విజయవాడకు వరద ముప్పు తొలిగే మార్గం లేదా? ఎందుకు ఈ పరిస్థితి?

కృష్ణ వరదలు, విజయవాడ
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

నదీతీరంలో ఉన్న వారికి ఏటా ఎదురయ్యే వరద ముప్పును సమర్థంగా అధిగమించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి వంటి ప్రధాన నదుల తీరంలో ఇలాంటి కొన్ని ప్రయత్నాల ఫలితాలనివ్వడం మనం చూడవచ్చు. అయితే, విజయవాడలో మాత్రం ఆ పరిస్థితి లేదు.

గోదావరిలో ఈ ఏడాది 23 లక్షల క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేయాల్సిన సమయంలో కూడా రాజమహేంద్రవరం ధీమాగా ఉంది. నగరంలో వరద ప్రభావం దాదాపుగా లేదు. కానీ విజయవాడ దానికి భిన్నం.

ప్రకాశం బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు దిగువకు విడుదల చేస్తున్నారనగానే విజయవాడలోని కొన్ని ప్రాంతాలు వణికిపోతాయి. అవి 6, 7 లక్షల చొప్పున పెరుగుతున్న కొద్దీ నగరానికి వరద ముప్పు తీవ్రమవుతుంది. 9లక్షల క్యూసెక్కుల వరకూ చేరితో వేల కుటుంబాలు నిరాశ్రయులు కావాల్సిన స్థితి వస్తోంది.

ఈసారి 7.96లక్షల క్యూసెక్కుల వరకూ చేరి, తర్వాత శాంతించడంతో కొంత ఉపశమనం దక్కింది. లేదంటే పెద్ద నష్టమే వచ్చేది.

కృష్ణ వరదలు, విజయవాడ

ఎందుకు ఇలా జరుగుతోంది

ఇన్నాళ్లుగా ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి.. ఏం చేస్తున్నాయనే దానిపై బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పలువురి అభిప్రాయాలు సేకరించింది.

వరద ప్రమాదం ఉందన్న విషయం అంగీకరిస్తూనే శాశ్వత పరిష్కారం మీద శ్రద్ధ పెట్టకపోవడమే విజవాడలో పరిస్థితికి అసలు కారణమనే అభిప్రాయం చాలా మంది నుంచి వినిపిస్తోంది. ఇప్పటికైనా రిటైనింగ్ వాల్ సహా కీలక చర్యలకు పూనుకుంటేనే సమస్య తీరుతుందనే వాదన ఉంది.

అదే సమయంలో ప్రతీసారి పలువురు కరకట్ట వాసులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నా... కొత్తగా వచ్చిన ఆక్రమణదారులతో సమస్య కొనసాగుతుందంటున్న వారు కూడా ఉన్నారు. వాటిని నియంత్రించడంలో కార్పోరేషన్ , ఇరిగేషన్ అధికారుల వైఫల్యం వరద వచ్చిన ప్రతీసారీ సమస్యను తెస్తుందనే వాదనకు మూలంగా ఉంది.

ప్రస్తుతం పరిస్థితి ఇది...

ఇటీవల వరదల కారణంగా ఏపీలో పలు నగరాలు జలమయమయ్యాయి. నేటికీ కాకినాడ వంటి సముద్రతీర నగరాల్లో పలు కుటుంబాలు వరద నీటిలోనే నానుతున్నాయి. వారం రోజులు దాటినా వరద ప్రభావం తగ్గకపోవడంతో జనం తల్లడిల్లిపోతున్నారు.

అదే సమయంలో కృష్ణా తీరంలో ఉన్న విజయవాడ వాసుల పరిస్థితి అంతకన్నా తీవ్రంగా ఉంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన భవానీపురం వంటి ప్రాంతాలతో పాటుగా దిగువన కృష్ణలంక, రాణీగారితోట వంటి ప్రాంతాల్లో పలు ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి.

ఈసారి దీర్ఘకాలంగా వరద కొనసాగుతోంది. ఏకంగా ఐదోసారి ప్రకాశం బ్యారేజ్ నుంచి 5లక్షల క్యూసెక్కులకు పైబడి నీటిని వదులుతున్నారు. నిరుడు కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. వరుసగా రెండేళ్లుగా కృష్ణా తీరంలో వరద సమస్య పలువురిని వెంటాడుతోంది.సుమారుగా 2వేల కుటుంబాలకు చెందిన వారు ప్రస్తుతం వరద బాధితులుగా ఉన్నారు. అనేక మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొందరు మాత్రం కరకట్టపైనే తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే గడుపుతున్నారు. వర్షాలు కొనసాగుతున్న తరుణంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు.

