ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయిందని బాలికకు విషమిచ్చి చంపేసిన మేనమామ, బావ

హత్య

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సల్మాన్ రావీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మధ్యప్రదేశ్‌ రాజ్‌గఢ్ జిల్లా రతన్‌పూరియా గ్రామంలో 17 ఏళ్ల బాలికను ఆమె మేనమామ, అతని కొడుకు కలిసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

‘‘వీరిద్దరూ కలిసి ఆ బాలికతో బలవంతంగా విషం తాగించారు’’ అని ఖిలచీపుర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ముఖౌశ్ గౌడ్ చెప్పారు.

మే 18న ఆ బాలిక మరణించిందని, మే 20న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

ముఖౌశ్ గౌడ్

ఫొటో సోర్స్, Kamlesh Sarada/BBC

ఫొటో క్యాప్షన్, ముఖౌశ్ గౌడ్

పోలీసులను తప్పుదోవ పట్టించారు..

బాలిక విషం తాగి ఆత్మహత్య చేసుకుందని ఆ ఇద్దరు నిందితులూ తమను తప్పుదోవ పట్టించినట్లు గౌడ్ వెల్లడించారు.

అయితే, ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పరిశోధన, వేలిముద్రల నిపుణుల సాయంతో నిందితులను పట్టుకున్నట్లు గౌడ్ చెప్పారు. నిందితులు అనార్ సింగ్, పీరూ సింగ్‌లు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు.

మొదట ఖార్‌చాయాఖేడీ ప్రాంతానికి చెందిన ఈ బాలికను దేవీసింగ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్సో చట్టం కింద అతడిపై కేసు నమోదైంది.

మధ్యప్రదేశ్

ఫొటో సోర్స్, Kamlesh Sarada/BBC

దేవీ సింగ్, ఆ బాలిక ప్రేమించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, దేవీ సింగ్‌పై బాధిత బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మైనర్‌అని, ఆమెను ఆయన కిడ్నాప్ చేశారని బాలిక కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసులు ఆ బాలికను వెతికి పట్టుకుని, ఆమె కుటుంబానికి అప్పగించారు. అయితే, ఆమెను కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టేవారని ఖార్‌చాయాఖేడీ గ్రామ ప్రజలు చెప్పారు.

మరోవైపు తాను దేవీ సింగ్‌నే పెళ్లి చేసుకుంటానని ఆ బాలిక తెగేసిచెప్పినట్లు పోలీసులతో ఆమె కుటుంబ సభ్యులు కూడా వివరించారు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ దళిత యువకుడి హత్య: ‘ ఇస్లాం ప్రకారం ఇది చాలా పెద్ద నేరం’ - అసదుద్దీన్ ఒవైసీ

తన గ్రామానికి తీసుకెళ్లిన మామయ్య

‘‘ఈ గొడవలు జరుగుతున్నప్పుడే బాలిక మావయ్య, ఆయన కుమారుడు గ్రామానికి వచ్చారు. తమతోపాటు ఆమెను రతన్‌పూరియా గ్రామానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా దేవీ సింగ్‌ను మరిచిపోవాలని ఆమెపై విపరీతంగా ఒత్తిడి చేసేవారు’’అని స్టేషన్ ఇన్‌ఛార్జి గౌడ్ వివరించారు.

ఖిలచీపుర్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీలోని సెక్షన్ 302, 201ల కింద కేసు నమోదైంది.

ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ప్రాథమిక విచారణ నివేదికను నమోదు చేశారు. తమ కుటుంబానికి ఇష్టం లేకుండా ఆ యువకుడితో వెళ్లినందుకు, ఇంకా ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని అన్నందుకు ఆగ్రహంతో వీరిద్దరూ కలిసి ఆమెతో బలవంతంగా విషం తాగించారని పోలీసులు వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, పరువు హత్యలు కాదు, అహంకార హత్యలు

మొదట్లో పోలీసులు కూడా ఇది ఆత్మహత్యగానే భావించారు. ఎందుకంటే బాధిత బాలిక మావయ్యే వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ బాలిక మృతదేహం పడివున్న తీరుపై తమకు అనుమానం వచ్చిందని పోలీసు అధికారి గౌడ్ వివరించారు.

‘‘అనుమానం రావడంతో ఫొరెన్సిక్ నిపుణులను పిలిపించాం. కేసును చాలా జాగ్రత్తగా విచారణ చేపట్టాం. దీంతో ఆమె మేనమామ, ఆయన కుమారుడిపై అనుమానం వచ్చింది’’అని గౌడ్ చెప్పారు.

కుటుంబం ‘పరువు’ పోతుందనే ఈ హత్య చేసినట్లు ఆ ఇద్దరూ అంగీకరించారని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)