గండికోట ముంపు గ్రామస్థుల ఆందోళన: ‘సందకాడ డబ్బులిచ్చి, పొద్దున్నే వెళ్లిపొమ్మంటే యాటికి పోతాం?’

- రచయిత, హృదయ విహారి బండి
- హోదా, బీబీసీ కోసం
‘‘వారం, పదినాళ్ల కిందట బురదలో నాలుగు రాళ్లు పాతి, ఇది మీ స్థలం అన్నారు. ఆ బురదలో మేము, మా పశువులు యాడ ఉండల్ల? పశువుల మేపును యాడ పెట్టుకోల్ల? మేము ఆటికి పోలేము. మమ్మల్ని ఇండ్లల్లోనే పెట్టి, బయటకు రాకుండా గెడి ఏసి, అప్పుడు కూలగొట్టండి మా ఇండ్లను. ఊళ్లోనో జచ్చిపోతాం’’ అంటున్నారు తాళ్లప్రొద్దుటూరు గ్రామస్థులు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఇప్పుడు నిరసన చెలరేగుతోంది. ఈ నిరసనలో దళిత, బీసీ, అగ్రవర్ణ మహిళలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు.
కడప జిల్లా తాళ్లప్రొద్దుటూరు గ్రామ ప్రజలు గత ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి, తమకు న్యాయం చేయాలంటూ నినదిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో పోలీసులను భారీగా మోహరించారు.
గండికోట జలాశయం ముంపు గ్రామాల పునరావాస కేంద్రం.. తాళ్లప్రొద్దుటూరు గ్రామస్థుల సమస్యకు కేంద్ర బిందువుగా మారింది.
పునరావాస సహాయం అందినవారు ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, వారు వెళ్లిపోతే వారి ఇళ్లు పడగొడతామని అధికారులు చెప్తున్నారు.
‘చేతిలో డబ్బు పెట్టిన మరుక్షణమే పొమ్మంటే.. పిల్లాజల్లా, పశువులతో మేం ఎక్కడికి పోయేది?’ అన్నది రైతుల ఆవేదన.
గ్రామస్థుల ఆందోళనల కవరేజ్ కోసం బీబీసీ తెలుగు తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి వెళ్లింది.
ఆ రోజు ఉదయం, గ్రామానికి ఖాకీ రంగు పులిమినట్లు ఉంది. ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడకుండా, వారిని ఎక్కడికక్కడ ఆపేశారు. అక్కడక్కడ చిన్నచిన్న గుంపులుగా గ్రామస్థులు కనిపిస్తున్నారు.

ఊరినడిబొడ్డులోని వైఎస్సార్ కూడలి వద్ద వంద మందికి పైగా మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమంలో మహిళలు మాత్రమే ఉన్నారు. ఇద్దరు ముగ్గురు డీఎస్పీలు, కొందరు సీఐలు, ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు వారి చుట్టూ నిలబడ్డారు. మహిళలు ఒక్కొక్కరూ వచ్చి ఆ గుంపులో కలిసిపోతున్నారు.
‘మా సమస్యకు పరిష్కారం కావాలి’, ‘కలెక్టరు గ్రామానికి రావాలి’ అంటూ మహిళలు నినాదాలు చేస్తున్నారు. వీరంతా గండికోట ముంపువాసులు.
గండికోట జలాశయాన్ని 23 టీఎంసీలతో నింపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నట్లు ఆర్డీఓ నాగన్న బీబీసీతో చెప్పారు.
‘గండికోట పునరావాస కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యం మాకు శాపంగా మారింది’ అని గ్రామస్థులు వాపోతున్నారు.
‘‘మాకు నీళ్లొస్తయి అంటే, 2006లో మా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి మా ఊర్లను స్వచ్ఛందంగా డ్యాముకు రాసిచ్చినాం. ఇప్పుడు మమ్మల్నే రోడ్డున పడేస్తారా? కనీసం తాగేకి, కడుక్కునేకి కూడా నీళ్లులేని చోటికి పొమ్మంటే ఎట్ల పోతాం? జగన్ మావాడు. అతనికి తెలీకుండా అధికారులే ఇదంతా చేస్తున్నారు’’ అని గ్రామస్థుడు రెండెద్దుల రామకృష్ణా రెడ్డి బీబీసీతో పేర్కొన్నారు.
