తేజస్వి యాదవ్, రాజశ్రీ: రేచల్‌ను రాజశ్రీగా మార్చారు, తేజస్విని టోనీగా మారిస్తే - అభిప్రాయం

ఫొటో సోర్స్, Twitter
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ నేత తేజస్వి యాదవ్ వివాహం ఇటీవల రేచల్‌తో జరిగింది.
వివాహం తరువాత రేచల్ పేరును రాజశ్రీగా మార్చారు.
"ఆమె పేరు ఇక రాజశ్రీ. ఇక్కడి ప్రజలకు పలకడంలో ఇబ్బంది ఉండకూడదని ఆమె స్వయంగా తన పేరును మార్చుకున్నారు. రాజశ్రీ అనే పేరును మా నాన్నగారే సూచించారు" అని తేజస్వి తెలిపారు.
ఇంటి పేరు ఏమిటని ఒక జర్నలిస్ట్ అడిగారు. "యాదవ్ అవుతుంది. ఇంకేటి?" అని తేజస్వి టక్కున జవాబిచ్చారు.
'ఆమె ఇష్టపడే మార్చుకున్నారు. పేరే కదా, అందులో ఏముంది' అనుకోవచ్చు.
సరే, పేరులో ఏమీ లేదనే అనుకుందాం.
రేచల్ పేరు పలకడం కష్టమని కారణం చూపుతూ ఒక క్రిస్టియన్ పేరును హిందూ పేరుగా మార్చారు.
తేజస్వి పేరు కూడా పలకడం కష్టమే. సరదాగా ఆ పేరును సులువుగా ఉండేలా టోనీగా మార్చి చూద్దాం.
రేచల్ కుటుంబానికి టోనీ అని పిలవడం సులభం అవుతుంది. బిహార్ ప్రజల సౌలభ్యం కోసమే రేచల్ పేరును రాజశ్రీగా మార్చారని చెప్పారు. టోనీ పేరు రేచల్ కుటుంబ సౌలభ్యం కోసం అనుకుందాం.
కొత్త తరానికి చెందినవాడినని, ఆలోచనాపరుడినని చెప్పుకునే తేజస్వికి తన పేరు టోనీగా మార్చడంలో అభ్యంతరం ఉండకపోవచ్చు.
వేరే మతంలో సంప్రదాయం నిలబెట్టడానికి టోనీ యాదవ్ అని పిలిచినా తప్పేముంది!
వివాహం కాగానే రేచల్ ఇంటి పేరు మారినట్టే తేజస్వి ఇంటి పేరు కూడా మార్చుకునేందుకు సిద్ధపడ్డారు అనుకుందాం.
అప్పుడు, చిన్నప్పటినుంచి తన గుర్తింపుగా ఉన్న పేరును చెరిపేయడానికి, ఇరుగుపొరుగువారిని, స్నేహితులను వదిలిపెట్టి, భార్య ఊరిలో తన కుటుంబంతో కలిసి జీవించడానికి ఎలాంటి సమస్య ఉండకూడదు.
పేరే కదా, అందులో ఏముంది?

ఫొటో సోర్స్, Twitter
సంప్రదాయమా? స్వచ్ఛందమా?
పెళ్లయిన తరువాత కోడళ్లకు పేరు మార్చడం అనేది కొత్త విషయమేమీ కాదు. తరతరాలుగా జరుగుతున్నదే. అలాగే, వివాహం కాగానే అమ్మాయి ఇంటి పేరూ మారిపోతుంది.
"మతం, సంప్రదాయాలను పాటించేవాళ్లు ఇళ్లల్లో మహిళలకు రెండో స్థానమే ఇస్తారు. వేలాది సంవత్సరాలుగా ఇది కొనసాగుతోంది. అలాగే మహిళలు పేరు మార్చుకోవాలని, అవసరమైతే మతం మార్చుకోవాలని కూడా అంటారు. ఇంటి పేరు ఎలాగూ మారిపోతుంది. ఈ ఆధునిక కాలంలో చదువుకుని కూడా తేజస్వి-రేచల్ విషయంలో అదే గొర్రెల మంద స్వభావం కనబడింది" అని పద్మశ్రీ అవార్డు గ్రహీత రచయిత్రి ఉషా కిరణ్ ఖాన్ అన్నారు.
చాలామంది మహిళలు ఈ సంప్రదాయాలను ఇష్టపడకపోయినా తిరగబడరు. పైగా వాటిని సులువుగా అలవర్చుకుంటారు. బహిరంగంగా దాని గురించి చెప్తారు. ప్రియాంక చోప్రా అదే చేశారు.
"నేను నా పేరు మార్చుకోవట్లేదుగానీ నా భర్త పేరు 'జోనస్ ' జోడిస్తున్నాను. నా గుర్తింపు చెక్కుచెదరకుండా, నా తల్లిదండ్రుల సంప్రదాయాన్ని నేను గౌరవించగలిగేలా ఇదొక మధ్యేమార్గం" అని ఆమె ప్రకటించారు.
యాదవ్ కుటుంబంలో అబ్బాయిని వివాహం చేసుకున్న రేచల్ స్వచ్ఛందంగా తన పేరు మార్చుకున్నారా లేక సంప్రదాయాలను పాటించారా అన్నది మనకు తెలీదు. ఎందుకంటే, ఆమె నేరుగా మీడియాతో మాట్లాడలేదు. ఆమె భర్త ఈ నిర్ణయం గురించి వెల్లడించారు.
మతం, రాజకీయాలు, సంప్రదాయం
'పర్సనల్ ఈజ్ పొలిటికల్' అంటారు. అంటే మన వ్యక్తిగత నిర్ణయాలు మన రాజకీయ భావజాలాన్ని, అవగాహనను తెలియజేస్తాయని అర్థం.
తేజస్వి లేదా టోనీ స్వయంగా రాజకీయ నాయకుడు. పైగా పార్టీలో అగ్రస్థానంలో ఉన్నారు కాబట్టి కొన్ని విలువలు పాటించాలి. అలాంటప్పుడు ఆయన తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలను కూడా వ్యక్తిగతం అనలేం.
బిహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, రాజకీయ నేతగా వ్యవహరిస్తున్న తేజస్వి ప్రవర్తనపై ప్రజలందరి దృష్టి ఉంటుంది.
ఆయన పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ సెక్యులర్ విలువల గురించి మాట్లాడుతుంది. ఎవరి స్వేచ్ఛ ప్రకారం వాళ్లు తమ మతాన్ని పాటించవచ్చని విశ్వసిస్తుంది. మహిళల సమాన హక్కుల గురించి చర్చిస్తుంది.
అలాంటప్పుడు, వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకుని, అది ఆమె 'వ్యక్తిగత నిర్ణయం' అంటూ పేరు మార్చడంపై ప్రశ్నలు లేవనెత్తవచ్చు.
మరో కోణం నుంచి చూస్తే, ఇది, దేశంలో మారుతున్న రాజకీయ వాతావరణాన్ని అనుసరించి, మెజారిటీ ప్రజలను తన పక్షాన ఉంచుకునే వ్యూహామా అనే సందేహం రాకమానదు. వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా తన మత ధర్మాలను, సంప్రదాన్ని పాటిస్తానని చెప్పడమా?
ముఖ్యంగా, కులాంతర, మతాంతర వివాహాలపై అసహనం పెచ్చుమీరుతున్న సమయంలో, అలాంటి వివాహాలను చట్టబద్ధంగా నమోదు చేసే ప్రక్రియ మరింత క్లిష్టంగా మారుతున్న ఈ సమయంలో ఇలాంటి చర్యలు ఎంతవరకు సబబు?

