విజయ్ దివస్: కూరగాయలు కోసే కత్తితో సొరంగం తవ్వి ఉత్తరప్రదేశ్ జైలు నుంచి పారిపోయిన పాకిస్తాన్ యుద్ధ ఖైదీలు

1971 యుద్ధం తరువాత భారత జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా ఎదుట లొంగిపోతున్నట్లు సంతకాలు చేస్తున్న పాకిస్తాన్ జనరల్ నియాజీ

ఫొటో సోర్స్, BETTMANN

ఫొటో క్యాప్షన్, 1971 యుద్ధం తరువాత భారత జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా ఎదుట లొంగిపోతున్నట్లు సంతకాలు చేస్తున్న పాకిస్తాన్ జనరల్ నియాజీ
    • రచయిత, ఫర్హత్ జావేద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తూర్పు పాకిస్తాన్‌(ప్రస్తుత బంగ్లాదేశ్)లో యుద్ధఖైదీలుగా చిక్కిన సైనికులను తీసుకొస్తున్న రైలు భారత్‌లోని ఒక స్టేషన్లోకి రాగానే, ఒక భారతీయ సైనికాధికారి బోగీ ఎక్కారు. ''ఎవరైనా మీ కరెన్సీ మార్చుకోవాలంటే చెప్పండి'' అని గట్టిగా అరిచారు.

ఆయన అలా అనగానే బోగీలో ఉన్న పాకిస్తానీ సైనికాధికారుల్లో చాలామంది తమ జేబులు తడమడం మొదలు పెట్టారు. లోపల చేతికి దొరికిన నోట్లు, చిల్లర అంతా తీసి భారత అధికారి చేతుల్లో పోశారు.ఇండియన్ కరెన్సీగా మార్చుకున్నారు.

ఆ రైలు అప్పటి తూర్పు పాకిస్తాన్‌కు ఆనుకుని ఉన్న భారత సరిహద్దు బంగాన్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ వైపు వెళ్తోంది. అదే రైలులో పాకిస్తాన్ సైనికాధికారి మేజర్ తారిక్ పర్వేజ్ కూడా ఉన్నారు.

మేజర్ తారిక్ పర్వేజ్ డబ్బులు తీసుకుని తన చొక్కాలో దాచిపెట్టుకున్నారు. ఆయనతో ఉన్న మిగతా అధికారులు తినే, తాగే వస్తువులు కొంటున్నారు.

కానీ, పర్వేజ్ మాత్రం వేరే ప్లాన్లు వేస్తున్నారు. అది 1971 డిసెంబర్లో జరిగింది. అంతకు కొన్నిరోజుల కిందటే పాకిస్తాన్ భారత్ ఎదుట లొంగుబాటు ఒప్పందంపై సంతకాలు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చింది.

ఈ ఓటమి తర్వాత వేలాది పాకిస్తాన్ సైనికులను యుద్ధఖైదీలుగా పట్టుకున్నారు. వారిలో అదృష్టవంతులైన కొందరు సైనికుల మినహా చాలామంది సైనికులు తర్వాత ఎన్నో ఏళ్లపాటు భారత్‌లోని వివిధ సైనిక శిబిరాల్లో యుద్ధఖైదీలుగా గడిపారు.

మేజర్ తారిక్ పర్వేజ్ మరో నలుగురు అధికారులతో కలిసి జైలు నుంచి తప్పించుకోగలిగారు
ఫొటో క్యాప్షన్, మేజర్ తారిక్ పర్వేజ్ మరో నలుగురు అధికారులతో కలిసి జైలు నుంచి తప్పించుకోగలిగారు

ఓటమి తర్వాత ఫతేగఢ్‌కు సైనికులు

భారత సైన్యం ముందు లొంగిపోయిన తర్వాత పాకిస్తాన్ సైనికులను యుద్ధఖైదీలుగా రకరకాల క్యాంపులకు పంపించడం మొదలైంది.

బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో పాకిస్తాన్ సైనికులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని వారిని క్యాంపులకు పంపించారు. దాంతోపాటూ అంతమంది సైనికులను ఎక్కువకాలం అక్కడే ఉంచేందుకు ఏర్పాట్లు లేవు. అందుకే భారత్ పంపాలని నిర్ణయించారు.

మేజర్ తారిక్ పర్వేజ్, ఆయనకు తమ్ముడు వరసయ్యే నాదిర్ పర్వేజ్ సహా వందలాది అధికారులు, సైనికులు రైల్లో ఉన్నారు. అది వివిధ ప్రాంతాల మీదుగా ప్రయాణించి చివరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేగఢ్ ఛావ్నీ చేరుకుంది.

యుద్ధ ఖైదీల కోసం అక్కడ ఒక క్యాంప్ ఏర్పాటుచేశారు. అధికారులు, సైనికులు అక్కడ మరో 20 నెలలకు పైగా గడపాల్సి ఉంటుంది.

లొంగిపోతున్నామనే వార్త కంటోన్మెంట్ల నుంచి మిగతా ప్రాంతాలకు చేరినప్పుడే పాకిస్తాన్ సైనికులు తప్పించుకోవాలనే ప్రయత్నం మొదలైంది. చాలామంది జవాన్లు పారిపోయే ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధంలో ప్రతి సైనికుడికీ శత్రువు చెర నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించే హక్కు ఉంటుంది. అలా చేస్తూ పట్టుబడితే అతడిని శిక్షించకూడదు. మేజర్ తారిక్ పర్వేజ్, ఆయన సహచరులు అదే ఆలోచనలో ఉన్నారు. భారత సైనికులు ఏదైనా పొరపాటు చేస్తే చాలు, వాళ్ల కళ్లుగప్పి రైలు నుంచి పారిపోవాలని ప్లాన్లు వేస్తున్నారు.

వాళ్లను ఫతేగఢ్ కంటోన్మెంట్ క్యాంపు నంబర్ 45లో ఉంచారు. ఆ క్యాంప్ అధికారుల కోసం రెండు పొడవాటి బ్యారక్‌లు ఉన్నాయి. ఒక్కో బ్యారక్‌ను ఆరు భాగాలుగా విభజించారు. అందులో ఒకభాగంలో కిచెన్, రెస్ట్ రూం కూడా ఉన్నాయి. రెండో బ్యారక్‌ను రెండు భాగాలుగా విభజించారు. అందులో చెక్కతో చేసిన ఐదు బాత్రూంలు ఉన్నాయి.

ఆ తాత్కాలిక బాత్రూంలతోపాటూ లోతుగా ఒక గుంత తవ్వి టాయిలెట్ కూడా నిర్మించారు. మేజర్ తారిక్ పర్వేజ్‌ను బందీగా ఉంచిన బ్యారక్ కూడా అక్కడే ఉంది. ఆ బాత్రూం నుంచే పారిపోయే ప్లాన్ మొదలైంది.

భారతీయ జైలు నుంచి ఎలా తప్పించుకున్నదీ మేజర్ తారిక్ పర్వేజ్ బీబీసీకి వివరించారు.
ఫొటో క్యాప్షన్, భారతీయ జైలు నుంచి ఎలా తప్పించుకున్నదీ మేజర్ తారిక్ పర్వేజ్ బీబీసీకి వివరించారు.

ప్లాన్ ఎలా వేశారు?

మేజర్ తారిక్ పర్వేజ్ పాకిస్తాన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ పదవి వరకూ చేరారు. బంగ్లాదేశ్ ఆవిర్భవించి 50 ఏళ్లయిన సందర్భంగా పాకిస్తాన్ యుద్ధ ఖైదీల పట్ల జరిగిన ఘటనలను, క్యాంప్ నంబర్ 45 నుంచి ఎలా తప్పించుకున్నామో ఆయన బీబీసీకి వివరించారు.

