గూగుల్‌కు పోటీగా భారతీయ యాప్ స్టోర్ సాధ్యమేనా? ఇది జాతీయవాదమా లేక అవకాశవాదమా?

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సప్తఋషి దత్తా
    • హోదా, బీబీసీ మానిటరింగ్

గూగుల్ ప్లే స్టోర్ నిబంధనల్లో ఇటీవల వచ్చిన మార్పుల కారణంగా భారతదేశంలోని కొన్ని పెద్ద స్టార్టప్‌లకూ, గూగుల్‌కు మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. ఈ విభేదాలు భారత ఇంటర్నెట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గూగుల్‌ కొత్త నిబంధనల ప్రకారం...ఇన్-యాప్ కొనుగోళ్లకు యాప్ డెవలపర్స్ గూగుల్‌ బిల్లింగ్ సిస్టంనే వాడాలి. ఇన్-యాప్ కొనుగోళ్లల్లో 30% ఫీజుగా గూగుల్‌ బిల్లింగ్ సిస్టం తీసుకుంటుంది. సరళంగా చెప్పాలంటే గూగుల్‌ ప్లే స్టోర్‌లో డిజిటల్ కొనుగోళ్లు...సిస్టం టూల్స్ కొనుక్కోవడం లేదా ఏదైనా గేమ్‌కు కావలసిన అదనపు ఫీచర్లు కొనుక్కోవడం, ఆడియో బుక్స్ కొనుక్కోవడం...ఇలాంటి వాటిని, ఈ యాప్ డెవెలపర్స్ గూగుల్‌ బిల్లింగ్ సిస్టం ద్వారానే అమ్మాలి. వాళ్ల బిల్లింగ్ సిస్టం వాడినందుకు గూగుల్‌ ఆ అమ్మకాలలో 30 శాతాన్ని ఫీజుగా తీసుకుంటుంది.

అయితే, ఇలాంటి నిబంధనలు విధిస్తూ గూగుల్‌ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నదంటూ పలు భారతీయ స్టార్టప్ వ్యవస్థాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్‌ 30% కమీషన్ తీసుకోవడంపై స్టార్టప్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి.

గూగుల్‌ తీసుకుంటున్న కమీషన్ చాలా ఎక్కువగా ఉందని స్టార్టప్ కంపెనీలు అంటున్నాయి. ఈ కంపెనీలు.. గూగుల్‌ ప్లే స్టోర్‌కు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే కాకుండా , భారతీయ మార్కెట్లో గూగుల్‌ అధికార దుర్వినియోగంపై దర్యాప్తు చేస్తామని భారతీయ యాంటీ-ట్రస్ట్ రెగ్యులేటర్ నవంబర్‌లో ఇచ్చిన ప్రకటన స్టార్టప్ కంపెనీల ఆరోపణలకు బలం చేకూర్చింది.

అయితే గూగుల్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. భారతదేశంలోని ప్రముఖ స్టార్టప్ కంపెనీలతో ‌ సమావేశమవుతామని, వారి సమస్యలను అర్థం చేసుకునేందుకు కొన్ని ‘లిజనింగ్ సెషన్లు’ ఏర్పాటు చేస్తామని తెలిపింది.

ప్రత్యామ్నాయ యాప్ స్టోర్ తయారీ ఆలోచన ఇంకా పూర్తిగా రూపు దాల్చలేదు. కానీ తగినన్ని కంపెనీలు ఆసక్తి చూపిన్నట్లయితే కొత్త యాప్ తయారీకి భారత ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

అయితే, విడిగా యాప్ స్టోర్ తయారుచేసుకోవడం చాలా కష్టమని, ఇందులో ప్రభుత్వ జోక్యం భారత పరిశ్రమలకు, కొనుగోలుదారులకు నష్టం కలిగించొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

గూగుల్

ఫొటో సోర్స్, AaronP/Bauer-Griffin

జాతీయవాదమా లేక అవకాశవాదమా?

ఇండియాలో చిన్న స్థాయి ప్రత్యర్థుల చేతులు విరిచే ప్రయత్నం చేస్తుంటుందని గూగుల్‌పై చాలాకాలంగా ఆరోపణలున్నాయి. అయితే, గూగుల్‌ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది.

ప్రస్తుతం ప్లే స్టోర్ నిబంధనలు మార్చడంతో ఇండియన్ కంపెనీలలో మరింత అసంతృప్తి చోటు చేసుకుందని సమాచారం.

