పోలవరంలో ముంపు శాపం... 18,622 కుటుంబాలను ముంచేస్తున్నది ప్రవాహమా, ప్రభుత్వమా?

పోలవరం ప్రాజెక్టు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పోలవరం ప్రాజెక్ట్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

"నిరుడు చాలా కష్టాలు పడ్డాం. ఈసారి జూన్ నుంచే మాకు వరద ముప్పు మొదలైంది. దారులు మూసుకుపోతున్నాయి. ఊళ్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. పోనీ పరిహారం ఇచ్చేస్తే పోదామని చూస్తుంటే మీరు ఖాళీ చేయండి, ఆ తర్వాత మేం చూస్తామంటున్నారు’’ అంటూ ఆవేదన చెందారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితురాలు మాడే చినపోశమ్మ.

‘‘మా ఇల్లు, పొలం, చెట్టూ, పుట్టా తీసేసుకుంటే మేం ఇక్కడి నుంచి పోయి ఏం చేయాలి? ఏం తినాలి. ఎలా బతకాలి. ఇప్పటికే ఖాళీ చేసిన వెళ్లినవాళ్లను ఇంకా తిప్పుతున్నారు. అందుకే వరదొచ్చినా, వానొచ్చినా ఇక్కడే ఉంటాం. ఈసారి పెద్ద వరద వస్తుందని చెబుతున్నారు. అయినా మేం కదలం. ఇక్కడే కొండలపై ఇళ్లు కట్టుకుని ఉంటాం" అన్నారామె.

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మీదుగా గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించారు.

కాఫర్ డ్యామ్ పూర్తిగా మూసేశారు. దాంతో సాధారణ నీటి ప్రవాహానికే వరద తాకిడి మొదలైంది.

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరద ముప్పు తప్పదని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు.

దాంతో పోలవరం ముంపు గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పునరావాస ప్యాకేజీ చెల్లించాలని ముంపు ప్రాంత వాసులు పట్టుపడుతున్నారు.

దాంతో పోలవరం నీళ్లు గిరిజన ప్రాంత ఊళ్లను ముంచేస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయోనన్న ఆందోళన పెరుగుతోంది.

పోలవరం నిర్వాసితులు

పెరిగిన పరిహారపు ఖర్చు..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పునరావాసం చెల్లించాల్సిన బాధితుల సంఖ్య కూడా పెరిగింది.

దానికి తోడు 2013 భూసేకరణ చట్టంలో మారిన నిబంధనలు అమలులోకి రావడంతో చెల్లించాల్సిన పరిహారం కూడా పెరిగింది.

విపక్ష నేతగా ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ జగన్ ఇచ్చిన హామీలు కూడా పునరావాసం కోసం వెచ్చించాల్సిన వ్యయం మరింత పెరగడానికి కారణమయ్యాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్సార్ హయంలో శంకుస్థాపన జరిగిన నాటికి 2005-06లో బాధితుల సంఖ్య 44,500 మంది అని ప్రకటించారు. వారికి పరిహారంగా రూ. 8 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు.

కానీ ఆ తర్వాత 2011-12 నాటి లెక్కల ప్రకారం పరిహారం కోసం అర్హుల సంఖ్య 80 వేలకు చేరింది. ఆ సమయంలో 18 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హుల జాబితాలో లెక్కించడం, కొత్తగా వచ్చిన కుటుంబాలు కలుపుకొని నిర్వాసితుల సంఖ్య పెరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ పదేళ్ల కాలంలో వారి సంఖ్య లక్ష దాటిందని చెబుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు

ఫొటో సోర్స్, ANI

ప్రాజెక్టు కోసం 2005-06లో 95,700 ఎకరాలు భూసేకరణ చేయాలని లెక్కలు వేశారు. కానీ, 2017-18లో దానిని 1,55,465 ఎకరాలుగా సవరించారు.

దాంతో తొలి అంచనాల కన్నా 55,335 ఎకరాలు అదనంగా సేకరించాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది.

పోలవరం ముంపు ప్రాంతంలో ఫీల్డ్ సర్వే చేయడం వల్ల భూసేకరణ పెరిగిందని అధికారికంగా ప్రకటించారు. కానీ పోలవరం విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తర్వాత ముంపు ప్రాంతం ఎక్కువగా లెక్కిస్తున్నారన్నది నిర్వాసితుల వాదన.