పారిపోవడానికి సిద్ధమైన పాకిస్తాన్ సైనికాధికారులు మొదట తమ ఒక్కో జత దుస్తులను దాచిపెట్టారు. తర్వాత కరెన్సీని దాచారు. బందీలుగా మారాక గడ్డం పెంచారు. తప్పించుకున్న తర్వాత రూపం మార్చుకోవచ్చన్నది వారి ప్లాన్. వారికి ఇచ్చే దుస్తులపై పీఓడబ్ల్యు (ప్రిజనర్ ఆఫ్ వార్) అనే ముద్ర ఉండడంతో ఒక జత దాచిపెట్టారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తప్పించుకోవడం అంత సులభం కాదు. జైళ్ల నుంచి ఎవరూ పారిపోలేని విధంగా భారత ఆర్మీ కట్టుదిట్టంగా గస్తీ కాస్తోంది.

క్యాంప్ చుట్టూ ముళ్ల కంచె ఉంది. దానికి కాస్త దూరంలో వాచ్ టవర్లు ఉన్నాయి. అన్ని వాచ్ టవర్ల మీదా సెర్చ్ లైట్లు ఉన్నాయి.

అదుపులో ఉన్న కొన్నిరోజుల తర్వాత మేజర్ తారిక్ పర్వేజ్, మేజర్ నాదిర్ పర్వేజ్ మరికొందరు అధికారులను తమతో చేర్చుకున్నారు. పారిపోవడానికి ఒక ప్లాన్ సిద్ధం చేశారు.

సొరంగం తవ్వడం తప్ప మరో మార్గం లేదని ఒక నిర్ణయానికి వచ్చారు. బాత్రూమ్‌లలో చివరి బాత్రూమ్‌ను సొరంగం తవ్వడానికి ఎంపిక చేసుకున్నారు. ఆ బాత్రూమ్.. శిబిరం గోడకు దగ్గరగా ఉంది. పైగా, ఒక మూలలో లైట్ లేదు. ఇక్కడ సొరంగం తవ్వాలి. కానీ ఎలా? దానికి కూడా ఒక ఉపాయం ఉంది.

సొరంగం తవ్వడానికి, గదిలో దుస్తులు వేలాడదీయడానికి అమర్చిన రాడ్ హుక్‌ను ఉపయోగించాలని నిర్ణయించినట్లు తారిక్ పర్వేజ్ వివరించారు.

కానీ, బాత్‌రూమ్‌లోని ఫ్లోర్‌ బాగా దృఢంగా ఉంది. దానిని పగలగొడితే శబ్ధం వస్తుంది. భారత సైనికులు 24 గంటలు కాపలాగా ఉంటారు. దీనికి కూడా పరిష్కారం దొరికింది.

ఫతేగఢ్ కంటోన్మెంట్ రాజ్‌పుత్ రెజిమెంట్ శిక్షణా కేంద్రం. దీనికి సమీపంలోనే ఫైరింగ్ రేంజ్ ఉంది. ఇక్కడ భారత సైనికులు రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్లు. ప్రాక్టీస్ సమయాన్ని వారు తెలుసుకున్నారు.

"సొరంగం తవ్వడానికి ఉపయోగించిన మొదటి ఆయుధం హుక్. వాళ్లు ఫైరింగ్ చేసినప్పుడు నేను ఆ హుక్‌తో తవ్వడం మొదలు పెట్టాను. అక్కడ వరసగా ఫైరింగ్ జరుగుతున్నపుడు మేం గబగబా తవ్వడం కొనసాగించాం'' అని తారిక్ పర్వేజ్ వివరించారు.

చివరకు సొరంగం ఏర్పడింది. కానీ, అది బైట పడకుండా ఎలా రహస్యంగా ఉంచాలన్నది ఇబ్బందిగా మారింది. మరోసారి తప్పిచుకునే ప్లాన్ వేసిన బందీలు రహస్య సమావేశం నిర్వహించారు.

ఈ అధికారులలో ఒకరైన మేజర్ రిజ్వాన్, పాకిస్తాన్ ఇంజనీర్స్ కార్ప్స్‌లో అధికారి. ఆ గొయ్యిని కప్పే విధంగా ఒక కవర్‌ను తయారు చేయమని ఆయనను అడిగారు. ఇనుప మంచానికి ఉన్న తీగను తొలగించి మ్యాన్ హోల్ మూతను తయారు చేశారు.

