నరేంద్ర మోదీకి సొంత కారు లేదు, చేతిలో ఉన్న నగదు కేవలం రూ. 31,450 - ప్రెస్ రివ్యూ

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, PTI

ప్రధాని నరేంద్ర మోదీకి సొంత కారు, అప్పులు లేవని ఈనాడు వార్తా కథనం ప్రచురించింది.

గత ఏడాదితో పోలిస్తే మోదీ ఆస్తి విలువ స్వల్పంగా పెరిగింది. ఆయనకు సొంత వాహనం లేనే లేదు. బ్యాంకుల నుంచి రూపాయి రుణం తీసుకోలేదు. చేతిలో ఉన్న నగదు కేవలం రూ. 31,450. ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితి.

ఈ ఏడాది జూన్‌ 30 నాటికి తనకున్న ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయానికి మోదీ సమర్పించారని పత్రిక రాసింది.

జూన్‌ నెలాఖరు నాటికి ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 2.85 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఆస్తి రూ. 36 లక్షలు పెరిగిందని చెప్పింది.

ప్రధాని పొదుపు ఖాతా (ఎస్‌బీఐ గాంధీనగర్‌ ఎన్‌ఎస్‌సీ శాఖ)లో రూ.3,38,173 ఉన్నాయి. అదే శాఖలో ఎఫ్‌డీఆర్‌, ఎంవోడీ బ్యాలన్స్‌ రూ.1.60 కోట్లుగా ఉంది.

ఆయనకు రూ. 8,43,124 విలువైన జాతీయ పొదుపు ధ్రువీకరణ పత్రాలు (ఎన్‌ఎస్‌సీ), రూ.1.50 లక్షల విలువైన జీవిత బీమా పాలసీలు, రూ. 20 వేల విలువైన పన్ను ఆదా ఇన్‌ఫ్రా బాండ్లు ఉన్నాయి.

మోదీ వద్ద నాలుగు బంగారు ఉంగరాలున్నాయి. వాటి బరువు 45 గ్రాములు. రుణాలేవీ తీసుకోలేదు. ఆయన పేరు మీద ఒక్క వాహనం కూడా లేదని ఈనాడు చెప్పింది.

గాంధీనగర్‌లోని సెక్టార్‌-1లో 3,531 చదరపు అడుగుల స్థలానికి మరో ముగ్గురితో కలిసి మోదీ సహ యజమానిగా ఉన్నారు.

అందులో ఆయన వాటా (25%)గా దక్కే భూమి మార్కెట్‌ విలువ ప్రస్తుతం రూ.1.10 కోట్ల వరకు ఉంటుంది.

ప్రభుత్వం నుంచి అందే రూ.రెండు లక్షల వేతనమే మోదీకి ముఖ్య ఆదాయ వనరు.

దాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టడం, వాటితో వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడులుగా పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆస్తులు తగ్గాయని కూడా ఈనాడు రాసింది.

ఆయన ఆస్తుల విలువ గత ఏడాది రూ.32.3 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి ఆ విలువ రూ.28.63 కోట్లకు పడిపోయింది.

షేర్‌ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడులకు ఎదురుదెబ్బ తగలడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

షా పేరు మీద గుజరాత్‌లో 10 స్థిరాస్తులున్నాయి. ఆయన చేతిలో కేవలం రూ.15,814 నగదు ఉంది. ఈ మేరకు తన ఆస్తుల వివరాలను షా తాజాగా వెల్లడించారని ఈనాడు వివరించింది.

ఉప్పల్‌ చెరువు నీరు

హైదరాబాద్‌లో కొట్టుకొస్తున్న మృతదేహాలు

హైదరాబాద‌లో భారీ వర్షాల, వరదలతో చనిపోయిన వారి శవాలు నీటిలో కొట్టుకొస్తున్నాయని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

ఉప్పెనలా విరుచుకుపడ్డ రాకాసి వరద కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. గల్లంతైన తమ ఆప్తుల విషయంలో వినకూడని వార్త ఎక్కడ వినాల్సి వస్తోందోనని అనుక్షణం వారు పడుతున్న ఆందోళనే చివరికి నిజమైంది.

