మహారాష్ట్ర: ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్‌లో వంశాధిపత్యం, మంత్రులుగా 21 మంది రాజకీయ వారసులు

ధనంజయ్ ముండే, అమిత్ దేశ్‌ముఖ్, ఆదిత్య ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధనంజయ్ ముండే, అమిత్ దేశ్‌ముఖ్, ఆదిత్య ఠాక్రే

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గం విస్తరణ పూర్తైంది. కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న నాయకులు.. సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే కూడా వారిలో ఉన్నారు.

కేబినెట్ మంత్రిగా ఉద్ధవ్ ప్రమాణం స్వీకారం చేశారు.

వారసత్వ రాజకీయాల గురించి పార్టీలు ఎప్పుడూ ఒకదాన్నొకటి విమర్శించుకుంటూ ఉంటాయి. కానీ మహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గాన్ని చూస్తే.. ఈ వారసత్వ రాజకీయాలకు ఏ పార్టీ అతీతం కాదేమో అనిపిస్తుంది.

ఈ ప్రమాణస్వీకార వేడుక తర్వాత సోషల్ మీడియా దీనిని 'తండ్రీకొడుకుల ప్రభుత్వం'గా వర్ణించింది. కానీ ఈ ప్రభుత్వంలో తండ్రీ తనయులే కాదు కూతుళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన మొత్తం 43 మందిలో 21 మంది రాజకీయ కుటుంబాల వారసులే.

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కుమారుడు.

ఇప్పుడు, కొత్త కేబినెట్లో ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే మంత్రిగా ప్రమాణం చేశారు. ఠాక్రే కుటుంబంలో రాజకీయాల్లో పోటీ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆదిత్య ఠాక్రేనే. ఆయన వొర్లి నియోజకవర్గం నుంచి గెలిచారు. కేబినెట్ విస్తరణలో ఆదిత్యకు మంత్రి పదవి దక్కింది.

అయినా, తండ్రీకొడుకులు ఒకే కేబినెట్‌లో ఉండడం కొత్తేం కాదు. తమిళనాడులో కరుణానిధి-స్టాలిన్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు-లోకేష్, తెలంగాణలో కె.చంద్రశేఖరరావు-కే.టి.రామారావు, పంజాబ్‌లో ప్రకాశ్ సింగ్ బాదల్-సుఖ్‌బీర్ సింగ్ బాదల్, హర్యానాలో దేవీలాల్-రంజిత్ సింగ్ చౌతాలా ఒకే ప్రభుత్వంలో కలిసి ఉన్నారు.

మహా కుటుంబ రాజకీయం

ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్లో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. అజిత్ ఎన్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ అన్న కొడుకు. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

50 రోజుల్లోపే అజిత్ పవార్ మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈసారీ ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అజిత్ పవార్ ఇప్పటివరకూ నలుగురు ముఖ్యమంత్రుల నేతృత్వంలో ఈ పదవిలో పనిచేశారు. గతంలో పృథ్వీరాజ్ చౌహాన్, అశోక్ చవాన్, దేవేంద్ర ఫడణవీస్, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎం అయ్యారు.

అజిత్ పవార్ ఎన్సీపీకి కంచుకోట అయిన బారామతి నియోజకవర్గం నుంచి ఏడోసారి ఎన్నికయ్యారు.

జయంత్ పాటిల్ ఉద్ధవ్ ఠాక్రేతోపాటూ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈయన మంత్రిగా కూడా పనిచేసిన రాజరాంబాపు పాటిల్ కొడుకు. 1962 నుంచి 1970 వరకూ ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సహకార ఉద్యమంలో ఆయన పేరు ప్రముఖంగా నిలిచింది.

అజిత్ పవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అజిత్ పవార్

కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరాట్‌ కూడా రాజకీయ వారసులే. ఆయన తండ్రి భావుసాహెబ్ థోరాట్ ఎమ్మెల్యే. ఆయన్ను సహకార ఉద్యమంలో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తుచేసుకుంటారు.

దిలీప్ వాల్సే-పాటిల్ విశ్వాసపరీక్ష సమయంలో ప్రోటెం స్పీకరుగా ఉన్నారు. ఆయన తండ్రి దత్తాత్రేయ్ వాల్సే పాటిల్ ఎమ్మెల్యే. పి.డి.పాటిల్ తండ్రి బాలాసాహెబ్ పాటిల్ కూడా ఎమ్మెల్యేనే.

మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. అశోక్ తండ్రి శంకర్‌రావ్ చవాన్ కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు.

అశోక్ చవాన్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, అశోక్ చవాన్

అజిత్ పవార్ దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేసినపుడు సింద్‌ఖేద్రాజా రాజేంద్ర శింగానే అక్కడే ఉన్నారు. శింగానే వెంటనే ఎన్సీపీ క్యాంప్ దగ్గరికి వచ్చి మహా వికాస్ అఘాడీకి మొత్తం జరిగినదంతా వివరించారు.