వంటగదిలో పెద్ద కత్తిని దొంగిలించి, ఆ కత్తితో సొరంగం తవ్వే పని ప్రారంభించారు. కంటోన్మెంట్ పక్కనే నది ఉండడంతో అక్కడి భూమి కాస్త మెత్తగా ఉంది.

''వంటకత్తి తోనే మేం మొత్తం సొరంగాన్ని తవ్వాం'' అని తారిఖ్ పర్వేజ్ వెల్లడించారు.

తవ్విన మట్టి కనిపించకుండా టాయిలెట్ కింద ఉన్న గుంటలో వేశారు. ఇలా దొంగతనంగా తప్పించుకోవడానికి ప్లాన్ వేసిన వారంతా గ్రూపులుగా విడిపోయి, కొందరు తవ్వే పనిలో ఉండగా, మరికొందరు నిఘా వ్యవహారాలు చూసుకున్నారు. ఇంకొందరు తవ్విన మట్టిని కనపించకుండా చేసే పనిలో ఉన్నారు.

1972 జనవరిలో సొరంగం తవ్వడం ప్రారంభించిన వీరంతా ఏడు నెలల పాటు అదే పనిలో ఉన్నారు.

బంగ్లాదేశ్ విముక్తి: 1971 యుద్ధం తర్వాత భారత సైనికులకు ఆయుధాలు అప్పగిస్తున్న పాకిస్తాన్ సైన్యం

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ విముక్తి:1971 యుద్ధం తర్వాత భారత సైనికులకు ఆయుధాలు అప్పగిస్తున్న పాకిస్తాన్ సైన్యం

ఫతేగఢ్ నుంచి పరారీ

తారిక్ పర్వేజ్‌ తో కలిసి తప్పించుకున్న ఆర్మీ అధికారి కెప్టెన్ నూర్ అహ్మద్ ఖైమ్ ఖానీ, 'హికాయత్' మ్యాగజైన్ ఎడిటర్ ఇనాయతుల్లాతో కలిసి నాటి తన పరారీకి సంబంధించిన పూర్తి కథనాన్ని ''ఫతేఘర్ నుంచి పరారీ వరకు" అనే పుస్తకంలో రాశారు.

భారత సైనికులు చెకింగ్‌కు వచ్చినప్పుడు బందీలలో కొందరు బాత్రూంలో దుస్తులు మార్చుకోవడానికి వెళ్లేవారని అహ్మద్ ఖైమ్ ఖానీ చెప్పారు. సొరంగం తవ్వుతున్న బాత్‌రూమ్‌లోంచి మాత్రం ఎవరూ బయటకు వచ్చేవారు కాదు. అందులో ఎవరో ఒకరు స్నానం చేస్తూనే ఉండేవారు.

1972 సెప్టెంబరు 16 నాటికి, సొరంగం క్యాంపు లిమిట్స్ నుంచి బయటి వరకు వెళ్లిందని కెప్టెన్ నూర్ ఖైమ్ ఖానీ రాశారు. మేజర్ నాదిర్ పర్వేజ్, తారిక్ పర్వేజ్, కెప్టెన్ నూర్ సహా ఐదుగురు అధికారులు, సెప్టెంబర్ 17న, రాత్రి పూట ఖైదీలను లెక్కించే సమయం ముగిసిన తర్వాత సొరంగం దగ్గరకు వెళ్లారు. సైన్యం దుస్తుల్లోనే పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నారు.

ఆ రాత్రి, మేజర్ నాదిర్ పర్వేజ్, మేజర్ తారిక్ పర్వేజ్, కెప్టెన్ నూర్ ఖైమ్‌ ఖానీ బయలుదేరారు. కొన్ని గంటల తర్వాత, కెప్టెన్ జాఫర్ హసన్ గుల్, లెఫ్టినెంట్ యాసిన్ శిబిరాన్ని దాటి బయటకు వచ్చారు. ఒకవేళ కాల్పులు జరిగితే ఆర్మీ యూనిఫారంలోనే చనిపోవాలన్నది ఈ నిర్ణయానికి కారణమని చెప్పారు.

