Ankur Warikoo: యువతరం ఏం కోరుకుంటోందంటే..

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువతీ యువకులు పాత తరంతో పోలిస్తే భిన్నమైన మార్గంలో నడుస్తున్నారు. మరి వారి కలలు సాకారమవుతాయా?
వ్యాపారవేత్త అంకూర్ వారికోకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. యువత నుంచి ఆయనకు రోజుకు 300 మెయిల్స్ వస్తుంటాయి.
పాతతరంలో పోలిస్తే నవతరం భారతీయులు ఏ విధంగా భిన్నమైన వారో ఆయన బీబీసీతో పంచుకున్నారు.
మధ్యతరగతి భారతీయ యువతీ, యువకుల గురించి ఆలోచించినప్పుడు వాళ్లు బాగా కష్టపడతారని, బాగా చదువుకుంటారని చాలామంది అనుకుంటారు. కుటుంబ ఆచార, సంప్రదాయలను గౌరవిస్తారని భావిస్తారు.
మంచి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం వారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారని కూడా మనం అనుకుంటాం.
తమ కాళ్లపై తాము నిలబడేలా మంచి కెరీర్ ఎంచుకోవాలని, అలాగే తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అనుకుంటారని భావిస్తుంటాం.
నిజానికి ఇలాంటి భావనలన్నీ స్టీరియోటైప్‌గానే మనం చెప్పుకోవచ్చు.
నేను మాట్లాడిన చాలామంది మధ్యతరగతికి చెందిన యువతీ, యువకులు తమ తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారికి ఎదురుచెప్పి, తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నారు.
ప్రతిసారి వాళ్లు సురక్షితమైన మార్గాన్నే ఎంచుకోలేదు. ఒక్కోసారి పక్కదారి పట్టినప్పటికీ.. తాము ఎంచుకున్న దారిలోనే ముందుకు నడిచారు.
ఎదుగుతున్నప్పుడు నేను కూడా వారిలో ఒకడిని. కానీ నా తర్వాత వచ్చేవారు అంత భిన్నంగా ఉండరని నేను అనుకున్నాను.
వాళ్లు భిన్నమైన బట్టలు వేసుకుంటారు. భిన్నమైన పదాలు వాడతారు. వెళ్లడానికి చాలా బార్లు ఉన్నాయి. పెళ్లికి ముందు కనీసం ఒకరితో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉండి ఉండొచ్చు. కానీ నేను ప్రయత్నిస్తే స్థిరమైన ఉద్యోగం కోసం అన్వేషించే వారు కూడా కనిపిస్తారు.
రెండు సంవత్సరాల క్రితం యూట్యూబ్, సోషల్ మీడియాలో కంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టాను. అప్పుడు మధ్యతరగతికి చెందిన యువ భారతీయుల గురించి నాకు తెలుసని అనుకున్నదంతా నిజం కాదని తర్వాత తెలిసింది.
నేను చేసిన వీడియోలను 40లక్షల మంది యువతీ యువకులు చూశారు. వారిలో సగం మంది 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు వారే. వీరిలో 40 శాతం మంది ఇండియాలోని టాప్-10 నగరాలకు దూరంగా ఉంటారు.
వాళ్లకు ఇంగ్లిష్ అర్థమవుతుంది. కానీ మాతృభాష వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజు వాళ్లు నాకు కొన్ని వందల మెయిల్స్ పంపిస్తుంటారు. డబ్బు, కెరీర్, మానవ సంబంధాలు, మానసిక ఆరోగ్యం ఇలా ఎన్నో సమస్యలపై వారు నన్ను అడుగుతూ ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
సొంతగా కోడింగ్ నేర్చుకున్న 15 ఏళ్ల వ్యక్తి, కాలేజీ మానేసి కుటుంబ వ్యాపారాన్ని డిజిటల్‌గా తీసుకెళ్లడంలో సాయం చేస్తున్న వ్యక్తి, ఆరు సంవత్సరాల వయసు నుంచి పెయింటింగ్ పని చేస్తున్న 24 ఏళ్ల వ్యక్తి, కాలేజీ పూర్తికాగానే ఫుల్‌టైమ్ జాబ్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్న ఒక ఫ్రీలాన్సర్, అలాగే పగలు అకౌంటెంట్‌గా పని చేస్తూ రాత్రి సమయంలో బీట్ బాక్సర్‌గా పని చేస్తున్న అమ్మాయి.. ఇలా చాలామందిని నేను కలిశాను.
