Rajasthan: ‘నాకు చాలా భయం వేసింది, బతుకుతాం అని అనుకోలేదు’ - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, Umesh Sharma/Dainik Bhaskar
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజస్థాన్ కరౌలీ జిల్లా కలక్టరేట్ సమీపంలో ఒక అద్దె ఇంట్లో తల్లిదండ్రులతో రెండున్నరేళ్ల పీహూ ఉంటోంది. మేం వారి ఇంటికి వెళ్లేటప్పటికి బెలూన్ కావాలని పీహూ మారాం చేస్తోంది.
బెలూన్ కొన్న తర్వాత కాసేపు ఆడుకుని దాన్ని పక్కనపడేసి తల్లి ఒడిలోకి వెళ్లి కూర్చుంది.
పోలీసు అధికారి తనను ఎత్తుకుని మంటల మధ్య నుంచి పరిగెడుతున్న ఆమె ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. దీనిలో ఆమెను బట్టల్లో కప్పి జాగ్రత్తగా పట్టుకుని పోలీసు అధికారి నేత్రేశ్ శర్మ పరిగెడుతున్నట్లుగా కనిపిస్తున్నారు.
ఆ ఫోటోలో వీరి వెనకే పీహూ తల్లి వినీత అగర్వాల్ కూడా పరిగెడుతూ కనిపిస్తున్నారు.
ఏప్రిల్ 2న నవరాత్రి తొలిరోజునాడు ఫూటాకోట్‌కు వినీత షాపింగ్‌కు వెళ్లారు. అక్కడే ఘర్షణలు జరిగాయి.
ఆ సమయంలో వెంటవెంటనే వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసేందుకు ప్రయత్నించారు. షట్టర్లపై రాళ్లు పడుతున్న శబ్దాలు కూడా వినిపించాయి.