గండికోట జలాశయం కింద వున్న 22 ముంపు గ్రామాల్లో తాళ్లప్రొద్దుటూరు ఒకటి. ఇది మేజర్ పంచాయతీ. ముంపు గ్రామాల పునరావాసంలో భాగంగా తమను గ్రామం నుంచి రాత్రికిరాత్రే వెళ్లగొడుతున్నారని ప్రజలు చెబుతున్నారు.
పునరావాస సహాయం అందలేదని, పరిహారం అందినా, పునరావాస కేంద్రంలో కనీసం గుడిసె వేసుకునే సమయం ఇవ్వకుండా అధికారులు తమను వెళ్లగొడుతున్నారని, భయపెడుతున్నారని మరికొందరు చెబుతున్నారు.
గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు. అందులో ప్రస్తుతం 12.5 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఈ సంవత్సరం 23 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్డీఓ నాగన్న బీబీసీకి తెలిపారు.
రాయలసీమ ఉద్యమకారులు, మేధావుల నుంచి కూడా ఈ అంశంపై సానుకూల స్పందన కనిపిస్తోంది.
ఈ రిజర్వాయర్ కిందున్న 22 ముంపు గ్రామాల్లో మొదటి విడతలో 14, రెండో విడతలో 8 గ్రామాలకు పునరావాసం కల్పించాలి. రెండో విడతలో భాగంగా తాళ్లప్రొద్దుటూరు పునరావాస కార్యక్రమం వివాదానికి కారణమైంది.

పునరావాస సహాయం
గండికోట జలాశయంలో ప్రస్తుతం 12.5 టీఎంసీల నీటిని ఉంచారు. దీంతో తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోకి బ్యాక్ వాటర్ వచ్చి చేరింది. ఊర్లో జనం ఉండగానే అలా నీళ్లు వదలడం ఏమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
తాళ్లప్రొద్దుటూరులో మొత్తం 2,860 కుటుంబాలను పి.డి.ఎఫ్ (ప్రాజెక్ట్ డిస్ప్లేస్‌మెంట్ ఫామిలీస్)గా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరికి పునరావాస సహాయం కింద రూ. 10 లక్షలు, ఆర్ అండ్ ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్) కింద నివాస స్థలంతో పాటు రూ. 7 లక్షలు ప్రభుత్వం ఇస్తోంది.
గత నెల ఆగస్టు 23 నుంచి బాధితులకు పునరావాస సహాయం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 23 తర్వాత ఏడు రోజులకు, సహాయం పొందినవారి ఇళ్లు పడగొడతామని, వారు ఊరు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారని గ్రామస్థులు చెప్పారు.
అందుకు నిదర్శనంగా, సెప్టెంబర్ 3 రాత్రి 9.30గంటల ప్రాంతంలో అధికారులు ఓ ఇంటిని కూల్చేశారు.
ఈ ఘటనతో గ్రామస్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అధికారులు వెనక్కితగ్గారు.
తాళ్లప్రొద్దుటూరులోని 2,860 పీడీఎఫ్‌కు గాను సెప్టెంబర్ 8 నాటికి 900 మందికి పునరావాస సహాయం (వన్ టైం సెటిల్మెంట్, ఆర్.ఆర్. ప్యాకేజ్) ఇచ్చినట్లు ఆర్డీఓ నాగన్న బీబీసీకి తెలిపారు. సహాయం అందాల్సినవారు ఇంకా మిగిలుండగానే బ్యాక్ వాటర్ ఊర్లోకి రావడంతో గ్రామస్థులు భయపడుతున్నారు.

‘మేమూ మనుషులమే, మాకు చాటు వద్దా?’
