జార్ఖండ్: 46 సంవత్సరాలు లివ్-ఇన్‌లో ఉన్నాక 69 ఏళ్లకు పెళ్లి చేసుకున్న బామ్మ

ఫొటో సోర్స్, NIMITTA
- రచయిత, రవి ప్రకాశ్
- హోదా, బీబీసీ కోసం
జార్ఖండ్‌లోని ఖుంటీ జిల్లా డుమర్దగా గ్రామానికి చెందిన ఫూల్మని టూటీకి 46 ఏళ్లు. 1998లో ఆమెకు మొదటి వివాహం జరిగింది. అప్పటికి ఆమె వయసు 22 ఏళ్లు. తరువాత ఏడేళ్లకు ఫూల్మని భర్త చనిపోయారు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు, మూడో బిడ్డ కడుపులో ఉంది.
భర్త మరణంతో ఆమె ఒంటరి అయిపోయారు. ముగ్గురు పిల్లలు, సంపాదించే దిక్కు లేదు. మామయ్య ముసలివారు. అత్తయ్య ముందే చనిపోయారు. జీవితం భారంగా మారింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఇక అప్పుడు ఫూల్మని మామ బిర్సా లోహ్రా, తన చెల్లెలి కొడుకు మహావీర్‌ను దత్తత తీసుకున్నారు.
మహావీర్, ఫూల్మనికి దగ్గరయ్యారు. వారిద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. ఈ సంబంధానికి ఫూల్మని మామ కూడా సమ్మతించారు. తన కోడలికి ఒక తోడు దొరికిందని, ఇంటికి ఒక వారసుడు దొరికాడని మామ సంతోషించారు.
వీరి బంధానికి సామాజిక గుర్తింపు కోసం వివాహం చేసుకోవాలనుకున్నారు. గ్రామ పెద్దలను సంప్రదించాలనుకున్నారు. సరిగ్గా అప్పుడే మామ బిర్సా లోహ్రా చనిపోయారు. దాంతో, వారు వివాహం మాట పక్కన పెట్టేశారు.
మహావీర్ కూలి పనులు చేస్తూ ఇంటి ఖర్చులకు సంపాదించేవారు. ఫూల్మని, మహావీర్, ముగ్గురు పిల్లలు కలిసి ఒకే కుటుంబంలా జీవించడం మొదలుపెట్టారు.
కానీ, వీరిద్దరూ పెళ్లి కాకుండానే కలిసి ఉండడంతో గ్రామస్థులంతా మహావీర్’ను 'ఢుకూ' అని పిలిచేవారు. ఇది జార్ఖండ్ ఆదివాసీ సంప్రదాయంలో ఒక ఆచారం. దీనికి సమాజ అంగీకారం ఉండదు. మహావీర్‌తో వివాహం కాకపోవడంతో ఫూల్మనికి మామ ఆస్తి (భూమి)పై హక్కు లేకుండా పోయింది.
చివరికి, నిమిత్త్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఫూల్మని ఈ సంస్థకు గ్రామ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు కూడా.
"ఈ వివాహంతో నాకు అత్తమామల ఆస్తిపై హక్కు లభించింది. నా భర్త కూడా గ్రామస్థులు చేసే అవమానం నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు మేం చట్టబద్ధంగా భార్యాభర్తలం. సుమారు 16 ఏళ్లు సహజీవనం చేశాక, వైవాహిక బంధంలో అడుగుపెట్టాం. మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఇంతకు ముందు మేం సర్నా మతాన్ని పాటించేవాళ్లం. ఇప్పుడు క్రైస్తవంలోకి మారాం. అందుకే చర్చి సంప్రదాయం ప్రకారం మా పెళ్లి జరిగింది. సామూహిక వివాహ వేడుకలో సర్నా, హిందూ మతాలకు చెందినవారు కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు. వారంతా కూడా అప్పటివరకు లివ్-ఇన్ బంధంలో ఉన్నవారే" అని ఫూల్మని బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, NIMITTA
69 ఏళ్ల బామ్మగారి పెళ్లి
ఖుంటీ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో అనేక జంటలు పెళ్లిళ్లు చేసుకున్నాయి. వారిలో సిల్వంతి ముండిన్, ప్రభు సహాయ్ జంట కూడా ఉంది.
విశేషం ఏంటంటే సిల్వంతికి 69 ఏళ్లు. గత 46 ఏళ్లుగా ఆమె తన భాగస్వామి ప్రభుతో సహజీవనం చేస్తున్నారు. వారికి, పిల్లలు, మనుమలు కూడా ఉన్నారు. వారి పెద్ద కొడుకు వయసు 40 సంవత్సరాలు.