ఫొటో సోర్స్, TWITTER @ROHINIACHARYA2
"పబ్లిక్‌లో ఉండేవారి జీవితాల్లో వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదు. అలాంటప్పుడు ఎన్నో అడ్డంకులు అధిగమించి ఆయన కనీసం తన ప్రేమను నిలబెట్టుకోగలిగారు. అందుకోసమైనా ఆయనకు కొంచం రిలాక్సేషన్ ఇవ్వొచ్చు" అని ఉషా కిరణ్ ఖాన్ అన్నారు.
కానీ, ఈ మతాంతర వివాహంపై కూడా రాజకీయ, సంప్రదాయ నీడలు కమ్ముకున్నాయన్నది ప్రజల దృక్కోణం.
"అయితే రేచల్, రాజశ్రీగా మారారు. వీళ్లేమో మైనారిటీ హక్కుల గురించి మాట్లాడతారు. రాజకీయ నాయకుల మాటలు, చేతలు ఒకటే అవుతాయని అనుకోవడం అత్యాశే" అని ట్విట్టర్‌లో ఒక యూజర్ పోస్ట్ రాశారు.
దాదాపు ఇదే సమయంలో బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల వివాహం జరిగింది. వారిది కూడా మతాంతర వివాహమే. కానీ కత్రినా పేరు ఏ 'కవిత' గానో మార్చాల్సిన అవసరం రాలేదు.
అలాగే రేచల్ కూడా తన మతాన్ని, వ్యక్తిగత గుర్తింపును వదులుకోవాల్సిన అవసరం ఉండకూడదు.
అత్తమామలు కోడళ్లను ఆస్తిగా భావించే ఈ సంప్రదాయం మనల్ని ఎందుకు అసహనానికి గురిచేయట్లేదు?
పేరు మార్చడాన్ని వ్యక్తిగత నిర్ణయంగా అంగీకరించేస్తూ మనం ఎందుకు కళ్లు మూసుకుంటున్నాం?
తేజస్వి పేరును టోనీగా మార్చినట్లు ఊహించుకుంటే పేరులో ఏముందో మనకు స్పష్టమవుతుంది.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వంపై రైతుల విజయం.. ఏడాది పోరాటంలో 7 కీలక ఘట్టాలు
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- చైనాపై నిఘా కోసం హిమాలయాలపై దాచిన ప్లుటోనియం ఎలా మాయమైంది? అమెరికా, భారత్ మిషన్ ఎందుకు ఫెయిలైంది?
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్.. భారత్‌లో బిట్ కాయిన్‌కు అధికారిక ఆమోదం అంటూ ట్వీట్
- కూరగాయలు కోసే కత్తితో సొరంగం తవ్వి ఉత్తరప్రదేశ్‌లోని జైలు నుంచి పారిపోయిన పాకిస్తాన్ సైనికులు
- కోవిడ్డెంగీ అంటే ఏంటి? తెలంగాణలో ఏం జరుగుతోంది? మీరు తెలుసుకోవాల్సిన 6 అంశాలు
- జనరల్ బిపిన్ రావత్ అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యేదెవరు, అర్హతలేమిటి
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- అంకోర్ సామ్రాజ్యం అభివృద్ధి, అంతం రెండిటికీ నీరే కారణమా
- బుద్ధుడి గురించి ఈ విషయాలు తెలుసా?
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- లఖీంపుర్ ఖేరీ హింసపై సిట్ రిపోర్ట్: రైతులను తొక్కించేందుకు పక్కా ప్రణాళికతో కుట్ర, కేంద్ర మంత్రి కొడుకుపై హత్య కేసు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








