ఇళయరాజా: నరేంద్ర మోదీని అంబేడ్కర్‌తో పోల్చినందుకు సోషల్ మీడియాలో విమర్శలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఏడీ బాలసుబ్రమణియన్
- హోదా, బీబీసీ తమిళ్
భారత ప్రధాని నరేంద్రమోదీని, బాబాసాహెబ్ అంబేడ్కర్‌తో పోలుస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక పుస్తకానికి రాసిన ముందుమాట... ఆయన అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
'అంబేడ్కర్ అండ్ మోదీ- రిఫార్మర్స్ ఐడియాస్ అండ్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్' అనే పుస్తకాన్ని ఇంగ్లిష్ భాషలో బ్లూక్రాఫ్ట్ పబ్లికేషన్స్ ప్రచురించింది. ఈ పుస్తకంతో ఎవరికీ వివాదాలు లేవు. అయితే, ఇళయరాజా ముందుమాట రాయడంతో ఈ పుస్తకం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇళయరాజా దళితుడు కావడం, ఆయన తండ్రి ప్రముఖ కమ్యూనిస్టు ప్లాట్‌ఫార్మ్ గాయకునిగా పనిచేయడంతో ఈ ముందుమాట మరింతగా చర్చల్లో నిలిచింది.
ఈ ముందుమాట మోదీని అంబేడ్కర్‌తో పోల్చుతూ సాగుతుంది. వారిద్దరిపై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తుంది.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను పొగుడుతూ ఇది ప్రారంభం అవుతుంది.
''డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక గొప్ప వ్యక్తి. సామాజిక వివక్షపై పోరాటం, తెలివితేటలు, మేధస్సు కారణంగా సమాజం ఆయనను కీర్తిస్తుంది. రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కులు, దాని కోసం ఆయన చేసిన కృషి గొప్పదనం గురించి మనందరికీ తెలుసు. సవాళ్లను ఎదుర్కొని విజయాన్ని అందుకోవాలని కృషి చేసే ఎంతోమందికి ఆయన ఆదర్శం. చాలామంది చారిత్రక వ్యక్తులు వారు జీవించి ఉన్నప్పుడు మాత్రమే గొప్పగా కనిపిస్తారు. తర్వాత వారిని మర్చిపోతాం. మరికొంతమంది వ్యక్తులు జీవిత కాలంలో పెద్దగా ప్రభావం చూపరు. మరణానంతరం వారి ఘనత బయటకొస్తుంది. కానీ, అంబేద్కర్ అరుదైన నాయకుడు. ఆయన బతికి ఉన్నప్పుడే చరిత్ర సృష్టించారు, మరణించి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ప్రజలు ఇంకా ఆయనను అనుసరిస్తున్నారు. ఆయన గురించి చదువుతున్నారు.'' అని రాశారు.

అలాంటి అంబేడ్కర్ గురించి ప్రధాని మోదీ మాటల ద్వారా తెలుసుకోవడం చాలా గొప్ప విషయం అని ఇళయరాజా అందులో పేర్కొన్నారు.
''భారతదేశ నదీ జలాల విధాన రూప శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని కొన్నేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం వార్తల్లో నేను చదివాను. నీరు, సాగుకు సంబంధించిన కొన్ని కీలక సంస్థల ఏర్పాటులో అంబేడ్కర్ పాత్ర గురించి తెలుసుకొని, అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. 2016లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ సందర్భంగా మోదీ ప్రసంగం ద్వారా ఈ విషయాలను తెలుసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది.''
''అయితే, అంబేడ్కర్ గురించి మరింత తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. ఆయన విలువలను పాటించడం, ఆయన ఆలోచనలను అమలు చేసే వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఊహకు పరిమితులు ఉండవు, ఆచరణకు అనేక అడ్డంకులు ఉంటాయి. ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధత, అభిరుచి ఉన్న నిజమైన నాయకుడు మాత్రమే, తన వారసత్వపు ముద్రను వదిలివేసి తార్కికంగా, కచ్చితంగా పని జరిగేలా చేయగలరు.''
ఈ పుస్తకంలో అంబేడ్కర్ ఆదర్శాలు, దార్శనికతతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతదేశ అభివృద్ధి ప్రయాణం ఎక్కడ ఏకీభవిస్తుందో తెలుసుకునే ప్రయత్నం జరిగింది.
పారిశ్రామికీకరణ పరంగా చూసుకుంటే 'మేక్ ఇన్ ఇండియా' విధానం ఎన్నో విజయాలు సాధించింది. ముఖ్యంగా మొబైల్ ఉత్పత్తిలో దీని విజయం కనిపిస్తుంది. రోడ్లు, రైల్వేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రోలు వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారతదేశ ప్రయత్నాలకు మంచి గుర్తింపు వస్తోంది.
