భూతవైద్యం పేరుతో మహిళపై అత్యాచార యత్నం, హత్య.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్థులు - ప్రెస్ రివ్యూ

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఒక మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపారని ఈనాడు కథనం ప్రచురించింది.

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను అత్యాచారం చేయబోయి, ఆమె ప్రతిఘటించడంతో కాళ్లు, చేతులు కట్టేసి గొడ్డలితో నరికి చంపాడో భూతవైద్యుడు.

విషయం తెలిసిన గ్రామస్థులు అతడిని కర్రలతో కొట్టి చంపారు. అతన్ని కాపాడబోయి జరుగుమల్లి ఎస్సై రజియా సుల్తానా బేగం గాయపడ్డారు.

కామేపల్లికి చెందిన ఒక మహిళ(42) వ్యవసాయ పనుల కోసం కూలీలను పిలిచేందుకు ఆదివారం రాత్రి వుడ్డెపాలెం వెళ్లారు.

సోమవారం ఉదయం కూలీలను పిలుస్తుండగా అదే కాలనీకి చెందిన వల్లెపు ఓబయ్య(51) ఆమెను పలకరించాడు. మోకాళ్ల నొప్పులకు మందులిస్తాను రమ్మంటూ ఇంటికి పిలిచాడని పత్రిక రాసింది.

నమ్మి వెళ్లిన ఆ మహిళను బలాత్కరించేందుకు ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేసింది. దాంతో ఓబయ్య ఆమె కాళ్లు, చేతులు కట్టేసి గొడ్డలితో నరికి చంపాడు. తర్వాత ఈ విషయాన్ని తన కుటుంబీకులకు చెప్పాడు.

వారు వెంటనే జరుగుమల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రజియా సుల్తానా బేగం సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

నిందితుడు ఓబయ్యను తమ వాహనంలో స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్థులు పోలీసు వాహనంలో ఉన్న ఓబయ్యను బయటకు లాగి కర్రలతో కొట్టారు.

అడ్డుకోబోయిన ఎస్సైమీదా దాడి చేశారు. స్థానికుల దాడిలో ఓబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కామేపల్లిలో ఉద్రిక్తత నెలకొనడంతో.. పోలీసులు పెద్దఎత్తున మోహరించారని ఈనాడు వివరించింది.

స్పైస్ జెట్ విమానాలు

ఫొటో సోర్స్, AFP

దిల్లీ-తిరుపతి మధ్య నాన్ స్టాప్ విమాన సేవలు

దిల్లీ-తిరుపతి మధ్య స్పైస్ జెట్ నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసును ప్రారంభించిందని ఆంధ్రజ్యోతి వార్తా కథనం ప్రచురించింది.

ఆదివారం దిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ఈ విమాన సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు.

దేశ రాజధాని నుంచి తిరుపతికి నాన్‌ స్టాప్‌ సర్వీసును ప్రారంభించటం ఇదే తొలిసారని స్పైస్‌జెట్‌ పేర్కొంది.

వారంలో (బుధ,శుక్ర,ఆదివారాలు) మూడు రోజుల పాటు ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

కాగా ఈ నెల 31 నుంచి సోమవారం కూడా ఈ సర్వీసు అందుబాటులో ఉండనుందని వెల్లడించింది.

ఈ మార్గంలో బోయింగ్‌ 737 విమానాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపింది. కాగా స్పైస్‌జెట్‌ ఇప్పటికే హైదరాబాద్‌, పుణె నుంచి తిరుపతికి విమానాలను నడుపుతోందని ఆంధ్రజ్యోతి వివరించింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, FB/TRS Party

టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరు ప్రతిపాదన

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైందని, పార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రతిపాదించారని నమస్తే తెలంగాణ దిన పత్రిక కథనం ప్రచురించింది.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రొఫెసర్‌ ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నికల పర్యవేక్షకుడు పర్యాద కృష్ణమూర్తితో కలిసి ఉదయం 10 గంటలకు తెలంగాణభవన్‌లో షెడ్యూల్‌ విడుదల చేశారు.

ఆ వెంటనే నామినేషన్ల దాఖలు కోసం నేతలు క్యూ కట్టారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేరును ప్రతిపాదిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, నల్లగొండ జిల్లా నేతలు నామినేషన్లు వేశారు.

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈసారి కూడా సీఎం కేసీఆర్‌ పేరును హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రతిపాదించగా మంత్రులు దానిని బలపరిచారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి మంత్రుల బృందం నామినేషన్‌ పత్రాలను అందజేసిందని పత్రిక రాసింది.

పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు.. పార్టీ ఎంపీల తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు.

ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి పేరును బలపరిచారని నమస్తే తెలంగాణ వివరించింది.

అయోధ్య రామాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఆయోధ్య రాముడిని తాకనున్న సూర్య కిరణాలు

గర్భగుడిలోని శ్రీరాముడిపై సూర్య కిరణాలు ప్రసరించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అయోధ్య రామ మందిర నిర్మిస్తున్నామని తీర్థ క్షేత్ర ట్రస్ట్ చెప్పిందని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున సూర్య భగవానుని కిరణాలు అయోధ్య భవ్య రామమందిరం గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహంపై పడేలా నిర్మాణం చేపడతామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు కామేశ్వర్‌ చౌపల్‌ వెల్లడించారు.

ఒడిశా కోణార్క్‌లో సూర్యదేవాలయం నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపి ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారని పత్రిక చెప్పింది.

ఇందుకోసం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్, ఢిల్లీ, ముంబై, రూర్కీ ఐఐటీలకు చెందిన నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

రామాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందని ట్రస్ట్‌ అధికారి ఒకరు చెప్పారు. 2023 డిసెంబర్‌ కల్లా గర్భగుడి నిర్మాణం పూర్తి చేసుకుని, భక్తుల దర్శనానికి సిద్ధమవుతుందని అన్నారు.

ఇప్పటికే మొదటి దశ పునాది నిర్మాణం పూర్తయిందనీ, రెండో దశ నవంబర్‌ 15 నుంచి మొదలవుతుందని చెప్పారు. పిల్లర్ల నిర్మాణం ఏప్రిల్‌ 2022 నుంచి మొదలవుతుందన్నారని సాక్షి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)