వన్ టైం సెటిల్మెంట్ కింద రూ. 10 లక్షలు తీసుకున్నవారు ఊరు ఖాళీ చేయాలని, ‘ఆర్ అండ్ ఆర్’ ప్యాకేజ్ కింద రూ. 7 లక్షలు తీసుకున్నవారు, వెంటనే ఇళ్లు ఖాళీ చేసి, తాళ్లప్రొద్దుటూరుకు దగ్గర పునరావాస కేంద్రంలో వారికి కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
కానీ, అధికారులు కేటాయించిన స్థలాల్లో తాగునీరు, విద్యుత్ లాంటి కనీస వసతులు కూడా లేవని గ్రామస్థులు చెబుతున్నారు.
‘‘సామీ, మాక్కూడా నీళ్లు కావల్ల. నీళ్ల కోసమే మా ఊరిని డ్యాముకు రాసిచ్చినాం. కానీ మాకు కేటాయించిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించండి, ఆ తర్వాత మేం ఇల్లు కట్టుకుంటాం. అంతేగానీ, సందకాడ డబ్బులిచ్చి, పొద్దున్నే పొమ్మంటే యాటికి పోతాం? ఆడవాళ్లు, ముసలివాళ్లు ఉన్నారు. ఆడ కాపురం ఉండల్లంటే ఒక చాటు వద్దా?’’ అని ఒక మహిళ ప్రశ్నించారు.
‘‘మాకు ఈపొద్దుటికీ స్థలాలు రాలేదు. కానీ ఊర్లోకి నీళ్లు ఇడిసినారు. పునరావాసంలో కరెంటు లేదు, నీళ్లు లేవు. ఆక్కడ మేం ఏవల్లన పోయి ఇల్లుకట్టుకోవల్ల?’’ అని ఆందోళన చేస్తున్న గుంపులో ఉన్న రాజేశ్వరి అనే మహిళ అడిగారు.

‘మూడు రోజుల వ్యవధి చాలన్నారు’
గ్రామస్థులు చెబుతున్న విషయం గురించి ఆర్డీఓ నాగన్న దగ్గర బీబీసీ ప్రస్తావించగా.. ‘‘ఊరు వదిలిపోతామని గ్రామస్థులు మాకు కన్సెంట్ నోట్ (సమ్మతి పత్రం)పై సంతకం చేసి ఇచ్చారు. అఫిడవిట్ కూడా ఇచ్చారు. వారి సమ్మతి లేకుండా మేం ఇంత పని చేయలేం కదా. సహాయం అందిన మూడు రోజుల్లోపల ఊరు ఖాళీ చేస్తామని వాళ్లు చెప్పారు. కానీ ఇప్పుడు పోము అంటున్నారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
గతంలో, మూడు రోజుల్లో ఊరు ఖాళీ చేస్తామని కన్సెంట్ లెటర్ ఇచ్చిన గ్రామస్థులు, ఇప్పుడెందుకు నిరాకరిస్తున్నారన్న విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా పునరావాస సహాయాన్ని రూ. 12.5 లక్షలుగా ఇచ్చారు. వీళ్లకు కూడా అదే డబ్బు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు గ్రామస్థులను మభ్యపెడుతున్నారు. అందుకే వారు ఖాళీ చేయడంలేదు. గ్రామస్థులను తరలించే కార్యక్రమం బహుశా ఆగదు. ఎందుకంటే పైనుంచీ నీళ్లు వస్తున్నాయి, అది ప్రకృతి, మనం ఏమీ చేయలేం’’ అని పేర్కొన్నారు.
‘రాయలసీమకు నీళ్లు ప్రాథమికమైన అంశం’
‘‘రాయలసీమకు నీళ్లు అత్యవసరం. ఇది ప్రాథమికమైన అవగాహన, అంశం కూడా. గతంలో రాయలసీమకు నీళ్లు అన్నది ఓ ఎండమావిలా కనిపించేది. కానీ ఇప్పుడు సీమకు నీళ్లు వచ్చే సానుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. కృష్ణా, గోదావరి నదులకు ఒకే కాలంలో వరద రావడం అంటే ఇది ‘లక్కీ ఇయర్’ అని నా భావన. అలా అని ముంపు ప్రాంతాల ప్రజలను రోడ్డున పడెయ్యలేం. ఇప్పటికే ఆర్ అండ్ ఆర్ పూర్తయ్యుంటే బాగుండేది. ఒక్క గండికోట మాత్రమేకాదు, రాష్ట్రంలో చాలా ప్రాజెక్టుల్లో పరిస్థితి ఇలానే ఉంది. ప్రభుత్వం రైతులతో మాట్లాడి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలి’’ అని పేరు ప్రస్తావించడానికి ఇష్టపడని నీటిపారుదల రంగ నిపుణులు బీబీసీతో వ్యాఖ్యానించారు.

