ముంబై మోడల్ ఆక్సిజన్ సరఫరా అంటే ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాలు దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మయాంక్ భగవత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు రాష్ట్రాలలో బెడ్స్ దొరక్కపోవడం గురించే ఆందోళన కనిపించగా, ఆక్సిజన్ కొరత ప్రమాదం కూడా పొంచి ఉందని ఆదివారం సాయంత్రం జరిగిన రుయా ఆసుపత్రి ఘటన చెప్పకనే చెప్పింది.
ఈ ప్రమాదంలో 40 మందికి పైగా మరణించారని కొందరు రోగుల బంధువులు ఆరోపించగా, 11మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
రుయాలో ప్రాణనష్టం జరగడం, అది ఆక్సిజన్‌ను ఆసుపత్రికి చేర్చడంలో జరిగిన ఆలస్యం వల్లేనని ప్రభుత్వం కూడా ఒప్పుకోవడంతో మున్ముందు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఫొటో సోర్స్, FACEBOOK/DISTRICTCOLLECTORCHITTORE
ఇటీవల కొన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ సమస్యపై ఆరోపణలు వినిపించినా, అవి సాంకేతిక కారణాలు కావడం, కొరత కారణంగా ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఆక్సిజన్ సరఫరా విషయంలో రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని కోవిడ్ సెకండ్ వేవ్ నొక్కి చెప్పింది. అందుకే, గత రెండు వారాలుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రకటనలు చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని 49 జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో రూ.309 కోట్ల వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్ల (పీఎస్ఏ)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మూడు నెలల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మే 7న వెల్లడించారు.
రుయా ఘటన విచారకరమన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలున్నా, చెన్నై నుంచి ఆక్సిజన్‌ను చేర్చడంలో ఆలస్యం వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉందని, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కేటాయింపులను పెంచాలని, సరఫరాలో ఇబ్బంది కలగకుండా, 20 ఆక్సిజన్ ట్యాంకర్లను కేటాయించాలంటూ ప్రధానమంత్రికి ఆయన లేఖ రాశారు.

ఫొటో సోర్స్, trspartyonline/twitter
ఇటు తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆక్సిజన్ సరఫరా కోసం విమానాలు, రైళ్లను వాడుకుంటూ ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను సేకరించడంలో అధికారులు తలమునకలై ఉన్నారు.
అయితే, కరోనా మొదటి వేవ్‌ను చూసిన తర్వాత కూడా పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రెండు రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
ఈ సందర్భంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో ముంబై మోడల్ అనే మాట చర్చనీయాంశంగా మారింది.
ఆక్సిజన్ సరఫరా విషయంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన చర్యలు బాగున్నాయని ఇటీవల సుప్రీం కోర్టు మెచ్చుకుంది. దీనినే అందరూ ముంబై మోడల్ అంటున్నారు.
ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్ విషయంలో ముంబై నగరం చేసిన ప్రయత్నాలను చూసి నేర్చుకోవాలంటూ దిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది కూడా.
ఒకపక్క అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్ సమస్య ఎదురవుతుండగా, వాటికి భిన్నంగా ముంబై ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడింది.