నిర్వాసితుల సంఖ్య, సేకరించాల్సిన భూమి కూడా పెరగడంతో పునరావాసానికి వెచ్చించాల్సిన ఖర్చు పెరిగింది.

దాంతో తాజాగా ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం సుమారు రూ. 30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.

పోలవరం ప్రాజెక్టు

ఇప్పటి వరకూ ఇచ్చిందెంత?

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మొత్తం 371 ఆవాసాల‌కు చెందిన 1,05,601 కుటుంబాలు ప్రభావితం అవుతాయని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిర్ధరించింది. వాటిలో ఇప్ప‌టి వరకు 3,922 కుటుంబాల‌కు మాత్రమే పున‌రావాసం క‌ల్పించారు.

వారంతా ప్రస్తుతం స్పిల్ వే, కాఫర్ డ్యామ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో నివసించిన వారు.

పున‌రావాసం కోసం ఇప్ప‌టివరకు రూ. 6,371 కోట్లు ఖ‌ర్చుచేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మరో రూ.26,796 కోట్లు అవసరం అవుతాయని తాజాగా రూపొందించిన డీపీఆర్-2లో పేర్కొన్నారు. అంటే పునరావాసం పొందిన వారి సంఖ్య 4 శాతం లోపు ఉండగా, చేసిన వ్యయం కూడా దాదాపు 20 శాతమే.

ప్రస్తుతం 41.5 అడుగుల వద్ద పోలవరం ప్రాజెక్టు నీటిమట్టం లెక్కలేస్తున్నారు. దాని ప్రకారం 18,622 కుటుంబాలకు తక్షణమే పునరావాసం కల్పించాల్సి ఉంది. కానీ నేటికీ అందులో నాలుగో వంతు మందికే పునరావాస ప్యాకేజీ దక్కింది.

పోలవరం ప్రాజెక్టు

పరిహారం పంపిణీలో భారీ అక్రమాలు

పోలవరం పునరావాస ప్యాకేజీ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కొంత కాలంగా ఉన్నాయి. గతంలో కొందరు అధికారులపైనా అవినీతి ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు.

నేటికీ గిరిజనుల పేరుతో అధికార పార్టీకి చెందిన వారే అక్రమంగా పరిహారం కాజేస్తున్నారని విపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

పోలవరం నిర్వాసితులకు ఒక్కో కుటుంబానికి అదనంగా రూ. 10 లక్షల చొప్పున ఇస్తానని జగన్ ప్రకటించారు. ఎంతమందికి ఇచ్చారు? పేదవాళ్లంటే అంత అలుసా ? అని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు.

"డ్యామ్ సైట్‌లో నిర్వాసితులు ధర్నాలు చేశారు. అప్పట్లో మేం వాళ్లకు మానవతా దృక్పథంతో అదనంగా పరిహారం ఇచ్చాం. కానీ ప్రస్తుతం కొందరు పెద్దలే పరిహారం కాజేస్తున్నారు. ఇటీవల మహాలక్ష్మి, మారకం సావిత్రి అనే గిరిజన మహిళల అకౌంట్లలో కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి కొంతసేపటికి ఆ డబ్బులకు కాళ్లు వచ్చాయి. ఎలా జరిగింది. ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, అధికారులు .. ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లా యో తేల్చాలి. మునిగిపోతున్న గిరిజనులకు చెల్లించకుండా వివాదాల్లో ఉన్న భూములను కొందరి పేరుతో రికార్డులు సృష్టించి కాజేస్తున్నార"ని దేవినేని ఉమ గతంలో బీబీసీతో మాట్లాడిన సందర్భంలో ఆరోపించారు.

పోలవరం నిర్వాసితులు
ఫొటో క్యాప్షన్, పోలవరం నిర్వాసితులు

అన్నీ ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు కడతామన్నారు

"మా అందరికీ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే, ప్రాజెక్టు కడతామని అన్నారు. కానీ ఇప్పుడు మాకు ఏమీ ఇవ్వకుండానే ప్రాజెక్టు కట్టేస్తున్నారు. అంటే మమ్మల్ని మోసం చేస్తున్నట్టే కదా. మా ఊరికి 30 కిలోమీటర్ల అవతల జీలుగుమిల్లిలో కాలనీ కడతారంట. మా తరతరాలు అక్కడే బతకాలి. కానీ అక్కడికెళ్లి ఎలా బతకాలి. మొత్తం మాకివ్వాల్సింది ఇచ్చేస్తే మేమే వెళ్లిపోతాం" అని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన భీంపల్లి వాసి ఎం.అబ్బులు అంటున్నారు.

