హిందుత్వ రాజకీయాలు చేసినా శివసేన ఎందుకు మహారాష్ట్ర దాటలేకపోయింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మయూరేశ్ కొన్నూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బాల్ ఠాక్రే, ఆయన స్థాపించిన శివసేనకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తాను హిందుత్వ రాజకీయాలను చేస్తానని చెప్పుకోవడానికి ఆయన ఎన్నడూ వెనుకాడలేదు.
బాల్‌ఠాక్రే స్థాపించిన శివసేన ముంబయి నుంచి మహారాష్ట్ర సరిహద్దులు దాటి విస్తరించింది. భారత దేశవ్యాప్తంగా ఠాక్రేకు అభిమానులు ఉండేవారు. కేంద్రంలో రాజకీయాలపై ఆయనకు ఆసక్తి కూడా ఎక్కువే.
కానీ, ఇంత ఆదరణ, అభిమానం ఉన్నా, ఆ పార్టీ ఎందుకు మహారాష్ట్రలోలా ఇతర రాష్ట్రాలలో ప్రభావం చూపలేకపోతోంది?
ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. వచ్చే నెలలో ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఉత్తర్‌ప్రదేశ్, గోవాలలో పోటీ చేసేందుకు సిద్ధమైంది. గోవాలో కూడా శివసేన ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంది.
ఇటీవల దాద్రా-నగర్ హవేలీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన కాలాబాయి డెల్కర్ మహారాష్ట్ర వెలుపల ఎన్నికైన తొలి శివసేన ఎంపీ కావడం విశేషం.
ఇటీవల కాలంలో పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా జాతీయ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీంతో శివసేన మహారాష్ట్ర వెలుపల తన పునాదులను పెంచుకునే ప్రయత్నంలో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మరి, బాల్‌ఠాక్రే చరిష్మా మహారాష్ట్ర వెలుపల ఎందుకు పనిచేయలేకపోయిందన్నది ఆశ్చర్యం కలిగించే ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
హిందూ మెజారిటీ రాష్ట్రాల్లో విజయాలు లేవు
మహారాష్ట్ర వెలుపల శివసేన తన అదృష్టాన్ని పరీక్షించుకోలేదని కాదు. శివసేన గతంలో ఉత్తర భారతదేశంలో హిందూ మెజారిటీ రాష్ట్రాలైన దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ల ఎన్నికల్లో పోటీ చేసింది.
దీంతో పాటు గోవా, కర్ణాటకలోని బెల్గాంలలో కూడా పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకుంది. జమ్మకశ్మీర్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ కూడా పోటీ చేసింది.
నిజానికి ఉత్తర భారతదేశంలో బాల్‌ఠాక్రేకు విపరీతమైన క్రేజ్ ఉండేది. నేటికీ ఈ రాష్ట్రాల్లో ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు.
ఈ క్రేజ్‌ను ఉపయోగించుకుని రాష్ట్రాలలో పాగా వేయడనికి శివసేన కూడా ప్రయత్నాలు చేసింది. కానీ, అనుకున్న స్థాయిలో మద్దతు సమీకరించలేకపోయింది. ఎన్నికల్లో విజయాలు దక్కలేదు.
దీంతో జాతీయ స్థాయిలో ప్రభ ఉన్నప్పటికీ మహారాష్ట్రకే పరిమితమైన పార్టీగా శివసేన మిగిలిపోయింది.
అలాగని, అస్సలు ఆ పార్టీ ప్రభావం లేదని కూడా కాదు. మహారాష్ట్ర వెలుపల శివసేనకు ఎంపీతో పాటు ఎమ్మెల్యే కూడా ఉండేవారు.

ఫొటో సోర్స్, Getty Images
'బాహుబలి' పవన్ పాండే శివసేన ఎమ్మెల్యే
1991లో రామజన్మభూమి ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో శివసేన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎమ్మెల్యే పదవిని సాధించింది. అయోధ్య రామ మందిరం అంశంపై దేశవ్యాప్తంగా హిందుత్వ గాలి వీస్తున్న కాలం అది. బాల్ ఠాక్రే ఆ సమయంలో హిందుత్వ రాజకీయాలలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు.
