ఆంధ్రప్రదేశ్: కోర్టు తీర్పులు... కొత్త జీవోలు, కొనసాగుతున్న ఇంగ్లిష్ మీడియం వివాదం

జగన్

ఫొటో సోర్స్, facebook/YS Jagan Mohan Reddy

    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఏపీలో ఇంగ్లీష్ మీడియం వివాదం, కొత్త జీవో విడుదల చేసిన ప్రభుత్వం, సుప్రీంకోర్టుకి వెళ్లేముందే జీవో ఎలా ఇస్తారంటూ కొందరి అభ్యంతరాలు

ఆంధ్రప్రదేశ్‌లో గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఇంగ్లిష్ మీడియం వివాదం మరో మలుపు తిరిగింది. ఏపీ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సిఫార్సులకు ఆమోదం తెలుపుతూ ఈ జీవో విడుదల చేశారు.

బోధనా మాధ్యమం విషయంలో ఇప్పటికే తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించామని తెలిపిన ప్రభుత్వం వాటి వివరాలను ఎస్‌సీఈఆర్‌టీకి నివేదించింది. దాని ఆధారంగా ఇంగ్లిష్ మీడియానికి అనుకూలంగా ఎస్‌సీఈఆర్‌టీ సిఫార్సులు చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తదుపరి చర్యలు తీసుకుంటారని జీవోలో పేర్కొన్నారు.

అయితే మే 13న విడుదలైన జీవో ఎంఎస్ నెం.24 అర్థరహితమని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు చెప్పిన ప్రభుత్వం, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న సమయంలో విడుదల చేసే ఇలాంటి జీవోలు చెల్లవనే వాదన వినిపిస్తున్నారు.

జీవో

ఇంగ్లిష్ మీడియం వివాదంలో ఐదో జీవో ఇది

ఏపీలో ప్రాథమిక, మాధ్యమిక విద్యా బోధనను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దానికి అనుగుణంగా గత ఏడాది నవంబర్ 5న తొలి జీవో నెం.81 విడుదలైంది. దాని ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఇంగ్లిష్‌లో సాగుతుందని ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్ 20 నాటికి దానిని సవరించారు.

జీవో నెం.85 ప్రకారం వచ్చే విద్యాసంవత్సరంలో 8వ తరగతి వరకూ కాకుండా కేవలం 1 నుంచి 6వ తరగతి వరకూ మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని తెలిపారు. ఆ తర్వాత దానిని ఏటేటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2024-25 విద్యా సంవత్సరం నాటికి 10వ తరగతి వరకూ ఇంగ్లిష్ మాధ్యమాన్ని అమలు చేస్తామని వెల్లండించారు.

దానికి అనుగుణంగా 2019 డిసెంబర్ 13న మరో జీవో వెలువడింది. ఈ జీవో నెం.89 ప్రకారం ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని అన్ని తరగతులకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆ తర్వాత 2020 మార్చి 22న జీవో నెం.15 విడుదల చేశారు. తెలుగు భాషలో కూడా బోధన ఉండేందుకు తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. దాని ప్రకారం ప్రతి మండల కేంద్రంలో ఒక పాఠశాలలో తెలుగు మీడియం కొనసాగుతుందని, ఇతర భాషలకు సంబంధించిన పాఠశాలల్లో కూడా వారి భాషలో బోధన ఉంటుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, http://hc.ap.nic.in/

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులొద్దు-ఏపీ హైకోర్టు

ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో ఎదురుదెబ్బ

ఇంగ్లిష్ మాధ్యమం కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్, బీజేపీ ఏపీ శాఖ అధికార ప్రతినిధి సుధీష్‌ రాంభొట్ల హైకోర్టును ఆశ్రయించారు. చీఫ్‌ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జయసూర్యలతో కూడిన బెంచ్ వివిధ వర్గాల వాదనను విన్న తర్వాత జీవోలు చెల్లవంటూ ఆదేశాలు జారీ చేసింది.

"రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (ఏ)(1) ప్రకారం మాధ్యమం ఎంపిక హక్కు ఉండాలి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా ఆర్టికల్ 19 (1)(జీ) ఉల్లంఘన జరుగుతోంది. మాధ్యమం నిర్ణయించే అధికారం ఎస్‌సీఈఆర్‌టీదే, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు లేదు. పిల్లలను ఏ మాధ్యమంలో చదివించుకోవాలి అనే హక్కు తల్లిదండ్రులకు ఉండాలి. ఒక్కసారిగా అన్ని పాఠశాలలు ఇంగ్లిష్ మీడియంలోకి మారాలనడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే. రాష్ట్రపతి ఆమోదం లేకుండానే జీవోలు సరికాదు" అంటూ ప్రభుత్వ జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఇంగ్లిష్ మీడియం