భూమికి భూమి ఇస్తామన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా రాలేదు. ఇక్కడ పొలాలు, చెట్టూ అన్నీ వదిలేసి వెళ్లి ఏం తినాలి.

"అడవిలో ఉంటే ఏదోటి తిని బతికేస్తాం. అక్కడ ఎలా గడపాలి. మాకు జరుగుతున్న అన్యాయం చూస్తామన్న వాళ్లే లేరు. గోదావరి వచ్చేస్తోంది. అందుకే అడవుల్లో ఏవో ఇళ్లు కట్టుకుని చీకట్లోనే గడపాలి ఇక" అని చెదల పార్వతి అన్నారు.

పోలవరం ప్రాజెక్టు

పేరుకే కాలనీ.. ఉన్నవన్నీ మొండి గోడలే

"అధికారుల మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాం. కానీ అక్కడ మంచినీరు, కరెంటు కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. బాత్రూములు లేవు. కుళాయిలు ఇప్పుడు తవ్వుతున్నారు. గోదావరి ఒడ్డున ఉండలేక ఇక్కడికి వచ్చేశాం.

ఈసారి వరద మూడు నాలుగు నెలలు ఉంటుందని అంటున్నారు. అందుకే పిల్లలతో అక్కడ ఉండలేక వచ్చేశాం. కానీ మాకు కరెంటు మీటర్లు వేసి, బాత్రూమ్ లు కట్టాలి . లేదంటే వరదలు, వర్షాల సమయంలో కష్టమే" అని పునరావాస కాలనీకి తరలివెళ్లిన కె.వెంకటలక్ష్మి అంటున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోనూ పునరావాస కాలనీల నిర్మాణంలో చాలా జాప్యం జరిగింది. ముఖ్యంగా నిధుల కొరత, కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పూర్తి కావడం లేదు.

ఇప్పుడు వరదలు బాధితుల గుమ్మం వరకూ నీరొచ్చినా పునరావాస కాలనీలు మాత్రం మొండిగోడలతోనే దర్శనమిస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్టు

అమానవీయ ధోరణిలో ప్రభుత్వం

"పోలవరం నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం తగదు. ప్యాకేజీ ఇచ్చేస్తే ఖాళీ చేస్తామని వారు చెబుతున్నారు.

కానీ ప్రభుత్వం ప్రాజెక్టు కడుతూ పునరావాసం మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్లు ఏం కావాలి.

నిరుడు నెల రోజులు పైగా వరద నీటిలోనే ఉన్నారు. ఇప్పుడు కాఫర్ డ్యామ్ మూసేశారు. కాబట్టి మూడు నెలల పాటు వరదలు వచ్చేలా ఉన్నాయి.

1986 నాటి వరదలను మించి వస్తాయని అధికారులే చెబుతున్నారు. నిరుడు కూడా నిర్వాసితులకు వరద సహాయం అందించకుండా వేధించారు. ఈసారి అదే పద్ధతిలో కనిపిస్తున్నారు. ఇది తగదు.

తక్షణమే పరిహారం చెల్లించాలి. వరదల సమయంలో వారిని ఆదుకోవాలి" అని ఏపీ గిరిజన సంఘం నేత ఎం కృష్ణమూర్తి బీబీసీతో అన్నారు.

పోలవరం నిర్వాసితులు

అందరికీ న్యాయం చేస్తాం

పోలవరం ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బీబీసీతో అన్నారు.

"కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రి కూడా ప్రయత్నిస్తున్నారు. నిర్మాణంలో గత ప్రభుత్వాలు తగు శ్రద్ధ చూపలేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పిల్ వే నిర్మాణం పూర్తి చేశాం. కాఫర్ డ్యామ్ సిద్ధం చేయడంతో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులకు ఆటంకం తొలగింది.

పునరావాస ప్యాకేజీ అందరికీ అందిస్తాం. కాలనీల నిర్మాణం కరోనాతో సహా కొన్ని కారణాలతో ఆలస్యమైంది. వాటిని సిద్ధం చేస్తాం.

వరదల మూలంగా ఎవరూ ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకు తగ్గట్టుగా అధికారులకు అవసరమైన ఏర్పాట్లు కోసం ఆదేశాలు ఇచ్చాం" అని అనిల్ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)