కృష్ణ వరదలు, విజయవాడ

‘అరకొరగానే ప్రభుత్వ సహాయం’

వరదల్లో చిక్కుకున్న తారకరామా నగర్, భూపేష్ గుప్తా నగర్ కి చెందిన పలు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని వరద బాధితులు చెబుతున్నారు. గత ఏడాది ఒకరిద్దరు మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటను వచ్చినప్పటికీ, ఈసారి కనీసం మొఖం కూడా చూపించలేదని వాపోతున్నారు.

"పది రోజులుగా కరకట్ట మీదే గడుపుతున్నాం. మా ఇల్లు నీటిలో నానుతోంది. పిల్లలు, మేము అంతా టెంట్లు వేసుకుని గడుపుతున్నాం. మమ్మల్ని కార్పోరేషన్ అధికారులు పునరావాస కేంద్రాలకు రమ్మని చెప్పారు. కానీ, ఇల్లు వదిలి వెళితే ఇంట్లో ఉన్న సరుకులకు గ్యారంటీ ఉండదు. అందుకే ఇక్కడే కాపలాగా ఉంటున్నాం. మాకు వరద సహాయం అందించలేదు. ప్రభుత్వ సహాయం చేస్తే కొంత ఊరట దక్కుతుంది" అని కృష్ణలంకు చెందిన ఎం.రాజేశ్వరరావు బీబీసీతో అన్నారు.ఇతర వరద బాధితులు కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. వరద సహాయం విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

‘వరద సహాయానికి ఆంక్షలేంటి?’

వరద బాధితులకు సహాయం విషయంలో కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు.

"సాయం పొందాలంటే వారం రోజులు పైగా ఇల్లు మునిగి ఉండాలనే షరతు పెట్టడం విడ్డూరంగా ఉంది.  వరద ఒక్కరోజు వచ్చినా, వారం వచ్చినా బాధితులకు కష్టాలు తప్పవు. కాబట్టి వారిని ఆదుకోవాలి. కృష్ణా కరకట్ట వాసులకు వరద వచ్చినప్పుడు రెండు మూడు రోజుల్లోనే వరదనీరు తగ్గిపోతుందని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఈసారి వరద ఎక్కువ రోజులు కొనసాగుతోంది. కాబట్టి అందరికీ వరద సహాయం అందించాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.

కృష్ణ వరదలు, విజయవాడ

‘ఏటా వరదల బారిన పడాల్సిందేనా?’

కృష్ణా నదిలో గడిచిన దశాబ్దకాలంలో ఐదు సంవత్సరాల పాటు వరదలు వచ్చాయి. 2009 తర్వాత నిరుడు, ఈ ఏడాది పెద్ద వరదలు వచ్చాయి. అవి కూడా ఎక్కువ కాలం పాటు కొనసాగాయి. దాంతో కృష్ణానది ఒడ్డునే నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు నిరాశ్రయులవుతున్నారు. ప్రభుత్వ అధికారుల తీరు కారణంగానే ఈ సమస్య కొనసాగుతోందని సీపీఎం సీనియర్ నేత చిగురుపాటి బాబూరావు అంటున్నారు.

"వరద నిర్వహణ సరిగా జరగడం లేదు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి నిల్వ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించకపోవడంతో సందేహాలు వస్తున్నాయి. విజయవాడ నగర పరిధి వరకూ బ్యారేజ్ దిగువన రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు పార్టీలూ ఈ హామీ ఇచ్చాయి. గత ప్రభుత్వం పూర్తి చేయలేదు. ప్రారంభించి మధ్యలో వదిలేశారు. ఈ ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టడం లేదు. రిటైనింగ్ వాల్ లేకపోవడం వల్ల బ్యారేజ్ నుంచి వరద నీరు వదలగానే కరకట్టకు లోపల ఉన్న ఇళ్లన్నీ నీటిపాలవుతున్నాయి. దానికి శాశ్వత పరిష్కారం చేయాలి. కృష్ణా మురుగునీరు నదిలో కలిసేందుకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది" అంటూ వివరించారు.

రిటైనింగ్ వాల్ ఎందుకు ఆగిపోయింది?

కృష్ణా కరకట్టకు రెండు ప్యాకేజీలుగా కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. దానికి తగ్గట్టుగా గతంలో కూడా కొన్నిసార్లు ఆక్రమణలు తొలగించారు. ఇళ్లు కోల్పోయిన వారికి వివిధ ప్రాంతాల్లో ఇళ్లు కూడా కేటాయించారు.

కానీ, ఆ తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మాణంలో మొదటి ప్యాకేజ్ మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన భాగం అసంపూర్తిగా నిలిచిపోయింది. దాంతో మరోసారి కృష్ణా కరకట్టకు దిగువను ఆక్రమణలు యథావిధిగా వెలిశాయి.