"పరారీ నిర్ణయం చాలా కష్టమైన దశ. ఏదో ఒక రోజు పాకిస్తానీ యుద్ధ ఖైదీలు స్వదేశానికి తిరిగి వస్తారని అందరికీ తెలుసు. కానీ, పరారీ ప్రయత్నంలో దొరికిపోతే కాల్చివేతకు గురి కావచ్చు. అందుకే ఐదుగురు అధికారులం తప్ప ఎవరూ రిస్క్ తీసుకోలేదు" అన్నారు తారిక్.

తప్పించుకున్న సైనికుల్లో మొదటి ముగ్గురు (మేజర్ తారిక్, మేజర్ నాదిర్, కెప్టెన్ నూర్ అహ్మద్ ఖైమ్ ఖానీ) బయటకు వచ్చి, దుస్తులు మార్చుకుని, గడ్డం గీసుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో భారతీయ వార్తా పత్రికలలో ఫొటోలు ఎటూ వస్తాయి కాబట్టి, గుర్తుపట్టకుండా జాగ్రత్తపడ్డారు.

పాకిస్తానీ సైనికులు తప్పించుకున్నారనే వార్త భారతీయ వార్తాపత్రికలలో రాగానే.. ఇండియా వైపు నుంచి సరిహద్దులు, నియంత్రణ రేఖను దాటడానికి ప్రయత్నించే వారిపై కాల్పులు జరపవద్దని పాకిస్తాన్‌ తన సైనికులకు ఆదేశాలు పంపించింది.

అయితే, పరారీలో ఉన్న అధికారులు మందుపాతరల కారణంగా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లడం మంచిది కాదని.. సముద్ర మార్గం లేదా నేపాల్‌‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చేరుకుని స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు.

''మా దగ్గర డబ్బులు అయిపోయాయి. ఇండియాలో కొన్ని ముస్లిం కుటుంబాలను సంప్రదించాలని నిర్ణయించుకున్నాం. కొంతమందిని కలిసినా ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు'' అని తారిక్ వెల్లడించారు.

చివరికి, వారు ముగ్గురూ లక్నోకు టిక్కెట్లు ఇప్పించిన జమాతే ఇస్లామ్-ఇ-హింద్ సభ్యుడిని సంప్రదించారు. జమాతే ఇస్లామ్-ఇ-హింద్ సభ్యుడి కుటుంబానికి చెందిన ఒక పెద్దాయన ఈ ముగ్గురూ భారతదేశం నుంచి నేపాల్ సరిహద్దు దాటడానికి సహాయం చేశారు. 1972 సెప్టెంబర్ 30న వీరు నేపాల్‌‌లో ప్రవేశించారు.

ఇక్కడి నుంచి 70 మైళ్ల దూరం నడిచి నేపాల్ సరిహద్దు ప్రాంతమైన భేర్వా చేరుకుని, అక్కడి ముస్లిం గ్రామంలోని ఒక మసీదులో బస చేశారు. అక్కడి నుంచి విమానం టికెట్‌ కొనుక్కుని నాదిర్‌ పర్వేజ్‌ కాఠ్‌మాండూ వెళ్లారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చేరుకుని మిగతా ఇద్దరు అధికారులకు టిక్కెట్లు పంపించారు.

ఈ ముగ్గురూ అక్టోబర్ 11న పీఐఏ విమానంలో కరాచీకి చేరుకున్నారు. ''విమానం నుంచి దిగగానే మళ్లీ భూమి పైకి వచ్చానంటూ సాష్టాంగ నమస్కారం చేసిన క్షణాలు బాగా గుర్తు. మా అమ్మ నన్ను పదేపదే హత్తుకున్నారు'' అన్నారు పర్వేజ్.

అందరు ఖైదీలు అదృష్టవంతులు కాదు.

