ఝార్ఖండ్: ఆదివాసీల జీవితాల్లో అగరుబత్తి ఘుమఘుమలు

ఆదివాసీల జీవితాల్లో అగరబత్తి ఘుమఘుమలు

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

    • రచయిత, రవి ప్రకాష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఝార్ఖండ్ దుమ్‌కా జిల్లాలో బేదియా అనే గ్రామం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో కేవలం 75 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వారిలో 99 శాతం మంది ఆదివాసీలే.

ఈ గ్రామంలో ఉంటున్న వారిలో చాంద్‌ముని హన్సదా ఒకరు. ఆమె సంథాలీ తెగకు చెందినవారు.

చాంద్‌ముని నెల క్రితం వరకూ 'హడియా' (ఒక రకం మద్యం) అమ్మి డబ్బులు సంపాదించేవారు. కానీ ఇప్పుడు ఆమె ఆ పని చేయడం లేదు.

ఆలయాలలో పూజకు ఉపయోగించే పూలు, బిల్వ పత్రాలతో చాంద్‌ముని ఇప్పుడు ఆగరుబత్తులు తయారు చేసే పనిచేస్తున్నారు. కొత్త పనితో ఆమె చాలా సంతోషంగా ఉన్నారు.

ఆదివాసీల జీవితాల్లో అగరబత్తి ఘుమఘుమలు

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

ఫొటో క్యాప్షన్, చాంద్‌ముని హన్సదా, ఆమె భర్త బిట్టూ మరాండీ

పని మారింది, సంతోషం దక్కింది

"ఇల్లు గడవడానికి మొదట హడియా అమ్ముతుండేదాన్ని. దానితో ఆదాయం వచ్చేది, కానీ ఆ పని నాకు నచ్చేది కాదు. ఈ పని ఎందుకు చేస్తున్నానా అనిపించేది. అక్కడ మత్తులో ఉన్న మగవాళ్ల మధ్య కూర్చోవాల్సి వచ్చేది" అని చాంద్‌ముని బీబీసీతో చెప్పారు.

ఇష్టం లేకపోయినా ఆమె మద్యం అమ్మేవారు. ఆ వ్యాపారంలో ఎక్కువ డబ్బు పెట్టాల్సిన అవసరం కూడా లేదు.

"వేరే ఏదైనా పని చేద్దామంటే మా దగ్గర దానికి పెట్టుబడి పెట్టేంత డబ్బు లేదు. నా భర్త కూడా పొలం పనులు చేస్తుంటాడు. ఇద్దరి సంపాదనతో ఇల్లు గడుస్తుంది" అని ఆమె చెప్పారు.

"గత నెల మా ఇంటి పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్లో కొంతమంది జనం ఉండడం చూశా. అక్కడ అగరుబత్తులు తయారు చేయడానికి ట్రైనింగ్ ఇస్తారని తెలిసింది. నేను దానికి ఫాం నింపాను. 10 రోజుల్లో ట్రైనింగ్ తీసుకున్నా, ఇప్పుడు రోజంతా అగరబత్తులు తయారు చేస్తుంటా" అని చాంద్‌ముని చెప్పారు

చాంద్‌ముని మనసుపెట్టి అగరబత్తులు తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు మత్తులో ఉండే మగవాళ్ల మధ్య కూచోవాల్సిన అవసరం లేదు. అగరబత్తి తయారీ చాలా సులభం కూడా.

ఆదివాసీల జీవితాల్లో అగరబత్తి ఘుమఘుమలు

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

మెరుగైన జీవితంపై ఆశలు

చాంద్‌మునితో పాటూ మరో 35 మంది మహిళలు కూడా అగరబత్తుల తయారీ శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా కలిసి ఈ పని చేస్తున్నారు.

"శిక్షణ ఇచ్చిన దాదా (అన్నయ్య) శ్రావణ మాసంలో అగరబత్తీలు బాగా అమ్ముడవుతాయని చెప్పారు. దానివల్ల మాకు వేల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ఇప్పుడు ఆ ఆశతోనే పనిచేస్తున్నాం" అని చాంద్‌ముని అన్నారు.

చాంద్‌ముని భర్త బిట్టూ మరాండీ మొదట పట్నాలో కూలి పనులు చేసేవాడు. పనులు చేస్తే అతడికి నెలకు సుమారు 3000 రూపాయలు వచ్చేవి

తల్లికి అతడు ఏకైక సంతానం. 1992లో తల్లి చనిపోవడంతో, అతడు తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. దాంతో ఆ సంపాదన కూడా పోయింది.