1991 అసెంబ్లీ ఎన్నికల్లో అక్బర్‌పూర్ నియోజకవర్గం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పవన్ పాండే శివసేన టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది ఆ పార్టీకి పెద్ద విజయం.
పవన్ పాండే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో శివసేన తన ఉనికిని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. లఖ్‌నవూ, బల్లియా, వారణాసి, గోరఖ్‌పూర్‌లలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ శివసేన విజయం సాధించింది. పవన్ పాండే ఉత్తర్‌ప్రదేశ్‌లో శివసేనకు ఫేస్‌గా మారారు. అయితే, ఈ ట్రెండ్ ఎక్కువ కాలం కొనసాగలేదు.
తర్వాత జరిగిన ఎన్నికల్లో పాండే ఓడిపోయారు. మాయావతి ముఖ్యమంత్రి కాగానే తన రాజకీయ ప్రత్యర్థులైన 'బాహుబలి' నేతలపై విరుచుకుపడేలా వ్యూహం అనుసరించారు. దీని నుంచి తప్పించుకోవడానికి పవన్ పాండే ముంబయి చేరుకున్నారు.
ముంబయిలో తన రాజకీయ ప్రాబల్యాన్ని నెలకొల్పడానికి పాండే ప్రయత్నించారు. అయితే, ఉత్తర భారత్‌కు చెందిన మరో నేత సంజయ్ నిరుపమ్ అక్కడ ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. చివరకు పాండే బీఎస్పీలో చేరారు. పాండే తర్వాత కూడా శివసేన ఉత్తర్‌ప్రదేశ్‌లో పోటీ చేసినా విజయం సాధించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
1990లలో శివసేన
అయోధ్య ఉద్యమ వాతావరణంలో శివసేన జాతీయ స్థాయిలో విస్తరణకు ప్రయత్నించింది. హిందుత్వ రాజకీయాల ప్రభావం హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కనిపించింది. ఆ కారణంగా శివసేనకు గుర్తింపు లభించింది.
రామజన్మభూమి ఉద్యమం సమయంలో, బాల్‌ఠాక్రే వ్యవహార శైలిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అప్పుడే శివసేన మహారాష్ట్రలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తోంది.
"పాకిస్తాన్‌లో ఠాక్రే పేరు మారుమోగుతున్న సమయంలో దేశ వ్యాప్తంగా శివసేనపై ఆసక్తి పెరిగింది" అని జర్నలిస్ట్ వైభవ్ పురంధరే అన్నారు. ఆయన 'బాల్ ఠాక్రే అండ్ ది రైజ్ ఆఫ్ శివసేన' పుస్తకం రాశారు.
శివసేన మరాఠావాదం, దూకుడు సంస్కృతి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయం ఇది. అంతకు ముందు కూడా శివసేన ఎమర్జెన్సీ సమయంలో కమ్యూనిస్టు వ్యతిరేక వైఖరిని అవలంబించి వార్తల్లో నిలిచింది.
వీటన్నింటి తర్వాత శివసేన ఒక ప్రాంతీయ లేదా స్థానిక శక్తిగా మారింది. ముంబయిని దాటి థానే వరకు చేరుకుంది. 1985 తర్వాత బాల్ ఠాక్రే హిందుత్వ, అయోధ్య రామ మందిరం, ముంబయి అల్లర్ల సమస్యలపై గళమెత్తడంతో శివసేన మహారాష్ట్రలో వేగంగా విస్తరించింది.
శివసేనకు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు మొదలైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక ఎమ్మెల్యే గెలవడమే ఇందుకు ఉదాహరణ. ఇది బాల్ ఠాక్రే జాతీయ రాజకీయాల ఆకాంక్షలకు ఇది నిదర్శనం.