ఐదుగురు అధికారులు తప్పించుకోగలిగారు. కానీ, పట్టుబడిన వేలాదిమంది పాకిస్తాన్ సైనికులు, పౌర సాయుధ దళాల అధికారులకు ఆ అదృష్టం దక్కలేదు. చాలామంది యుద్ధ ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఫలించలేదు.

భారతదేశంలోని యుద్ధ ఖైదీల శిబిరాల్లో శిక్షను అనుభవించిన సైనికాధికారులలో మేజర్ (రిటైర్డ్) సాబీర్ హుస్సేన్, మేజర్ (రిటైర్డ్) నయీమ్ అహ్మద్ కూడా ఉన్నారు.

'' 1965 నాటి యుద్ధంలో కూడా నేను పోరాడాను, అది వ్యవస్థీకృత యుద్ధం. కానీ, 1971 యుద్ధంలో అలాంటిదేమీ లేదు. తూర్పు పాకిస్తాన్‌కు చేరుకున్న తర్వాత మాకు దారి తెలియలేదు. సహచరులను కూడా నమ్మే పరిస్థతి లేదు'' అని మేజర్ సాబీర్ చెప్పారు.

"మా సొంత బెంగాలీ సైనికులు తిరుగుబాటుదారులుగా మారారు. మమ్మల్ని అన్నివైపుల నుంచి శత్రువులు చుట్టుముట్టారు. తూర్పు పాకిస్తాన్ ప్రజలు, అధికారులు, అక్కడ ఉన్న సైనికులు కూడా మాకు శత్రువులే. మాకు దారి చూపించే గైడ్‌లను కూడా నమ్మలేకపోయాం'' అన్నారు మేజర్ సాబీర్.

మేజర్ సాబిర్
ఫొటో క్యాప్షన్, మేజర్ సాబిర్

'భారత అధికారి తిట్టడం అవమానకరంగా ఉంది'

జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ తూర్పు పాకిస్తాన్‌లో భారత సైన్యానికి చెందిన జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా ఎదుట లొంగిపోయారని తెలిసి తాను నమ్మలేకపోయానని మేజర్ సాబీర్ అన్నారు. అప్పటికే తాను యుద్ధ ఖైదీగా మారిపోయానని సాబీర్ గుర్తు చేసుకున్నారు.

"మేం కలకత్తా నుంచి బిహార్‌‌కి బోటులో వచ్చాం. ఎక్కడికి వెళ్లాలో, వెళ్తే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అక్కడ నాలుగైదు రోజుల కిందట వండిన ఆహారం తినాల్సి వచ్చింది. రొట్టెలు కడుక్కుని, ఎండబెట్టుకుని తినడమే అప్పటి మా భోజనం" అన్నారాయన.

"భారత సైనికులు బాగానే ఉన్నారు, కానీ బెంగాలీ సైనికుల వైఖరి మాత్రం చాలా దారుణంగా ఉండేది. పాకిస్తాన్ సైనికులను తమ శత్రువులుగా భావించేవారు. సాధారణ పరిస్థితుల్లో సొంత అధికారి తిట్టినా బాధ కలుగుతుంది. కానీ భారతీయుడు తిడితే అది అవమానంగా భావించేవాళ్లం'' అని సాబీర్ అన్నారు.

అనారోగ్యంతో ఉన్న ఖైదీలను శిబిరం నుంచి తీసుకెళ్లడం ప్రారంభించినప్పుడు, తాను వెళ్లిపోవాలనే ఆలోచనకు వచ్చారు మేజర్ సాబీర్.

"ఏప్రిల్ 1974లో, మమ్మల్ని రాంచీకి ట్రక్కులో తీసుకెళ్ళారు. అక్కడి నుంచి విమానాలలో పాకిస్తాన్‌కు తిరిగి తీసుకువచ్చారు. పాకిస్తాన్‌ చేరుకున్న తర్వాత జరిగిన సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి'' అని సాబీర్ చెప్పారు. ఆ సమయంలో ఆయన ఆలోచనంతా తన కూతురు పైనే ఉంది.

