జై భీమ్: హిందీ మాట్లాడిన వ్యక్తిని కొట్టిన ప్రకాశ్ రాజ్... ఏమిటీ వివాదం? ఇంతకీ ఆయన ఏమన్నారు -ప్రెస్ రివ్యూ

ప్రకాశ్ రాజ్

ఫొటో సోర్స్, facebook/prakashraj

ఇటీవల విడుదలైన 'జై భీమ్‌' చిత్రంలోని ఓ సన్నివేశంపై వివాదం చోటుచేసుకుందని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘హిందీ మాట్లాడుతున్న వ్యక్తిని ప్రకాష్‌రాజ్‌ చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఇప్పుడు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. 'ఇది హిందీ భాషని అవమానించడమే' అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

దీనిపై ప్రకాష్‌ రాజ్‌ స్పందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''ఈ సినిమాలో అణగారిన వర్గాల బాధని చెప్పాం. వాళ్ల కష్టాల్ని చూపించాం. కానీ, కొంతమంది ఈ సినిమాలోని చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు" అని ప్రకాశ్ రాజ్ స్పందించారు.

అంతేకాదు, "నేనున్నాననే కావాలని ఈ సినిమాని వివాదంలో లాగారు. ఇటువంటి వివాదాలకు స్పందించడంలో ఎలాంటి అర్థం లేదు'' అని కూడా ఆయన బదులిచ్చారని ఆ కథనంలో తెలిపారు.

మద్యం దుకాణం

ఫొటో సోర్స్, Getty Images

మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు

తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలుచేస్తూ నూతన మద్యం విధానాన్ని ప్రకటించిందని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.

‘‘దుకాణాల కేటాయింపులో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్‌ను కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రంలో 2021-23 సంవత్సరాలకు గాను నూతన మద్యం పాలసీ విధివిధానాలను ఖరారు చేసింది.

దీనిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు ఖరారుచేశారు.

ఏయే దుకాణాలు ఏ రిజర్వేషన్‌లోకి వస్తాయన్నది నిర్ణయించిన తరువాత దరఖాస్తు గడువును ఎక్సైజ్‌ కమిషనర్‌ నిర్ణయిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

లైసెన్సు ఫీజును యథాతథంగా కొనసాగించిన ప్రభుత్వం, ఈ సారి నుంచి దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు తెలిపింది.

ఏ4 లిక్కర్‌ షాప్‌ (వైన్స్‌)లకు దరఖాస్తు ఫీజు, కాలపరిమితి, ఇతర నిబంధనలను మద్యం పాలసీలో ఖరారు చేసింది. మద్యం దుకాణాల లైసెన్సు కోసం దరఖాస్తు ఫీజును గతంలో ఉన్నట్టుగానే రూ.2 లక్షలుగా నిర్ణయించారు. గతంలో మాదిరిగానే జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలోనే దుకాణాలను కేటాయించనున్నారు.

జీహెచ్‌ఎంసీ వెలుపల ఐదు కిలోమీటర్ల వరకు కూడా నగరంలో వసూలు చేసే ఎక్సైజ్‌ పన్నే వర్తిస్తుందని నిబంధనల్లో పేర్కొన్నారు.

అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా వాటి పరిధికి వెలుపల రెండు కిలోమీటర్ల వరకు అదే ఫీజు వర్తిస్తుందని స్పష్టంచేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి11 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు తెరిచి ఉంటాయని నూతన పాలసీలో పేర్కొన్నారు.

2011 జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు ఎక్సైజ్‌ వార్షిక పన్నును నిర్ణయించార’’ని ఆ కథనంలో వివరించారు.

గంజాయి ధ్వంసం చేస్తున్న ఏపీ పోలీసులు

ఫొటో సోర్స్, AP Police

ఏవోబీలో 'ఆపరేషన్‌ పరివర్తన్‌'

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగుపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ‘సాక్షి’ కథనం రాసింది.

‘‘కేరళ, మహరాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో ఏవోబీలో యథేచ్ఛగా నడుస్తున్న గంజాయి సాగును నామరూపాల్లేకుండా తుదముట్టించేందుకు ప్రత్యేక బృందాలను యాక్షన్‌లోకి దించింది.

ఎట్టిపరిస్థితుల్లోనూ గంజాయి దందాను కట్టడి చేయాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పోలీసు శాఖ 'ఆపరేషన్‌ పరివర్తన్‌'ను చేపట్టింది.

ఈ తరహా ఆపరేషన్‌ను దేశంలో తొలిసారిగా ఏపీలో అమలు చేస్తున్నారు.

గంజాయి దుష్పరిణామాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తూ..టెక్నాలజీ సాయం, భారీ స్థాయిలో బలగాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ద్విముఖ వ్యూహంతో విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది.

రంగంలోకి దిగిన బృందాలు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను ఆనుకుని ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో ›5 రోజులుగా భారీగా గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నాయి.

అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్‌ఈబీ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతోంద’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

jagan

ఫొటో సోర్స్, facebook/ysjagan

ఇక రూ. 2,155 కోట్లే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు రూ. 31,751 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించిందని 'ఈనాడు' కథనం తెలిపింది.

''డిసెంబరు నెలాఖరు వరకు రూ. 2,155 కోట్లే సెక్యూరిటీల వేలం ద్వారా రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది. అందులోనూ మరో రూ. వెయ్యి కోట్ల రుణానికి ఆర్థిక శాఖ రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు పంపించింది.

వచ్చే మంగళవారం వేలంలో పాల్గొని వేర్వేరు కాలపరిమితుల్లో తీర్చేలా చెరో రూ. 500 కోట్ల రుణం సమీకరిస్తోంది.

ఇది పూర్తయితే డిసెంబరు నెలాఖరు వరకు మిగిలేది రూ. 1155 కోట్లే.

ఇంకా నవంబరు, డిసెంబరు గడవాలి. కొన్నాళ్లుగా నెలకు రూ. 5,000 కోట్ల రుణం తీసుకుంటేనే రాష్ట్రం అవసరాలు సర్దుబాటు అవుతున్నాయి. గత ఏడు నెలలు ఇలాగే తీసుకున్నారు. మరోవైపు అనేక బిల్లులు పెండింగులో ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, ఖర్జూర కల్లు: చెట్టు మీంచి కుండ దించక ముందే అడ్వాన్సులు ఇస్తున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)