ఇండియాలో అధికశాతం స్మార్ట్‌ఫోన్లు గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారంనే వినియోగిస్తున్నాయి. యాపిల్ కంపెనీ కూడా ఉంది గానీ యాపిల్ ఫోన్లు వాడేవారి సంఖ్య చాలా తక్కువ.

సుమారు 150 మంది పారిశ్రామితవేత్తలు ఒక కూటమిగా ఏర్పడి గూగుల్ కొత్త పాలసీని వ్యతిరేకించారు. ఈ కారణంగా, గూగుల్ తన కొత్త నిబంధనల అమలును 2022 సంవత్సరానికి వాయిదా వేసింది.

ఇండియాలో ప్రసిద్ధి చెందిన స్టార్టప్ ‘పేటీఎం’, ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ సేవలు అందించే ‘మేక్‌మైట్రిప్’, పెళ్లి సంబంధాలు స్థిరపరిచే ‘భారత్ మాట్రిమొనీ’లాంటి అనేక పెద్ద పెద్ద స్టార్టప్‌లు ఈ కూటమిలో భాగం పంచుకుంటున్నాయి.

అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ కూడా..గూగుల్ వసూలు చేస్తున్న అధిక కమీషన్లకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు.

ఆపిల్, గూగుల్ ప్లే స్టోర్ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో....మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ ‘స్పాటిఫై’, గేమింగ్ కంపెనీ ‘ఎపిక్ గేమ్స్‌’తో సహా మరికొన్ని కంపెనీలు కలిసి సెప్టెంబర్‌లో, వాషింగ్టన్‌లో 'కొలియేషన్ ఫర్ యాప్ ఫెయిర్‌నెస్’ అనే సంస్థను ప్రారంభించాయి.

"ఆపరేటింగ్ సిస్టంనుంచీ యాప్స్‌దాకా ఇంటర్నెట్ ఎకోసిస్టంను గూగల్, తన చెప్పుచేతుల్లోకి తీసుకుంది. మనదరం గూగుల్ దయ మీద ఆధారపడి ఉన్నాం" అని భారత్ మాట్రిమోని వ్యవస్థాపకులు మురుగవేల్ జానకిరామన్ అన్నారు.

పేటీఎం అధిపతి విజయ్ శేఖర్ శర్మ గూగుల్ కొత్త నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బహుశా, తన కంపెనీ పేటీఎం, ‘గూగుల్ పే’నుంచీ గట్టి పోటీ ఎదుర్కోవడమే ఇందుకు కారణం కావొచ్చు.

తన విధానాలను ఉల్లంఘించినందుకు పేటీఎంను గూగుల్ సెప్టెంబరులో తన యాప్ స్టోర్‌నుంచీ తాత్కాలికంగా తొలగించింది.

"ఏ విదేశీ సంస్థ లేదా అమెరికన్ సంస్థ కూడా భారత స్టార్టప్‌ల విధి రాతను నియంత్రించే పరిస్థితి ఉండకూడదు" అని జానకీరామన్ ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

‘గోకీ ఫిట్నెస్’ యాప్ వ్యవస్థాపకులు విశాల్ గొండాల్..గూగుల్‌ను భారతదేశంలో వలసరాజ్య పాలన తీసుకొచ్చిన బ్రిటిషర్లతో పోల్చారు. "మార్పు రాబోతోంది" అని ట్వీట్ చేస్తూ హెచ్చరించారు.

అయితే, ఇదంతా కూడా ఆటలో పావులు కదపడంలాంటిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

"ఇదంతా కూడా వ్యాపారంలో భాగమే" అని మీడియానామా ఎడిటర్ నిఖిల్ పాహ్వా అభిప్రాయపడ్డారు. మీడియానామా వెబ్‌సైట్‌లో టెక్నాలజీ పాలసీకి సంబంధించిన కథనాలు ఎక్కువగా ప్రచురిస్తూ ఉంటారు.

"భారత కంపెనీలు గూగుల్ అధికార దుర్వినియోగాన్ని వ్యతిరేకించడంవరకూ బాగానే ఉందిగానీ..దీన్ని అవకాశంగా తీసుకుని జాతీయవాదాన్ని పైకి తీసుకురావడం అవకాశవాదమే అవుతుందని" పాహ్వా అన్నారు.

గూగుల్

ఫొటో సోర్స్, Anadolu Agency

ప్రత్యామ్నాయ యాప్ స్టోర్ ఆలోచన మంచిదేనా?

