బ్లూ రెవల్యూషన్: భవిష్యత్తులో ప్రజల ఆకలి తీర్చే కొరత లేని సరికొత్త ఆహారం ఇదే...

సముద్రపు నాచు

ఫొటో సోర్స్, Alamy

    • రచయిత, మీనాక్షి. జె
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రామేశ్వర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పంబన్‌ దీవికి వెళుతుంటే అందమైన ఆకుపచ్చ రంగు జలాలు, కెరటాల మీద నుంచి దూకిపడే నావలు కనిపిస్తుంటాయి.

అయితే, ఆ ప్రాంత సముద్ర అంతర్భాగంలో అక్కడి జీవ వైవిధ్యాన్ని, ఆర్ధిక వ్యవస్థను, ఆహార విధానాలను మార్చేసే ఒక పరిణామం జరుగుతోంది. ఈ తీర ప్రాంత గ్రామాలు భారతదేశపు సముద్రపు నాచు విప్లవానికి కేంద్రాలుగా మారుతున్నాయి.

సముద్రపు నాచును సంప్రదాయ వైద్యవిధానాలలో వాడటం భారతదేశంలో వేల సంవత్సరాల నుంచీ ఉంది. ఒక్క భారతదేశంలోనే కాక, ఆసియాలోని చాలా దేశాలలో ఈ విధానం కొనసాగుతోంది.

పంబన్‌ దీవీ, మన్నార్‌ సింధుశాఖలాంటి జీవవైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో ఈ నాచుని సేకరణ తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. నాచు సేకరణలో ఈ ప్రాంతం ప్రతియేటా 8% వృద్ధితో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.

సముద్రపు నాచు పెంపకాన్ని ఒక వ్యవసాయ సాగు విధానంగా మార్చాలని భారతదేశంలోని పలువురు పరిశోధకులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వాతావరణం కారణంగా భారతదేశంలోని అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఈ నాచు పెరగడానికి అనువుగా ఉంటుంది.

సముద్రపు నాచు

ఫొటో సోర్స్, Alamy

నాచులో ఏముంటుంది?

ఇంగ్లీషులో సీవీడ్‌గా పిలిచే ఈ నాచులో ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. తమిళనాడు, గుజరాత్‌లలోని తీర ప్రాంతాలలో ఈ సముద్రపు ఇది అత్యధికంగా పెరుగుతుంది.

తమిళనాడులోనే సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడవైన సముద్రతీరంలో దాదాపు 282 రకాల జాతుల సముద్రపు నాచు రకాలు ఉన్నాయని గుర్తించారు. భారతదేశపు మొత్తం తీర రేఖలో సుమారు 841 సముద్రపు రకాలు ఉన్నాయని, వాటిలో కొన్నింటిని మాత్రమే సాగు చేయడానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సముద్రపు నాచుతో అనేక ప్రయోజనాలున్నాయి. భారతదేశంలో 60 శాతం భూమి వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. అయితే అందులో సుమారు 47% శాతం భూమి వ్యవసాయానికి ఉపయోగపడని విధంగా బలహీనమవుతోంది. ఇందులో మూడింట ఒక వంతు భూమి నీటి కోత కారణంగానే దెబ్బతింటోంది. సముద్రపు నాచు పెంపకానికి నీరే ప్రధాన వనరు కావడం ఇక్కడ కలిసి వచ్చే అంశం.

“ఇది పోషకాహార లోపాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా అయోడిన్‌, విటమిన్‌, ప్రొటీన్‌లు ఇందులో ఎక్కువగా ఉంటాయి’’ అని దిల్లీ యూనివర్సిటీకి చెందిన వృక్షశాస్త్ర నిపుణుడు దీనబంధు సాహు వివరించారు. దీనిని పెంచడం ద్వారా నీలి విప్లవం (బ్లూ రివల్యూషన్‌) సాధించాలని వాదించే వారిలో సాహూ ఒకరు.

అయితే సాహూ కోరుతున్న విప్లవం చేరువలోనే ఉంది. ఎందుకంటే ఈ సముద్రపు నాచు పెంపకం కోసం రాబోయే ఐదేళ్లలో సుమారు రూ. 650 కోట్ల విలువైన సబ్సిడీలను ప్రభుతం ఈ ఏడాది ప్రకటించింది

సముద్రపు నాచులో దొరికే పోషకాలు ఆ పంటకు ప్రోత్సహకాలకు కల్పించేలా ఆకర్షిస్తోంది. సాధారణ మొక్కల్లాగే ఈ సముద్రపు నాచు కూడా సూర్యరశ్మి ద్వారా ఆహారాన్ని సేకరించుకుంటుంది. కార్బన్‌-డై-ఆక్సైడ్‌ను తీసుకుని షుగర్‌, ఆక్సీజన్‌ల రూపంలో సముద్రంలోకి వదులుతుంది.