"నేను యుద్ధానికి వెళ్లేటప్పుడు నా కూతురు వయసు 9 నెలలు. తిరిగి వచ్చేటప్పటికి దాదాపు మూడేళ్లు. నన్ను చూడగానే వచ్చి నా ఒడిలో కూర్చుంది. నేను తిరిగి వచ్చి నా కూతుర్ని కలవడం గొప్ప విషయం'' అని మేజర్ సాబీర్ అన్నారు.

" మేం మామూలు మనుషులు కావడానికి చాలా సమయం పట్టింది. శత్రువుల చెర నుంచి వచ్చామన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది. కొంతమంది మమ్మల్ని వెక్కిరించేవారు. కానీ తర్వాత అన్నింటికీ అలవాటుపడ్డాం'' అన్నారాయన.

బంగ్లాదేశ్ విముక్తిలో భారత నౌకాదళం కీలక పాత్ర పోషించింది.

ఫొటో సోర్స్, INDIAN NAVY

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ విముక్తిలో భారత నౌకాదళం కీలక పాత్ర పోషించింది.

"మా వరకు 1971 యుద్ధం ఎప్పుడూ ముగియలేదు."

మేజర్ సాబీర్ హుస్సేన్ వంటి వేలాదిమంది సైనికులు కాలక్రమేణా మామూలు జీవితంలోకి వచ్చారు. కానీ, చాలామంది సైనికుల కోసం వారి కుటుంబాలు అనేక దశాబ్దాలపాటు యుద్ధం చేయాల్సి వచ్చింది. వారిలో మేజర్ నయీమ్ అహ్మద్ ఒకరు

మేజర్ నయీమ్ అహ్మద్ కూతురు సానియా అహ్మద్ బీబీసీతో తన తండ్రి కథ వివరించారు. 1971 యుద్ధం తనకు, తన సోదరులకు ఎప్పటికీ ముగియలేదని ఆమె అన్నారు.

తన తాత, నాన్నమ్మలకు తన తండ్రి ఒక్కరే కొడుకుని.. యుద్ధం చేసే విభాగంలో పని చేయకూడదన్న షరతుతో సైన్యంలో చేరడానికి తన తాత, నాన్నమ్మలు అనుమతించారని సానియా వెల్లడించారు. తూర్పు పాకిస్తాన్‌కు చేరుకున్న తర్వాత, మేజర్ నయీమ్ అహ్మద్‌కు సైనికులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించే పనిని అప్పగించారు.

యుద్ధంలో పాకిస్తాన్ లొంగిపోయినట్లు తెలియగానే, తన దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రిని ధ్వంస చేయాలని తన తండ్రికి ఆదేశాలు వెళ్లాయని సానియా చెప్పారు. మందుగుండు సామగ్రిని ధ్వంసం చేసే ప్రదేశం 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో నయీమ్ అక్కడికి బయలుదేరారు. అయితే, దారి తప్పి వేరే దిక్కుకు వెళ్లిపోయారు.

"మేం చేరుకుంది సరైన స్థలం కాదని అర్థమైంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. భారత సైనికులు దాడి చేశారు" అని తన తండ్రి చెప్పినట్లు సానియా వెల్లడించారు.

మూడు గంటలపాటు కాల్పులు జరిగాయి. ఈ దాడిలో సానియా తండ్రి మేజర్ నయీమ్ మోర్టార్ షెల్ దాడిలో గాయపడి ఒక కన్ను కోల్పోయారు. ముఖంపై గాయాల కారణంగా తన తండ్రిని ఎవరూ గుర్తించ లేకపోయారని, ఆయన్ను మిస్సింగ్ జాబితాలో చేర్చడంతో, చనిపోయాడనుకుని పాకిస్తాన్‌లో తమ కుటుంబానికి చాలామంది సంతాపం తెలిపారని సానియా చెప్పారు.

ఓ ఆసుపత్రిలో నయీమ్ చికిత్స పొందుతుండగా, ఆయన స్నేహితుడొకరు గుర్తించారు. కోలుకున్న తర్వాత యుద్ధఖైదీగా ఆయన్ను రాంచీ జైలుకు పంపారు.

