అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు: 49 మందిని దోషులుగా ప్రకటించిన కోర్టు, 56 మంది మృతికి కారణమైన ఆ రోజు ఏం జరిగింది

ఫొటో సోర్స్, KALPIT BHACHECH
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 77 మందిలో 28 మందిని గుజరాత్ స్పెషల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించినట్లు వార్తాసంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
2008లో అహ్మదాబాద్‌లో జరిగిన ఈ వరుస పేలుళ్ల కేసులో బుధవారం తుది తీర్పు వెలువడనుందని విలేఖరులతో ప్రాసిక్యూటర్ అమిత్ పటేల్ చెప్పారు.
మంగళవారం వర్చువల్‌గా ఈ కేసు విచారణ జరిగినట్ల ఆయన తెలిపారు.
28 మందిని నిర్దోషులుగా గుర్తించిన స్పెషల్ కోర్టు మిగిలిన 49 మందిని దోషులుగా ప్రకటించింది.
వీరిలో ఇమ్రాన్ షేక్, ఇక్బాల్ షేక్, షంశుద్దీన్ షేక్, యాసుద్దీన్ అన్సారీ, మొహమ్మద్ ఆరిఫ్, మొహమ్మద్ ఉస్మాన్, యూనస్ మన్సూరీ, సఫ్దార్ హుస్సేన్ నగోరి, హఫీజ్ హుస్సేన్ ముల్లా, మొహమ్మద్ సాజిద్, ముఫ్తీ అబు బషర్, అబ్బాస్ సమీజా, జావేద్ షేక్, అతికార్ రహమాన్, మెహదీ హసన్, ఉమర్ కబీరా, సలీమ్ సెఫాహి, అఫ్జల్ ఉస్మానీ, మొహమ్మద్ సాదిఖ్, ఖయాముద్దీన్ కపాడియా, మొహమ్మద్ షేక్, జీషాన్ అహ్మద్, జియా వుల్ రహమాన్, మొహమ్మద్ షకీల్, మొహమ్మద్ అక్బర్, మొహమ్మద్ నౌషద్, సైఫుర్ రహమాన్, మొహమ్మద్ అన్సర్, మొహమ్మద్ షకీల్, అమీన్ అలియాస్ రజా, మొహమ్మద్ అబ్రార్ ఉన్నారు.

ఫొటో సోర్స్, NANDAN DAVE
జడ్జి ఏఆర్ పటేల్, కరోనా వైరస్ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉండటంతో ఫిబ్రవరి 1న ఈ కేసు విచారణ సాధ్యం కాలేదు.
2008 జులై 26న అహ్మదాబాద్‌లో 70 నిమిషాల వ్యవధిలో వరుసగా 21 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 56 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.
ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం), హర్ఖత్ ఉల్ జిహాదీ ఆల్ ఇస్లామీ తీవ్రవాద సంస్థలే ఈ పేలుళ్లకు కారణమని తేల్చారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని అహ్మదాబాద్‌లోని సబర్మతీ జైలులో ఉంచారు. అయితే కొంతమంది నిందితులు జైలులో సొరంగం తవ్వి పారిపోవడానికి విఫలయత్నం చేశారు.

ఫొటో సోర్స్, KALPIT BHACHECH
గుజరాత్‌లోనే ఎందుకు బాంబు పేలుళ్లు జరిగాయి?
2002లో గోద్రాలో కొన్ని రైలు బోగీలకు నిప్పంటించారు. దీని తర్వాత గుజరాత్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో మైనారిటీ వర్గాలకే తీవ్ర నష్టం జరిగినట్లు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి) సభ్యులు భావించారు. ఈ అల్లర్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియన్ ముజాహిదీన్ అనే సంస్థను సిమి నెలకొల్పింది.
2008 జూలై 25న కర్ణాటకలోని బెంగళూరులో వరుసగా 8 బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ మరుసటి రోజు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని నివాస, వాణిజ్య, ప్రజా రవాణా కేంద్రాలు, ఆసుపత్రులు ఉండే ప్రాంతాల్లో 70 నిమిషాల వ్యవధిలో 21 వరుస పేలుళ్లు జరిగాయి.
మణినగర్, హఠ్‌కేశ్వర్ సర్కిల్, ఎల్జీ ఆసుపత్రి, సివిల్ ఆసుపత్రి ట్రామా సెంటర్ ఏరియాల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. మణినగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాల్లోనే ఎక్కువ పేలుళ్లు జరిగాయి. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ మణినగర్ అసెంబ్లీ స్థానానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పుడు గుజరాత్‌కు హోంమంత్రిగా ఉన్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో బాంబులు అమర్చిన కుట్రదారులు... క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే సమయంలో ఆసుపత్రుల సమీపంలో అమర్చిన బాంబులు విస్పోటనం చెందేలా టైమింగ్‌ను సర్దుబాటు చేశారు. దీంతో వైద్యవర్గాలు భయాందోళనలకు గురికావడంతో పాటు అధిక స్థాయిలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగాలనేది వారి కుట్ర.

