అమ్మోనియం నైట్రేట్: విశాఖ రేవుకు జోరుగా దిగుమతులు, విజయవాడలో భారీ నిల్వలు

విశాఖ ఓడరేవులో సరకుతో ఓడ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విశాఖ ఓడరేవులో సరకుతో ఓడ
    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

లెబనాన్ రాజధాని బేరూత్‌లో జరిగిన పేలుళ్లు ప్రపంచాన్ని వణికించాయి. ఒక్కసారిగా పేలిన అమ్మోనియం నైట్రేట్ తీవ్ర విషాదాన్ని, తీరని నష్టాన్ని మిగిల్చింది. అంత ప్రమాదకరమైన అమ్మోనియం నైట్రేట్‌ రసాయనం ఆంధ్రప్రదేశ్‌కు కూడా భారీగా దిగుమతి అవుతుండడం కలవరపరుస్తోంది.

దేశంలోని వివిధ ప్రాంతాల అవసరాల కోసం అమ్మోనియం నైట్రేట్ విశాఖ రేవుకు దిగుమతి అవుతోంది.

దేశంలో దీన్ని దిగుమతి చేసుకునే ఏకైక రేవు విశాఖ. రెండు దశాబ్దాల కిందట దేశంలోని దాదాపు అన్ని రేవుల్లో అమ్మోనియం నైట్రేట్ దిగుమతి జరిగేది.

కానీ తగిన రక్షణ, నిల్వ సామర్థ్యం, రవాణా అవకాశాలు దృష్టిలో పెట్టుకుని తర్వాత విశాఖ పోర్టుకి మాత్రమే అనుమతినిచ్చారు.

దాంతో ప్రస్తుతం దేశంలో అమ్మోనియం నైట్రేట్ దిగుమతులకు విశాఖ కేంద్రంగా మారింది.

దేశీయ అవసరాల్లో 85 శాతం స్థానికంగా తయారవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మిగతా 15 శాతం అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్నారు.

విశాఖ ఓడరేవు

ఫొటో సోర్స్, SipraDas

ఫొటో క్యాప్షన్, విశాఖరేవు

విశాఖ రేవుకు గత కొన్నేళ్లుగా ఏడాదికి సగటున 2.7 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అవుతోంది.

2017-18లో 2,75,822 టన్నులు, 2018-19లో 2,60,505 టన్నుల అమ్మోనియం దిగుమతైంది. విశాఖ రేవుకు దిగుమతైన తర్వాత దీనిని చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణా, బిహార్ లాంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

మొదట పోర్టు నుంచి గోడౌన్లకు తరలించి అక్కడ నిల్వ చేస్తారు. విశాఖలో అమ్మోనియం నిల్వ కోసం మొత్తం 7 గోడౌన్లున్నాయి. వాటిలో ఒక్కోదానికీ 30వేల టన్నుల సామర్థ్యం ఉంది.

అమోనియం నైట్రేట్‌ను ఎందుకు ఉపయోగిస్తారు,

అమ్మోనియం నైట్రేట్‌ను సాధారణంగా ఎరువుల తయారీలో వినియోగిస్తారు. కానీ గనులు, భవన నిర్మాణాలకు జరిపే పేలుళ్లలోనూ దీన్ని వాడుతున్నారు.

దీనిని వైద్య సేవల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అందుకే నైట్రేట్‌కు చాలా డిమాండ్ ఉంది.

పేలుడు స్వభావం, ప్రమాదకరమైన పదార్థం కావడంతో దీనిపై కఠిన ఆంక్షలున్నాయి. దీని తయారీకి చాలా అనుమతులు కావాలి. జనసమ్మర్థ ప్రాంతాల్లో దీనిని నిల్వ చేయడానికి అనుమతించరు.

2012లో దీనికి సంబంధించిన నియమావళిని రూపొందించారు. పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ వాటిని పర్యవేక్షిస్తుంది.

అయితే, చాలా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కోసం అమోనియం నైట్రేట్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో అమ్మోనియం నైట్రేట్ తరలిస్తున్న ట్రక్కులు మాయమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అమ్మోనియం నైట్రేట్ అక్రమంగా తరలిస్తున్న ట్రక్కులు పోలీసులకు చిక్కాయి.

విజయవాడలోనూ నిల్వ

ఇక రాష్ట్రంలోని విజయవాడ పరిసరాల్లో జరిగే వివిధ మైనింగ్ పనుల కోసం నైట్రేట్‌ను కొండపల్లి గ్రామంలోని గోడౌన్లలో నిల్వ చేస్తున్నారు.

దానిని వివిధ అవసరాల కోసం అక్కడి నుంచి నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

విశాఖలో లంగరు వేసిన నౌక

ఫొటో సోర్స్, Getty Images

నిబంధనలను నీరుగార్చేస్తున్నారు..

విశాఖలో అమ్మోనియం నైట్రేట్ నిల్వల అంశాన్ని ఏడెనిమిదేళ్లుగా పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నిబంధనలు రూపొందించామని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ‘బీబీసీ’కి చెప్పారు.

