పిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే ఎంత ప్రమాదకరం.. ఏం చేయాలి, ఏం చేయకూడదు?

పిల్లల్లో మూర్ఛ వ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శిరీష పాటిబండ్ల
    • హోదా, బీబీసీ కోసం

పిల్లలకు జ్వరమంటేనే చేయీ కాలూ ఆడదు మనకు. అలాంటిది జ్వరంలో ఫిట్స్ వస్తే ?! అమ్మో, ఏమైనా ఉందా?! ఏం చేయాలి, ఎటు పోవాలి, హాస్పిటల్లో చేర్చాలా, ఎన్నిరోజులుంచాలి, ఏమవుతుందో...ఇలా సవాలక్ష ప్రశ్నలు....ఇంటిల్లిపాదికీ ఫిట్స్ వచ్చినంత పనవుతుంది.

పిల్లలకనే కాదు, పెద్దవాళ్లకూ ఫిట్స్ రావడం, ఫిట్స్ జబ్బు ఉండటం పట్ల ఎన్నో భయాలూ, అపోహలు ఉన్నాయి. సమాజంలోనైతే ఫిట్స్ రోగుల పట్ల ఒకింత చిన్న చూపు కూడా ఉంది.

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఫిట్స్ రావడానికి కారణాలు అనేకం. అయితే అన్ని ఫిట్స్ ప్రమాదకరమైనవి కావు. అలాగని, ప్రతిసారీ దాన్ని తేలిగ్గానూ తీసుకోలేము.

ముందుగా మనం తెలుసుకోవలసిందేమిటంటే ఫిట్స్/మూర్ఛ అనేది వ్యాధి కాదు. వ్యాధి లక్షణం. అంటే శరీరంలో లేదా మెదడులో జరిగే ఏదో ఒక అసమతుల్యతను బయట వేసే ఒక లక్షణమే మూర్ఛ. అలాంటి అసమతుల్యతల్లో తరచూ మనం చూసేది జ్వరం. మన తెలిసిన వాళ్లలో ఎవరో ఒకరికి చిన్నప్పుడు జ్వరంలో ఫిట్స్ వచ్చేవని మనమూ వినే ఉంటాము.

వీడియో క్యాప్షన్, తల్లిపాలు బిడ్డకు ఎప్పుడు పట్టాలి? బాలింతలు ఏం తినాలి? ఏం తినకూడదు?

అన్ని ఫిట్స్ ఒకేరకం కాదు

జ్వరం వచ్చిన పిల్లలందరిలోనూ ఫిట్స్ రావు. అలాగే జ్వరంలో వచ్చే ఫిట్స్ అన్నీ ఒక కోవకే చెందినవీ కావు.

జ్వరంలో వచ్చే మూర్ఛ గురించి ఎప్పుడు మనం ఆదుర్దా పడనవసరం లేదు?

1. ఆరు నెలల వయసు నుండి (ఈ మధ్య 3 నెలలు అని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి) అరవై నెలలు వరకూ పిల్లల్లో.

2. ఎదుగుదల విషయంలో ఎటువంటి లోపమూ లేనివారికి

3. జ్వరం వచ్చిన మొదటి 24 గంటల్లోపు

4. శరీర ఉష్ణోగ్రత మరీ హెచ్చుగా ఉన్నప్పుడు

5. కొన్ని క్షణాల నుండి - 15 నిమిషాల లోపు

6. శరీరమంతా కొట్టుకునేలా వచ్చే రకం మూర్ఛ

7. సాధారణంగా ఒక్కసారే వచ్చి ఉండటం.

8. ఫిట్స్ ఆగిపోయాక పిల్లవాడు పూర్తి స్పృహలో ఉండటం

ఇలాంటివి గనుక మీరు గమనిస్తే, ఇవి సాధారణ జ్వరంలో వచ్చే మూర్ఛ (Simple febrile seizures) అయి ఉండవచ్చు.

పిల్లల్లో మూర్ఛ వ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఎవరిలో ఈ సింపుల్ ఫైబ్రైల్ సీజర్స్ రావచ్చు?

