ప్రయాగ్‌రాజ్: 'మా నాన్నను ఇరికించారు... అబద్ధం చెప్పి మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు'-జావెద్ మొహమ్మద్ కూతురు సుమైయా

సుమైయా ఫాతిమా
ఫొటో క్యాప్షన్, సుమైయా ఫాతిమా
    • రచయిత, అనంత్ ఝణాణె
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ప్రయాగ్‌రాజ్ నుంచి

ప్రయాగ్‌రాజ్‌లో గత శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల కేసులో జావెద్ మొహమ్మద్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రయాగ్‌రాజ్ అభివృద్ధి సంస్థ (పీడీఏ) ఆదివారం జావెద్ మొహమ్మద్ ఇంటిని కూల్చివేసింది.

జావెద్ మొహమ్మద్ ఆ ఇంటిని అక్రమంగా నిర్మించారని... దీనికి సంబంధించి మే నెలలోనే అతనికి నోటీసులు పంపామని పీడీఏ చెప్పింది.

అయితే, పీడీఏ చర్యపై ప్రజలు ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

జావెద్ మొహమ్మద్ చిన్న కూతురు సుమైయా ఫాతిమా, వారి న్యాయవాది కె.కె రాయ్‌తో మాట్లాడి ఈ అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

ఇల్లు తన తండ్రి పేరు మీద లేదని, తల్లి పర్వీన్ ఫాతిమా పేరు మీద ఉన్నట్లు సుమైయా స్పష్టం చేశారు. అయితే, ఇంటి ప్లాన్‌కు అనుమతి లభించలేదని కూడా ఆమె చెప్పారు. ఈ సమస్య తామొక్కరిదే కాదని నగరం మొత్తానికీ ఇదే సమస్య ఉందని తెలిపారు.

జావెద్ ఇల్లు

ఫొటో సోర్స్, ANI

''రాత్రికి రాత్రే నా తండ్రి మాస్టర్‌మైండ్ ఎలా అయ్యారు?''

తన కుటుంబం గత 20 ఏళ్లుగా ఆ ఇంట్లోనే ఉంటున్నట్లు సుమైయా చెప్పారు.

ప్రయాగ్‌రాజ్ హింసకు జావెద్ మొహమ్మద్ సూత్రధారి అని పోలీసులు భావించడం గురించి సుమైయా మాట్లాడారు.

''మా నాన్నను ఇందులో ఇరికించారు. ఈ ఘటనల్లో ఆయన ప్రమేయం లేదు. ఆయన చేసిన చివరి ఫేస్‌బుక్ పోస్ట్‌ను చూడండి. అందులో ఆయన శాంతి, సామరస్యాల గురించే మాట్లాడారు. ఎప్పుడూ అడ్మినిస్ట్రేషన్‌కు సహాయకంగా ఉండే వ్యక్తి... అకస్మాత్తుగా రాత్రికి రాత్రే మాస్టర్‌మైండ్ ఎలా అయ్యాడు?'' అని ఆమె ప్రశ్నించారు.

జావెద్ మొహమ్మద్‌పై పోలీసులు చేసిన ఆరోపణల గురించి కూడా సుమైయా మాట్లాడారు. ''ఈ ప్రదర్శనల్లో ఆయన హస్తం లేదు... ఆయన ఎవర్నీ పిలవడానికి ప్రయత్నించలేదు కూడా. పోలీసులు ఏ ఆధారాలతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. వారు మా ముందు ఇలా ఎందుకు మాట్లాడట్లేదు? నిజం ఏంటంటే మా నాన్న నిరసన ప్రదర్శనల కోసం వచ్చేవారికి రావొద్దని చెప్పారు. ఎవరైనా నిరసన తెలపాలనుకుంటే ప్రభుత్వాన్ని, అధికారులను ఆశ్రయించండని గత పోస్టులో విజ్ఞప్తి చేశారు. ఇలా రోడ్ల మీద అల్లర్లు చేయవద్దు అని అన్నారు'' అని సుమైయా వివరించారు.

ఆదివారం జావెద్ మొహమ్మద్ ఇల్లును కూల్చివేశారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఆదివారం జావెద్ మొహమ్మద్ ఇల్లును కూల్చివేశారు

‘‘అమ్మని పోలీసులు తిట్టారు’’

రాత్రి 8.30 గంటల సమయంలో మాట్లాడాలని చెప్పి పోలీసులు తన తండ్రిని తీసుకెళ్లారని సుమైయా తెలిపారు. నాలుగైదు గంటల తర్వాత తనతో పాటు తన తల్లి పర్వీన్ ఫాతిమాను కూడా పోలీసులు తీసుకెళ్లారని ఆమె చెప్పారు.

''మాకు అబద్ధం చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు. మీ నాన్న ఎక్కడున్నారో అక్కడికే తీసుకెళ్తున్నాం అని వారు మాకు చెప్పారు. కానీ, మమ్మల్ని మహిళా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ముందుగా మా పేర్లు అడిగారు. తర్వాత, ఇంట్లో మీ నాన్న ఎలాంటి విషయాలు మాట్లాడతారు అని అడిగారు. మొదట మాతో పోలీసుల ప్రవర్తన బాగానే ఉంది. తర్వాత ఒక్కొక్కరుగా మహిళా కానిస్టేబుళ్లంతా వచ్చి విచిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒక మగ కానిస్టేబుల్ వచ్చి మా అమ్మను హిందీలో తిట్టాడు. మేం శుక్రవారం, శనివారం రాత్రి అక్కడే ఉన్నాం. ఆదివారం మమ్మల్ని మా బంధువుల ఇంటి దగ్గర దింపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మా ఇల్లును కూల్చేశారు'' అని సుమైయా వివరించారు.