వరదల్లో కొట్టుకుపోయిన వారు విగతజీవులుగా బయటపడుతున్నారు. హైదరాబాద్‌లో గురువారం ఒకే రోజు 12 మృతదేహాలు వెలుగుచూశాయని పత్రిక చెప్పింది.

మంగళవారం తొర్రూర్‌కు చెందిన ప్రణయ్‌ కుమార్‌ (16), జైదీప్‌ (19) బైక్‌పై తుర్కయంజాల్‌లో పొంగిపొర్లుతున్న మాసబ్‌ చెరువు అలుగు దాటేందుకు ప్రయత్నించి అందులో పడి గల్లంతయ్యారు. గురువారం ఆ చెరువులోనే ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

తారామతిపేట్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద చెట్టుకు తట్టుకొని ఓ మృతదేహం కనిపించింది. మృతుడిని హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన విపిన్‌ కుమార్‌ (27)గా గుర్తించారు. విపిన్‌ గౌరెల్లిలో ఉంటున్నాడు.

సింగరేణి కాలనీలో ఓ మృతదేహం వెలుగుచూసింది. మృతుడు మాదన్నపేట కుర్మగూడకు చెందిన హసన్‌ ఉల్లా ఖాన్‌(47). దిల్‌సుఖ్‌నగర్‌ లో ఓ బట్టల షోరూంలో పనిచేస్తున్నా డు.

బండ్లగూడ చెరువులో జే సుందర్‌రాజ్‌(68) మృతదేహం లభ్యమైం ది. ఆయన పోస్టల్‌ ఉద్యోగి. బండ్లగూడ చెరువు వద్ద అయ్యప్పనగర్‌ కాలనీలో ఉంటున్నాడని చెప్పారు.

మిగతా 8 మందిలో ఇద్దరి మృతదేహాలు బుధవారం లభ్యంకాగా గురువారం మరో 2 మృతదేహాలు లభించాయి.

మంగళవారం రాత్రి గగన్‌పహాడ్‌ అప్పలచెర్వు వద్ద వరదలో గల్లంతైన మాధవ్‌ అనే యువకుడు ఆ ప్రాంతంలోనే కొన్ని వాహనాల మధ్య మృతదేహంగా వెలుగుచూశాడని పత్రికలో రాశారు..

ఎయిర్‌పోర్టు ఉద్యోగి మాధవ్‌ శంషాబాద్‌లో ఉంటున్నారు. తల్లిని పంజాగుట్టలో బస్సు ఎక్కించి తిరుగు ప్రయాణమైన ఆయన వరద ఉధృతికి బైక్‌తో పాటు కొట్టుకుపోయారు.

ఇక శంషాబాద్‌ సుల్తాన్‌పల్లి ఎంటేరు వాగులో మంగళవారం చాకలి నర్సింహ(45) చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు.

నెక్లెస్‌ రోడ్డులోని కూకట్‌పల్లి నాలాలో 30-35 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. లైట్‌ ఆరెంజ్‌ రం గు జాకెట్‌, లైట్‌ బ్లూ లంగా ధరించి ఉంది.

నాగోల్‌ ఎస్‌టీపీ (సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) 172 ఎంఎల్‌డీ వద్ద గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి (50) మృతదేహం లభించింది.

మృతుడి శరీరంపై ఉన్న ఆనవాళ్ల ప్రకారం ముస్లిం అయిఉండొచ్చని భావిస్తున్నారు. ఉస్మానియా మార్చురీకి మృతదేహాన్ని తరలించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

గగన్ నారంగ్

ఫొటో సోర్స్, GaganNarang/Twitter

గగన్ నారంగ్ అకాడమీలోకి వాన నీరు

హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు షూటర్ గగన్ నారంగ్ అకాడమీలో ఉన్న విలువైన సామగ్రి పాడైనట్లు సాక్షి దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది.

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒలింపిక్‌ మెడలిస్ట్, షూటర్‌ గగన్‌ నారంగ్‌ 'గన్‌ ఫర్‌ గ్లోరీ (జీఎఫ్‌జీ) అకాడమీ'లోకి వరద నీరు వచ్చి చేరింది. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న తన షూటింగ్‌ రేంజ్‌లోకి వరద నీరు చేరడంతో దాదాపు రూ. 1.3 కోట్లు విలువైన షూటింగ్‌ సామగ్రి పాడైనట్లు నారంగ్‌ గురువారం వెల్లడించారని తెలిపింది.