‘‘పీహూ నిద్రపోతోంది’’
నిద్రపోతున్న పీహూను ఎత్తుకుని వినీత ఆ రోజు ఓ ఇంటిలోకి ప్రవేశించారు. మార్కెట్‌లో పరిస్థితులను వెంటనే భర్త హరి ఓమ్ అగర్వాల్‌కు ఫోన్‌లో ఆమె వివరించారు. అయితే, సరిగ్గా ఆమె ఎక్కడున్నారో వారికి చెప్పలేకపోయారు.
‘‘నాకు చాలా భయం వేసింది. ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మా అమ్మాయి చాలా చిన్నది. నా కళ్లలో నుంచి నీళ్లు అలా కారుతూనే ఉన్నాయి’’అని నాటి పరిస్థితులను వినీత గుర్తు చేసుకున్నారు.
పోలీసు అధికారి నేత్రేశ్ శర్మ సాయంతో ఆమె అక్కడి నుంచి సురక్షితంగా భయటపడ్డారు. అయితే, ఘటన సమయంలో దైనిక్ భాస్కర్‌కు చెందిన జర్నలిస్టు ఉమేశ్ శర్మ తీసిన ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.
‘‘మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్లాలి. పైకప్పు కూలిపోయేలా ఉంది’’అని ఆ పోలీసు అధికారి తనకు చెప్పారని వినీత వివరించారు. ‘‘మేం బయటకు వచ్చేసరికి చుట్టువైపుల అంతా మంటలే కనిపించాయి. ఆయనకు నేను రుణపడి ఉంటాను. ఆయన వల్లే మేం ఈ రోజు ప్రాణాలతో ఉన్నాం’’అని ఆమె చెప్పారు.
ఆ రోజు నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలపై కూడా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం మళ్లీ పరిస్థితులు మునుపటికి వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Umesh Sharma/Dainik Bhashkar
కోట్ల రూపాయల నష్టం..
కరౌలీ పట్టణ జనాభా లక్ష వరకూ ఉంటుంది. వీరిలో ముస్లింల జనాభా 20 శాతం.
ఏప్రిల్ 2న హిందూ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని హిందూ సంస్థలు బైక్ ర్యాలీని నిర్వహించాయి. అయితే, ఈ ర్యాలీలో ఓ కారు నుంచి పెద్ద శబ్దాలతో ముస్లింలను ఉద్దేశించి డీజేలో కొన్ని పాటలు పెట్టారని ఆరోపణలు వచ్చాయి.
ఆ రోజు ర్యాలీలో పాల్గొన్నవారు బీబీసీతో మాట్లాడారు. ‘‘మార్కెట్‌లోని హఠ్‌వాడా మార్గంలోకి వెళ్లినప్పుడు కొందరు కావాలనే మాపై దాడి చేశారు. కొన్ని ఇళ్లపై రాళ్లు, కర్రలు విసిరారు. చాలా మందికి గాయాలయ్యాయి’’అని వారు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.
హింసలో చాలా వాహనాలు, షాపులకు నిప్పు పెట్టారు. ఈ ర్యాలీలో వందల మంది పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Umesh Sharma/Dainik Bhaskar
‘‘ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో విచారణకు ఆదేశించాం. ఘటన ఎలా జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? లాంటి అంశాలపై దర్యాప్తు చేపడుతున్నాం’’అని కరౌలీ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్‌ఎస్ షెఖావత్ చెప్పారు.
మొత్తంగా 71 ఆస్తులు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో ఐదు ఇళ్లు కూడా ఉన్నాయి.
ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు సహా 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురికి తీవ్రమైన గాయాలయ్యాయి. దాదాపు రెండున్నర కోట్ల రూపాయల వరకు ఆస్తులకు నష్టం సంభవించినట్లు అధికారుల అంచనా.
ఇక్కడి మార్కెట్లలో వీధులు చాలా ఇరుకుగా ఉంటాయి. షాపులు ఒకదానికి మరొకటి అతుక్కుని ఉంటాయి. ఆ గందరగోళంలో ఇక్కడి నుంచి వాహనాల్లో బయటపడటం చాలా కష్టం.
స్థానికంగా ఉండే గాజుల షాపులకు నిప్పు అంటుకోవడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక దళం చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Umesh Sharma/Dainik Bhaskar
అసలు ఏం జరిగింది?
ఈ ఘటనపై చాలా ప్రశ్నలు, సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి. కానీ, సరైన సమాధానం ఎవరి దగ్గరా లేదు.
‘‘ఆ రోజు డీజే స్పీకర్‌లో గట్టిగా నినాదాలు చేశారు. టోపీలు పెట్టుకునే వారు కూడా ఒక రోజు జై శ్రీరామ్ అని చెప్పాల్సిందే’’అని మైక్‌లో అన్నారని కౌన్సిలర్ మతలూబ్ అహ్మద్ భార్య నౌషీన్ అహ్మద్ చెప్పారు.
ప్రస్తుతం మతలూబ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ఉన్న భవనం నుంచి రాళ్లు, కర్రలతో దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, గాయపడిన వారికి సాయం చేసేందుకు వెళ్లిన తన భర్తపై ఆరోపణలు చేస్తున్నారని నౌషీన్ అన్నారు.
మేం నౌషీన్ ఇంటికి వెళ్లేసరికి, అక్కడ మహిళలు, పిల్లలు మాత్రమే కనిపించారు. ఒక పాపకు జ్వరం ఉంది. కానీ ఇంటిలో థెర్మోమీటర్ కూడా లేదు. మందులు కూడా అయిపోతున్నాయి.
ఈ రోడ్డులో జనాలు పెద్దగా లేరు. ఒక ఇంటి దగ్గర ఇద్దరు పోలీసులు కుర్చీల్లో కుర్చున్నారు. పక్క రోడ్డులో పోలీసు జీపులు వెళ్తున్న శబ్దాలు వినిపించాయి.
ఏప్రిల్ 2న తను ఇంట్లో కూర్చున్నప్పుడు డీజే నుంచి ఆ నినాదాలను విన్నానని నౌషీన్ చెప్పారు.
‘‘అలాంటి నినాదాలు వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది’’అని ఆమె అన్నారు.
ర్యాలీలో పాల్గొన్నవారు ఏం అంటున్నారు?
డీజే వాహనం యజమాని సోను ప్రజాపతి బీబీసీతో మాట్లాడారు. ‘‘ఆ రోజు ర్యాలీలో కొందరు డ్యాన్స్ చేస్తున్నారు. డీజేలో టోపీవాలా పాటను ప్లే చేశారు’’అని ఆయన చెప్పారు.
ఓ హిందూ సంస్థ యజమాని తమ కారును బుక్ చేసుకున్నారని సోను చెప్పారు. మేం హిందూ సంస్థ యజమానితో మాట్లాడేందుకు ప్రయత్నించాం. కానీ ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.
అయితే, ముస్లింలను రెచ్చగొట్టేలా ర్యాలీలో ఎలాంటి నినాదాలు చేయలేదని సోనుతో కలిసి పనిచేస్తున్న రవీంద్ర పూనియా చెప్పారు. ర్యాలీ అప్పటివరకు చాలా ప్రశాంతంగా సాగిందని అన్నారు.
డీజే పెట్టినట్లుగా చెబుతున్న కారును నిరసనకారులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ కారు కొతవాలీ పోలీస్ స్టేషన్‌లో ఉంది. ఇది దెబ్బ తినడంతో సోనుకు రూ.5 లక్షల వరకు నష్టం సంభవించింది.
ఆ రోజు రాళ్లు, కర్రల దాడి నుంచి తప్పించుకునేందుకు సోను, రవీంద్ర ఓ కారులో ఉండిపోయారు. పోలీసులు వచ్చిన తర్వాత వారు బయటకు వచ్చారు.