‘పెండ్లికూతురిలా మిమ్మల్ని సాగనంపుతాం అన్నారు’
‘‘ఆగస్టు 7వ తేదీన కలెక్టర్ వచ్చి, ఊర్లో మీటింగ్ పెట్టినాడు. ఆగస్టు 14కు అందరికీ డబ్బులు యేచ్చామని, అక్టోబర్ 15కు ఊరు ఖాళీ చేయమన్నాడు. దానికి మేము ఒప్పుకోలేదు. మీ ఒప్పుదలతో సంబంధం లేదు, నీళ్లు మాత్రం ఊర్లోకి వస్తాయి జాగ్రత్త అని అధికారులు హెచ్చరిస్తే, వచ్చే డబ్బులు కూడా పోతాయేమో అన్న భయంతో అందరూ వాళ్లు చెప్పినచోట సంతకాలు పెట్టినారు’’ అని రెండెద్దుల రామకృష్ణారెడ్డి అన్నారు.
తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో గత ఎన్నికల్లో 3,000 ఓట్లు పడితే, అందులో వైఎస్ జగన్‌కు 1,600 ఓట్ల మెజారిటీ వచ్చిందని రామకృష్ణారెడ్డి బీబీసీతో అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ ఊరితో మంచి సంబంధాలు ఉండటమే అందుకు కారణమని చెప్పారు.
‘‘జగన్ మావాడు, ఈ ఊరంటే ఆయనకు అభిమానం. ఆయనకు తెలీకుండా అధికారులే ఇదంతా చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి డ్యాము కడతాన్నాడంటే మేమంతా స్వచ్ఛందంగా డ్యాముకు మా ఊర్లను రాసిచ్చినాం. 2008లో మేం రాసిచ్చిన భూములకు, ఎకరం తోటకు 1.5 లక్షలు, చేనుకు 75 వేలు ఇచ్చినారు. ఇప్పుడు అదే భూమి ఎకరం 10 లక్షలు పలుకుతాంది. కానీ ఇప్పటి రేట్ల ప్రకారం పరిహారం ఇమ్మంటున్నామా? అట్ల డబ్బులు పెంచమని అడిగేకి మొగం చెల్లదు మాకు’’ అని తెలిపారాయన.
‘‘మేము అడుగుతాంది ఒక్కటే.. సంవత్సరం టైం ఇస్తే, మీరు చూపించిన భూముల్లో ఇల్లు కట్టుకుంటాం. అబ్బుడు మీకు ఇష్టమొచ్చినన్ని నీళ్లు ఇడుసుకోండి. నీళ్లు మాకూ అవసరమే. రాజశేఖరరెడ్డి గండికోట రిజర్వాయర్ కోసం మా భూములు అడిగేకి ఒకసారి ఊరికి వచ్చినాడు. అప్పుడు ఆయన ఒక మాట ఇచ్చినాడు... ‘డ్యాం పూర్తయ్యి, నీళ్లు ఇడిసేనాటికి కొత్త పెళ్లికూతుర్ని సాగనంపినట్ల మిమ్మల్ని కూడా ఊరు దాటిస్తాం’ అన్నాడు’’ అని రామకృష్ణారెడ్డి వివరించారు.
తాళ్లప్రొద్దుటూరు రైతులకు మద్దతుగా మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ పోరాడుతున్నారు.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘పునరావాస కేంద్రంలో అన్ని వసతులు కల్పించి, బాధితులు ఇళ్లు కట్టుకున్నాకనే పునరావాసం పూర్తయినట్లు. అంతవరకూ ముంపు గ్రామాల జోలికి పోకూడదు. గండికోట జలాశయం కోసం భూములిచ్చిన రైతులకు 2008లో పరిహారం అందించారు. కానీ పునరావాసం గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మళ్లీ 12 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మీకు సమయం లేదు.. వెళ్లిపోండి అంటున్నారు’’ అని ఆమె చెప్పారు.
