'తెలంగాణలో త్వరలో నిరుద్యోగ భృతి, 50 వేల ఉద్యోగాల ప్రకటన' - కేటీఆర్ : ప్రెస్ రివ్యూ

కేటీఆర్

ఫొటో సోర్స్, KTR/FACEBOOK

తెలంగాణలో త్వరలో నిరుద్యోగ భృతి- కేటీఆర్ వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 50 వేల నియామకాలు చేపట్టబోతోందని, ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది.

‘రేపో మాపో నిరుద్యోగ భృతి కూడా ముఖ్యమంత్రి ప్రకటిస్తారు కావచ్చు. అది కూడా వస్తుంది’’ అని కేటీఆర్ అన్నారని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. తెలంగాణ భవన్ లో జరిగిన విద్యుత్ కార్మిక సంఘాల విలీన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది.

ఉద్యోగ నియామకాలపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కేసీఆర్ అధికారం చేపట్టాక టీఎస్ పీఎస్సీ ద్వారానే 36 వేల నియామకాలు చేపట్టారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 1.31 లక్షల ఉద్యోగాలను ఇచ్చిందని, త్వరలో మరో 50వేల ఉద్యోగాలకు ప్రకటనలు రాబోతున్నాయని ఆయన తెలిపారు.

నిరుద్యోగ భృతి మీద ఎన్నికల సమయంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఒక్కొక్క నిరుద్యోగికి 3,016 రూపాయలు ఇస్తామని చెప్పిందని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. నిరుద్యోగ భృతి కోసం దాదాపు 10లక్షలమంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారని కూడా ఈ కథనం తెలిపింది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ-ఏపీలలో భిన్నమైన కరోనా వైరస్

దక్షిణ భారతదేశంలో మిగిలిన కరోనా వైరస్ లకన్నా భిన్నమైన కరోనా వైరస్ ఒకటి కనిపిస్తోందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా దీని ఆనవాళ్లు ఉన్నాయని హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు వెల్లడించినట్లు ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.

ఈ భిన్నమైన కరోనా వైరస్ కు ఎన్440కె అని పేరు పెట్టారని, అయితే ఇది కరోనా వైరస్ కన్నా కాస్త బలహీనంగా ఉందని, దేశంలో ఈ రకం వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు పరిశోధనలు ముమ్మరం చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారని ఈనాడు కథనం పేర్కొంది.

బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో దేశంలో మరో రకం వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్నట్లు ఈ కథనం తెలిపింది.

గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల నుంచి ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని, దీనిలో స్వల్పస్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయని, కాకపోతే దీనిపై పూర్తిస్థాయిలో డేటా అందుబాటులో లేదని శాస్త్రవేత్తలు తెలిపినట్లు ఈనాడు కథనం వెల్లడించింది.

ఏపీలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు
ఫొటో క్యాప్షన్, ఏపీలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు

ఏపీలో నేటి నుంచిపంచాయతీ నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్లు మొదలవుతున్నాయని సాక్షి పత్రిక రాసింది. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని, వీటికి నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని ఈ కథనం పేర్కొంది.

శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. వివిధ జిల్లాల్లో పంచాయితీల వారీగా రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అభ్యర్ధితోపాటు ఇద్దరు వ్యక్తులను మాత్రమే నామినేషన్ వేసే గదిలోకి అనుమతిస్తారు.

మొదటి విడతగా ఫిబ్రవరి 9 నుంచి ఒక్క విజయనగరం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది.

విజయనగరం, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో డివిజన్ల వారీగా నాలుగు విడతలుగా జరిగే ఎన్నికల తేదీలు మారాయని సాక్షి కథనం పేర్కొంది.

గంగూలీ ఇటీవల ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, గంగూలీ ఇటీవల ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందారు

గంగూలీకి మళ్లీఅస్వస్థత-ఆసుపత్రికి మమతా బెనర్జీ

బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి రెండోసారి యాంజియోప్లాస్టీ జరిగినట్లు పత్రిక రాసింది.

రక్త నాళాల్లో మళ్లీ పూడికలు కనిపించడంతో ఆయనకు రెండు స్టెంట్లు వేసినట్లు వైద్యులు తెలిపారని ఈ కథనం పేర్కొంది. ఈ నెల ఆరంభంలో గంగూలీ గుండెపోటుకు గురయ్యారు.

మూడు వారాలపాటు చికిత్స తీసుకున్న ఆయనకు బుధవారం నాడు మళ్లీ అసౌకర్యంగా అనిపించడంలో మరోసారి ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం ఆయన రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు మరో రెండు స్టెంట్లు వేశారు. గతంలోనే మూడు చోట్ల పూడికలు గుర్తించామని, అయితే అప్పట్లో ఒకటే స్టెంట్ వేశామని వైద్యులు వెల్లడించారు.

ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు గంగూలీ ఆనారోగ్యం విషయం తెలియగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ఆసుపత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసినట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)