రామేశ్వరం సమీపంలో అనేకమంది మత్స్యకారులు నాచు సేకరణతో ఉపాధి పొందుతున్నారు

ఫొటో సోర్స్, ALAMY

ఫొటో క్యాప్షన్, రామేశ్వరం సమీపంలో అనేకమంది మత్స్యకారులు నాచు సేకరణతో ఉపాధి పొందుతున్నారు

ప్రమాదం కూడా ఉంటుందా?

ఈ నాచు చనిపోయిన తర్వాత అందులోని కర్బన పదార్ధాలు భారీ ఎత్తున సముద్రంలోకి విడుదలవుతాయని మొదట్లో శాస్త్రవేత్తలు భావించారు. కానీ చనిపోయిన వెంటనే ఈ నాచు నీటి మీద తేలుతూ ఒడ్డుకు కొట్టుకు వస్తుంది. తద్వారా దానిలో కర్బనాలు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకలో కూరుకుపోతాయి. ఈ కారణంగా పర్యావరణానికి హాని తక్కువని డెన్మార్క్‌లోని ఆర్హస్‌ యూనివర్సిటీలో పర్యావరణ నిపుణుడిగా పని చేస్తున్న డోర్టే క్రాస్‌ –జెన్సెస్‌ అన్నారు.

కర్బనాలను తనలో దాచుకోవడమే కాక అనేక సముద్ర జీవులకు ఆహారమైన పైటోప్లాంక్టన్‌ అనే ఒకరకమైన నాచు ఏర్పడటానికి కూడా ఇది సహకరిస్తుంది.

అయితే ఇన్ని ప్రయోజనలున్నా భారత్‌లో ఈ సముద్రపు నాచు సాగు అనుకున్నంత వేగంగా మొదలుకాలేదు. 1987 నుంచి ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫిలిప్పీన్స్‌ నుంచి స్థానిక సముద్రపు నాచు వంగడం ‘కప్పాపైకస్‌ అలవెరజీ’ని ఇండియాలోని సెంట్రల్‌ సాల్ట్‌ అండ్‌ మెరైన్‌ కెమిలక్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ) సేకరించింది. ఈ సంస్థ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్ అండ్‌ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌లో భాగం.

ఆహార పదార్ధాలు, కాస్మెటిక్స్‌, మైక్రోఆర్గానిజమ్స్‌ పెంపొందించే లేబరేటీలకు అవసరమైన అగర్‌ అనే జెల్లీని సముద్రపు నాచు నుంచి తయారు చేయడం ఈ ప్రయత్నం వెనకున్న ప్రధాన ఉద్దేశం.

ఓ పదేళ్లపాటు గుజరాత్‌లోని ఓఖా ప్రాంతంలో లేబరేటరీ ప్రయోగాలు జరిగాయి. అక్కడి నుంచి 1997లో తమిళనాడులోని రామేశ్వరంలోని మండపం ప్రాంతంలో ఈ విత్తనాన్ని ప్రయోగించారు. కేవలం 5 గ్రాముల విత్తనంతో ఇక్కడ కూడా సాగు మొదలైందని కె.ఈశ్వరన్‌ తెలిపారు. ఆయన సీఎస్‌ఎంసీఆర్‌ఐలో సైంటిస్టుగా ఉన్నారు. 27 సంవత్సరాలుగా మండపం ప్రాంతంలో ఈ సముద్రపు నాచుపై ఆయన పరిశోధన చేస్తున్నారు.

5 గ్రాముల విత్తనంతో పాక్‌ జలసంధి ప్రాంతంలో కొన్ని సంవత్సరాలలో సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో సముద్రపు నాచు విస్తరించింది.

అయితే భారీ ఎత్తున సాగు మాత్రం 2000 సంవత్సరం తర్వాతనే ప్రారంభమైంది. అది కూడా సీఎస్‌ఎమ్‌సీఆర్‌ఐ సంస్థ పెప్సీకో కంపెనీకి లైసెన్స్‌ ఇవ్వడంతో సాధ్యమైంది. అయితే పెప్సీకో కంపెనీ ఈ సముద్రపు నాచుని ఆహార పంటగా కాకుండా ఆహారంలో, కాస్మెటిక్స్‌ల తయారీలో ఉపయోగించే ‘క్యారజీనన్‌’ అనే పదార్ధాన్ని తయారు చేయడానికి ఉపయోగించింది.

“ఈ ప్రయోగం సముద్రపు నాచు వాణిజ్య పంటగా మారడానికి కారణమైంది’’ అన్నారు ఈశ్వరన్‌.

