'మహాత్ముడిపై అకారణ ఆరోపణలు చేస్తున్నారు' -బీబీసీ ఇంటర్వ్యూలో గాంధీజీ ముని మనుమడు తుషార్ గాంధీ

ఫొటో సోర్స్, EMMANUEL DZIVENU/JOYNEWS
ఘనా రాజధాని ఆక్రాలోని విశ్వవిద్యాలయం పరిసరాల్లో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఇటీవల తొలగించారు. నల్లజాతీయుల పట్ల గాంధీ వివక్ష చూపారంటూ కొంతకాలంగా అక్కడి అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
ఈ విగ్రహాన్ని 2016లో నాటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు.
భారతీయులు మహాత్మునిగా కీర్తించే గాంధీజీని, నేడు ఆఫ్రికాలో జాత్యహంకారి అని నిందిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాల పాటు నివాసమున్న గాంధీ, నల్లజాతీయులను వివక్షతో చూశారన్న ఆరోపణలు ఉన్నాయి.
నల్లజాతీయులను కాఫిర్లని పిలవడంతో పాటు, భారతీయులతో పోలిస్తే వారికి నాగరికత తక్కువనే అభిప్రాయాలను గాంధీ వెల్లడించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి.
అయితే, దక్షిణాప్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ పాతికేళ్ల యువకుడనీ, ఆయన లోపాలను నాటి ఆయన అవగాహనా స్థాయిని బట్టి అర్థం చేసుకోవాలని అనేవారు కూడా ఉన్నారు.
తాజాగా ఘానాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీబీసీ మరాఠీ ప్రతినిధి మయూరేశ్ కొన్నార్, గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీతో మాట్లాడారు. ఆఫ్రికన్ల పట్ల గాంధీజీ అభ్యంతరకరమైన మాటల్ని ఉపయోగించింది నిజమేనా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ కింది విధంగా జవాబిచ్చారు.
అక్కడ మూలవాసుల గురించి బాపూజీ కొన్ని అభ్యంతరకమైన పదాలను ఉపయోగించారన్న విషయం నాకు తెలుసు. అయితే, గాంధీజీ చదువుకున్నది ఇంగ్లిష్ చదువులన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇంగ్లిష్ వాళ్లతో కలిసి జీవిస్తూ, వాళ్ల పద్ధతుల్లోనే ఎదిగిన వ్యక్తి ఆయన.
ఆయనకు అబ్బిన విద్యాపరమైన సంస్కారాలన్నీ ఇంగ్లిష్ వాళ్లవే. భారతీయ సంస్కృతి నుంచి వచ్చి ఇంగ్లిష్ చదువులు చదువుకొని ఆయన ఆఫ్రికాకు వెళ్లారు.
అక్కడి ప్రజల పట్ల ఆయనకున్న దృక్పథం ఒక భారతీయ వ్యక్తికుండేదే కానీ, ఆయన భాష ఇంగ్లిష్ చదువు ద్వారా నేర్చుకున్న భాష.
అక్కడి మూలవాసుల పట్ల ఆయన ఉపయోగించిన మాటలు ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్నవే. వాటిని అభ్యంతరకరమైనవని ఎవరూ భావించేవారు కాదు.
అయితే, వాళ్ల పట్ల ఉన్న ద్వేషపూరిత వైఖరికి ప్రతీకగా ఆ పదాలు మారిపోయాయి. అందుకే వాటిని అభ్యంతకరమైన మాటలుగా ప్రస్తుతం గుర్తిస్తున్నాం. ఇప్పటి అవగాహన ప్రకారం ఒక వ్యక్తిగత ఆచరణను అంచనా వేయడం సరికాదు. నిజానికి ఆయనకు ఆనాడు ఆ గ్రహింపు కూడా లేదు.
అలాంటి వ్యక్తిపై ఈ ఆరోపణలు చేయడం విద్యావంతులకూ, విజ్ఞులకు తగదని నా అభిప్రాయం. ఇలాంటి చర్యలు ద్వేషభావంతో చేస్తున్నవే.
ఇందులో ముందుగా ఒక నిర్ధరణకు వచ్చి, ఆ తర్వాత పరిశోధన చేస్తున్నట్టుగా అనిపిస్తోంది.
ఒకవేళ గాంధీజీ నిజంగానే జాత్యహంకారి అయినట్టయితే, జులూ విప్లవం జరిగినప్పుడు, వారిపై బ్రిటిష్ సైన్యం దారుణ అత్యాచారాలకు పాల్పడ్డ సమయంలో, ఇండియన్ ఆంబ్యులెన్స్ కోర్ నేతగా, బాపూజీ జులూ జాతికి తన సేవలందించారు. అంటే.. మొదట జాత్యహంకారిగా ఉన్న వ్యక్తి తర్వాత మారిపోయాడనుకోవాలా?
అలా నిజంగానే మారిపోయాడంటే అతన్ని ప్రశంసించాలి కదా. తన అవగాహనలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని తనను తాను మార్చుకున్నందుకు మెచ్చుకోవాలి కదా.
అంతకు ముందు ఆయన వాడిన మాటల్ని మాత్రమే తీసుకొని ఆయన జీవితాన్ని అవమానించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?
ఈ ప్రయత్నాలు కేవలం ఆఫ్రికాలో మాత్రమే కాదు.. మన దేశంలోనూ జరుగుతున్నాయి. బాపూపై నిరాధారమైన విమర్శలు చేయడం ఓ అలవాటుగా మారిపోయిందని తుషార్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