ఈ ప్రపంచాన్ని వాళ్లు ఎలా చూస్తున్నారు.. అందులో వారి పాత్ర ఏంటన్న దానిపై నాకిలా అనిపించింది.
'కాలేజీ అంటే కేవలం డిగ్రీ మాత్రమే కాదు'
18-25 ఏళ్ల వయసున్నవారి ఉద్దేశంలో కాలేజీ అంటే ఉద్యోగాన్ని సంపాదించి పెట్టే మార్గం మాత్రమే కాదు. ఇది అవకాశాలకు ఒక ప్రదేశం.
తరగతి గదిలో పాఠాలు, పరీక్షలు లేదా ఇతర పాఠ్యాంశాలపై వాళ్లు పెద్దగా ఆసక్తి చూపరు.
వారి ఉద్దేశంలో కాలేజీ అంటే ఒక ప్రయోగశాల. నలుగురితో పరిచయాలు పెంచుకునే ప్రదేశం. ఎలాంటి సంకోచం లేకుండా ఇక్కడ వారు ప్రయోగాలు చేయొచ్చు. స్టార్టప్‌కు అంకురార్పణ చేయొచ్చు. ఆర్థిక భారం లేకుండా ఎన్నో ఇంటర్న్‌షిప్‌లు కూడా చేయొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్యోగం కోసం తొందరపడరు
యువతరం స్కూల్ - కాలేజీకి మధ్య ఎట్టిపరిస్థితుల్లో గ్యాప్ తీసుకోరు. అలా చేస్తే తనకు నచ్చినట్టు బతుకుతున్నారని, విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని అంటుంటారు.
తమకు నచ్చని విషయాలను నచ్చినట్టుగా నటిస్తూ తమ జీవితాన్ని వృధా చేసుకోవాలని అనుకోవడం లేదని నాతో మాట్లాడిన 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్లు చెప్పారు.
అందుకే లక్ష్యం దిశగా అడుగులు వేయడానికి ముందు, నిజంగా తామేంటో, తమకు ఏది ఇష్టమో తెలుసుకునేందుకు కొన్ని నెలలు లేదా ఒక ఏడాది సమయం తీసుకోవడానికైనా సిద్ధమని వాళ్లు తెలిపారు.
ఆలస్యంగా పెళ్లి
పెళ్లి అంటే ఒక ఉచ్చు అని నేను మాట్లాడిన 20ఏళ్లు దాటిన యువతి, యువకులు చెప్పారు.
తమ జీవితంలో త్వరగా పెళ్లి చేసుకోకూడదని వాళ్లు అనుకుంటున్నారు.
ఒకరి చేయి పట్టుకునే ముందు తమ గురించి తాము తెలుసుకోవడం, తమ కోసం తాము జీవించడం చాలా ముఖ్యమని అనుకుంటున్నారు.
ఆర్థిక రిస్కులూ తీసుకుంటారు
స్థిరత్వంపై ఎక్కువ దృష్టిపెట్టిన తల్లిదండ్రులను చూస్తూ చాలామంది పెరిగారు. కానీ ఇప్పుడు కాలం మారిందని వాళ్లకు అర్థమైనట్టుంది. అసమానతలు పెరిగాయి. కలలు పెరిగాయి. విజయ తీరాలకు చేరేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.
వాళ్ల ఉద్దేశంలో డబ్బు బతకడానికి అవసరమని భావించరు. కానీ డబ్బుంటే స్వేచ్ఛ ఉంటుందని అనుకుంటారు.
మంచి ఏరియాలో ఖరీదైన బంగ్లా వాళ్ల లక్ష్యం కాదు. కానీ డబ్బులను స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీలో నెలవారిగా పెట్టుబడులు పెట్టి, నచ్చిన వస్తువులు కొనడానికి కావాల్సిన డబ్బును కలిగి ఉండడం వాళ్ల లక్ష్యం.

ఫొటో సోర్స్, Getty Images
నేర్చుకోవడానికి సోషల్ మీడియా
యూట్యూబే వారి పాఠశాల. పాఠాలు ఎక్కడ చెబుతున్నారన్న దాని గురించి వాళ్లు పెద్దగా పట్టించుకోరు. వెంటనే ఉపయోగించుకోదగిన వివేకం కోసం వాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సరైన వ్యక్తులను ఫాలో అవుతూ ఉంటారు.
వాళ్లకు ఆశయం ఉంది. ధైర్యం ఉంది. పాతతరంతో పోలిస్తే వారిలో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అదే రిస్క్ తీసుకునే స్వభావం. ఇదే వీరిని పాతతరం కంటే భిన్నంగా ఉండేలా చేస్తోంది.