ఫొటో సోర్స్, KALPIT BHACHECH
35 ఎఫ్ఐఆర్‌లు, 78 మంది నిందితులు
సూరత్‌లోని పలు ప్రాంతాల్లో కూడా గుజరాత్ పోలీసులు బాంబులను కనుగొన్నారు. వరుస పేలుళ్లకు కుట్ర జరిగినట్లుగా పేర్కొంటూ అహ్మదాబాద్‌లో మొత్తం 20, సూరత్‌లో మొత్తం 15 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.
35 ఎఫ్ఐఆర్‌లపై కోర్టు విచారణ జరిపింది. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ), ఎక్స్‌ప్లోసివ్ యాక్ట్, చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ)లోని పలు సెక్షన్ల కింద నిందితులపై అభియోగాలను నమోదు చేశారు.
తొలుత మొత్తం 78 మందిని నిందితులుగా నిర్ధారించగా, తర్వాత వారిలో ఒకరు అప్రూవర్‌గా మారిపోయారు. దీంతో నిందితుల సంఖ్య 77కు తగ్గింది.
ఈ కేసు విచారణ సందర్భంగా 1100 మందికి పైగా సాక్షుల్ని కోర్టు విచారించింది. ఇంకా కొంతమంది నిందితులు పరారీలోనే ఉన్నారు. తర్వాత అరెస్ట్ చేసిన కొందరు నిందితులపై కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
అహ్మదాబాద్ పేలుళ్లలో ప్రధాన నిందితుడైన అబ్దుల్ సుభమ్ ఖురేషీని 'న్యూఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్' 2018 ప్రారంభంలో అరెస్ట్ చేసింది.
'టెకీ బాంబర్'గా గుర్తింపు ఉన్న ఖురేషి పలు ఐటీ కంపెనీల్లో పనిచేశారు. ఇండియన్ ముజాహిదీన్ ఆర్థిక వ్యవహారాల ఇన్‌చార్జీగా పనిచేశారు. అహ్మదాబాద్ పేలుళ్ల వెనుక 'మాస్టర్ మైండ్'గా అతన్ని పరిగణిస్తున్నారు.
పేలుడు పదార్థాలను రవాణా చేయడానికి, వాటిని అమర్చడం కోసం కారును దొంగిలించిన అఫ్జల్ ఉస్మానీ, 2013 సెప్టెంబర్‌లో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నారు. నెల తర్వాత మళ్లీ ఆయనను పోలీసులు పట్టుకోగలిగారు.

ఫొటో సోర్స్, KALPIT BHACHECH
సబర్మతీ జైలు సొరంగం కేసు
ఈ కేసులోని నిందితులను అత్యంత పటిష్టమైన భద్రత ఉండే అహ్మదాబాద్‌లోని సబర్మతీ జైలులో ఉంచారు. కేసు ప్రారంభ దశలో స్పెషల్ కోర్టు విచారణలు కూడా ఈ జైలులోనే జరిగాయి.
ఈ కేసు విచారణ 2009లో ప్రారంభమైంది. ఆ తర్వాత చాలా వరకు విచారణలు వీడియా కాన్ఫరెన్స్ ద్వారానే పూర్తి చేశారు.
ఈ కేసులోని కొంతమంది నిందితులు, జైలులో 200 అడుగుల పొడవైన సొరంగం తవ్వి తప్పించుకునేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. ఈ నేరానికి సంబంధించి పోలీసులు మరో అభియోగాన్ని కూడా దాఖలు చేశారు. ఇది ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

ఇవి కూడా చదవండి:
- నేపాల్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు: బీబీసీ చేతికి నేపాల్ నివేదిక
- కర్ణాటక: హిజాబ్ వివాదంతో రాళ్ల దాడులు, మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన ప్రభుత్వం
- ‘పారాసిటమల్ ఎక్కువగా వాడితే రక్తపోటు పెరిగి గుండెపోటు రావొచ్చు’
- అయోధ్య: విశాలమైన రామ మందిర నిర్మాణం ఒకవైపు, శిథిల ఆలయాలు మరోవైపు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- భారీ విగ్రహాలను చైనా నుంచే ఎందుకు తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేయలేరా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