''మా నాన్న జైలుకు వచ్చినప్పుడు, ఆయనకు దుస్తులు కూడా లేవు. ఆయనే స్వయంగా సూదీదారం తెప్పించుకుని దుస్తులు తయారు చేసుకున్నారు. ఆయన్ను అధికారులు, సైనికులను ఉంచే జైలులో ఉంచినందుకు చాలా గర్వపడేవారు'' అని సానియా వెల్లడించారు.

యుద్ధం చేసే దళంలో భాగం కానప్పటికీ మేజర్ నయీమ్ భారత సైనికులతో యుద్ధం చేశారు.
ఫొటో క్యాప్షన్, యుద్ధం చేసే దళంలో భాగం కానప్పటికీ మేజర్ నయీమ్ భారత సైనికులతో యుద్ధం చేశారు.

'నాన్నకు మూర్ఛలు మొదలయ్యాయి'

మేజర్ నయీమ్ అహ్మద్ 1974లో భారతదేశం నుంచి తిరిగి పాకిస్తాన్ వచ్చారని, వచ్చేటప్పటికి ఆరోగ్యంగానే ఉన్నారని కుమార్తె సానియా అహ్మద్ చెప్పారు.

''పెళ్లి చేసుకున్నారు. పిల్లల్నికన్నారు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవారు. కానీ 1984లో ఆయన ఆరోగ్యంలో మార్పులు రావడం మొదలైంది. జ్ఞాపకశక్తి తగ్గడమే కాకుండా మూర్ఛ కూడా మొదలైంది. దీన్ని ఆయన ఆఫీసు వాళ్లు కూడా గుర్తించారు. ఆరు నెలలు మెంటల్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది'' అని సానియా గుర్తు చేసుకున్నారు.

''నాన్న ఒకసారి మమ్మల్ని ఎయిర్ షోకి తీసుకెళ్లారు. డ్రైవింగ్ చేస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగారు. మాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కానీ, ఆయన నోటి నుంచి మాటలు రావడం లేదు. ఆయన ఇక మాట్లాడలేరని తర్వాత మాకు అర్థమైంది'' అన్నారు సానియా.

20 ఏళ్లపాటు మెదడులో శకలాలు

మేజర్ నయీమ్‌కు మాట్లాడే, నడిచే శక్తి తగ్గడం మొదలైంది. 1989లో మేజర్ నయీయ్‌ ఇకపై యూనిఫాం ధరించరాదని సైన్యం తేల్చి చెప్పింది. అప్పటికే తీవ్రమైన శారీరక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న ఆయన యూనిఫాం ధరించలేనన్న బాధతో మరింత బాధపడ్డారు. రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

"ఆయన చివరిసారిగా యూనిఫాం ధరించిన రోజు, ప్రత్యేకంగా కనిపించారు. ఆ క్షణాలు గుర్తుండిపోయేలా ఆర్మీ దుస్తులతో పిల్లలతో ఫొటోలు దిగారు"అని సానియా ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

పదవీ విరమణ తర్వాత మేజర్ నయీమ్ ఆర్మీ సంక్షేమ సంస్థలో పనిచేయడం ప్రారంభించారు. కానీ, చాలాకాలం మూర్ఛవ్యాధితో బాధపడ్డారు. ఓసారి వైద్యులు సీటీ స్కాన్‌ చేయగా ఆశ్చర్యకరమైన విషయం బైటపడింది. 1971లో ఆయనకు తగిలిన మోర్టార్ షెల్ తాలూకు వందల శకలాలు మెదడులోనే ఉన్నాయి. దాదాపు 22, 23 సంవత్సరాల తర్వాత మొదటిసారి అవి కనిపించాయి.

ఆయన ఆరోగ్య సమస్యలన్నింటికీ కారణమేంటో ఆయన కుటుంబ సభ్యులకు అప్పుడు అర్థమైంది. అనేక రకాల చికిత్సలు తీసుకున్న తర్వాత 2000 సంవత్సరంలో మేజర్ (రిటైర్డ్ ) నయీం అహ్మద్ మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)