సామాజిక న్యాయం విషయానికొస్తే ప్రధాని మోదీ అనేక చట్టాలు, రాజ్యాంగపర రక్షణలతో పాటు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓబీసీ కమిషన్‌ను ఏర్పాటు ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చట్టపరమైన రక్షణను బలోపేతం చేశారు. మరుగుదొడ్లు, గృహాలను నిర్మించడం, బ్యాంకు ఖాతాలను తెరవడం ద్వారా పేదల జీవితాలను మార్చడానికి పెద్దఎత్తున ప్రయత్నం చేశారు. ఈ పథకాల లబ్ధిదారుల్లో చాలామంది నిరుపేదలు, అణగారిన వర్గాలకు చెందినవారు. గృహ నిర్మాణం, పారిశుధ్యం, విద్యుత్ సదుపాయంలో సాధించిన విజయాలు కోట్లాదిమంది పేద, అట్టడుగు ప్రజలను శక్తిమంతం చేస్తున్నాయి.
ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిన మోదీని ఇళయరాజా మహిళల స్వేచ్ఛకు భరోసా ఇచ్చే వ్యక్తిగా అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
''మహిళల కనీస వివాహ వయస్సును పెంచాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవలే వార్తల ద్వారా తెలుసుకున్నా. ఇదే జరిగితే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మాయిలు పైచదువులు చదువుకోవడానికి మరింత స్వేచ్ఛ లభిస్తుంది. మహిళల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ చేస్తోన్న కృషిని తలుచుకోగానే ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు, ఆడపిల్లల రక్షణ కోసం ఆయన సమాజానికి ఇచ్చిన సందేశం గుర్తుకు వస్తాయి. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం, బేటీ బచావో, బేటీ పడావో ఉద్యమంతో జనాభాలో మహిళల నిష్పత్తిని పెంచడం వంటి సామాజిక మార్పులు అంబేద్కర్ కోరుకున్నవి.''
అంబేడ్కర్, నరేంద్ర మోదీ మధ్య ఉన్న అద్భుతమైన సారూప్యతలను కూడా ఈ పుస్తకం వెల్లడించింది. ''సమాజంలో అణగారిన వ్యక్తులు ఎదుర్కొంటోన్న సవాళ్లను ఈ ఇద్దరూ అధిగమించారు. పేదరికం, అణచివేతతో కూడిన సామాజిక వ్యవస్థ స్థితిగతుల్ని వీరిద్దరూ నిశితంగా గమనించి వాటిని అణిచివేసేందుకు కృషి చేశారు. భారత్ గురించి వీరిద్దరికీ పెద్ద కలలు ఉన్నాయి. ఇద్దరూ ప్రాక్టికల్‌గా ఆలోచించేవారే'' అని ముందుమాటలో ఆయన రాసుకొచ్చారు.
ఈ ముందుమాటలో డాక్టర్ అంబేడ్కర్‌ను ప్రధాని నరేంద్ర మోదీతో పోలుస్తూ ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు తమిళ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ స్వరకర్త ఏఆర్ రెహమాన్ తన ట్విటర్ పేజీలో తమిళ్ స్క్రిప్టు ఉన్న 'తమిళ్ అనంగు' దేవతా చిత్రాన్ని షేర్ చేశారు. రెహమాన్ పంచుకున్న చిత్రంలో కవి భారతీదాసన్ పంక్తులైన 'తమిళం మన హక్కులకు మూలం' అని రాసి ఉంది.
భారత హోం మంత్రి అమిత్ షా ఇటీవల భారత్‌లో ఇంగ్లిష్ భాషకు ప్రత్యామ్నాయంగా హిందీని ఉపయోగించాలని పేర్కొన్నందుకు ప్రతిస్పందనగా తమిళ భాషలో రెహమాన్ ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంతేకాకుండా 'తమిళం, భారతదేశానికి అనుసంధాన భాష' అని రెహమాన్ అన్నారు.
తమిళ సోషల్ మీడియా రెహమాన్ ట్వీట్‌పై ప్రశంసలు కురిపించింది. కానీ, కొంతమంది రైట్ వింగ్ వ్యక్తులు మాత్రం ఆయనను విమర్శిస్తున్నారు.
మరికొందరు ప్రధాని మోదీని అంబేడ్కర్‌తో పోల్చడంపై ఇళయరాజాను విమర్శిస్తున్నారు.
ఇళయరాజాపై పలువురు దళిత నేతలు, మేధావులు స్పందిస్తుండగా... రాజకీయనేతలు దీనిపై వ్యాఖ్యానించడం మానేశారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ జీవరేఖ ప్రాణహిత... రాక్షస బల్లులు, పెద్ద పులులు తిరుగాడిన నదీ తీరం
- టైటానిక్: సరిగ్గా 110 ఏళ్ళ కిందట మునిగిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- అర్ధరాత్రి ఎందుకు కాళ్లు పట్టేస్తుంటాయి, చాలామందిని వేధించే ఈ రుగ్మత గురించి ప్రశ్నలు, సమాధానాలు
- విషపు పుట్టగొడుగులను గుర్తించడం ఎలా? వెండిపాత్రలో వేస్తే ఆ పాత్ర నల్లగా మారుతుందా
- కందుకూరి వీరేశలింగం: చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాశారు, 40 వితంతు వివాహాలు జరిపించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