ఏంటి ఈ 'ముంబై మోడల్'?
దీనిని అర్ధం చేసుకోవాలంటే 2020 సంవత్సరంలోకి వెళ్లాలి. గత ఏడాది మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఆసుపత్రులలో ఆక్సిజన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
ఆక్సిజన్ సమకూర్చే బాధ్యతను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ పి.వేలరసుకు అప్పజెప్పారు.
''సాధారణంగా ఆసుపత్రులలో ఐసీయూలలో మాత్రమే ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ కోవిడ్ సందర్బంగా ఆక్సిజన్ డిమాండ్ రెండింతలైంది'' అని వేలరసు వెల్లడించారు.
ముంబై కార్పొరేషన్ దగ్గర 13,000 లీటర్ల ఆక్సిజన్ తయారు చేయగల భారీ ప్లాంట్ ఉంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఆసియాలోనే అత్యధిక నిధులున్న కార్పొరేషన్.
''21 ఆక్సిజన్ ట్యాంకులను సిద్దం చేశాం. ఈ కారణంగా నగరంలో ఏ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ కొరత రాకుండా చేయగలిగాం. ట్యాంకర్లు రావడం ఆలస్యమైనా ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు జరిగాయి'' అన్నారు వేలరసు.
2021 మార్చి నాటికి ముంబై నగరంలో మళ్లీ ఆక్సిజన్ డిమాండ్ పెరగడం మొదలైంది. డిమాండ్ 200 టన్నుల నుంచి 210 టన్నుల వరకు చేరుకుంది. అయితే, ముందుగానే ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవడంతో ఆసుపత్రులకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ముంబై ఆక్సిజన్ టీమ్
గత ఏడాది అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న ముంబై మున్సిపాలిటీ.. ఆక్సిజన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. డిమాండ్, సరఫరాలను ఈ టీమ్ మేనేజ్ చేస్తుంటుంది.
''ఈ టీమ్‌లోని ఆరుగురు అధికారులు.. వార్డ్ ఆఫీసర్లు, ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో సమన్వయం చేసుకుంటారు. ఆసుపత్రులలో ఆక్సిజన్‌ను పర్యవేక్షించడానికి ఓ అధికారిని నియమించాం. ఇద్దరు అధికారులు వార్డులలో ఆక్సిజన్ మేనేజ్‌మెంట్‌ను పర్యవేక్షిస్తుంటారు'' అన్నారు వేలరసు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాంకర్లను ఈ టీమ్ నిత్యం గమనిస్తూ ఉంది. ట్యాంకర్లు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు ఆసుపత్రికి చేరుతున్నాయి, ఏయే ఆసుపత్రులు తీసుకుంటున్నాయి అన్నదానిపై తాను దృష్టిపెట్టానని వేలరసు చెప్పారు.
అయితే, ఏప్రిల్ 17న ఇబ్బంది ఎదురైంది. కోవిడ్ పేషెంట్లు ఎక్కువమంది చేరడంతో ఆరు ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం మొదలైంది. దీంతో 168మంది పేషెంట్లను హుటాహుటిన జంబో కోవిడ్ సెంటర్‌కు తరలించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరు ప్రాంతాలలో ఆక్సిజన్ సిలిండర్ల మోహరింపు
ఒక్కసారిగా ఆక్సిజన్ డిమాండ్ పెరగడంతో చిన్న ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్, 200 సిలిండర్ల ఆక్సిజన్‌ను ఆరు ప్రధాన ప్రాంతాలలో అందుబాటులో ఉంచింది.
ఎక్కడ అత్యవసరమైతే అక్కడికి ఈ సిలిండర్లను సరఫరా చేస్తారు. ''సాధారణంగా రోజుకోసారి మేం ఆక్సిజన్ సప్లయి చేస్తాం. కానీ ఇప్పుడు ప్రతి 13, 14 గంటలకు ఒకసారి సరఫరా చేస్తున్నాం'' అని వేలరసు వెల్లడించారు.
ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచడంతోపాటు, ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా సరి చేసేందుకు డాక్టర్లకు శిక్షణ కూడా ఇచ్చారు.
'ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు'
వాస్తవానికి ముంబైలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ లేదు. అందువల్ల ఇప్పటికీ ముంబై నగరానికి ఆక్సిజన్ ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిందే.
మూడో వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నామన్న ముంబై కార్పొరేషన్ అధికారులు, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే 16 ప్రొడక్షన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 45 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని వారు అంటున్నారు.

ఫొటో సోర్స్, PBNS/twitter
తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆక్సిజన్ కోసం ఎక్కువగా ఇతర రాష్ట్రాల మీద ఆధారపడుతున్నాయి. సొంత రాష్ట్రాలలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పటికీ, డిమాండ్ దృష్ట్యా కేంద్రం మీదా, ఇతర రాష్ట్రాల మీదా ఆధారపడాల్సి వస్తోంది.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి. విమానాలు, రైళ్ల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో దిగుతున్నట్లు తరచూ మీడియాలో వార్తలు కనిపించాయి.
పెరుగుతున్న డిమాండ్ కారణంగా రాష్ట్రంలో కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
కృష్ణా జిల్లా కొండపల్లి పారిశ్రామిక వాడలో ఏడేళ్ల కిందట మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్‌ను అధికారులు యుద్ధ ప్రాతిపదికన తెరిపించి ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రారంభించారు.

ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా కొత్తగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్లు లేవు. ఇప్పుడే అధికారులు వాటి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈలోగా ఎలాంటి కొరతా రాకుండా సమన్వయంతో పని చేస్తూ ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కేసుల పెరుగుదలకు ఇండియన్ వేరియంటే కారణమా
- 'పెళ్లైతే భర్త పేరు తగిలించుకోవాలా?': పాకిస్తాన్ అమ్మాయిల్లో మారుతున్న ట్రెండ్
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ వేరియంట్ 1000 రెట్లు స్పీడా... అందుకే ఏపీ ప్రజలంటే ఇతర రాష్ట్రాలు భయపడుతున్నాయా
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- బాలాకోట్ వైమానిక దాడికి రెండేళ్లు.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
- సైనోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం.. ఇప్పటికే కోట్ల మందికి పంపిణీ
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