శివసేన పలు రాష్ట్రాల ఎన్నికల్లో పాల్గొనడానికి ఇదే కారణం. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా, కేవలం మరాఠా వాదంతో జాతీయ రాజకీయాల్లో నెగ్గలేమన్న విషయాన్ని శివసేన గ్రహించి ఉండవచ్చు. అందుకే 1993లో హిందీలో 'దోపహర్ కా సామ్నా' అనే దినపత్రికను ప్రారంభించి ఉత్తర భారతీయులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
స్థానిక స్థాయిలో నెగ్గలేని సేన
మహారాష్ట్ర వెలుపల శివసేన ఎప్పుడూ గొప్ప విజయాలు సాధించలేదు. ఇతర రాష్ట్రాల్లో స్థిరంగా లేదు. కొన్ని ఎన్నికల్లో అద్భుతంగా రాణించినా, అవి తాత్కాలికమే అయ్యాయి.
శివసేన విధానాలన్నీ మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికేనని, మహారాష్ట్రలో అధికారంలో వాటా వచ్చినప్పుడు ఆ పార్టీ దానితో పూర్తిగా సంతృప్తి పడిపోవడం ఇందుకు ఒక కారణమని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం మహారాష్ట్ర పై దృష్టి సారించడం వల్ల జాతీయ రాజకీయాల్లో శివసేన తనదైన ముద్ర వేసే అవకాశాన్ని కోల్పోయింది.
1995లో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా, ఆ పార్టీ ఒక వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. మహారాష్ట్ర దాటి విస్తరించవచ్చు. కానీ, ఆ పని ఎప్పుడూ చేయలేదు. ఆ పార్టీ నాయకత్వం రాష్ట్రంలో అధికారం పైనే దృష్టిసారించింది.
"ఇతర రాష్ట్రాల్లో పార్టీకి లోకల్ లీడర్‌షిప్ లేదు. పార్టీ పెద్దగా బాల్‌ఠాక్రేలాంటి బలమైన వ్యక్తి ఉన్నా, రాష్ట్రాలలో సమర్ధులైన నాయకులు లేని మాట నిజం. 1999 నాటి ఫిరోజ్‌షా మైదానం పిచ్ తవ్వేసిన ఘటన తర్వాత దిల్లీ నుంచి జై భగవాన్ గోయల్ పేరు బాగా వినిపించింది. ఆ తర్వాత మళ్లీ అంతటి దూకుడు వ్యక్తి లేరు" అని జర్నలిస్ట్ వైభవ్ పురంధరే అన్నారు.
జై భగవాన్ గోయల్‌ను మహారాష్ట్ర వెలుపల అత్యంత పేరున్న శివసైనికుడిగా గుర్తింపు పొందారు. ఆయన దిల్లీలో పార్టీని నడిపించారు. దూకుడుగా ఉండేవారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లను అనుమతించకూడదనే వైఖరిని బాల్‌ఠాక్రే అనుసరించినప్పుడు, గోయెల్, ఆయన అనుచరులు దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో పిచ్ ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత కూడా శివసేన దిల్లీలో దూకుడుగా కార్యక్రమాలు నిర్వహించింది. కానీ, ఎన్నికల్లో విజయం సాధించలేకపోయింది.
1999లో మహారాష్ట్రలో శివసేన అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీ దృష్టి మళ్లీ మహారాష్ట్రపై పడింది. ఇక్కడ అధికారం కోసం చేసిన ప్రయత్నం జాతీయ సంకల్పాన్ని అడ్డుకుంది.
ఇక మహారాష్ట్ర వెలుపల, ఇతర రాష్ట్రాల్లో ప్రముఖులను తన పార్టీలో చేర్చుకునే విషయంలో శివసేన బాగా వెనకబడింది. ఇందుకు ఉదాహరణ శంకర్ సింగ్ వాఘేలా.
ఆయన భారతీయ జనతా పార్టీని వీడి శివసేనలోకి వచ్చేందుకు మొగ్గు చూపినా, ఆ పార్టీ ఆయనను చేర్చుకోలేదు. అప్పట్లో బీజేపీతో ఉన్న సంబంధాల కారణంగా శంకర్ సింగ్‌కు ఆహ్వానం పంపలేదు.
వాఘేలా లాంటి నాయకుడు శివసేనలోకి రావాలనుకోవడం పెద్ద విషయం. కానీ, గుజరాత్‌లో ఒక మంచి అవకాశాన్ని శివసేన వదులుకుంది.
