వైజాగ్‌: ఎల్జీ పాలిమర్స్‌లో అదుపులోకి వచ్చిన స్టైరీన్ గ్యాస్ లీకేజీ, ప్రమాదంపై విచారణకు హైపవర్ కమిటీ

విశాఖ గ్యాస్ లీకేజీ

ఫొటో సోర్స్, Getty Images

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ప్రమాదంపై విచారణకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం అనంతరం చేపట్టిన భద్రతా చర్యలపై కూడా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఈ కమిటీకి పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఛైర్మన్‌గా ఉంటారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ సీపీ ఆర్కే మీనా, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ సభ్యులుగా ఉంటారు.

ఐదు అంశాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది.

  • గ్యాస్ లీకేజీకి కారణాలతో పాటు కంపెనీ భద్రతా ప్రమాణాలను పాటించిందో లేదో విచారణ జరపాలి.
  • పరిసర ప్రాంతాలపై ఈ గ్యాస్ లీకేజీ ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందా అనే దానిపై అధ్యయనం చేయాలి.
  • ఒకవేళ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో సూచించాలి.
  • ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్‌లో జరగకుండా అన్ని రకాల పరిశ్రమలు ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో విశదీకరించాలి.
  • ఇలాంటి పరిశ్రమలకు సంబంధించి ఇంకేవైనా సలహాలు, సూచనలు చేయదలిస్తే వాటిని ప్రస్తావించాలి.

నెలరోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించాలని స్పష్టం చేసింది.

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై ఎల్జీ పాలిమర్స్ సంస్థకు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నోటీసులు జారీచేసింది. అలాగే, తక్షణ పరిహారం కింద ముందుగా రూ.50 కోట్లు చెల్లించాలని ఎల్జీ పాలిమర్స్‌ను ఆదేశించింది.

గ్యాస్ లీకేజీ బాధితులకు ప్రాణాపాయం లేదు

గ్యాస్ లీకేజీ బాధితులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు.

విశాఖ కేజీహెచ్‌లో 305 మంది, ప్రైవేట్ హాస్పటళ్లలో 121 మంది చికిత్స పొందుతున్నారని, వారెవరూ వెంటిలేటర్‌పై లేరని నాని అన్నారు. వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని, పూర్తిగా కోలుకున్న తర్వాతే వారిని ఇళ్లకు పంపిస్తామని స్పష్టం చేశారు.

కంపెనీ పరిసర ప్రాంతాల్లో 15వేల మంది ఉండగా, 554 మంది అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు. బాధితులకు పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.

మరోసారి గ్యాస్ లీకేజీ అంటూ వదంతులు

విశాఖ నగరంలో గ్యాస్ లీకేజీ ఆందోళన, భయం రాత్రి కూడా కొనసాగాయి. ఎల్జీ పాలిమర్స్ నుంచి మరోసారి గ్యాస్ లీకవుతున్నట్లు సమాచారం రావడంతో స్థానికులు రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రాంతాలవైపు పరుగులు తీశారు.

గురువారం రాత్రి కూడా ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ విడుదల కావడాన్ని గుర్తించిన స్థానిక అధికారులు వేపగుంట, నాయుడుతోట, కంపెనీ సమీప గ్రామాలను ఖాళీ చేయించారంటూ సోషల్ మీడియాలో కూడా సమాచారం వచ్చింది.

అయితే, గ్యాస్ లీక్ ఏమీ లేదని, ముందు జాగ్రత్తగా 4 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించామని డీజీపీ స్పష్టం చేశారు.

విశాఖ గ్యాస్ లీకేజీ

న్యూట్రలైజర్ కెమికల్‌తో ఎల్జీ పాలిమర్స్ దగ్గరకు చేరుకున్న బృందం తమ పని మొదలుపెట్టే ముందు సమీప గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించాల్సిందిగా సూచించింది.

లీకేజీ ఏమీ లేదని, ఉదయం లీకైన ఛాంబర్ నుంచి అందులో మిగిలిపోయిన గ్యాస్ బయటకు వస్తోందని డీజీపీ వెల్లడించారు.

కూలెంట్‌ను ఛాంబర్‌లోకి పంపించే ప్రక్రియ పూర్తైందని, ఈ ప్రక్రియలో భాగంగా అందులో మిగిలిన గ్యాస్ బయటకు వచ్చిందని నిపుణులు తెలిపారు.

ఎల్జీ పాలిమర్స్ దగ్గర చేపట్టిన చర్యలను పర్యవేక్షించిన అనంతరం, పరిస్థితి పూర్తి అదుపులో ఉంది అని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఉదయం గ్యాస్ లీకేజీ ప్రమాదం నుంచి తేరుకోకముందే మరోసారి లీకేజీ జరిగిందనే వదంతులు రావడంతో విశాఖపట్నంలో బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాత నగర్ తదితర ప్రాంతాల ప్రజలంతా ఇళ్లు వదిలి నగరం వైపు వచ్చారు. ఎల్జీ పాలిమర్స్ పేలిపోతుందనే ప్రచారం కొనసాగటంతో చాలామంది ఇళ్లను వదిలి దూరంగా, బయటి ప్రాంతాలకు వెళ్లిపోయారు.

గ్యాస్ లీకేజీ

పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవాలనే ఆతృతతో విజయనగరం జిల్లా వైపు వాహనాల్లో బయలుదేరారు. వారందరి పేర్లు నమోదు చేసుకొని పోలీసులు ఆ జిల్లాలోకి అనుమతించారు.

పెందుర్తి, మీదుగా ఎస్.కోట, హనుమంతవాక వరకు ఎక్కడ చూసినా రోడ్లన్నీ ప్రజలు, వాహనాలతో నిండిపోయాయి.

ఎయిర్ ఇండియా కార్గో విమానం

ఫొటో సోర్స్, ANI

గ్యాస్ లీకేజీ నివారణకు ప్రత్యేక బృందం రాక

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రత్యేక రసాయనాలు (కెమికల్)ను తీసుకుని ప్రత్యేక బృందం (టెక్నీషియన్స్) ముంబయి, పుణె, నాగ్‌పూర్‌ల నుంచి విశాఖ విమానాశ్రయానికి కార్గో విమానంలో రాత్రి 10:30 గంటలకు చేరుకుంది.

పారా-టెర్షరీ బ్యుటైల్ కెటెకాల్ (పీటీబీసీ) అనే ఈ ప్రత్యేక రసాయనంతో ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన ప్రమాదకర వాయువు స్టైరీన్‌ ప్రభావాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

"ఎయిర్ ఇండియా కార్గో విమానం పీటీబీసీ కెమికల్‌తో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రి 10.30 గంటలకు చేరుకున్న ఈ విమానంలో 9 మంది నిపుణుల బృందం కూడా వచ్చింది. వీరంతా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్దకు బయలుదేరారు" అని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు.

గ్యాస్ లీకేజీ

ఈ కెమికల్ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా వాపిలో తయారవుతుంది. దీన్ని ప్రమాదకర వాయువుల లీకేజీని అరికట్టేందుకు, వాటివల్ల తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.

స్టైరీన్ గ్యాస్ ప్రభావాన్ని తగ్గించేందుకు తమకు పీటీబీసీ కెమికల్ పంపించాల్సిందిగా గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుజరాత్ సీఎం విజయ్ రూపానీని కోరారు.

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుఝామున స్టైరీన్ గ్యాస్ విడుదల కావడంతో సమీప ప్రాంతాల్లోని కొందరు స్థానికులు ప్రాణాలు కోల్పోగా, వందల మంది అస్వస్థతకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)