'24 గంటల్లో అంతా నాశనమైంది. భారీ వరద మా షూటింగ్‌ రేంజ్‌ను ముంచెత్తింది. కొత్తగా తెచ్చిన 80 రైఫిల్స్, పిస్టల్స్‌ తో పాటు ఇతర సామగ్రిని పూర్తిగా పాడు చేసింది. జీఎఫ్‌జీ సిబ్బంది 9 ఏళ్ల కష్టం వరద నీటిలో కొట్టుకుపోయింది' అని ఆవేదనతో నారంగ్‌ పోస్ట్‌ చేశారని రాసింది.

ఇప్పటికే కరోనా వల్ల ఏర్పడిన నష్టం చాలదన్నట్లు... తాజా వరదలు జీఎఫ్‌జీని ఆర్థికంగా దెబ్బ తీశాయని నారంగ్‌ వ్యాఖ్యానించాడు. జీఎఫ్‌జీని ప్రపంచస్థాయి షూటింగ్‌ అకాడమీగా మార్చేందుకు తాము రాత్రింబవళ్లు కష్టపడ్డామని, ఇకపై అకాడమీని మునుపటిలా మార్చడానికి వీలవుతుందో లేదో చెప్పడం కష్టమని పేర్కొన్నట్లు సాక్షి వివరించింది..

టీఆర్పీ

న్యూస్ చానళ్ల రేటింగ్ బంద్

12 వారాలపాటు టీఆర్పీ రేటింగ్స్ ప్రకటించబోమని బార్క్ ప్రకటించినట్లు నమస్తే తెలంగాణ ఒక వార్తా కథనం ప్రచురించింది.

టీవీ చానళ్లలో టీఆర్‌పీ కుంభకోణం నేపథ్యంలో బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చి కౌన్సిల్‌(బార్క్‌) కీలక నిర్ణయం తీసుకున్నది.

అన్ని భాషల్లోని వార్తా చానళ్లకు ప్రతీవారం ఇచ్చే రేటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

12వారాల పాటు (మూడు నెలలు) రేటింగ్‌ను ఇవ్వబోమని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

ప్రస్తుతం టీవీ రేటింగ్‌ ఇవ్వడానికి గల ప్రమాణాలను సమీక్షించి, రేటింగ్‌ ప్రక్రియను ఆధునిక సాంకేతికత సాయంతో మెరుగుపర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది.

బార్క్‌ నిర్ణయాన్ని న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌(ఎన్‌బీఏ) స్వాగతించినట్లు పత్రికలో రాశారు.

బార్క్‌ నిర్ణయం సాహసోపేతమైనదని, సరైనదని వ్యాఖ్యానించింది. ఈ 12 వారాల్లో రేటింగ్‌ ప్రమాణాలను పూర్తిగా సమీక్షించి సమగ్ర మార్పులు చేయాలని ఈ సందర్భంగా కోరింది.

తప్పుడు టీఆర్‌పీలతో మోసాలకు పాల్పడుతున్నారని ముంబై పోలీసులు రిపబ్లిక్‌ టీవీ సహా మూడు టీవీ చానళ్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

టీఆర్‌పీ కుంభకోణం కేసులో పోలీసులు తమపై కేసు నమోదుచేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన రిపబ్లిక్‌ మీడియా గ్రూప్‌కు నిరాశ మిగిలిందని కూడా కథనంలో చెప్పారు.

రిపబ్లిక్‌ టీవీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుపై బాంబే కోర్టుకు వెళ్లాలని బెంచ్‌ సూచించిందన్నారు.

ప్రస్తుతం ఉన్న టీఆర్‌పీ వ్యవస్థలో టీఆర్‌పీ పాయింట్లను సులభంగా తారుమారు చేయవచ్చని, ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా టీఆర్‌పీ వ్యవస్థలేదని అధికారులు ఐటీ పార్లమెంటరీ ప్యానల్‌కు వివరించారని పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)