ఇప్పుడు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. జార్ఖండ్ ఆదివాసీ సంఘం సంప్రదాయం ప్రకారం, ఈ వివాహంతో సిల్వంతి తన అత్తమామల ఆస్తిపై యాజమాన్య హక్కులు పొందారు.
ఇలాంటి ఎన్నో జంటలు ఉన్నాయి. అయితే, జార్ఖండ్‌లో ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. ఎందుకంటే, ఆదివాసీ సంప్రదాయంలో ఇదొక భాగం. వారిలో పలు రకాల వివాహాలున్నాయి. అందులో ఢుకూ ఆచారం ఒకటి.
ఢుకూ ఆచారం ఏమిటి?
ఆదివాసీలలో సాధారణంగా స్త్రీల ఆధిపత్యం కనిపిస్తుంది. ప్రతి నిర్ణయంలో మహిళల భాగస్వామ్యం ఉంటుంది. వాళ్లకి ఆస్తి హక్కులు ఉంటాయి. అయితే, ఆస్తి కోసం మహిళలను మంత్రగత్తెలుగా చిత్రీకరించి చంపే దురాచాలూ జార్ఖండ్‌లో ఎక్కువే.
అయినప్పటికీ, ఆదివాసీ సమాజంలో మహిళలకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో పూర్తి స్వేచ్ఛ, హక్కులు ఉంటాయి. ఢుకూ ఆచారం కూడా ఈ స్వేచ్ఛలో భాగమేనని ఆదివాసీ మత నాయకుడు బంధన్ తిగ్గ చెప్పారు.
"జార్ఖండ్‌లోని గ్రామాల్లో అఖడా సంప్రదాయం ఉంది. ఇక్కడ జరిగే ధుంకుడియా వేడుకలో, యువతీ యువకులకు కలిసి ఉండే ఏర్పాట్లు చేస్తారు. సాయంత్రం వారు కలిసి ఆడతారు, పాడతారు. ఈ క్రమంలో వారు ఎవరినైనా ఇష్టపడితే ప్రేమ ప్రస్తావన తీసుకొస్తారు. తమ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెబుతారు. వాళ్లు ఒప్పుకుంటే వివాహం జరుగుతుంది.
కానీ, కొందరు తల్లిదండ్రులు ఒప్పుకోరు. అలాంటి సందర్భాల్లో యువతీ యువకులు కలిసి జీవించడం (లివ్-ఇన్) మొదలుపెడతారు. దీన్నే 'ఢుకూ ' అంటారు. చాలాసార్లు ఈ జంటలు గ్రామం విడిచి వెళ్లిపోతారు. పిల్లలు కలిగాక మళ్లీ వస్తారు. తరువాత సామాజిక గుర్తింపు కోసం గ్రామ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. ఈ వివాహం ద్వారా వారికి ఆస్తి హక్కులు, పిల్లలకు పెళ్లి చేసే హక్కు వస్తుంది.
అందుకే, ఒక్కోసారి ఒకే మండపంలో తల్లిదండ్రుల పెళ్లి, కొన్ని గంటల వ్యవధిలోనే వారి పిల్లల పెళ్లిళ్లు కూడా జరుగుతుంటాయి. ఢుకూ జంటలు వివాహానికి ముందు నామమాత్రపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వంద, రెండు వందలు చెల్లించడం లేదా మేకను కోసి గ్రామస్థులకు విందు చేయడం లాంటి జరిమానాలు ఉంటాయి. జరిమానా విధిస్తున్నప్పుడు జంటల ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుంటాం" అని బంధన్ తిగ్గ వివరించారు.
నిమిత్త్ సంస్థ 1950ల నుంచి జార్ఖండ్‌లో ఇలాంటి సామూహిక వివాహాలు నిర్వహిస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నికితా సిన్హా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మదర్స్ డే: తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇది
- తాలిబాన్ ఆదేశం: ‘మహిళలు బురఖా ధరించాల్సిందే.. లేకుంటే కుటుంబంలోని మగవాళ్లకు జైలు శిక్ష’
- బాంగ్‌బాంగ్ మార్కోస్: తండ్రి అవినీతి రాజకీయ సామ్రాజ్యాన్ని కొడుకు పునఃప్రతిష్టిస్తారా
- డాన్స్ వ్యాధి: 16వ శతాబ్దపు ఐరోపాలో వేలాది మంది ప్రాణాలు తీసిన ఈ వింత వ్యాధి ఏంటి?
- ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ఇంటర్నెట్ షట్డౌన్లు ఒక్క భారతదేశంలోనే ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