ఫొటో సోర్స్, iStock

తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ - ఎస్‌సీఈఆర్‌టీ సిఫార్సులు

హైకోర్టు తీర్పు తర్వాత కూడా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం బోధనకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. ప్రభుత్వం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 96.17 శాతం మంది ఇంగ్లిష్ మీడియాన్ని కోరుతూ రాతపూర్వకంగా తెలియజేశారని వెల్లడించింది. మొత్తం 17,97,168 మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా అందులో కేవలం 59,943 మంది మాత్రమే తెలుగు మీడియం కోరుకున్నట్టు ప్రకటించారు.

ఈ అభిప్రాయ సేకరణ తర్వాత ఎస్‌సీఈఆర్‌టీ నివేదికను ప్రభుత్వం కోరింది. దానికి అనుగుణంగా ఎస్‌సీఈఆర్‌టీ నుంచి 56 పేజీల నివేదిక ప్రభుత్వానికి అందింది.

"1 నుంచి 10వ తరగతి వరకూ దశలవారీగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టవచ్చు. తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా 2020-21 నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిష్ మీడియం అమలు చేయవచ్చు. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం పాఠ్యపుస్తకాలకు సంబంధించిన ప్రకియ చేపట్టాం. ప్రతి తరగతిలోనూ తెలుగు భాష తప్పనిసరి కాబట్టి దానికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు సిద్ధం చేశాం. ఉర్దూ, తమిళ, కన్నడ, ఒడియా మాధ్యమాలు కొనసాగుతాయి. ఆ స్కూళ్లలో కూడా తల్లిదండ్రులు కోరుకుంటే సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం బోధన కూడా ఉండాలి" అని నివేదికలో పేర్కొంది.

ఎస్‌సీఈఆర్‌టీ నివేదికకు అనుగుణంగా కొత్త జీవో

హైకోర్టు తీర్పు, ఆ వెంటనే ప్రభుత్వం తరపున అభిప్రాయ సేకరణ, తాజాగా ఎస్‌సీఈఆర్‌టీ నివేదిక వెలువడటంతో పాఠశాల విద్యాశాఖ తరపున ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధనకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు జీవోలో పేర్కొంది.

పాఠశాల విద్య, గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలవుతుంది. మైనార్టీ భాషా మాధ్యమాల పాఠశాలలు మాత్రం ఆయా భాషల్లో యథావిధంగా బోధన కొనసాగిస్తాయి. అక్కడ కూడా విద్యార్థులు కోరుకుంటే సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం బోధన మొదలవుతుందని జీవో నెం.24లో పేర్కొన్నారు.

ఇంగ్లిష్ మీడియం

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయాల కోసమే ఈ జీవో: సుధీష్ రాంభొట్ల

హైకోర్టులో ప్రభుత్వ వాదన చెల్లుబాటు కానందున రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఉత్తర్వులు విడుదల చేసినట్టు కనిపిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సుధీష్‌ రాంభొట్ల వ్యాఖ్యానించారు. తెలుగు మీడియం కొనసాగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆయన తాజా ఉత్తర్వులపై బీబీసీతో మాట్లాడారు.

"జీవో నెం.24 పూర్తిగా అర్థరహితం. జీవో కూడా తప్పిదాలమయం. దానిని కూడా సవరించుకోవాల్సి వచ్చింది. ముందు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిన వాక్యాన్ని సవరించారు" అని సుధీష్ తెలిపారు.

"సుప్రీంకోర్టులో ఇంకా పిటిషన్ వేయలేదు. వేసిన తర్వాత ఏం ఆదేశాలు వస్తాయో తెలియదు. అయినా ముందుగా జీవో విడుదల చేశారు. ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకునే బదులుగా భిన్నంగా వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ హైకోర్టు తీర్పునే అమలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తాం" అని అన్నారు.

హైకోర్టు తీర్పుని గౌరవించాలి

ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుని నీరుగార్చేలా వ్యవహరించడం సరికాదని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు వ్యాఖ్యానించారు.

"హైకోర్ట్ ఆదేశాలు ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్లాలి. లేదంటే ఆ తీర్పును అమలు చేయాలి. ఆ రెండూ కాకుండా విద్యాశాఖలోని ఓ విభాగం ఎస్‌సీఈఆర్‌టీ నివేదిక పేరుతో కొత్త జీవో విడుదల చేయడం విడ్డూరంగా ఉంది. ఈ తీరును పీడీఎఫ్ తరపున ఖండిస్తున్నాం. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి" అని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)