అక్రమ భవనాల నిర్మాణం చేపడుతున్నప్పుడు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో అడ్డుకోవాల్సి  ఉంది. కానీ అలా జరగకపోవడంతో వరదల సమయంలో తీవ్ర నష్టం జరుగుతోంది. రాజకీయ నేతల ఒత్తిళ్లు, ఇతర కారణాలతో అధికారులు ఆక్రమణలకు అవకాశం ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి.2009 నాటి భారీ వరదలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగర వాసులకు వరద నుంచి ఉపశమనం కోసం రిటైనింగ్ వాల్ ప్రతిపాదన చేశారు. కానీ పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. ఇప్పుడు అదే వరదలకు మూలకారణం అవుతోంది.  

కృష్ణా నది వారధి నుంచి దిగువకు రెండో ప్యాకేజీ రిటైనింగ్ వాల్ నిర్మాణం త్వరలోనే చేపడతామని ఇరిగేషన్ ఈఈ జి వెంకటకుమార్ బీబీసీతో చెప్పారు.

"గతంలో రిటైనింగ్ వాల్ నిర్మించిన ప్రాంతాల్లో ఆక్రమణలకు ఆస్కారం లేకుండా చేయగలిగాం. ప్రస్తుతం రూ.100 కోట్లతో మిగిలిన భాగం కాంక్రీట్ వాల్ నిర్మాణం చేస్తున్నాం. వరదలను తట్టుకోవడానికి అనుగుణంగా నాణ్యమైన కాంక్రీట్‌తో వాల్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందుకోసం 2500 ఇళ్లను తొలగించాలి. ఇప్పటికే దానికి అనుగుణంగా ప్రయత్నాలు ప్రారంభించాం. త్వరలోనే ఈ పనులు పూర్తి చేస్తే విజయవాడ నగరం దాదాపుగా వరదల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది" అని వివరించారు.

కృష్ణ వరదలు, విజయవాడ

‘ఆక్రమణలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాం’

కృష్ణా కరకట్టకు దిగువన అనుమతుల్లేని ఇళ్ల నిర్మాణం విషయంలో కార్పోరేషన్ తరుపున పలువురిని నియంత్రిస్తున్నామని వీఎంసీ ఎస్ఈ జేవీ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

"వరదల సమయంలో నియంత్రణ కోసం ఇంజనీరింగ్ విభాగం తరుపున పలు ప్రయత్నాలు చేస్తున్నాం. బాధితులకు అవసరమైన సహాయం అందిస్తున్నాం. వరద నీరు చొచ్చుకురాకుండా ఇసుక బస్తాలు, ఇతర నియంత్రణ చర్యలు సాగుతున్నాయి. ఆక్రమణల గురించి మా దృష్టికి రాగానే వాటిని అడ్డుకుంటున్నాం. ఇప్పటికే అనేక చోట్ల ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. భవిష్యత్తులో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగితే పూర్తిగా అడ్డుకట్టపడుతుంది. ప్రభుత్వమే నగరంలో పేదలందరికీ ఇళ్లు, స్థలాలు కేటాయించే యోచనలో ఉన్న తరుణంలో ఇక ఆక్రమణలకు ఆస్కారం ఉండకపోవచ్చు" అని ఆయన వివరించారు.

‘సమగ్ర చర్యలతో వరద ముప్పు నివారించవచ్చు’

రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటుగా వరద నిర్వహణకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉందని ఇరిగేషన్ మాజీ ఇంజనీర్ వి వేణుగోపాల్ అన్నారు.

"గోదావరి వరద ఒకప్పుడు రాజమహేంద్రవరాన్ని ముంచెత్తేది. కానీ గట్లు బలపడిన తర్వాత 2006 నుంచి ఒక్కసారి కూడా ఆ నగరం వరద బారిన పడలేదు. కృష్ణా నదిలో కూడా కరకట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలి. కేవలం వరద నుంచి దిగువకు మాత్రమే కాకుండా కృష్ణలంకను ఆనుకుని నదీ తీరానికి పటిష్టమైన ఏర్పాటు అవసరం అవుతాయి. వరద నిర్వహణ విషయంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేయాలి. సిబ్బందిని నియమించాలి. ఆక్రమణల విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే విజయవాడ వరద తాకిడి నుంచి తప్పించుకునే మార్గం ఉంటుంది" అని ఆయన చెప్పారు.అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి అన్నట్టుగా కనిపించే కృష్ణా నదిలో గడిచిన రెండు సంవత్సరాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజయవాడకు చెందిన గరికపాటి విజయ ప్రకాష్ అభిప్రాయపడ్డారు.

"బ్యారేజ్‌కి ఎగువ, దిగువ ప్రాంతాల్లో వరద తాకిడి ఏటా తీరని నష్టం మిగుల్చుతోంది. దానిని నివారించే మార్గం ఉన్నా, నిర్లక్ష్యమే ముంచుతోంది. ఇకనైనా మేల్కొంటారని ఆశిస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)