చివరికి నా తల్లిదండ్రుల తరంలో కూడా స్థిరత్వం అనేది కీలకమైన అంశం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, కెరీర్‌లో ఉన్నతస్థాయికి వెళ్లడం, ఇంపాక్ట్ అనే విషయాలను ఉన్నతవర్గాల వారు చెబుతూ వచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా తమకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి జనరేషన్ జెడ్‌కు తెలియడమే కాదు.. వాటిని అందుకునే ప్రయత్నం చేయడానికి వారు ఏమాత్రం సిగ్గుపడరు.

ఫొటో సోర్స్, Getty Images
35 సంవత్సరాలకే రిటైర్మెంట్ తీసుకునేందుకు ఒక మార్గం ఉందన్న విషయం వారికి తెలుసు. అందుకే 60ఏళ్ల వయసు వచ్చే వరకు పని చేస్తూ కూర్చోకుండా, ముందుగానే రిటైర్మెంట్ తీసుకోవడానికి వాళ్లు ఏమాత్రం ఇబ్బందిపడరు.
విజయవంతమైన స్టార్టప్ పేటీఎంను స్థాపించిన విజయ్ శేఖర్ శర్మ లేదా దేశంలోనే అతిపెద్ద హోటల్ నెట్‌వర్క్‌ను స్థాపించి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచిన రితేశ్ అగర్వాల్‌లు యూత్ ఐకాన్‌లుగా మారారు.
కానీ వాస్తవం ఏమిటంటే.. పేటీఎం ఏమాత్రం లాభాలు ఆర్జించడం లేదు. భారీగా విస్తరించడం వల్ల ఓయోకు అప్పులు పెరిగాయి. కానీ వీటి గురించి తక్షణం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కానీ నాకు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. వెయిట్ చేసేలా మనల్ని మార్చారు. మనకు ఇష్టం లేకుండానే ఆ పని చేయాల్సి వస్తుంది. పాలు కొనడానికి లైన్లో నిలబడతాం. బంధువులకు ఫోన్ చేయడానికి ఎదురుచూశాం. లేఖల కోసం రోజుల తరబడి ఎదురుచూశాం. ఒక వాహనం కొనడానికి ఎన్నో ఏళ్లు ఎదురుచూశాం. ఆర్థిక స్థిరత్వం కోసం జీవితకాలం వెయిట్ చేశాం.
కానీ ఎదురుచూడటాన్ని మనం ఇష్టంతో నేర్చుకోలేదు. మన దేశంలో పరిస్థితులు అలా ఉన్నాయి.
కానీ ఇప్పుడు మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఒక క్లిక్ దూరంలో ఉంది. ఆహారం, బట్టలు, పుస్తకాలు, సినిమాలు.. చివరికి రిలేషన్‌షిప్‌లు కూడా ఒక క్లిక్కు దూరంలో ఉన్నాయి.
ఈ వయసు వారు ఏ దేశంలో ఉన్నా ఇలాగే ఆలోచిస్తుంటారు. కానీ భారత్‌లోని ఆర్థిక వ్యవస్థ యూత్ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉంది.
ఒక అకౌంటెంట్ పూర్తిస్థాయి బీట్‌బాక్సర్‌గా మారగలరా.. 20 ఏళ్లు దాటిన ఒక ఆర్టిస్ట్‌కు గ్రాఫిక్ డిజైన్ కంపెనీలో ఉద్యోగం దొరుకుతుందా?
ఆశలు - అవకాశాల మధ్య ఉన్న అంతరాన్ని ఈ తరం తగ్గించగలదా? లేదంటే ఆ అగాధంలో పడిపోతుందా?
దీనికి కేవలం కాలం మాత్రమే సమాధానం చెప్పగలదు.
(అంకూర్ వారికో ఒక వ్యాపారవేత్త. రచయిత. టీచర్, కంటెంట్ క్రియేటర్)

ఇవి కూడా చదవండి:
- ఆ గిరిజన గ్రామానికి వెళ్లిన వారంతా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు?
- 70 నిమిషాల్లో 21 బాంబులు, 59 మంది మృతి- 2008లో అహ్మదాబాద్‌లో ఏం జరిగింది
- ఆటలు ఆడట్లేదా? అయితే, మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా..
- కర్ణాటక: హిజాబ్ వివాదంతో రాళ్ల దాడులు, మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన ప్రభుత్వం
- నేపాల్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు: బీబీసీ చేతికి నేపాల్ నివేదిక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













