అసోంలో ముస్లిం మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారా?

ఫొటో సోర్స్, Hafiz Ahmed/Anadolu Agency via Getty Images
- రచయిత, నసీరుద్దీన్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
మైనారిటీల జనాభా, కుటుంబ నియంత్రణ, అధిక జనాభా వలన ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గత వారం మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే..
- జనాభా విస్ఫోటనం నివారించేందుకు ఇక్కడికి వలస వచ్చిన ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించాలి. చిన్న కుటుంబాన్ని మాత్రమే ఏర్పరచుకునే ప్రయత్నాలు చేయాలి.
- జనాభా విస్ఫోటనం కొనసాగితే, ఏదో ఒక రోజు కామాఖ్యా ఆలయ భూమి కూడా ఆక్రమణకు గురవుతుంది.
- జనాభా సంఖ్యను తగ్గించడానికి మైనారిటీ ముస్లిం సమాజంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం.
- అధిక జనాభా వలన పేదరికం వంటి సామాజిక సమస్యలు తెలెత్తుతాయి.
- ఈ సమస్యపై బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ ఏఐయూడీఎఫ్, ఆల్ అసోం మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎంఎస్‌యూ)లతో కలిసి పని చేయాలనుకుంటున్నాం అని ఆయన అన్నారు.
ముస్లింల జనాభా అంశం అనేకసార్లు చర్చల్లోకి వస్తూనే ఉంటుంది.
తాజాగా అసోం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని అసోంలో ముస్లిం జనాభా గణాంకాలు, ఇతర అంశాలను పరిశీలిద్దాం.

ఫొటో సోర్స్, ANI
ముస్లిం మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కంటున్నారా?
మొదటి ప్రశ్న.. నిజంగానే అసోంలో ముస్లిం జనాభా పెరుగుతోందా?
దీనికి జవాబు తెలియాలంటే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) ఐదు రిపోర్టులూ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ గణాంకాలు చాలావరకు వాస్తవాలను తెలియజేస్తాయి.
ఈ రిపోర్టుల ప్రకారం, అసోంలో సంతానోత్పత్తి రేటు దేశ సగటుతో ఇంచుమించు సమానంగానే ఉంది.
సంతానోత్పత్తి రేటు అంటే 15-49 సంవత్సరాల మధ్య వయసు గల స్త్రీలు సగటున ఎంతమందికి జన్మనిస్తున్నారో చెప్పే లెక్క.
2005-06లో జాతీయ సంతానోత్పత్తి రేటు 2.7 కాగా, అసోంలో ఇది 2.4గా ఉంది. తాజా నివేదికలో ఈ రేటు 1.87కు చేరుకుంది. అంటే, సంతానోత్పత్తి రేటు రేఖ 2.1 కన్నా కిందకు దిగిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా 2.1ని రీప్లేస్మెంట్ (పునఃస్థాపన) సంతానోత్పత్తి రేటుగా భావిస్తారు. అంటే సంతానోత్పత్తి రేటు 2.1 ఉంటే కొత్త తరం, తమ తల్లిదండ్రుల తరానికి సమాన సంఖ్యలో ఉంటారు.
ఈ గణాంకాల ప్రకారం అసోం సంతానోత్పత్తి రేటు జనాభా స్థిరీకరణ వైపు అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, REUTERS
ముస్లింలలో సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతోంది
రాష్ట్ర జనాభాలో మూడింట ఒక వంతు ముస్లింలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రం జనాభా స్థిరీకరణ వైపు ఎలా సాగుతోంది? అనే ప్రశ్న వస్తుంది.
అసోంలో సంతానోత్పత్తి రేటు మూడు దశాబ్దాల కాలంలో దాదాపు సగానికి పడిపోయింది.
1992-93 సంవత్సరంలో 3.53 ఉన్న సంతానోత్పత్తి రేటు, తాజా ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ నివేదిక ప్రకారం 2019-20 సంవత్సరంలో 1.87కు పడిపోయింది.
ముస్లింల సంతానోత్పత్తి రేటు ఇతరుల కన్నా ఎక్కువగా ఉందన్నది వాస్తవమే అయినా ఈ రేటు వేగంగా తగ్గుతోంది.