''స్థలం అమ్మ పేరు మీద ఉంది''

భూమి యాజమాన్యం గురించి అడిగిన ప్రశ్నకు సుమైయా మాట్లాడుతూ ఈ భూమి మా అమ్మకు చెందినది అని చెప్పారు. ''మా తాతయ్య ఆమెకు దీన్ని బహుమతిగా ఇచ్చారు. మా దగ్గర భూమికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయి. మేం కట్టే నీటి పన్ను, ఇంటి పన్ను కూడా మా అమ్మ పేరు మీదే వస్తుంది. ఎందుకంటే ఈ స్థలం మా అమ్మ పేరు మీద ఉంది'' అని తెలిపారు.

ఇంటిని కూల్చివేయడానికి కారణం ఏమిటని సుమైయాను ప్రశ్నించగా... ''పీడీఏ నుంచి ఇంటి ప్లాన్‌కు అనుమతి దొరకలేదు. దీనికీ ఒక కారణం ఉంది. మా ఇంట్లో చాలాసార్లు దీని గురించి చర్చించాం. ఇంటి ప్లాన్‌కు అనుమతి దక్కలేదని మా నాన్న కూడా చాలా ఆందోళన చెందేవారు. దాని కోసం కనీసం 25 నుంచి 30 లక్షల వరకు అవసరం. మాదే కాదు ప్రయాగ్‌రాజ్‌లోని చాలా ఇళ్ల ప్లాన్‌కు అనుమతి దక్కలేదు'' అని ఆమె చెప్పారు.

ఇల్లు కూల్చడానికి ముందు సామాన్లను బయట పెడుతోన్న కార్మికులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఇల్లు కూల్చడానికి ముందు సామాన్లను బయట పెడుతోన్న కార్మికులు

''ఇంట్లో అక్రమ ఆయుధాలు కనిపిస్తే వాటిని ఎందుకు అందరికీ చూపెట్టలేదు''

జావెద్ మొహహ్మద్ ఇంట్లో అక్రమ ఆయుధాలు, అభ్యంతరకర వస్తువులు లభించాయన్న పోలీసుల వాదనపై సుమైయా మాట్లాడారు. ''మా ఇంటిని కూల్చివేస్తున్నప్పుడు లైవ్‌ రికార్డింగ్ చేస్తున్నారు. లోపల నుంచి బయటకు తెచ్చే వస్తువులు బయటకు కనిపించాయి. వాటిని అందరూ చూశారు. అప్పుడు మా ఇంట్లో ఎలాంటి ఆయుధాలు, అభ్యంతరకర వస్తువులు కనిపించలేదు. కానీ, ఇల్లు మొత్తం కూలిన తర్వాత వారికి ఆయుధాలు కనిపిస్తున్నాయి.

మా నాన్న దగ్గర లైసెన్స్ తీసుకున్న తుపాకీ ఉంది. కానీ, ఎన్నికల సమయంలో దాన్ని అడ్మినిస్ట్రేషన్ దగ్గర డిపాజిట్ చేశారు. దాన్ని తిరిగి ఇంటికి తెచ్చుకునేందుకు మాకు ఇప్పటివరకు సమయమే దొరకలేదు'' అని సుమైయా చెప్పారు.

ఇల్లును మళ్లీ కట్టుకోవచ్చు కానీ, వారు ఒక కుటుంబాన్ని ముక్కలు చేశారు అని ఆమె అన్నారు.

వారి న్యాయవాది కె.కె రాయ్ కూడా ఇంటి యజమాని పర్వీన్ ఫాతిమా అనే విషయాన్ని పునరుద్ఘాటించారు.

వీడియో క్యాప్షన్, గల్ఫ్ ప్రభుత్వాల ఆగ్రహం వెనుక అక్కడి ప్రజల ఆక్రోశం ఉందన్న హామిద్ అన్సారీ

''ఇంటి యజమాని జావెద్ మొహమ్మద్ కాదు పర్వీన్ ఫాతిమా. చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధమైన చర్య బుల్డోజర్ విధానం. ఈ విషయంలో పెద్ద పొరపాటు జరిగింది. తొలుత వారు జావెద్ ఇంటిని కూల్చివేస్తామని ప్రకటించారు. కానీ, కూల్చివేసిన ఇట్లు జావెద్ మొహమ్మద్‌ది కాదు'' అని ఆయన చెప్పారు.

ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. అయితే జూన్ 9న ఇచ్చిన నోటీసుల్లో దీనికి సంబంధించి మే నెలలోనే నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ''ఇవన్నీ అప్పటికప్పుడు తయారు చేసిన నోటీసులు. ఒక్కరోజు సమయం కూడా ఇవ్వకుండా ఇంటిని కూల్చేశారు'' అని వివరించారు.

ప్లాన్‌ను ఆమోదించకపోయినా ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి చట్టం ప్రకారం ఇంటిని కూల్చివేయకూడదు. కేవలం ఇంటికి సీల్ వేయవచ్చు అని తెలిపారు.

ఈ కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని రాయ్ చెప్పారు. జావెద్ మొహమ్మద్ భార్య, పిల్లలను అక్రమంగా నిర్బంధించడంపై హైకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)