కరోనావైరస్ కారణంగా ఈ ఏడాది అమరనాథ్ యాత్ర రద్దు

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయాలని అమరనాథ్ దేవాలయ బోర్డు నిర్ణయించింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము నేతృత్వంలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక జర్నలిస్టు మాజిద్ జహంగీర్ వెల్లడించారు.
ఫిబ్రవరి 2020 నుంచే అమరనాథ్ యాత్ర కోసం మొదలైన ఏర్పాట్లు, లాక్‌డౌన్‌తో దేవాలయాలపై పడిన ప్రభావం, కరోనావైరస్ వ్యాప్తి తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ప్రస్తుతం అమలులోనున్న ఆంక్షలు జులై 31 వరకు కొనసాగుతాయి. జులైలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరగడాన్ని సమావేశంలో చర్చించారు.
"అమరనాథ్ యాత్ర నిర్వహణకు చాలా మంది సిబ్బంది అవసరం అవుతారు. ఇది కరోనావైరస్ కట్టడికి చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం చూపుతుంది. మరోవైపు యాత్రికులకూ వైరస్ వ్యాపించే ముప్పు కూడా ఉంది." అని సమావేశం అభిప్రాయపడింది.
అయితే, ఈ ఏడాది భక్తుల కోసం వర్చువల్ దర్శనానికి ఏర్పాట్లు చేయాలని బోర్డు నిర్ణయించింది.

మొదటి నుంచీ ఆందోళన
ఏటా యాత్రికులకు ఆహ్వానం పలికే కశ్మీరీల్లో ఈసారి ఆందోళన వ్యక్తమైంది. కోవిడ్-19 హాట్‌స్పాట్‌లలో జమ్మూకశ్మీర్ కూడా ఒకటి కావడమే దానికి కారణం. ఇక్కడ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
మరోవైపు ఈ సారి యాత్రికులపై సాయుధులు దాడిచేసే ముప్పుందని భారత సైన్యం కూడా హెచ్చరించింది.
అయితే రోజువారి దర్శనాలను 500కు పరిమితం చేస్తూ యాత్రకు అనుమతించాలని జమ్మకశ్మీర్ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం కొత్త ప్రొటోకాల్ తీసుకొచ్చారు. కేవలం రెండు వారాలు మాత్రమే యాత్రికులను అనుమతించాలని ఆయన సూచించారు. కానీ, ఇప్పుడు మొత్తంగా యాత్ర రద్దయింది.
కశ్మీర్‌లో కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. సగటున రోజూ 500 కేసులు నమోదవుతున్నాయి. మరణిస్తున్నవారి సంఖ్య పదికిపైనే ఉంటోంది. మొత్తం కేసులు 14,000ను మించిపోయాయి. మరణాలు 250 దాటాయి.
గత ఏడాది కూడా రద్దు
గత ఏడాది కూడా ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో.. అమరనాథ్ యాత్ర రద్దయ్యింది.
2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు ప్రకటన వెలువడింది. ఆ తర్వాత కొన్ని రోజులకే అమరనాథ్ యాత్రికులపై దాడి జరిగే ముప్పుందని సైన్యం హెచ్చరించింది.
ఈ ఏడాది కూడా దాడి జరగొచ్చని సైన్యం హెచ్చరించింది. అయితే అత్యంత అప్రమత్తంగా యాత్రను నిర్వహించేందుకు స్థానిక పరిపాలన విభాగం సిద్ధమైంది.
అమరనాథ్ యాత్రికులు వెళ్లే మార్గాలను సిద్ధంచేశామని, మిగతా ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయని గతవారం బీబీసీతో స్థానిక ప్రభుత్వ అధికారి చెప్పారు.
మరోవైపు దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్, కుల్గాం, షోపియాన్, పుల్వామా జిల్లాల్లో వందకుపైగా సాయుధులు క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందిందని సైన్యాధికారి బ్రిగేడియర్ వీఎస్ ఠాకుర్ కూడా వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
రెడ్ జోన్‌లో బేస్ క్యాంప్
"ఉత్తరాఖండ్‌లో ఏటా నిర్వహించే చార్‌ధామ్ యాత్రపై కఠిన ఆంక్షలు విధించారు. కేవలం స్థానికులు మాత్రమే వెళ్లేలా నిబంధనలు తీసుకొచ్చారు. కానీ అమరనాథ్ యాత్రకు దేశం నలుమూలల నుంచీ వస్తారు. అందుకే ఒక్కరికి వైరస్ సోకినా.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దీంతో కశ్మీరీలకు మాత్రమే కాదు.. యాత్రికులందరికీ ముప్పు" అని చరిత్రకారుడు, కాలమిస్టు పీజీ రసూల్ వ్యాఖ్యానించారు.
అమరనాథ్ యాత్రను ఈ సారి చేపట్టాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
యాత్రికులకు తాలాబ్ టుల్లు ప్రధానమైన బేస్‌క్యాంపు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తాన్నీ అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు.
ఆందోళనల నడుమ యాత్రను రద్దు చేస్తున్నట్లు గత నెలలోనే ఆలయ బోర్డు ప్రకటించింది. అయితే కేంద్ర హోం శాఖ జోక్యంపై ఈ ఆదేశాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే నిర్ణయం వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- అమర్‌నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- హైదరాబాదీల్లో నిజాయితీ ఎంత?.. పర్సు దొరికితే తిరిగి ఇచ్చేది ఎందరు?
- హజ్ యాత్ర-మానస సరోవర్ యాత్ర రాయితీ ఒకటేనా?
- మీ నగరం ఎంత వేడిగా ఉంది
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