శింగానే సోమవారం(డిసెంబర్ 30) కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన తండ్రి భాస్కర్‌రావ్ శింగానే కూడా ఎమ్మెల్యేనే. రాజేంద్ర శింగానే ఎమ్మెల్యేగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు.

అమిత్ దేశ్‌ముఖ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమిత్ దేశ్‌ముఖ్

రాజేష్ తోపే ఇంతకు ముందు మంత్రిగా పనిచేశారు. ఈసారీ కూడా ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. తోపే ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి అంకుశ్‌రావ్ తోపే ఎంపీగా చేశారు. ఆయన జాల్నా జిల్లాలో ఎన్నో సహకార సొసైటీలు ప్రారంభించారు.

మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు అమిత్ దేశ్‌ముఖ్‌కు కూడా కొత్త కేబినెట్‌లో స్థానం దక్కింది. ఇంతకుముందు కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంలో ఆయన సహాయ మంత్రిగా పనిచేశారు. అమిత్ తమ్ముడు ధీరజ్ కూడా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.

బీజేపీ దివంగత సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే సోదరుడి కుమారుడు ధనంజయ్ ముండే ఎన్సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల్లో గోపీనాథ్ కుమార్తె పంకజా ముండేపైనే ఆయన విజయం సాధించారు. రాష్ట్రంలో ఆసక్తికరంగా సాగిన పోటీల్లో ఇది కూడా ఒకటి. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అనుభవం ధనంజయ్‌కు ఉంది. ఉద్ధవ్ కేబినెట్‌లో ఇప్పుడు ఆయనకు స్థానం దక్కింది.

ధనంజయ్ ముండే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధనంజయ్ ముండే

ఎన్సీపీ ఎంపీ సునీల్ తట్కరే కుమార్తె అదితి ఈ ఎన్నికల్లోనే తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. 2012 నుంచి ఎన్సీపీ యువ విభాగంలో ఆమె క్రియాశీలంగా ఉన్నారు. రాయ్‌గఢ్ జిల్లా మండలికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సహాయ మంత్రిగా ఆమె సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఎమ్మెల్యే జయంత్ పాటిల్ బంధువు, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ తంపురే కుమారుడు ప్రజక్త్ తంపురే కూడా సహాయ మంత్రి పదవి చేపట్టారు.

గతంలో సహాయమంత్రిగా పనిచేసిన బాబా సాహెబ్ కేదార్ కుమారుడు సునీల్ కేదార్.. మాజీ ఎమ్మెల్యే భయ్యాసాహెబ్ ఠాకుర్ కుమార్తె యశోమతి ఠాకుర్ కూడా సోమవారం సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

కాంగ్రెస్ ఎంపీ ఏక్‌నాథ్ గైక్వాడ్ కుమార్తె వర్ష గైక్వాడ్‌కు కూడా కొత్త కేబినెట్‌లో చోటు దక్కింది. మాజీ మంత్రి, గవర్నర్ డీవై పాటిల్ కుమారుడు సతేజ్ పాటిల్ సహాయ మంత్రి పదవి చేపట్టారు.

ఎమ్మెల్యే పతంగ్‌రావ్ కదమ్ కుమారుడు విశ్వజిత్ కదమ్, మాజీ మంత్రి బాలాసాహెబ్ దేశాయ్ మనువడు శంభురాజే దేశాయ్‌లకు కూడా మంత్రి పదవులు లభించాయి.

మాజీ ఎంపీ యశ్వంత్‌రావ్ గడఖ్ కొడుకు శంకర్‌రావ్ గడఖ్‌కు మంత్రి పదవి లభించింది. ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు.

వారసత్వ రాజకీయాలు తప్పవా?

వారసత్వ రాజకీయాలు ఒక పార్టీకే పరిమితం కాలేదని లోక్‌మత్ పత్రిక సీనియర్ అసోసియేట్ ఎడిటర్ సందీప్ ప్రధాన్ అభిప్రాయపడ్డారు. గతంలో కాంగ్రెస్‌ను వారసత్వ రాజకీయాల పార్టీ అంటూ నిందించిన పార్టీలు కూడా ఇప్పుడు అదే తరహా పార్టీలుగా మారిపోయాయని ఆయన అన్నారు.

''పార్టీలు, నాయకులందరికీ రాజకీయాలతో ముడిపడిన ప్రయోజనాలు ఉన్నాయి. వేరే ఎవరికో అధికారం అప్పగించే బదులు, తమ కుటుంబంలోనే విశ్వసనీయమైన వ్యక్తులకు బాధ్యత అప్పగించాలని వాళ్లు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా అన్ని పార్టీల్లోనూ ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది'' అని చెప్పారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)