“విశాఖలో నైట్రేట్‌ను నిల్వ చేసిన ప్రాంతం అత్యంత కీలకమైనది. షిప్‌యార్డ్, విమానాశ్రయం, తూర్పు నావికాదళ కేంద్రం, హెచ్‌పీసీఎల్ దానికి అతి సమీపంలో ఉన్నాయి. అప్రమత్తంగా లేకపోతే పెను విపత్తు తప్పదు.

ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చాక గతంలో బల్క్ దిగుమతుల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం బస్తాల్లో దిగుమతి చేస్తున్నారు. కానీ నిల్వ చేసే దగ్గర తగిన పర్యవేక్షణ లేదు.

ఇటీవల విశాఖలో జరుగుతున్న ప్రమాదాలను గమనిస్తే నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గోడౌన్లను నిర్వహించే ప్రైవేటు యాజమాన్యాలు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి.

దీనిని చాలాసార్లు కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లినా, తగిన స్పందన కనిపించడం లేదు.

బేరూత్ లో 2,750 టన్నుల అమోనియం నైట్రేట్ పేలితే జరిగిన నష్టం చూశాం. కానీ విశాఖకు దానికి పది రెట్లు దిగుమతి అవుతోంది.

విశాఖకు అంతకంటే ముప్పు ఉంది” అని హెచ్చరించారు.

షిప్‌యార్డ్‌లో సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

జాగ్రత్తలు తీసుకుంటున్నా దినదిన గండం..

దీనికి తగిన భద్రత ప్రమాణాలు పాటించడం అత్యంత కీలకం అని ఆంధ్రా యూనిర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ పీజే రావు చెబుతున్నారు.

“సాధారణ పరిస్థితుల్లో అమ్మోనియం నైట్రేట్ పేలదు. కానీ అది ఇతర రసాయనాలతో కలిస్తే ప్రమాదం. కాబట్టి భద్రతా ప్రమాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

దిగుమతులు పరిమితి దాటకుండా చూడాలి. దానిని నిల్వ ఉంచే ప్రాంతం పూర్తి రక్షణలో ఉండాలి. సీల్ చేసిన సంచుల్లో నిర్దేశిత సమయంలో రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే చిన్నపాటి అలక్ష్యం కూడా పెద్ద విపత్తుకి కారణం అవుతుంది. దానికి తగ్గట్టు చాలా అప్రమత్తత అవసరం” అన్నారు.

బేరూత్ ప్రమాదం తర్వాత దృశ్యం

ఫొటో సోర్స్, THIBAULT CAMUS

ఫొటో క్యాప్షన్, బేరూత్ ప్రమాదం తర్వాత దృశ్యం

నిల్వ ఉంచడం లేదు, దిగుమతి సమయంలో నిబంధనలు పాటిస్తున్నాం

దేశంలోనే నైట్రేట్ దిగుమతులు చేసుకుంటున్న ఏకైక రేవు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహన్ రావు బీబీసీకి తెలిపారు.

“నైట్రేట్‌ను మా దగ్గర నిల్వ ఉంచడం లేదు. దిగుమతి సమయంలో ఫైర్ బ్రిగేడ్‌కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఎప్పుడూ సమస్య రాలేదు. దీనిపై భద్రతా విభాగం ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. పోర్ట్ బయట ప్రైవేటు గోడౌన్లలో దీనిని నిల్వ చేస్తున్నాం. వాటిని పెసో పర్యవేక్షిస్తుంద”ని చెప్పారు.

లెబనాన్ పేలుడు

ఫొటో సోర్స్, Str

20 ఏళ్లలో చిన్న ప్రమాదం కూడా జరగలేదు

నైట్రేట్ విషయంలో విశాఖ హ్యాండ్లింగ్ పాయింట్ మాత్రమేనని, ప్రమాదాలకు అవకాశం లేదని శ్రవణ్ షిప్పింగ్స్ ఎండీ సాంబశివరావు ‘బీబీసీ’కి చెప్పారు.

“ఇరవై ఏళ్లుగా హ్యాండ్లింగ్ ఎగుమతుల ఏజన్సీగా ఉన్నాం. ఎప్పుడూ ప్రమాదాలు జరగలేదు. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. నిబంధనలు అనుసరిస్తున్నాం.

పెద్ద మొత్తంలో నిల్వ ఉంటే ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. కానీ విశాఖలో దిగుమతి అయిన నెల రోజులకే ఆయా ప్రాంతాలకు తరలిస్తాం. బేరూత్ ప్రమాదానికి ఆరేళ్లుగా అక్కడ నైట్రేట్ నిల్వ ఉండడమే కారణమని తేలింది. మన దగ్గర ఆ పరిస్థితి ఉండదు.