ఇండియన్ కంపెనీలు చేస్తున్న హడావుడి ఆశ్చర్యకరమేం కాదు. ఈ ఏడాది చైనాతో సరిహద్దు ఘర్షణలు ఏర్పడిన తరువాత...’స్థానిక సంస్థలు, విదేశీ పరిశ్రమలపై ఆధారపడడం తగ్గించాలని’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియన్ కంపెనీలు ఇంత ఆర్భాటం చెయ్యడంలో ఆశ్చర్యం లేదు.

గూగుల్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ యాప్ స్టోర్‌లను అభివృద్ధి పరచాలని పలు స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు..అక్టోబర్‌లో, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో జరిగిన సమావేశంలో ప్రతిపాదించారు.

అయితే, ప్రభుత్వ మద్దతుతో తయారయ్యే యాప్ స్టోర్ వ్యవస్థలో కొన్ని రకాల రక్షణ వలయాలుంటాయని..అవి, అంతర్జాతీయ మార్కెట్లో భారత సంస్థలు పోటీ పడేందుకు అడ్డుగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనివలన “విదేశీ యాప్స్‌పై నిషేధం” విధించే అవకాశం ఉందని, అలా జరిగితే “భారతీయ వినియోగదారులకు ఉన్న ఛాయిస్‌ను తగ్గిపోతుందని" పబ్లిక్ పాలసీ స్పెషలిస్ట్ ప్రణయ్ కోటస్థనే అభిప్రాయపడ్డారు. ప్రణయ్, బెంగళూరులోని తక్షశిల ఇన్స్టిట్యూట్‌లో రిసెర్చ్ అధిపతిగా ఉన్నారు.

అంతే కాకుండా, ఇది “దేశీయ గుత్తాధిపత్యాలను తయారుచేసే అవకాశం ఉందని" ప్రణయ్ అభిప్రాయపడ్డారు.

యాప్స్

ఫొటో సోర్స్, Getty Images

డాటా భద్రతపై సందేహాలు

ఒక యాప్ స్టోర్‌కు సంబంధించి డాటా భద్రత అతి ముఖ్యమైన అంశం. చాలా ఏళ్లుగా, గూగుల్ డాటా భద్రత విషయంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది. కానీ, ఇంకా ఇండియాలో డాటా భద్రతకు సంబంధించిన ప్రత్యేక చట్టాన్ని తీసుకురావలసి ఉంది.

ప్రత్యామ్నాయ యాప్ స్టోర్‌ను కనుక అభివృద్ధిపరిస్తే వినియోగదారుల డాటాను ఎవరు నియంత్రిస్తారు, డాటాతో ఏం చేస్తారులాంటి సందేహాలు అనేకం తలెత్తుతాయి.

"గూగుల్ స్థాయిలో డాటాను భద్రతను నిర్థారించడానికి అవసరమైన సాంకేతిక సామర్థ్యం భారత ప్రభుత్వం వద్ద లేదు" అని పాహ్వా అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ మద్దతుగల యాప్ స్టోర్ అంటే వినియోగదారుల వ్యక్తిగత డాటా ప్రభుత్వం చేతిలో ఉన్నట్టే. ఈ డాటాను ఉపయోగించి జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వం వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

"ఒక ప్రైవేట్ సంస్థకంటే మెరుగ్గా ప్రభుత్వం డాటాను భద్రపరచగలదని నమ్మడానికి కారణాలేమీ లేవు. మనకు ఒక డాటా భద్రత చట్టం అవసరం ఉంది" అని అని కోటస్థనే తెలిపారు.

డిజిటల్ ఇండియాపై గూగుల్ పట్టు

గూగుల్‌లాంటి అతి పెద్ద సంస్థను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఇండియా డిజిటల్ మార్కెట్‌పై గూగుల్ గణనీయమైన పట్టు సాధించడమే కాకుండా రోజురోజుకూ తన అడుగుజాడలను విస్తరిస్తోంది.

అంతే కాకుండా, భారత ప్రధాని మోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా ప్రోగ్రాంకు మద్దతునిస్తూ రాబోయే ఏడేళ్లల్లో ఇండియాలో సుమారు 75వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ జూలైలో ప్రకటించింది.

ఇప్పటికే సుమారు 33వేల కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడిగా పెట్టింది.

అయితే, గూగుల్‌కు కూడా ఇది కష్టకాలమే. ఈ కంపెనీ ఇప్పటికే భాతదేశంలో పలురకాల దర్యాప్తులను ఎదుర్కుంటోంది. అంతే కాకుండా, ఈ నెల ప్రారంభంలో, యూఎస్‌లో..మార్కెట్ పోటీ పద్ధతులకు వ్యతిరేకంగా నడుచుకుంటోందంటూ గూగుల్‌పై ఆరోపణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)