ముత్తులక్ష్మి నంబురాజ్‌ 38 ఏళ్లుగా నాచు సేకరించే పనిలో ఉన్నారు

ఫొటో సోర్స్, ALAMY

ఫొటో క్యాప్షన్, ముత్తులక్ష్మి నంబురాజ్‌ 38 ఏళ్లుగా నాచు సేకరించే పనిలో ఉన్నారు

ఉపాధి మార్గం

2008లో పెప్సీకో తన తన సాగు ప్రాంతాన్ని అమ్మకానికి పెట్టగా, ఆక్వాఅగ్రి అనే సంస్థ దీనిని కొనుగోలు చేసింది. ఈ సంస్థ భారతదేశంలో తొలి సీవీడ్‌ సాగు సంస్థ. ప్రస్తుతం అది తమిళనాడులోని 18 ప్రాంతాలలో సముద్రపు నాచుని సాగు చేస్తోంది. మత్స్యకార కుటుంబాలకు చెందిన సుమారు 650మంది ఇందులో పని చేస్తున్నారు. అందులో మహిళలే ఎక్కువమంది ఉన్నారు.

ముత్తులక్ష్మీ నంబురాజన్ అనే మహిళ గత 38 ఏళ్లుగా ఈ సముద్రపు నాచు సేకరించే వృత్తిలో ఉన్నారు. సముద్ర అంతర్భాగంలోకి వెళ్లి నాచు ని తీసుకురావడం ఆమె పని.

ప్రస్తుతం శరీరం సహకరించకపోవడంతో ఆమె ఆ వృత్తిని మానేసి సముద్రపు ఒడ్డున మత్సకారులకు ఆహారం సరఫరా చేస్తున్నారు. తాను ఈ పనిలోఉన్నప్పుడు రోజుకు దాదాపు 50కేజీల నాచుని సేకరించే దానినని ముత్తులక్ష్మి చెప్పారు.

సముద్రపు నాచు సేకరణ భారతదేశంలోని తీర ప్రాంతంలో ఆర్ధిక ప్రగతికి ముఖ్యంగా మహిళల ఆర్ధిక స్వావలంబనకు తోడ్పడింది. సుమారు 1200 కుటుంబాలు ఇప్పుడు ఈ సముద్రపు నాచు సాగులో పని చేస్తున్నాయని ఈశ్వరన్‌ చెప్పారు.

రాను రాను ఈ నాచు సాగు పెరుగుతుండటంతో కేంద్ర మత్స్యపరిశ్రమాభివృద్ధి శాఖతో కలిసి సీఎస్‌ఎంసీఆర్‌ఐ మరో 100 కిలోమీటర్ల పరిధిలో ఈ సాగును విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది.

కేవలం ఆహార వనరుగానే కాక ఇది బయో ఫ్యూయల్‌, బయో ఫెర్టిలైజర్‌గా కూడా ఉపయోగపడుతోంది. సాధారణ పంటల సాగులో ఈ బయో ఫెర్టిలైజర్‌ చౌకైన ఎరువుగా మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

అయితే అధికంగా సముద్రపు నాచుని పెంచడంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కరీబియన్‌ దీవుల్లో ఈ నాచు ప్రభావం కనిపించినట్లు తేలింది. ఇది అధికంగా ఉండటం వల్ల దీనిని ఇష్టపడని చేపలు దీవులకు దూరంగా వెళుతున్నట్లు గుర్తించారు.

ఇటు ఇండియాలోని మన్నార్‌ సింధుశాఖ సమీపంలో కూడా ఇలాంటి సమస్యలే కనిపించాయి. 'కురుసడాయి' దీవిలో ఇతర పంటలపై ఈ సముద్రపు నాచు ప్రభావం పడినట్లు ఆందోళనలు రేకెత్తాయి. అయితే కేవలం 77చదరపు మీటర్ల ప్రాంతంలోనే దీని ప్రభావం కనిపించినట్లు సీఎస్‌ఎంసీఆర్‌ఐ తెలిపింది.

సముద్రపు నాచు

ఫొటో సోర్స్, Alamy

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ప్రపంచవ్యాప్తంగా సముద్రపు నాచు వ్యాపారం ఇప్పటికే 6 బిలియన్‌ డాలర్లను దాటిందని ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఒక నివేదికలో పేర్కొంది. భారత్‌లో సుమారు 50కోట్ల వ్యాపారం సాగుతోందని తెలిపింది.

“2013లో 1500 మెట్రిక్‌ టన్నుల సముద్రపు నాచు ని సేకరించాం’’ అని ఆక్వా అగ్రి సంస్థకు చెందిన అభిరామ్‌ సేథ్‌ తెలిపారు. “ఎల్‌నినో, గ్లోబల్‌ వార్మింగ్ కారణంగా సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. వాటి ప్రభావం ఉత్పత్తి మీద పడుతోంది’’ అని సేథ్‌ వెల్లడించారు.

సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల విత్తనపు నాణ్యత కూడా తగ్గిందని ఈశ్వరన్‌ తెలిపారు. “ఈ సమస్య నుంచి బైటపడటానికి వేడిని తట్టుకునే వంగడాలను తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాం’’ అని ఈశ్వరన్‌ వెల్లడించారు.

వాస్తవానికి ఒక ఆహార పంటగా సముద్రపు నాచు చారిత్రకంగా నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడది క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. అలాగే ఇది పర్యావరణ సమస్యలను కూడా తగ్గించి వ్యవసాయరంగానికి మేలు చేయబోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)