ఆంధ్రప్రదేశ్: అసాని తుపాన్ తాకిడితో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు

తుఫాన్ తాకిడికి ఉప్పాడలో పలు ఇళ్లు సముద్రం పాలవుతున్నాయి.
ఫొటో క్యాప్షన్, తుపాన్ తాకిడికి ఉప్పాడలో పలు ఇళ్లు సముద్రం పాలవుతున్నాయి
    • రచయిత, శంకర్ వడిశెట్టి, శ్రీనివాస్ లక్కోజు
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తుపాన్ ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలతో పాటుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.

పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల పరిధిలో కొంతమేర భారీ వర్షాలు కురిశాయి. అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోనూ వర్షాల తాకిడి కనిపిస్తోంది. కడప జిల్లాలోనూ ఎడతెరిపిలేని వర్షాలు నమోదయ్యాయి.

తుపాన్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టిందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వెల్లడించింది.

విశాఖలోని ఎంవీపీ కాలనీ వన్‌టౌన్ ప్రాంతం
ఫొటో క్యాప్షన్, ఉప్పాడ

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈదురుగాలుల తాకిడి కనిపిస్తోంది. బంగాళాఖాతంలో అలలు ఎగిసిపడుతున్నాయి.

వ్యవసాయదారులకు ఈ వర్షాల కారణంగా పలుచోట్ల నష్టం వాటిల్లుతోంది. చేతికి వచ్చిన వరి పంట నేలపాలవుతోంది.

మామిడి, అరటి రైతులకి గాలుల తీవ్రత వల్ల అధికంగా నష్టం జరిగింది.

కాకినాడ జిల్లా కాజులూరు లో ఆలయ మండపంపై కూలిన కొబ్బరిచెట్టు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, కాకినాడ జిల్లా కాజులూరులో ఆలయ మండపంపై కూలిన కొబ్బరిచెట్టు

వ్యవసాయ పంటల నష్టంతో పాటుగా నెల్లూరు జిల్లాలో తుపాన్ సహాయక కార్యక్రమాలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా రాష్ట్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.

పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు.

తుపాన్ తాకిడి కి నేల పాలయిన వరి

ఫొటో సోర్స్, ugc

అసాని తుపాను: 'వ్యక్తికి రూ. 1000, కుటుంబానికి రూ. 2000' - సీఎం జగన్

అసాని తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తోన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అన్నారు.

తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై సమీక్ష జరిపారు.

''తీరం వెంబడి తుపాను ప్రయాణిస్తోంది. కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తత అవసరం. అయితే, తుపాను బలహీనపడటం కాస్త ఊరటనిచ్చే అంశం. అయినా ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. అవసరమైనచోట పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయండి. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి వెయ్యి రూపాయలు, కుటుంబానికి రూ. 2000 చొప్పున ఇవ్వండి. తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు'' అని కలెక్టర్లు, అధికారులకు సీఎం సూచించారు.

ఈదురు గాలులతో ఒరిగిన అరటి చెట్లు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, ఈదురు గాలులతో ఒరిగిన అరటి చెట్లు

యంత్రాంగం అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉందని, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత మీడియాకి తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఏ తుపాను వచ్చినా ఉప్పాడ తీరం మీదే ఎందుకు ప్రభావం పడుతుంది?

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు:

  • కాకినాడ కలెక్టరేట్‌: 18004253077
  • కాకినాడ ఆర్డీవో ఆఫీస్‌ : 0884-2368100
  • శ్రీకాకుళం: 08942-240557
  • తూర్పు గోదావరి: 8885425365
  • ఏలూరు కలెక్టరేట్‌ : 18002331077
  • విజయనగరం: 08922-236947
  • పార్వతీపురం మన్యం: 7286881293
  • మచిలీపట్నం కలెక్టరేట్‌ : 08672 252572
  • మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్‌ : 08672 252486
  • బాపట్ల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 8712655878, 8712655881
  • ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 90103 13920
  • విశాఖ: 0891-2590100,102
  • అనకాపల్లి: 7730939383

మరోవైపు, తుపాన్ బాధితులకు తగిన సహాయం అందడం లేదని విపక్ష టీడీపీ నేతలు విమర్శించారు. పునరావాస కార్యక్రమాలు జరగడం లేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రకటనలతో సరిపెట్టకుండా తీర ప్రాంత ప్రజలకు తగిన సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

వర్షాలు

తీరానికి కొట్టుకొచ్చిన బంగారు రంగు రాజమందిరం

బంగారు రంగులో ఉన్న రాజమందిరం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి మత్స్యకార గ్రామ తీరానికి కొట్టుకుని వచ్చింది. సముద్రంలో తేలుతోన్న ఈ మందిరాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించారు.

దీనిపై ఉన్న అక్షరాలు మయన్మార్‌కు చెందిన భాషలా ఉన్నాయని మెరైన్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మందిరం

అసాని తుపాను ప్రభావంతో అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం ఉప్పరాపల్లిలో కొబ్బరిచెట్టు కూలి ఎంపీటీసీ మృతి చెందారు.

తుపాను ప్రభావంతో వీస్తున్న గాలులకు కొబ్బరి చెట్టు కూలిపోయింది.

ఎస్. రాయవరం నుంచి ఉప్పరాపల్లి వెళుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ తుంపాల కాసుబాబు ప్రయాణిస్తున్న బైక్‌పై ఆ చెట్టు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు.

రోడ్డుపై అడ్డంగా కూలిపోయిన కొబ్బరిచెట్టు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, గాలులకు కూలిపోయి రోడ్డుపై అడ్డంగా పడిపోయిన కొబ్బరిచెట్టు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)