అసోంలో హిందూ సంతానోత్పత్తి రేటు గత 15 సంవత్సరాలలో 2.0 నుంచి 1.59కు పడిపోయింది.
ముస్లింల సంతానోత్పత్తి రేటు 3.64 నుంచి 2.38కి తగ్గింది. రీప్లేస్మెంట్ రేటు 2.1కు ఇది దగ్గరగా ఉందన్నది గుర్తించాల్సిన విషయం.
ఎన్ఎఫ్‌హెచ్ఎస్ తాజా గణాంకాల ప్రకారం.. అసోంలో క్రైస్తవులలో సంతానోత్పత్తి రేటు అతి తక్కువగా ఉంది. దీని తరువాత షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలలో తక్కువగా ఉంది. ఆ తర్వాత వరుసలో హిందువులు, ముస్లింలు ఉన్నారు.
ఈ గణాంకాలను బట్టి, అసోంలో ముస్లిం జనాభా పెరుగుదల రేటు చాలాకాలంగా తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Hafiz Ahmed/Anadolu Agency via Getty Images
విద్య, సంతానోత్పత్తి మధ్య సంబంధం
మిగతావారికన్నా ముస్లింలలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంది కదా అని కొందరు వాదిస్తారు.
అది నిజమే కానీ, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ రేటును అనేక ఇతర అంశాలతో ముడిపెట్టి చూడాలి.
వాటిల్లో మొదటిది, ముఖ్యమైనది విద్య. రెండవది ఆర్థిక పరిస్థితి.
ఇతర మతాలవారితో పోలిస్తే ఈ రెండు విషయాల్లోనూ ముస్లింలు వెనుకబడి ఉన్నారన్నది నిజం.
సంతానోత్పత్తి రేటు పెరగడం, తగ్గడం మహిళల విద్యపై ఆధారపడి ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఎన్ఎఫ్‌హెచ్ఎస్ కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది.
ఎన్ఎఫ్‌హెచ్ఎస్ ప్రకారం, 12వ తరగతి చదువుకున్న మహిళలతో పోలిస్తే, అసలు చదువుకోని మహిళలు అధిక సంఖ్యలో పిల్లల్ని కంటున్నారు.
అంటే ఒక సమాజంలో విద్యావంతులైన మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటే సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంటుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం అసోంలో హిందువుల అక్షరాస్యత 77.67 శాతం కాగా, ముస్లింల అక్షరాస్యత 61.92 శాతం. ఈ రెండు వర్గాల అక్షరాస్యతల్లో తేడా ఎక్కువే. ఈ వ్యత్యాసం సంతానోత్పత్తి రేటుతో పాటు అనేక ఇతర అంశాలనూ ప్రభావితం చేస్తుంది.

ఫొటో సోర్స్, Reuters
కుటుంబ నియంత్రణ పద్ధతులను ఎంతవరకు పాటిస్తున్నారు?
మెరుగైన విద్య, మంచి ఆర్థిక పరిస్థితి ఉంటే కుటుంబ నియంత్రణ పద్ధతుల పట్ల అవగాహన కూడా మెరుగ్గా ఉంటుంది.
సాధారణంగా ముస్లింలు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించరనేది చాలామందికి ఉన్న అభిప్రాయం. కానీ, అసోం విషయంలో ఇది నిజం కాదు.
2005-06 ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-4 గణాంకాల ప్రకారం.. అసోంలో గర్భ నిరోధకాల వాడకం జాతీయ సగటుతో సమానంగా ఉంది. జాతీయ స్థాయిలో ఈ రేటు 56 శాతం ఉంటే అసోంలో 57 శాతం ఉంది.
గర్భ నిరోధకాల వాడకం ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-4 (52%)తో పోలిస్తే ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-5 (61%)కు పెరిగింది.
ఇదే కాకుండా, ఈ అంశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంది.
మరో విషయం ఏమిటంటే, అసోంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మధ్య గర్భ నిరోధకాల వాడకంలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉందని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 గణాంకాలు చెబుతున్నాయి.
గర్భ నిరోధకాల వాడకం హిందువులలో 61.1 శాతం ఉంటే ముస్లింలలో 60.1 శాతం ఉంది. తేడా ఒక్క శాతం మాత్రమే.