దెబ్బలు తిన్నవారు ఏం చెబుతున్నారు?
ఆ రోజు ర్యాలీకి హాజరైన వారిలో 70ఏళ్ల మదన్ మోహన్ స్వామి కూడా ఒకరు. తనను బీజేపీ కార్యకర్తగా ఆయన పరిచయం చేసుకున్నారు.
‘‘నేను కారులో కూర్చున్నాను. అప్పుడే ఒక రాయి వచ్చి ముందు అద్దానికి తగిలింది. ఆ తర్వాత చాలా రాళ్లు మా మీదకు వచ్చాయి’’అని ఆయన చెప్పారు.
‘‘ఎలాగోలా మేం కారు నుంచి బయటకు వచ్చేశాం. కానీ, కర్రలతో మాపై దాడి చేశారు. భుజం, వీపుపై నాకు గాలయ్యాయి’’అని ఆయన వివరించారు.
తనపై దాడిచేసిన వారు ముస్లింలని మదన్ అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆయన ఆరోగ్య చెకప్ కోసం దిల్లీ వచ్చారు.

‘‘మేం ముస్లింలను రెచ్చగొట్టేలా ఎలాంటి పాటలూ డీజేలో పెట్టలేదు’’అని ఆయన చెప్పారు.
మరోవైపు అసలు టోపీ పేరుతో ఎలాంటి పాటా ఆ రోజు తనకు వినిపించలేదని ఆరెస్సెస్‌కు చెందిన కేసర్ సింగ్ నరూకా చెప్పారు. డీజేలో కేవలం జైశ్రీరామ్ పాట మాత్రమే వినిపించిందని ఆయన అన్నారు.
‘‘అక్కడ ర్యాలీలో ఆరెస్సెస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలం ఉన్నాం’’అని ఆయన వివరించారు.
ఇంతకీ అక్కడ డీజేలో వివాదాస్పద పాటలు పెట్టారా అనే అంశంపై ఓ సీనియర్ అధికారితో మేం మాట్లాడాం. కానీ, ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని మాత్రమే ఆయన చెప్పారు.

విధ్వంసం
ఆ రోజు ఘర్షణల్లో సంజయ్ సోని ఇల్లుతోపాటు మరికొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. హింస చెలరేగినప్పుడు ఇంటిలో భార్య, ముగ్గురు పిల్లతోపాటు సంజయ్ ఉన్నారు.
‘‘మేం బయటకు వచ్చేసరికి భారీగా మంటలు కనిపించాయి.’’
‘‘నేను పోలీసులకు ఫోన్ చేశాను. వారు మా పిల్లలను ఎత్తుకుని పరిగెత్తారు. దీంతో మేం ప్రాణాలతో బయటపడ్డాం.’’
‘‘ఇప్పుడు మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. మొదటి రెండు, మూడు రోజులు పొరుగున్న వారి ఇంట్లో ఉన్నాం. వారే మాకు తిండి పెట్టారు’’అని ఆయన వివరించారు.
ఘర్షణలు చేపట్టినవారికి పోలీసుల నుంచి మద్దుతుందని కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, 10-20 సెకన్ల వీడియో క్లిప్పులు చూసి ఆరోపణలు చేయడం తగదని కరౌలీ ఎస్సీ శైలేంద్ర సింగ్ అన్నారు.

ఎవరిపై ప్రభావం పడుతోంది?
రాళ్లు, కర్రలతో దాడులు జరిగినప్పుడు దైనిక్ భాస్కర్ జర్నలిస్టు ఉమేశ్ శర్మ అక్కడ ఉన్నారు.
‘‘నేను అక్కడకు వెళ్లినప్పుడు, ఘర్షణల్లో గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలిస్తూ కనిపించారు. చాలా బైక్‌లు ధ్వంసమయ్యాయి. షాపుల ముందు కొంతమంది గాయాలతో కనిపించారు. చాలా మంది సాయం కోసం ఎదురుచూస్తూ కనిపించారు’’అని ఆయన చెప్పారు.
‘‘విద్యుత్ తీగల నుంచి కూడా నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. ఆ తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.’’
‘‘2006, 2012-13లోనూ ఇక్కడ ఇలాంటి ఘర్షణలు సంభవించాయి. కానీ, అవి ఇంత పెద్దగా జరగలేదు’’అని ఆయన అన్నారు.
‘‘ఇక్కడ హిందువులు-ముస్లింలు కలిసిమెలసి ఉంటారు. ఉద్రిక్తతల సమయంలో ముస్లింల ఇళ్లలో హిందువులు, హిందువుల ఇళ్లలో ముస్లింలు తలదాచుకున్న సందర్భాలు ఇక్కడ చాలా ఉన్నాయి.’’
‘‘కానీ, కొందరు ఇక్కడి సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.’’
ఇక్కడి హిందూ-ముస్లింల సోదర భావంపై తాజా ఘర్షణలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఆయన అన్నారు.
‘‘తాజా ఘర్షణల్లో నష్టపోయిన వారిలో ఎక్కువ మంది పేదలే ఉన్నారు. రెండు వర్గాల ప్రజల ఆస్తులూ ధ్వంసమయ్యాయి.’’
రాజస్థాన్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
- యుక్రెయిన్: ‘రష్యా సైనికులు మా నాన్న గుండె మీద కాల్చారు.. నా కళ్లెదుటే చంపేశారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