ఐదేళ్లలోపు పిల్లల్లో ఎవరికైనా ఈ ఫిట్స్ రావచ్చు. 2-5% ఆరోగ్యంగా ఉండే పిల్లల్లో febrile seizures వస్తాయి.

1. సాధారణంగా కాస్త అటు ఇటుగా ఏడాది వయసులో

2. అబ్బాయిల్లో ఎక్కువ

3. కుటుంబంలో ఎవరికైనా జ్వరంలో ఫిట్స్ వచ్చి ఉండటం

4. కుటుంబంలో ఎవరికైనా మూర్ఛ వ్యాధి ఉండటం

5. శరీరంలో ఉప్పు (సోడియం) శాతం తక్కువగా ఉండడం

6. రక్తహీనత

పైన చెప్పిన ప్రమాద సూచికల్లో ఒకటి కంటే ఎన్ని ఎక్కువ పిల్లవాడికి వర్తిస్తాయో దానిని బట్టి జ్వరంలో మూర్ఛ మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఎంత ఉండవచ్చో వైద్యులు అంచనా వేసి చెప్పగలరు.

అలాగే ఐదేళ్ల వయసు తరువాత కూడా వీరిలో ఎవరెవరికి భవిష్యత్తులో వ్యాధి రావచ్చో కూడా అంచనా వేయవచ్చు.

తరచూ జ్వరంలో ఫిట్స్ రావడం, సాధారణ తరహాలో కాకుండా ఎక్కువసేపు లేదా శరీరంలో కొంత భాగం వరకే ఫిట్స్ రావడం, కుటుంబంలో మూర్ఛ వ్యాధి ఉండటం, బిడ్డ ఎదుగుదలలో ప్రవర్తనలో తేడాలు ఉండటం లాంటివి కనిపిస్తే, అటువంటి పిల్లలను ఐదేళ్ల తర్వాత కూడా వైద్యులు పరిశీలించవలసి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, "మా బాబుకు ఆటిజం ఉందని చెప్పడానికి డాక్టర్లే భయపడ్డారు"

ఈ ఫిట్స్‌ను ఎప్పుడు ప్రమాదంగా పరిగణించాలి?

మొదటిసారి సాధారణ జ్వరంలో ఫిట్స్ అయినా కూడా ఒక పూట వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. ఒకసారి నిర్ధారణ అయితే ఈ ఫెబ్రిల్ సీజర్స్‌కు ప్రతీసారి ఆందోళనతో ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఉండొచ్చు.

- ఒక్కరోజులోనే ఒక్కసారికి మించి ఫిట్స్ వచ్చినా

- ఎక్కువ సమయం వరకూ ఫిట్స్ వచ్చినా

- అసాధారణ ఎదుగుదల ఉన్న పిల్లల్లో అయినా

- పిల్లవాడు ఎక్కువ మగతగా లేదా స్పృహలో లేకుండా ఉన్నా

- పాలు తాగకుండా, ఏడుస్తూ, వాంతులు చేసుకుంటున్నా...

- ఏదైనా అనారోగ్యంతో ఉండి రెండో రోజో, ఆ తరువాతో ఫిట్స్ వస్తే..

అటువంటివి సందర్భాలలో ఫిట్స్‌ను ప్రమాదకరమైనవని గుర్తించాలి. తక్షణమే ఆసుపత్రిలో చేర్చాలి.

ఐదేళ్లు నిండిన పిల్లల్లో లేదా కౌమార దశలో ఉన్న పిల్లల్లో అయినా మొదటిసారి ఎటువంటి రకమైన ఫిట్స్ అయినా అలక్ష్యం చేయకండి.

జ్వరం లేకుండానే ఫిట్స్ వచ్చిన కూడా ఏ వయసు పిల్లల్లో అయినా అది ప్రమాదకరమే.

