ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? దీనిని భారత ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?

ఫొటో సోర్స్, Reuters
అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఇంటర్నెట్ కంపెనీ స్టార్‌లింక్ సర్వీసులను కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిలిపేసింది.
ఎలాన్ మస్క్ కంపెనీ 'స్పేస్ ఎక్స్'లో స్టార్‌లింక్ ఒక భాగం. ఇది 'లో ఎర్త్ ఆర్బిట్' ద్వారా ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తుంది.
భారత్‌లో ఇంటర్నెట్ సర్వీసులు బుక్ చేయడం, ఇతర సేవలు అందించకుండా స్టార్‌లింక్‌ను నిషేధించాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసిందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
భారత్‌లో ఐదువేల కంటే ఎక్కువ మందే తమ సర్వీసులను ఉపయోగించుకునేందుకు సిద్ధపడ్డారని, వాళ్లు అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నారని స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్ సంజయ్ భార్గవ సోషల్ మీడియాలో ఇదివరకు వెల్లడించారు.
భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అందించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
2022 డిసెంబర్ నాటికి రెండు లక్షల డిష్ టెర్మినళ్ల ద్వారా ఇండియాలో బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని స్టార్‌లింక్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు అందించడానికి స్పేస్ ఎక్స్ ఇప్పటి వరకు 1700 శాటిలైట్లను స్పేస్‌లోకి పంపింది. నిజానికి ఇలాంటి పది లక్షల శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించాలని స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
స్టార్‌లింక్ సేవలను కేంద్రం ఎందుకు ఆపేసింది?
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు స్టార్‌లింక్ ఇంకా లైసెన్స్ తీసుకోలేదు. అందుకే స్టార్‌లింక్ సేవలను కేంద్రం అడ్డుకుంది. లైసెన్స్ లేకుండా భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెస్ సర్వీసులు అందించడానికి వీలు లేదు.
కానీ ఈ కంపెనీ మాత్రం లైసెన్స్ తీసుకోకుండానే బుకింగ్స్ ప్రారంభించింది. ప్రకటనలు కూడా ఇస్తోంది. దాంతో చాలా మంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఐదు వేల మంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారని స్టార్‌లింక్ ఇండియా హెడ్ కూడా చెప్పారు.
భారతీయ యూజర్లు తమ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ సర్వీసులను బుక్ చేసుకోవచ్చని స్టార్‌లింక్ వెబ్‌సైట్ కూడా పేర్కొందని కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల విభాగం తెలిపింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించి, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులను బుక్ చేసుకోకుండా నిషేధం విధించింది. ఆ కంపెనీ ప్రకటనలను అడ్డుకుంది.
"భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్‌లింక్ సంస్థ లైసెన్స్ తీసుకోలేదు. ఈ సర్వీసులను ప్రజలు బుక్ చేసుకోవద్దు. లైసెన్స్ తీసుకోకుండానే భారత్‌లో సేవలు అందించడానికి ఎలాన్ మస్క్ కంపెనీ ప్రకటనలు ఇస్తోంది. నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆ కంపెనీకి విజ్ఞప్తి చేసింది. అవసరమైన లైసెన్స్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది. ఈ కంపెనీ ఈ నెలలో భారత్‌లో రిజిస్టర్ చేసుకున్నప్పటికీ అది సరిపోదు" అని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్ర టెలి కమ్యూనికేషన్స్ విభాగం పేర్కొంది.
చట్టప్రకారం అవసరమైన నిబంధనలు పాటించాలని స్టార్‌లింక్ కంపెనీకి కేంద్ర టెలికమ్యూనికేషన్ల విభాగం సూచించింది. అలాగే, శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల బుకింగ్ తక్షణం ఆపేయాలని చెప్పింది.

ఫొటో సోర్స్, NASA
'లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ఇంటర్నెట్' సర్వీస్ అంటే ఏమిటి?
ఇంటర్నెట్‌ను అందించడానికి ఈ కంపెనీ 'లో ఎర్త్ ఆర్బిట్' శాటిలైట్లను ఉపయోగించుకుంటుంది. ఈ ఉపగ్రహాలు 550 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి. కేవలం 90 నిమిషాల్లోనే ఒక రౌండ్ పూర్తి చేస్తాయి.
వినియోగదారుల దగ్గర డీటీహెచ్‌లాంటి ఒక చిన్న డిష్ యాంటెన్నా ఉంటుంది. శాటిలైట్ పంపించే సిగ్నల్‌ను ఈ యాంటెన్నా గ్రహిస్తుంది.
అంటే ఎలాంటి వైర్లు, ఫైబర్ లేకుండానే ఇంటర్నెట్ ప్రొవైడర్ శాటిలైట్ లింక్స్ ద్వారా వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలను అందించొచ్చు.
ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ బీటా టెస్టింగ్ జరుగుతోంది. అంటే ఈ టెక్నాలజీని పరీక్షిస్తున్నారు.
శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా డౌన్‌లోడ్ స్పీడ్ ప్రస్తుతం 150-200 Mbps వస్తోందని ఈ సేవలను వాడుతున్న వినియోగదారులు చెబుతున్నారు. అప్‌లోడ్ స్పీడ్ 10-20 Mbps ఉందని అంటున్నారు.
