కరోనా వైరస్: టెస్టుల పేరుతో తీసుకెళ్లి అవయవాలు కాజేస్తున్నారని వదంతులు.. పంజాబ్‌లో ఆగిపోయిన టెస్టులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరవింద్ ఛాబ్రా
- హోదా, బీబీసీ పంజాబీ
కరోనా టెస్టుల పేరుతో ప్రజల అవయవాలను మాయం చేస్తున్నారని వదంతులు వ్యాపించడంతో పంజాబ్ రాష్ట్రంలో కోవిడ్-19 టెస్టులు ఆగిపోయాయి.
అక్కడ ప్రచారమవుతున్న వదంతులు, దానివల్ల ప్రభుత్వ సిబ్బందికి కలుగుతున్న ఇబ్బందులపై బీబీసీ పంజాబ్ ప్రతినిధి అరవింద్ ఛాబ్రా వివరించారు.
“శరీరంలోని అవయవాలను తీసుకుంటున్నారు. ఒక్క మా ఊరే కాదు, ప్రపంచమంతా దీని గురించి భయపడుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా ఇవే వార్తలు’’ అని సంగ్రూర్ జిల్లాకు చెందిన మహిళ సోనియా కౌర్ బీబీసీతో అన్నారు.
కరోనా వైరస్‌కు టెస్టులు, ట్రీట్‌మెంట్ చేస్తామని చెప్పి శరీరంలోని అవయవాలు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తాను విన్నానని కౌర్ అన్నారు. ఈ వదంతులు వినడంతో ఆమె తన గ్రామంలోని మిగిలిన ప్రజల్లాగే ఆమె కూడా టెస్టులు, చికిత్స అంటే భయపడుతున్నారు.
కరోనా వైరస్ విషయంలో పంజాబ్‌లో అనేక వదంతులు వేగంగా వ్యాపిస్తున్నాయి.
కరోనా అనేది అసలు లేదని కొందరు చెబుతుండగా, టెస్టుల్లో కరోనా సోకలేదేని తేలినవారిని తీసుకెళ్లి చంపి, అవయవాలు కాజేస్తున్నారని, శవాలను గుర్తు తెలియని ప్రాంతాలలో పడేస్తున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ తరహా వదంతులు, భయాలను వ్యాపింపజేయడానికి సోషల్ మీడియాను ముఖ్యంగా వాట్సప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
కల్పిత, తప్పుడు వీడియోలను జత చేసి ఇదే ఆధారం అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.
ఈ వదంతులతో కొన్నిచోట్ల ఆందోళనలు, మరికొన్నిచోట్ల ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరిగాయి. వైద్య సిబ్బందిని తమ గ్రామంలోకి రానివ్వని అనేక పల్లెల్లో సంగ్రూర్ జిల్లాలో సోనియా కౌర్ నివసిస్తున్న గ్రామం ఒకటి.
ఇటీవల టెస్టులు చేయడానికి వచ్చిన మెడికల్ సిబ్బందిపై రాళ్లు విసిరి, టెస్టులు వద్దంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు. దీంతో వారు పరీక్షలు జరపకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దని ప్రభుత్వం వీడియోల రూపంలో విజ్జప్తి చేస్తోంది. అనేక అవగాహన కార్యక్రమాలను మొదలుపెట్టింది. “ఇవన్నీ ఆధారంలేని వార్తలు’’ అని పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధు బీబీసీతో అన్నారు.
“కోవిడ్‌తో మరణించిన వ్యక్తిని తాకడానికి కూడా అవకాశం ఉండదు. చనిపోయిన వ్యక్తిని నేరుగా స్మశానానికే తీసుకెళతారు. అవయవాలు తీసుకోవడమనే ప్రశ్నే ఉండదు’’ అని ఆరోగ్యమంత్రి స్పష్టం చేశారు.
కోవిడ్-19 విషయంలో వదంతులు పంజాబ్‌కు కొత్తకాదు. టెస్టుల మీద వ్యతిరేకత రాష్ట్రమంతా విస్తరిస్తోంది. ఈ కారణంగా వైరస్‌వ్యాప్తిని అడ్డుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 65,583 కేసులు నమోదు కాగా, 1,923మంది చనిపోయారు. గత కొద్దివారాలుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. టెస్టుల్లో ఆలస్యంగా జరగడమే ఇందుకు కారణమని, కొందరు వైరస్ బాధితులు ఆసుపత్రికి చాలా ఆలస్యంగా వస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
కరోనా అనేది ఒట్టి అబద్ధమని పంజాబ్‌కు చెందిన 60 ఏళ్ల సుచాసింగ్ ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నారు. ఆయన భార్య ఇటీవలే కోవిడ్-19 కారణంగా మృతి చెందారు.
“కరోనా అనేది లేనేలేదు. అదే నిజమైతే నా భార్య తల్లి 80 ఏళ్ల వృద్ధురాలు. ఆమె కూడా మరణించి ఉండాల్సింది కదా’’ అని సుచాసింగ్ ప్రశ్నించారు.
ఆరోగ్యం బాగాలేదని చెబితే ఆమెను ఇంటి నుంచి లాక్కెళతారేమోనన్న భయంతో తాను ఆమెను ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదని సుచా సింగ్ చెప్పారు. “ఆమెకు షుగర్ వ్యాధి ఉంది. దానికి చికిత్స చేయకుండా కరోనా కరోనా అంటూ గొడవ పెడుతున్నారు’’ అని సుచాసింగ్ అన్నారు.
