మధ్యప్రదేశ్: ఒకేసారి మూడు పెళ్లిళ్లు.. అర్ధరాత్రి కరెంట్ పోవడంతో మారిపోయిన పెళ్లికూతుళ్లు..

మార్పడ్డ వధువులు

ఫొటో సోర్స్, SHURAIH NIAZI/BBC

    • రచయిత, శురాయి నియాజీ
    • హోదా, బీబీసీ కోసం

విద్యుత్ కోత కారణంగా మధ్యప్రదేశ్‌‌లో ఓ పెళ్లిలో పెళ్లికూతుళ్లు మారిపోయారు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా అస్లానా గ్రామంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లి జరుగుతోంది.

అస్లానాకు చెందిన రమేశ్‌లాల్‌కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. ముగ్గురు కూతుళ్లకు ఒకేసారి పెళ్లి చేయాలని ఆయన నిర్ణయించారు. పెద్ద కూతురు కోమల్‌కు రాహుల్‌తో, రెండో అమ్మాయి నికితకు భోలాతో, మూడో కుమార్తె కరిష్మాకు గణేశ్‌తో పెళ్లి సంబంధం కుదిరింది.

మే 6వ తేదీన పెళ్లి కొడుకులు ఊరేగింపుగా అస్లానా గ్రామానికి వచ్చారు.

కల్యాణ క్రతువులో భాగంగా అమ్మవారి పూజా కార్యక్రమం జరుగుతుండగా గ్రామంలో కరెంటు పోయింది.

వీడియో క్యాప్షన్, పెళ్ళిలో కరెంటు పోయింది... పెళ్ళికూతుళ్ళు మారిపోయారు

అమ్మవారి పూజలో పొరపాటు

చిమ్మచీకటిగా ఉండటం, అదే సమయంలో వధువులు అటు మారడంతో పొరపాటు జరిగింది. దీంతో రమేశ్ లాల్ రెండో కూతురు నికిత తన చెల్లికి కాబోయే భర్త గణేశ్ పక్కన, మూడో అమ్మాయి కరిష్మా తన అక్కకు కాబోయే భర్త భోలా పక్కన కూర్చుని పూజను పూర్తి చేశారు.

పూజ జరుగుతున్న గదిలో చీకటి కారణంగా ఈ విషయం ఎవరూ గుర్తించలేకపోయారు. పెళ్లి కూతుళ్లు ముసుగేసుకోవడంతో వారిని గుర్తు పట్టడానికి వీలు లేకుండా పోయింది.

రాత్రి పన్నెండున్నరకు కరెంటు వచ్చింది. జరిగిన పొరపాటును గుర్తించారు. దీంతో మళ్లీ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. ఉదయం 5 గంటలకు, నికితా-భోలా, కరిష్మా-గణేష్‌లు ప్రదక్షిణలు చేశారు.

అస్లానా గ్రామస్తులు

ఫొటో సోర్స్, SHURAIH NIAZI/BBC

'సాయంత్రం కరెంటు కోత'

అయితే, ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

''గ్రామంలో సాయంత్రం సమయంలో కరెంటు కోత ఉంది. ఇది రోజువారీ వ్యవహారంగా మారింది. పూజ సమయంలో చిన్న పొరపాటు జరిగింది. అయితే వారిద్దరికీ సరైన వరుడితో, సరైన సమయంలోనే పెళ్లి జరిపించాం'' అని అమ్మాయిల తండ్రి రమేశ్‌లాల్ అన్నారు.

ఈ వ్యవహారంపై పెళ్లి వేడుకలో వాగ్వాదం జరిగిందని, అయితే వెంటనే సద్దుమణిగిందని గ్రామస్తులు చెప్పారు.

జరిగిన ఘటనకు బాధ్యత వహించాలంటూ కాంగ్రెస్ నేత కేకే మిశ్రా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో విద్యుత్ సమస్య కారణంగా చాలా చోట్ల కరెంట్ కోతలు అమలు చేస్తున్నారు. దీంతో గ్రామంలో గంటల తరబడి కరెంటు ఉండటం లేదు. రాష్ట్రంలో ఎండలు కూడా అధికంగా ఉన్నాయి. వేడి కారణంగా విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరిగింది.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ హత్య: ‘నడిరోడ్డుపై చంపుతుంటే 30 మందిలో ఒక్కరూ అడ్డుకోలేదు’

గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు నుంచి ఆరు గంటల పాటు విద్యుత్ కోతలు సాధారణంగా మారాయి. దాదాపు 600 మెగావాట్ల డిమాండ్-సరఫరా అంతరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇది ఇంకా ఎక్కువని చెబుతున్నారు.

విద్యుత్ సంక్షోభంపై మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

''విద్యుత్ సంక్షోభం, నీటి సంక్షోభం, బొగ్గు సంక్షోభాన్ని ఇప్పటికీ తప్పుడు లెక్కలు చూపుతూ కొట్టిపారేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి'' అంటూ కమల్‌నాథ్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)