తెలంగాణలో తొలి కరోనావైరస్ కేసు నమోదు

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో తొలి కరోనావైరస్ కేసు నమోదయ్యింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.
దీంతో దేశంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య ఐదుకి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో తొలి కరోనావైరస్ కేసు కేరళలో నమోదైన విషయం తెలిసిందే.

తాజాగా ప్రకటించిన ఇద్దరు బాధితుల్లో దిల్లీకి చెందిన వ్యక్తి గతంలో ఇటలీ వెళ్లి రాగా, తెలంగాణకు చెందిన వ్యక్తి గతంలో దుబాయ్ వెళ్లి వచ్చారు. బాధితులు ఇద్దరూ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు.
భారతీయులెవ్వరూ చైనా, ఇటలీ, కొరియా, సింగపూర్ దేశాలకు ప్రయాణించవద్దని మంత్రి హర్షవర్ధన్ సూచించారు. చైనా, ఇరాన్ దేశాలకు ఈ వీసాలతో సహా, ఇతర వీసాలను జారీ చేయడం నిలిపేశామని, పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో వైరస్ ప్రభావితమైన ఇతర దేశాలకు కూడా మున్ముందు ఇది వర్తింపజేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు .
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 21 విమనాశ్రయాల్లోనూ మొత్తం 5,57,431 ప్రయాణీకులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా... 12 భారీ నౌకాశ్రయాల్లోనూ, 65 చిన్న తరహా నౌకాశ్రయాల్లో 12,431 మందికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించినట్లు హర్షవర్ధన్ తెలిపారు .
హైదరాబాద్ యువకునికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స
తెలంగాణలో కరోనావైరస్ సోకిన వ్యక్తి వయసు 24 ఏళ్లు. ప్రస్తుతం ఆ యువకునికి గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక విభాగంలో చికిత్స అందిస్తున్నారు.
ఫిబ్రవరి 20 వరకు ఆయన దుబాయ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేశారు. అక్కడ హాంకాంగ్ వాసులతో కలసి పనిచేయడం వల్ల ఈ వ్యాధి సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.
అక్కడి నుంచి బెంగళూరు వచ్చిన ఆయన అక్కడ 2 రోజులు ఉండి, తిరిగి 22వ తేదీన హైదరాబాద్ వచ్చారు. ఆ తరువాత అనారోగ్య కారణలతో సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు.
అయితే అక్కడి వైద్యులకు అనుమానం వచ్చి గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేయగా, మార్చి ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆ వ్యక్తి గాంధీలో చేరారు. హైదరాబాద్, పుణెలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్టు తేలింది.

జాగ్రత్త పడండి.. భయపడొద్దు- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
కరోనా సోకిన యువకునితో పాటు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో ప్రయాణించిన వారితో పాటు, యువకుని కుటుంబసభ్యులు, ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించిన వారందరినీ ట్రాక్ చేస్తున్నామనీ, వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
ఆ యువకుడు పనిచేసిన బెంగళూరు కంపెనీని అలర్ట్ చేయాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా రాజేందర్ వివరించారు.
కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామనీ, భయపడాల్సిన పని లేదన్నారు.
కరోనావైరస్ అనుమానిత దేశాల జాబితాలో దుబాయ్ లేకపోవడంతో ఆ యువకునికి పరీక్షలు నిర్వహించలేదని మంత్రి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కేసూ నమోదు కాలేదు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకూ ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వెల్లడించారు.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిరంతర పర్యవేక్షణ, నిఘా కొనసాగుతోందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు.
విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు.
కోవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి 263 మంది ప్రయాణికులు వచ్చారని, వారందరినీ ప్రత్యేక పరిశీలనలో ఉంచామన్నారు. వీరిలో 50 మంది వారి ఇళ్లలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, 211 మందికి 28 రోజుల పరిశీలన పూర్తైందని వెల్లడించారు. 11మంది శాంపిళ్లను పరీక్షలకు పంపగా, 10 మందికి నెగటివ్ అని రిపోర్టు వచ్చిందని, మరొకరి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని జవహర్ రెడ్డి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా 3వేలకు పైగా కరోనావైరస్ మరణాలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మరణాల సంఖ్య 3వేలు దాటింది. తాజాగా చైనాలో 42 మంది చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు.
90 శాతం మరణాలు హుబే ప్రావిన్స్‌లోనే సంభవించాయి. సుమారు పది దేశాల్లో మిగిలిన 10 శాతం మరణాలు సంభవించాయి. ఇరాన్‌లో అత్యధికంగా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఆ తరువాత స్థానం యూరోపియన్ హాట్ స్పాట్‌గా భావిస్తున్న ఇటలీది.
ఇప్పటి వరకు కరోనావైరస్ కారణంగా ఇటలీలో 34 మంది మరణించారు. ప్రస్తుతం చైనాలో కంటే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనే ఈ వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంది .
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 90వేల కేసులు నమోదయ్యాయి. ఇటలీలో మొత్తం 1694 కేసులు నమోదయ్యాయి. తమ ఉద్యోగుల్లో ఇద్దరికి వైరస్ సోకిందని వారిని ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో నిర్బంధంలో ఉంచామని ఇటలీలో అమెజాన్ సంస్థ వెల్లడించింది.
బ్రిటన్‌లో 36 కేసులు నమోదు కాగా, దక్షిణ కొరియాలో కొత్తగా 476 కేసులు నమోదయ్యాయి. దీంతో దక్షిణ కొరియాలో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య 4,212కి చేరింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది ?
కరోనావైరస్ వ్యాధి లక్షణాలు సాధారణంగా 60 ఏళ్ల వయసు పైబడ్డ వారిలోనే కనిపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ముఖ్యంగా ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో ఉన్న వారికి ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోందని చెప్పింది.
బాధిత దేశాలన్నీ తక్షణం వీలైనన్ని వెంటిలేటర్లను సిద్ధం చేసుకోవాలని కోవిడ్-19 వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారికి ఆక్సిజన్ థెరపీ ద్వారా మాత్రమే స్వాంతన చేకూర్చవచ్చని స్పష్టం చేసింది.
చైనాలో తొలిసారిగా నమోదైన 44 వేల కేసుల్ని పరిశీలించగా మధ్య వయసు వారితో పోల్చితే వృద్ధుల్లోనే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు పది రెట్లు అధికంగా ఉన్నాయని తమ పరిశోధనలో వెల్లడైనట్టు డబ్యూహెచ్ఓ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- దిల్లీ హింస: రాజకీయ జోక్యానికి దిల్లీ పోలీసులు బలిపశువులయ్యారా? - అభిప్రాయం
- ఇవాంకా ట్రంప్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషాప్ ఎడిట్ ఫొటోలు..
- బాంబే డక్: ‘భారతదేశ చేపల్లో అద్భుతమైన చేప’
- అండర్-19 ప్రపంచకప్ సెమీస్ హీరో యశస్వి జైశ్వాల్... పగలంతా ప్రాక్టీస్, రాత్రి పానీపూరీ అమ్మకం
- పిల్లల్ని కనడానికి సరైన వయసు ఏది?
- కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్‌కు పెరుగుతున్న గిరాకీ
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