పిల్లల్లో మూర్ఛ వ్యాధి

ఫొటో సోర్స్, MATT HUGHES

ఆసుపత్రిలో చేరాక

సాధారణ జ్వరంలో వచ్చిన ఫిట్స్ అయితే ఫిట్స్ కన్నా, జ్వరం ఎంత హెచ్చుగా వచ్చిందో పరీక్షలు అవసరమైన మేరకు చేసుకుంటే చాలు. మెదడుకు స్కానింగులు ,ఇఇజి, వెన్ను నీరు పరీక్ష వంటివి అవసరం ఉండవు.

పిల్లల్లో ఫిట్స్ అసాధారణ రీతిలో ఉన్నాయనిపిస్తేనే వైద్యుల సలహా మేరకు ఖర్చుతో కూడుకున్నవి, రేడియేషన్ రిస్కు ఉన్న టెస్టులను పరిగణించాల్సి ఉంటుంది. ఏ టెస్ట్ ఎందుకు చేయిస్తున్నారన్నది రోగిగా, రోగి తల్లిదండ్రులుగా, స్పష్టత పొందే హక్కు మీకు ఉంటుంది. అడిగి తెలుసుకుని ముందుకు వెళ్ళండి.

సాధారణ జ్వరంలో ఫిట్స్ను నివారించడం ఎలా?

- ముందుగా బిడ్డ జ్వరాన్ని మరీ పెరగకుండా నిర్ణీత మోతాదులో పారాసిటమాల్ ఇవ్వాలి.

- తగినంత నీరు తాగించాలి. ORS కూడా పట్టవచ్చు.

- తడిబట్టతో ఒళ్లు చల్లబడే వరకూ(10-15 నిమిషాలు) తుడవాలి.

- నివారణ కోసం వైద్యులు సూచించిన మాత్ర రెండు పూటలా ఓ రెండు మూడు రోజులు వేయాల్సి ఉంటుంది.

- ఈ తరహా ఫిట్స్‌కు ఇతర ఫిట్స్ మందులు రోజూ వాడాల్సిన పని లేదు.

- జ్వరం ఎందుకు వచ్చిందనే దానిపై దృష్టి పెట్టండి.

వీడియో క్యాప్షన్, ఉదయపు నడక ఆరోగ్యానికి ఎందుకు మంచిది

సాధారణ ఫిట్స్ విషయంలో చేయకూడని పనులు

1. పెద్ద పెద్ద స్కానింగుల జోలికి వెళ్ళకండి. అందుకు అనుభవజ్ఞులైన పిల్లల వైద్యుల సలహా తీసుకోండి.

2. నుదుటి మీద, కణతలపై కాల్చి వాత పెట్టడం లాంటివి చేయకండి. (గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి చూస్తుంటాము)

3. పసరు మందులు, తాయత్తులు హానికరం.

4. ఇది అంటువ్యాధి అనో, అవమానకరమైన విషయమనో భావించకండి.

5. పరిజ్ఞానం లేని వారు (అర్హత లేకుండా వైద్యులుగా చలామణి అయ్యేవారు) సూచించే ఫిట్స్ మందులు వాడకండి.

6. ఎటువంటి ప్రమాద లక్షణాలు కనిపించినా అలక్ష్య పెట్టకండి. ఒకసారి సాధారణ జ్వరంలో ఫిట్స్ వచ్చే పిల్లల్లో మరోసారి ప్రమాదకరమైన ఫిట్స్ రావని గ్యారంటీ లేదు.

ఇదండీ....సాధారణ జ్వరంలో వచ్చే ఫిట్స్‌ను గుర్తించే విధానం. మనం భయపడిపోయి పిల్లలను ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎదిగే కొద్దీ చాలా వరకు ఈ ఫెబ్రిల్ సీజర్స్ తగ్గిపోతాయి. ఎటువంటి లోపాలూ లేకుండా పూర్తి ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు.

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)

వీడియో క్యాప్షన్, బాలీవుడ్ సినిమా జల్సాలో నటించిన తెలుగు అబ్బాయి సూర్య కాశీభట్లతో బీబీసీ ఇంటర్వ్యూ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)