జుట్టు పొట్టిగా కట్ చేసిన సెలూన్‌కు రూ.2 కోట్ల జరిమానా విధించిన కోర్టు

జుట్టు కట్ చేసిన సెలూన్

ఫొటో సోర్స్, Getty Images

ఒక మోడల్‌ జుట్టును పొట్టిగా కట్ చేసినందుకు రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని దిల్లీలోని వినియోగదారుల కోర్టు ఒక సెలూన్‌ను ఆదేశించింది.

పొడవాటి జుట్టు ఉండటంతో గతంలో ఆ మహిళకు హెయిర్ ప్రొడక్ట్ కంపెనీల నుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయని పేర్కొంది.

సెలూన్‌లోని సిబ్బంది ఆమె చెప్పినట్టు చేయకుండా, జుట్టు పొట్టిగా కత్తిరించేయడంతో ఆమెకు అవకాశాలు తగ్గి, భారీ నష్టం జరిగిందని కోర్టు గుర్తించింది.

ఈ సెలూన్.. దిల్లీలోని ఒక ప్రముఖ హోటల్ చెయిన్‌లో భాగంగా ఉంది. కోర్టు తీర్పుపై అపీల్ చేసుకునే అవకాశం ఆ సెలూన్‌కు కల్పించారు. దీనిపై సదరు సెలూన్ ఇంకా స్పందించాల్సి ఉంది.

"తనకు వస్తాయనుకున్న అవకాశాలు చేజారడంతో ఆమెకు భారీ నష్టం వచ్చింది. దాంతో ఆమె జీవనశైలి పూర్తిగా మారిపోయింది. టాప్ మోడల్ కావాలన్న ఆమె కలలు ఛిద్రం అయ్యాయి" అని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) చెప్పింది.

"సెలూన్ నిర్లక్ష్యం వల్ల ఆమె తీవ్ర మానసిక క్షోభకు గురైంది. జుట్టు పొట్టిగా కత్తిరించడంతో ఆమె తన ఉద్యోగంపై కూడా దృష్టి పెట్టలేక, చివరికి దాన్ని కూడా పోగొట్టుకుంది" అని కోర్టు పేర్కొంది.

వీడియో క్యాప్షన్, తెల్ల జుట్టును మళ్లీ నల్లగా ఇలా మార్చుకోవచ్చు

ఈ మోడల్ హెయిర్ కట్ కోసం 2018లో ఆ హోటల్‌కు వెళ్లారు. సెలూన్‌లో ఉన్న స్టాఫ్‌కు తన జుట్టు ఎలా కట్ చేయాలో నిర్దిష్ట సూచనలు కూడా ఇచ్చారు.

కానీ "అక్కడున్న ఒక హెయిర్ స్టైలిష్ట్ ఆమె జుట్టులో ఎక్కువ భాగం కత్తిరించేసింది. పైనుంచి భుజాలకు తగిలేలా కేవలం నాలుగు అంగుళాలే ఉంచింది" అని కోర్టు డాక్యుమెంట్స్‌లో చెప్పారు.

"దాంతో ఆమె అద్దంలో తన ముఖం కూడా చూసుకోలేకపోతున్నారు. ఆమె ఒక కమ్యూనికేషన్ ప్రొఫెషనల్. తరచూ సమావేశాల్లో, ఇంటరాక్టివ్ సెషన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు తన జుట్టు పొట్టిగా ఉండడంతో ఆమె తన ఆత్మవిశ్వాసం కోల్పోయింది" అని కోర్టు ఆదేశాల్లో పేర్కొన్నారు.

సెలూన్ మీద ఫిర్యాదు చేసినపుడు, జరిగిన తప్పును కప్పిపుచ్చుకోడానికి ఆ సెలూన్ ఆమెకు ఫ్రీ హెయిర్ ట్రీట్‌మెంట్ ఇస్తామని ఆఫర్ చేసింది. ఆ ట్రీట్‌మెంట్ మీద సందేహాలున్నాయని, దాని వల్ల తన జుట్టు మరింత దెబ్బతిందని మోడల్ కోర్టుకు చెప్పారు.

"పొట్టి హెయిర్ కట్‌తో మానసికంగా కుంగిపోయిన ఆమె తన ఆదాయం కూడా కోల్పోయారు. ఆ తర్వాత సెలూన్ ఆఫర్ చేసిన హెయిర్ ట్రీట్‌మెంట్‌ వల్ల మరింత నష్టం జరగడంతో తన ఉద్యోగం కూడా వదిలేశారు. ఈ ఘటన తర్వాత గత రెండేళ్లుగా ఆ బాధను అనుభవించారు" అని కోర్టు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)