హైదరాబాద్ రహేజా మైండ్ స్పేస్‌లో డీఎస్ఎమ్ ఉద్యోగికి కరోనా వైరస్ లక్షణాలు

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో రహేజా మైండ్ స్పేస్‌లో న్యూట్రీషియన్, ఆరోగ్య సేవలందిస్తున్న డీఎస్ఎం సంస్థకు చెందిన ఓ ఉద్యోగికి కోవిడ్-19 లక్షణాలు బయటపడ్డాయి.
దీంతో తక్షణం స్పందించిన ఆ సంస్థఆయన్ను వైద్యుల పర్యవేక్షణలో నిర్బంధంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది.
తమ సంస్థ నిబంధనలను అనసరించి అన్ని రకాల జాగ్రత్తల్ని తీసుకుంటున్నామని అలాగే కోవిడ్ -19 లక్షణాలున్న వ్యక్తి కుటుంబ సభ్యులకు, ఆయన సహచరులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని డీఎస్ఎం స్పష్టం చేసింది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ ఉద్యోగులందర్నీ తదుపరి సమాచారం ఇచ్చేంత వరకు ఇంటిదగ్గరే ఉండి పని చెయ్యాలని( వర్క్ ఫ్రమ్ హోమ్) కోరినట్టు సంస్థ తెలిపింది.
కరోనావైరస్ లక్షణాలున్న వ్యక్తి గత ప్రయాణ చరిత్ర ప్రకారం ఆయన గతంలో ఇటలీ వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు రహేజా మైండ్ స్పేస్‌లో ఉన్న ఇతర సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి.
తక్షణం తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపిన కంపెనీలు.. తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు ఇంటి దగ్గర నుంచే (వర్క్ ఫ్రం హోమ్) పని చెయ్యాలని ఆదేశించాయి.

ఫొటో సోర్స్, twitter.com/MinisterKTR/
తెలంగాణలో 47 మందికి కరోనావైరస్ పరీక్షలు
ఐటీ ఉద్యోగి విషయంలో పూణె నుంచి తుది నివేదిక రావాల్సి ఉందని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ సర్వీసెస్, అలాగే సైబరాబాద్ పోలీసు విభాగం తెలిపాయి. ప్రస్తుతం వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశాయి.
తెలంగాణలో తొలి కరోనావైరస్ కేసు బయటపడిన తర్వాత అప్రమత్తమైన ప్రభుత్వం అనేక చర్యల్ని చేపడుతోంది.
అందులో భాగంగా ఇప్పటి వరకు 47 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 45 మందికి కోవిడ్ -19కి సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని తేలినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మరో ఇద్దరి నమూనాలను పూణె లేబొరేటరీకి పంపినట్టు చెప్పారు.
సోషల్ మీడియాలో అనవసరపు ప్రచారాలు చెయ్యవద్దని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేసిన చోట కూడా చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇచ్చామని చెప్పారు.
అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారు పరీక్షల నిమిత్తం నమూనాలను గాంధీ ఆస్పత్రికే పంపాలని కోరారు.
హైదరాబాద్‌లోని కోఠీలో ఉన్న వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మంత్రి చెప్పారు.
మొత్తం నాలుగు కమిటీలు ఏర్పాటు చేశామని , ఒక్కో కమిటీకి ఒక్కో ఐఏఎస్ అధికారి నేతృత్వం వహిస్తారని తెలిపారు. ఎటువంటి సమాచారం కోసమైన 104కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని రాజేందర్ స్పష్టం చేశారు .

ఇవి కుడా చదవండి
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు?
- కరోనావైరస్: ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది?
- మాంసం తింటే కరోనావైరస్ వస్తుందంటూ వదంతులు.. పడిపోయిన చికెన్, మటన్ అమ్మకాలు, ధరలు
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- కరోనావైరస్ లాంటి అంటువ్యాధులు ఇటీవలి కాలంలోనే పుట్టుకొస్తున్నాయి... ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








