పశ్చిమ బెంగాల్‌‌లో జేపీ నడ్డాపై దాడి: మోదీ, మమతా ప్రభుత్వాల మధ్య ముదురుతున్న విభేదాలు

ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల డిప్యూటేషన్‌ మీద కేంద్రానికి, మమతా సర్కారుకు మధ్య వివాదం నడుస్తోంది

ఫొటో సోర్స్, Sanjay Das

ఫొటో క్యాప్షన్, ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల డిప్యూటేషన్‌ మీద కేంద్రానికి, మమతా సర్కారుకు మధ్య వివాదం నడుస్తోంది
    • రచయిత, ప్రభాకర్‌ మణి తివారి
    • హోదా, కోల్‌కతా నుంచి బీబీసీ కోసం

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి వ్యవహారంలో కేంద్రం, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాల మధ్య రాజ్యాంగ, పరిపాలనా సంక్షోభాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటన తర్వాత ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను డిప్యూటేషన్‌ మీద దిల్లీకి రావాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దక్షిణ 24 పరగణా జిల్లాలో నడ్డా పర్యటనలో భద్రత బాధ్యతలను ఈ బృందమే చూసుకుంది.

అయితే ఈ ముగ్గురినీ దిల్లీ పంపడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించారు. ఇది ప్రతీకార చర్య అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లాకు ఘాటుగా లేఖ రాశారు.

ఒకపక్క ఈ వివాదం ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే రెండు రోజుల పర్యటన కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిసెంబర్‌ 19న కోల్‌కతాకు వెళ్లబోతున్నారు. ఇది మరింత ఘర్షణకు దారితీయవచ్చని భావిస్తున్నారు.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమైంది.

ఫొటో సోర్స్, SANJAY DAS/ BBC

ఫొటో క్యాప్షన్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమైంది

అసలేం జరిగింది?

పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం దక్షిణ 24-పరగణా జిల్లాలోని డైమండ్ హార్బర్‌కు వెళుతుండగా తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

మరుసటి రోజే పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బెనర్జీ, డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ వీరేందర్‌కు సమన్లు పంపిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, డిసెంబర్‌ 14న దిల్లీకి రావాలని వారిని ఆదేశించింది. అయితే అధికారులను పంపడానికి మమతా బెనర్జీ అంగీకరించలేదు.

ఆ మరుసటి రోజు డైమండ్‌ హార్బర్‌ ఎస్.పి. భోలానాథ్ పాండే, మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు ప్రవీణ్‌ కుమార్‌ త్రిపాఠి, రాజీవ్ మిశ్రాలకు కూడా కేంద్రం నుంచి నోటీసులొచ్చాయి. అయితే వీరిని పంపడానికి కూడా మమతా సర్కారు ఒప్పుకోలేదు.

రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల కొరత ఉందని, ఈ పరిస్థితుల్లో వారిని డిప్యూటేషన్‌ మీద దిల్లీకి పంపడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తేల్చి చెప్పింది

ముగ్గురు ఐపీఎస్‌ అధికారులలో ఒకరైన రాజీవ్‌ మిశ్రా గతంలో ఓసారి యూనిఫామ్‌లో ఉండి ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించి వివాదాస్పదుడయ్యారు.

“అధికారులను డిప్యూటేషన్‌ మీద పంపాలని అడిగే అధికారం కేంద్రానికి ఉంది. అయితే వారిని పంపాలా వద్దా అని నిర్ణయించే అధికారం రాష్ట్రానికి ఉంది. కేంద్రం ప్రతీకార ధోరణిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది’’ అన్నారు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సౌగతారాయ్‌.

"కేంద్రం పరోక్షంగా అత్యవసర పరిస్థితిని అమలు చేయడానికి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది" అని కల్యాణ్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు.

“జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి కాన్వాయ్‌కి ముందు, వెనకా పోలీస్‌ పైలట్‌ కారు ఉంది. కాన్వాయ్‌లో ఇతర వాహనాలను చేర్చాలంటే స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలి. కానీ అలాంటి అనుమతి ఏదీ తీసుకోలేదు. కాన్వాయ్‌లో చేరే వాహనాల వివరాలు పోలీసులకు ఇవ్వలేదు. నడ్డా కాన్వాయ్‌లో 50మోటార్‌ సైకిళ్లు, కార్లు ఉన్నాయి’’ అని కల్యాణ్‌ బెనర్జీ హోంశాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే కేంద్రానికి లేఖ రాసే అధికారం కల్యాణ్‌ బెనర్జీకి లేదని, ఆయన ముఖ్యమంత్రి లేదా ముఖ్య కార్యదర్శి కాదని పశ్చిమబెంగాల్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ అన్నారు.

గతంలో కోల్‌కతా పోలీస్‌ కమీషనర్‌ సీబీఐ అరెస్టు వ్యవహారంలో మమతా బెనర్జీ ధర్నా కూడా చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గతంలో కోల్‌కతా పోలీస్‌ కమీషనర్‌ సీబీఐ అరెస్టు వ్యవహారంలో మమతా బెనర్జీ ధర్నా కూడా చేశారు

మున్ముందు ఏం జరగబోతోంది?

రాష్ట్రంలో పని చేస్తున్న ఐపీఎస్‌ అధికారులను కేంద్రానికి పంపకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోగలదా ? నిపుణులు ఇది సాధ్యం కాదంటున్నారు. “ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్ (కేడర్‌) 1954 ప్రకారం ఒక విషయంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు వస్తే, కేంద్రం పంపిన నోటీసులను రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిందే’’ అని బెంగాల్ క్యాడర్‌ మాజీ ఐపీఎస్‌ అధికారి పి.రవి స్పష్టం చేశారు. “కేంద్రం అధికారులను పంపమంటే రాష్ట్రం పంపాల్సిందే’’ అని ఆయన అన్నారు.

“ఈ సందర్భంలో రాష్ట్రం ముందున్న చివరి ఆప్షన్‌ వారిని పంపకుండా వీలైనంత ఆలస్యం చేయడమే. కానీ ఎప్పటికైనా పంపాల్సిందే’’ అన్నారు మాజీ పోలీస్‌ అధికారి సోమెన్‌ దాస్‌.

కేంద్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య వివాదాల్లో ఇది మొదటిది కాదు. అంతకు ముందు కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు సీబీఐ సమన్ల విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదంగా మారింది.

ఇదే అంశంపై మమతా బెనర్జీ ధర్నాకు కూడా దిగారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు కారణంగా సీబీఐ రాజీవ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేయలేక పోయింది.

“పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ పోలీసు అధికారులు సరిపడినంతగా లేరు. ఈ కారణం చూపి రాష్ట్ర ప్రభుత్వం ఆ ముగ్గురు అధికారులను పంపకపోవచ్చు’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి అన్నారు.

“డిప్యూటేషన్‌కు పంపదగిన అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి పంపుతుంది. అందులో తమకు కావాల్సిన అధికారులను కేంద్రం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో పోలీసు అధికారులు ఎక్కువగా లేరు. కేంద్రానికి రాష్ట్రం పంపిన లిస్టులో ఈ ముగ్గురి పేర్లు లేవు” అని ఓ అధికారి వెల్లడించారు.

“కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం వచ్చినప్పుడు కేంద్ర నిర్ణయమే నెగ్గుతుంది. ఇరువర్గాలు పట్టుదలకు పోతే వివాదం సుప్రీంకోర్టుకు చేరుతుంది. గతంలో తమిళనాడులో అదే జరిగింది’’ అని కలకత్తా హైకోర్టు న్యాయవాది ధీరేన్‌ కుమార్‌ అన్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)