హిందువుల కన్నా క్రైస్తవులు, షెడ్యూల్డ్ తెగలు ఎక్కువగా గర్భ నిరోధక పద్ధతులను పాటిస్తున్నారు.
15 సంవత్సరాల మధ్య కాలాన్ని పరిశీలిస్తే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-3 నుంచి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5కు) హిందువులు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడంలో స్వల్ప మెరుగుదల మాత్రమే కనిపిస్తుంది. కానీ, ముస్లింలలో సుమారు 14 శాతం మెరుగుదల కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, EPA
ఆధునిక గర్భనిరోధక పద్ధతులను పాటించడంలో ముస్లింలు ముందంజలో ఉన్నారు
గత రెండున్నర దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే.. ఆధునిక గర్భనిరోధక పద్ధతులను అనుసరించే ముస్లింల సంఖ్య దాదాపు మూడున్నర రెట్లు పెరిగింది.
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-2 నాటికి కేవలం 14.9 శాతం మంది ఆధునిక పద్ధతులను పాటిస్తుంటే, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 నాటికి 49.6 శాతం మంది వీటిని అనుసరిస్తున్నారు.
అదే హిందువుల్లో ఈ శాతం 33 నుంచి 42.8కి పెరిగింది.
మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-3 ప్రకారం, భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అసోంలో సంప్రదాయ గర్భనిరోధక పద్ధతులను ఎక్కువగా అనుసరిస్తారు.

ఫొటో సోర్స్, Reuters
ఇప్పటివరకు ఎవరూ చెప్పని అసోం కథ ఇది..
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 గణాంకాల ప్రకారం..
- అసోంలో ముస్లింలలో సంతానోత్పత్తి రేటు క్రమేనా తగ్గుతోంది. ఇది ఎంత వేగంగా తగ్గుతోందంటే దాదాపు జనాభా స్థిరీకరణ స్థాయికి చేరుకుంది. మిగతా వర్గాలతో పోలిస్తే అసోం ముస్లింలలో సంతానోత్పత్తి రేటు క్షీణత అత్యధికం.
- ఇతరులతో పోలిస్తే అక్షరాస్యత రేటులో ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గడం గమనార్హం.
- కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడంలో, ఆధునిక గర్భనిరోధక పద్ధతులను అనుసరించడంలోనూ ముస్లింలు ముందంజలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- అసోం డిటెన్షన్ కేంద్రాలు: నరేంద్ర మోదీ చెప్పింది నిజమా.. కాదా..
- ఇరాన్ ఎన్నికలు: ఇబ్రహీం రైసీ ఎన్నిక ప్రమాదకరమని హెచ్చరిస్తున్న ఇజ్రాయెల్
- International Yoga Day: కోవిడ్ సమయంలో యోగాతో కలిగే ప్రయోజనాలేమిటి?
- చైనా-ఇరాన్ స్నేహం ఎందుకు బలపడుతోంది? ఇది అమెరికాకు ప్రమాదమా?
- జమ్ము-కశ్మీర్: మోదీ ప్రభుత్వం ఇక్కడ కొత్తగా ఏం చేయడానికి సిద్ధమవుతోంది?
- చైనా సరిహద్దులో బ్రహ్మపుత్ర నది అడుగున సొరంగం నిర్మించాలని భారత్ భావిస్తోంది.. ఎందుకు?
- కరోనావైరస్: ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ కోవిడ్-19 కేసులు నమోదవడానికి కారణాలేంటి?
- పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనలు: యూపీ ముస్లింలలో భయాందోళనలకు కారణాలేమిటి
- ఇరాన్ అణు శాస్త్రవేత్తలు వరుసగా ఎందుకు హత్యకు గురవుతున్నారు? ఇది ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఆపరేషనా?
- చైనా షిన్జియాంగ్లో నరకం సృష్టించింది... ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక
- పౌరసత్వ చట్టం: ‘వాస్తవాలకు అతీతంగా వ్యతిరేకతలు.. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్న మేధావులు’ - అభిప్రాయం
- ఒసామా బిన్ లాడెన్: ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఇప్పుడు ఏ స్థితిలో ఉంది
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
- ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్: ‘మానవ హక్కుల పేరుతో చట్టాలను అతిక్రమించకూడదు’ – భారత హోం శాఖ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