అయితే స్టార్‌లింక్ తన ఇంటర్నెట్ గరిష్ట వేగాన్ని 300 Mbpsకు పెంచుతుందని 2021 ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, ALAN WOODWARD/BBC
ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించాలనుకుంటున్న కొద్ది కంపెనీల్లో స్టార్‌లింక్ ఒకటి. కొన్ని ఇతర సంస్థలు, కొన్ని ప్రభుత్వాలు కూడా ఇందులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెజాన్, కెనడాకు చెందిన టెలిశాట్, వన్‌వెబ్ వంటి సంస్థలతో పాటు యురోపియన్ యూనియన్, చైనా దేశాలు కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
భారత్‌లో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికామ్ సంస్థలతో స్టార్‌లింక్ పోటీపడబోతోంది.
అలాగే ఈ కంపెనీ వన్‌వెబ్‌తో నేరుగా పోటీపడబోతోంది. వన్‌వెబ్ అనేది శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కోసం భారతీ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్. ఎయిర్‌బస్, భారతీ ఎంటర్‌ప్ర్రైజెస్, భారతీ టెలికామ్ కలిసి ఈ జాయింట్ వెంచర్ ప్రారంభించాయి.
ప్రాజెక్ట్ కైపర్‌లో భాగంగా 3236 శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించాలని అమెజాన్ అనుకుంటోంది. అదే సమయంలో కెనడాకు చెందిన టెలీశాట్ కంపెనీ మరో 298 ఉపగ్రహాలను స్పేస్‌లోకి పంపించడానికి ప్రణాళికలు వేస్తోంది. అలాగే భారీ స్థాయిలో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు యురోపియన్ యూనియన్ కూడా సన్నాహాలు చేస్తోంది. చైనా కూడా తన ప్రణాళికలను వెల్లడించింది.
వన్‌వెబ్ శాటిలైట్లు ఇదివరకే స్పేస్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు 288 ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. వన్‌వెబ్ ప్రధానంగా ప్రభుత్వం, వ్యాపార సంస్థలకు ఇంటర్నెట్ సేవలు అందించాలని భావిస్తోంది.
బ్రిటిష్ టెలికామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇంటర్నెట్ సేవలు అందించే అవకాశం కూడా ఉంది. ఇందులో పోర్టబుల్ '5జీ సెల్స్' కూడా ఉన్నాయి.
ప్రజలకు అవసరమైనప్పుడు వీటిని అద్దెకు తీసుకోవచ్చు. మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్లు కూడా ఇకపై శాటిలైట్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను పొందొచ్చు.
శాటిలైట్ ఇంటర్నెట్ నాణ్యత ఎలా ఉండొచ్చు?
వినియోగదారులకు ఎంత నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు లభిస్తాయన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది.
చుట్టుపక్కల ఎన్ని డిష్‌లు ఉన్నాయన్నది మొదటి అంశం. ఒకే సమయంలో ఒక ఏరియాలో ఉన్న అందరికీ ఇంటర్నెట్ గరిష్ఠ వేగంగా రాకపోవచ్చు. చుట్టుపక్కల ఉన్న యూజర్ల సంఖ్య పెరిగితే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాంతంలో టాప్ స్పీడ్ ఇంటర్నెట్ అందివ్వడంలో ఈ వ్యవస్థ సామార్థ్యం పరిమితంగానే ఉంటుంది. అందుకే కవరేజ్ చేసే ఏరియాలో సబ్‌స్క్రైబర్ల సంఖ్యపై పరిమితి విధించింది స్టార్‌లింక్.
ఉపగ్రహ వ్యవస్థలో పెరుగుతున్న జోక్యంపై దాని నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. అది డ్రాపవుట్‌కు కారణం కావొచ్చు.
అప్పుడప్పుడు స్పీడ్‌గా వచ్చే ఇంటర్నెట్ కన్నా.. స్లోగా ఉన్నప్పటికీ స్థిరంగా ఉండే ఇంటర్నెట్టే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీడియో కాన్ఫరెన్సు లాంటి ఇంటరాక్టివ్ అప్లికేషన్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంటర్నెట్ రావడం చాలా అవసరం.
ఇవి కూడా చదవండి:
- ‘కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
- చెక్క, గడ్డి, గంజాయితో 1941లోనే కారు తయారీ.. దీన్ని ఫోర్డ్ సంస్థ ఎందుకు ధ్వంసం చేసింది?
- లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది, భాగస్వాముల్ని మోసం చేస్తున్నాయి, ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి
- క్రిప్టోకరెన్సీలో 70 లక్షలు నష్టపోయి ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు...’
- కొందరు వందేళ్లకు పైగా జీవించడానికి కారణమేంటి... ఏమిటీ మిస్టరీ?
- రూ. 7 కోట్ల లాటరీ తగిలితే ఇన్ని కష్టాలా?
- బీజింగ్ ఎయిర్పోర్ట్ ఫొటోను నోయిడా ఎయిర్పోర్ట్ అంటూ కేంద్ర మంత్రులు ఎందుకు పోస్ట్ చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