మహారాష్ట్ర దాటని శివసేనాని
శివసేన మహారాష్ట్ర వెలుపల విస్తరించకపోవడానికి స్థానిక స్థాయిలో నాయకుల కొరత ఒక కారణమైతే, బాల్ ఠాక్రే స్వయంగా పార్టీ విస్తరణ కోసం మహారాష్ట్ర నుంచి ఎన్నడూ బయటకు రాకపోవడం కూడా మరో ముఖ్య కారణం.
ఆయన ఎప్పుడూ ప్రచారానికి వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఇది తరచుగా జరిగేది. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు రాకపోవడం శ్రేణుల్లో నిస్పృహ నింపేది. 1999లో ఒకసారి శివసైనికులు దిల్లీలో ఆయనకు అభినందనలు తెలిపేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ, ఆయన తన స్థానంలో ఉద్ధవ్ ఠాక్రేను పంపారు.
"ఈ విషయంలో బాల్ ఠాక్రే కు, శివసేనకు ముందు చూపు లేదనే చెప్పవచ్చు" అన్నారు వైభవ్ పురంధరే.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీతో పొత్తు అడ్డుపడిందా?
జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కూడా శివసేన మహారాష్ట్ర వెలుపల విస్తరించలేకపోయిందని కూడా కొందరు అంటారు. నిజానికి, బాల్ ఠాక్రేని ఆకర్షించిన ఉత్తర భారతదేశపు రాజకీయ క్షేత్రాలు బీజేపీకి కూడా చాలా కీలకమైనవి.
బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో హిందుత్వ రాజకీయాలు పెరిగాయని, మనం మహారాష్ట్రలో మిగిలి పోయామని, హిందుత్వ రాజకీయాలను పూర్తిగా ఉపయోగించుకుని ఉంటే మనం దిల్లీలో ఉండేవాళ్లమని ఉద్ధవ్ ఠాక్రే ఓసారి అన్నారు.
ఒకవేళ శివసేన కూడా బీజేపీతో పోటాపోటీగా విస్తరణ ప్రయత్నాలు చేసినట్లయితే, రెండు పార్టీలకు విభేదాలు తప్పేవి కావు.
"బీజేపీలోని పెద్ద నేతలతో బాలాసాహెబ్‌కు సంబంధాలు ఉండేవి. ముఖ్యంగా ప్రమోద్ మహాజన్, ఎల్‌కే అద్వానీలతో ఆయనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి" అన్నారు పురంధరే.
అయితే ప్రస్తుతం శివసేన, బీజేపీ దారులు విడిపోయాయి. సేన ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ వంటి కొత్త మిత్రపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో రాజకీయాల్లో పాల్గొంటోంది.
ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన బాల్ ఠాక్రే తరహా రాజకీయాలకు భిన్నంగా రాజకీయాలు చేస్తోందని అంటున్నారు.
మరి పరిస్థితుల్లో కొత్త శివసేన మహారాష్ట్ర వెలుపల విస్తరిస్తుందా, జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. రాబోయే రోజుల్లో దీనికి సమాధానం దొరకవచ్చు.
ఇవి కూడా చదవండి:
- RRB NTPC: రైలుకు నిప్పుపెట్టిన అభ్యర్థులు, వారి ఆగ్రహానికి కారణమేంటి?
- యుక్రెయిన్ సంక్షోభం: ‘యుద్ధానికి ముందు, ఇప్పుడు నా ఊరికి పోలికే లేదు’
- విజయనగరం: దక్షిణ భారతంలో చిట్టచివరి హిందూ సామ్రాజ్యం ఎలా పతనమైంది? తళ్లికోట యుద్ధంలో నలుగురు సుల్తానులు ఏకమై ఎలా ఓడించారు
- తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
- పద్మ అవార్డులు: మొగిలయ్య, గరికపాటిలకు పద్మశ్రీ.. ఎల్లా సుచిత్ర, ఎల్లా కృష్ణలకు పద్మ భూషణ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