కరోనా పేరుతో ఏదో జరుగుతోందని అనుమానిస్తున్నారు సుచాసింగ్. “డాక్టర్లు, వైద్య సిబ్బంది కావాలనే కేసులను ఎక్కువ చేసి చూపిస్తున్నారు. దానికి వారికి డబ్బులు అందుతున్నాయి. జనాన్ని ఇంటి నుంచి లాక్కెళ్లి చంపేస్తున్నారు ’’ అని సుచాసింగ్ ఆరోపించారు.
కోవిడ్-19 కు సంబంధించిన ఒకరి నుంచి ఒకరికి చేరుతున్న సమాచారం, వివిధ వయసులు, ప్రాంతాలు, వయో వర్గాలపై దాని ప్రభావం ఈ వదంతులు మరింత వ్యాపించేలా చేస్తున్నాయి.
“ఇంతకు ముందు వృద్ధులు మాత్రమే చనిపోతారని చెప్పారు. ఇప్పుడు యువకులు కూడా కరోనా పేరుతో చనిపోతున్నారు. హఠాత్తుగా యువకులకు కూడా ఇది ఎందుకు సోకుతోంది’’ అని గ్రామ పెద్ద సత్పాల్ సింగ్ ధిల్లాన్ ప్రశ్నించారు.
ఊళ్లోకి వైద్య సిబ్బందిని అనుమతించరాదని ఆయన గ్రామ పంచాయతీ తీర్మానించింది.

“మా ఊళ్లో ఒక పెద్దాయన చనిపోతే, ఆయన మృతదేహం స్థానంలో ఒక మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా నమ్ముతారు’’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ రూమర్లకు మూలాలేంటో ఎవరికీ తెలియదు. ఒకవేళ నిజంగానే మృతదేహాలు తారుమారైన ఘటనలు జరిగి ఉండవచ్చు. అది కేవలం పొరపాటు కావచ్చు.
జులైలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రి మృతదేహం స్థానంలో ఒక స్త్రీ మృతదేహాన్ని తమకు ఇచ్చారని ఆరోపించారు. తమ తండ్రి చనిపోలేదని, ఆయనను దాచిపెట్టి ఒక మహిళ డెడ్‌బాడీని తమకు ఇచ్చారని వారు ఆరోపించగా, దానిపై విచారణ జరిగింది.
అయితే మృతదేహాలు తారుమారయ్యాయని, వారి తండ్రి మృతదేహాన్ని మహిళ కుటుంబ సభ్యులు దహనం చేశారని విచారణ తర్వాత తేలింది.
ఇలాంటి వదంతులు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. “మేం టెస్టులను వ్యతిరేకించం. కానీ వ్యాధి వచ్చిన వారిని బలవంతంగా ఇళ్ల నుంచి లాక్కెళ్లడాన్నితీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని మోగా జిల్లాకు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ కోక్రి అన్నారు.
“మామూలుగా తీసుకెళ్లి తీసుకొస్తే ఇబ్బంది లేదు. కానీ అవయవాలు తీసి, మృతదేహాలు పంపిస్తున్నారు’’ అని సుఖ్‌దేవ్ ఆరోపించారు.
నిరసనలను అడ్డుకోడానికి, ప్రజలను భయపెట్టడానికి ప్రభుత్వం కోవిడ్-19 కేసులను ఎక్కువ చేసి చూపిస్తోందని సుఖ్‌దేవ్ అంటారు.
ఇలాంటి వదంతులను ఎవరు పుట్టిస్తారో,ఎందుకు పుట్టిస్తారో అర్ధంకావడం లేదని అధికారులు తలపట్టుకుంటున్నారా.
“ గతంలో పోలియో, రూబెల్లా వ్యాక్సిన్‌లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రచారాలే జరిగాయి’’ అని పంజాబ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరక్టర్ అర్వీందర్ గిల్ అన్నారు.
“ పోలియో టీకాలు పిల్లలను నపుంసకులుగా మారుస్తాయని అప్పట్లో వదంతులుండేవి. రూబెల్లా టీకా వల్ల జ్వరాలు వస్తున్నాయని ప్రజలు ఆరోపించేవారు. అప్పట్లో వైద్య సిబ్బందిని చాలాచోట్ల అడ్డుకున్నారు కూడా’’ అని తన అనుభవాలను అర్వీందర్ గిల్ వివరించారు.
ప్రజలు ఇలా వదంతులను నమ్మడం ప్రమాదకరమని అర్వీందర్ గిల్ అన్నారు. “వాళ్లలో చాలామంది కోవిడ్‌తో ఉంటారు. అంతా తిరిగేస్తారు. అందరికీ వ్యాపిస్తుంది. తీరా ఆరోగ్య పరిస్థితి జటిలమయ్యాక ఆసుపత్రికి రావడం వల్ల ప్రయోజనం ఉండదు’’ అని గిల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- ‘రూ.6 లక్షలు బిల్లు.. మొత్తం కట్టి, శవాన్ని తీసుకెళ్లండి..’ కరోనా రోగి బంధువులకు ఓ ప్రైవేటు ఆస్పత్రి అల్టిమేటం
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