రవాణాలో కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాకే రవాణా చేస్తుంటాం. దిగుమతి, తరలించడం బ్యాగుల ద్వారానే జరుగుతుంది. వాహనాలకు జీపీఎస్ కూడా ఉపయోగిస్తున్నాం. ఇది పక్కదారి పట్టే అవకాశం లేదు” అంటూ వివరించారు.

అమ్మోనియం నైట్రేట్

ఫొటో సోర్స్, Getty Images

విజయవాడలో నిల్వ చేయడంపై స్థానికుల అభ్యంతరం

విజయవాడలో కూడా నిల్వలు విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న కొండపల్లి గ్రామంలో కూడా నైట్రేట్ నిల్వలకు అనుమతించారు. అక్కడ 100 మెట్రిక్ టన్నులు నిల్వ చేయడానికి వీలుగా తులసీదాస్ ఐ అండ్ టీ అసోసియేట్స్ సంస్థకు చెన్నై ఎగ్మూర్‌లోని పెసో సంస్థ నుంచి నుంచి అనుమతులు వచ్చాయి.

కృష్ణా జిల్లా యంత్రాంగం కూడా దానికి అంగీకరించడంతో 2015 నుంచి దానిని నిల్వ చేస్తున్నట్టు చెబుతున్నారు.

దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫోరమ్ బెటర్ విజయవాడ ప్రతినిధి ఎస్ కే అలీషా దీనిపై బీబీసీతో మాట్లాడారు.

“ఈ గోడౌన్ల నిర్మాణంపై అభ్యంతరం చెప్పాం. వాటికి అనుమతివ్వడం శ్రేయస్కరం కాదన్నాం. అర కిలో నైట్రేట్‌కి ఇతర రసాయనాలు కలిస్తే. జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ 100 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచుతున్నారు.

జిలిటెన్ స్టిక్స్ వంటి పేలుడు పదార్థాలకు ఇది గోడౌన్‌గా ఉంది. మైనింగ్ అవసరాల కోసం సమీపంలోని చారిత్రక ప్రాంతం కొండపల్లిని ఉపయోగించడం పెను ప్రమాదాన్ని నెత్తిన పెట్టుకున్నట్టే. అది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు చేరువలో ఉండడం , మావోయిస్టుల ప్రభావం కూడా ఉండడంతో అప్పట్లోనే దానికి అభ్యంతరం చెప్పాం. కానీ వినలేదు. బేరూత్ ప్రమాదం తర్వాత కూడా మనం మేలుకోకపోతే తీరని ముప్పు పొంచి ఉన్నట్టే భావించాలి” అన్నారు అలీషా.

మరోవైపు జిల్లా జాయింట్ కలెక్టర్ మాత్రం విజయవాడలో అమ్మోనియం నైట్రేట్ నిల్వల విషయం వాస్తవమేనని, తగిన నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.

అటు విశాఖ, ఇటు విజయవాడలో అధికారికంగా నిల్వ చేసినప్పటికీ, వేరే చాలా ప్రాంతాల్లో నైట్రేట్‌ను అనధికారికంగా నిల్వ చేస్తున్నారని, అక్రమంగా రవాణా చేసేతూ వినియోగిస్తున్నారని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకుని, నైట్రేట్ అక్రమ వినియోగం అడ్డుకోకపోతే, చిన్నపాటి నిర్లక్ష్యానికి బేరూత్ లాంటి విధ్వంసం చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

విశాఖలో నిల్వలు

ఫొటో సోర్స్, Ani

విశాఖకు అమోనియం నైట్రేట్ ముప్పు లేదు

మరోవైపు విశాఖలో అమోనియం నైట్రేట్ నిల్వలను పరిశీలించాలన్న జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశాలతో శుక్రవారం నగర ఆర్డీవో, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, ఇనస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మిందిలో ఉన్న అమోనియం నైట్రేట్ ఫెసిలిటేటర్ శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గోదామును పరిశీలించారు.

అందులో ప్రస్తుతం 18,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంది. విదేశాల నుంచి దిగుమతైన దీనిని గోదాంలో నిల్వచేసి, బయటి రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత ఏజెన్సీలకు సరఫరా చేస్తారు. అమోనియం నైట్రేట్ కోసం విదేశాలకు ఆర్డర్ చేసిన ఇతర రాష్ట్రాల్లోని సంస్థలు నెల రోజుల్లో దానిని తీసుకెళ్లాల్సి ఉంటుంది.

గోడౌన్‌ను పరిశీలించిన అధికారులు ఇతర సాంకేతిక అంశాలను అంచనా వేసి నగరానికి దీంతో ముప్పు లేదని తేల్చారు. ఉష్ణోగ్రత సుమారు 270 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటినప్పుడు మాత్రమే ఆ లవణం మండుతుందని చెప్పారు.

అయితే, విపత్తుల శాఖతో మరింత లోతుగా పరీక్షలు చేయించి అగ్ని మాపక అధికారుల ద్వారా మరింత పక్కాగా ముందస్తు ప్రమాద నివారణ చర్యలు అమలు చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)