అప్పటి నుంచి ఇల్లు గడవడం కోసం ఈ దంపతులు చాలా కష్టపడుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు తమ జీవితం మెరుగు పడుతుందని ఇద్దరూ ఆశతో ఉన్నారు.

ఆదివాసీల జీవితాల్లో అగరబత్తి ఘుమఘుమలు

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

ఆదివాసీ సఖి సంఘం

"చేతికి ఎక్కువ డబ్బు వస్తుంది. అగరబత్తి వాసన కూడా బాగుంటుంది. చాలా బాగా అమ్ముడవుతుంది. దేవఘర్‌కు కూడా సప్లై చేస్తున్నాం. ఇక ఎలాంటి సమస్యా ఉండదు" అంటాడు బిట్టూ.

ఇక్కడ అగరబత్తులు తయారు చేస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలు ఆదివాసీలే. వీరంతా కలిసి "సఖి మండల్" పేరుతో ఒక సంఘం ఏర్పాటు చేశారు. అగరబత్తులు తయారు చేయడం ప్రారంభించారు.

పక్కనే ఉన్న చోర్‌ఖేడా గ్రామంలోని రేణూ కుమారి వీరికి ఈ ట్రైనింగ్ ఇప్పించడానికి ముందుకొచ్చారు. "బేదియాలో హడియా అమ్మకం మామూలు విషయం" అని ఆమె చెబుతారు.

అక్కడి పరిస్థితి గమనించిన ఆమె గ్రామంలో ఏ పనిలేకుండా ఉన్న మహిళలతో మాట్లాడారు. 35 మంది మహిళలతో ఒక స్వయం సహాయక బృందం ఏర్పాటు చేశారు.

మొదట వారికి మాన్యువల్ మెషిన్‌తో అగరబత్తీల తయారీ శిక్షణ ఇచ్చారు. తర్వాత వారికి ఆటోమేటిక్ మెషిన్‌తో పనిచేయడం కూడా నేర్పించారు.

ఆదివాసీల జీవితాల్లో అగరబత్తి ఘుమఘుమలు

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

బ్రాండింగ్ చేస్తున్న ప్రభుత్వం

"ఇప్పుడు మేం ఇంకో బృందానికి ట్రైనింగ్ ప్రారంభిస్తున్నాం. అది ఇదే గ్రామంలో జరుగుతుంది. దానికి వాళ్ల ఇంట్లో ఉన్న వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు" అని రేణూ చెప్పారు.

ఈ అగరబత్తీలకు బ్రాండింగ్ చేయడానికి ఝార్ఖండ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇటీవల దీన్ని లాంచ్ చేసిన దుమ్‌కా జిల్లా కలెక్టర్ ముకేష్ కుమార్, ముఖ్యమంత్రి రఘువర్ దాస్, ప్రధాన కార్యదర్శి సుధీర్ త్రిపాఠీని కలిసి ఈ అగరబత్తీలను బహుమతిగా కూడా ఇచ్చారు.

అదే రోజు మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి "ప్రభుత్వం వీటి అమ్మకాలకు అండగా నిలుస్తుంది" అని చెప్పారు

"బాసుకినాథ్ ఆలయంలో శివలింగాన్ని పూజించే బిల్వపత్రాలు, పూలతో ఈ అగరుబత్తులు తయారు చేస్తున్నాం, అందుకే వాటికి 'బాసుకి అగరబత్తి' అనే పేరు పెట్టాం" అని జర్‌ముండీ బీడీఓ రాజేష్ డుంగ్‌డుంగ్ బీబీసీకి చెప్పారు.

ఆదివాసీల జీవితాల్లో అగరబత్తి ఘుమఘుమలు

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

బాబాధామ్ (దేవ్‌ఘర్), బాసుకినాథ్ ధామ్ (జర్‌ముండీ)కు ఏడాదంతా భక్తులు వస్తూనే ఉంటారు. శ్రావణ మాసంలో రోజూ లక్షల మందితో ఈ అలయాలు కిటకిటలాడుతుంటాయి. ఆ సమయంలో ఇక్కడ అగరబత్తీల అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఆలయంలో పూజకు ఉపయోగించిన బిల్వపత్రాలు, పూలతో ఈ అగరబత్తీలను తయారు చేస్తుండడంతో ఈ బ్రాండ్‌పై భక్తులకు విశ్వాసం ఏర్పడింది.

ఇది అగరబత్తిల మార్కెటింగ్‌కు కూడా కలిసొస్తుందని ఆశిస్తున్నారు. దక్షిణ భారత దేశంలోని కొన్ని ఆలయాల్లో ఈ ప్రయోగం ఇప్పటికే విజయవంతం అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)