గండికోట రిజర్వాయర్ పునాదిరాళ్లకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్ హయాంలో మూడుసార్లు ఈ ప్రాజెక్టుక శంకుస్థాపన చేశారని గ్రామస్థులు చెబుతున్నారు.

‘ఒక్క రోజే మూడు చావులు’
తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో ఒకవైపు నిరసనలు, ఆందోళనలు జరుగుతుంటే, మరోవైపు దళితవాడలో ఒకే రోజు ముగ్గురు వృద్ధులు మరణించారు. మరణించిన వారికి అంత్యక్రియలు చేయడం కుటుంబ సభ్యులకు పెద్ద సవాలుగా మారింది.
ఆ గ్రామంలో దళితులకున్న శ్మశాన స్థలమే కాస్త. ఆ కాస్త శ్మశానం కూడా గండికోట బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయింది. దీంతో తమ తల్లిని, తండ్రిని, భర్తను ఎక్కడ పూడ్చిపెట్టాలో తెలియక భార్యాబిడ్డలు దిక్కులు చూశారు. మునిగిపోయిన శ్మశానం సమీపంలో పూడ్చడానికి ఎక్కడ గుంత తీసినా నీళ్లు ఊరుతున్నాయని, చివరికి చేసేదేమీ లేక, ఆ నీళ్లలోనే తమవారిని సమాధి చేసి వచ్చామని ఈశ్వరయ్య అనే వ్యక్తి బీబీసీకి చెప్పారు.
‘‘నిన్న పొద్దున మా అమ్మ చనిపోయింది. ఆమెను శ్మశానానికి తీసుకుపోయేకి చానా కష్టపడినాం. చానా దుర్మార్గం అనిపించింది సార్. మాకు ఇంతవరకూ ఆర్ఆర్ ప్యాకేజీ అందలేదు. వీళ్లేమో ఊరు ఖాళీ చేయమంటున్నారు. మా అమ్మ చనిపోయింది, మా శ్మశానం మునిగిపోయింది. మేము ఏం చేయల్ల? చేసేదిలేక, ఆ నీళ్లలోనే బూడ్చివస్తిమి. కనీసం కొత్తగా ఇచ్చే ఆర్ఆర్ ఇళ్ల స్థలాల్లోనైనా దళితులకు శ్మశానానికి స్థలం ఈయల్ల సార్’’ అని ఈశ్వరయ్య కోరారు.
ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద మౌలిక వసతులు కల్పించాలని ఊరంతా డిమాండ్ చేస్తోంటే, ఆ ఇళ్లస్థలాల్లో దళితులకు శ్మశానం కేటాయించాలని ఈశ్వరయ్య కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ఎన్నికలు: భారతీయ హిందూ ఓట్లు ట్రంప్‌కేనా.. డెమొక్రాట్లు భయపడుతున్నారా
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు
- ‘సెల్ఫిష్’ మాస్క్‌లు: ఇవి వాడుతున్న వాళ్లు మీ పక్కన ఉంటే జాగ్రత్త..
- కోవిడ్ చికిత్సకు ఆరోగ్య బీమా పని చేస్తుందా? హాస్పిటల్ నిరాకరిస్తే ఏం చేయొచ్చు?
- అన్నం తింటే డయాబెటిస్ వస్తుందా
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- ‘సెల్ఫిష్’ మాస్క్‌లు: ఇవి వాడుతున్న వాళ్లు మీ పక్కన ఉంటే జాగ్రత్త..
- శరీరంలో కరోనావైరస్ చనిపోయినా.. టెస్టుల్లో ‘పాజిటివ్’ అని తప్పుగా వస్తోందా?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- హైపర్సోనిక్ స్క్రామ్‌జెట్ టెక్నిక్.. ధ్వనికన్నా ఐదు రెట్ల వేగం గల క్షిపణులతో భారత్ సాధించేదేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








