చెప్పలేదు.

దాదాపు రెండు నిమిషాలు మేం వారితో మాట్లాడాం. అప్పటివరకు చుట్టుపక్కల వారంతా పరిసరాల్లోని ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసేసుకున్నారు.

వీడియో క్యాప్షన్, అనంతపురం: 'మా అమ్మే నన్ను నమ్మించి మోసం చేసింది... నా భర్తను చంపించింది'

అసలేం జరిగింది?

అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సురేందర్ సింగ్ బిష్ణోయ్‌కు సమాచారం అందిందనే వార్తలను బీబీసీ కోసం పనిచేసే జర్నలిస్టు సత్ సింగ్ కూడా ధ్రువీకరించారు.

''ఒక అనుమానాస్పద ట్రక్కును సురేందర్ రోడ్డుపై ఆపేసి.. పేపర్లు చూపించమన్నారు. కానీ, ఆ డ్రైవర్ చాలా వేగంగా సురేందర్ పైనుంచి దూసుకెళ్లాడు''అని సత్ సింగ్ చెప్పారు.

''ట్రక్కు తమవైపు దూసుకొచ్చినప్పుడు వెంటనే డ్రైవర్, గన్‌మ్యాన్ పక్కకు తప్పించుకున్నారు. కానీ, సురేందర్ ఘటన స్థలంలోనే చనిపోయారు''అని ఆయన వివరించారు.

''ఈ ఘటనకు బాధ్యులైన ఎవరినీ వదిలిపెట్టబోం. సురేందర్ కుటుంబానికి హరియాణా పోలీసులు అండగా నిలబడతారు''అని హరియాణా పోలీసులు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)