కశ్మీర్‌, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...

డువా , సౌమ్య
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పదిహేడేళ్ళ దువా భట్ ప్రపంచంలోనే అత్యధికంగా మిలిటరీ సిబ్బంది కాపలా కాస్తున్న ప్రాంతాలలో ఒక్కటైన భారత పాలిత కశ్మిర్‌లో నివసిస్తోంది. దువా, దిల్లీలో నివసిస్తున్న18 ఏళ్ల సౌమ్య సాగరిక రెండేళ్ళ కిందట కలం స్నేహితులయ్యారు. ఈ స్నేహం వారికి తమ జీవితాల్లో ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది.

కశ్మీర్‌లో 1989లో తలెత్తిన సాయుధ తిరుగుబాటుతో సైన్యాన్ని మోహరించారు. కశ్మీర్లో తరచూ జరుగుతూ ఉండే దాడుల మూలంగా స్కూల్ మూత పడుతూ ఉండటంతో దువా చదువుకు ఎప్పుడూ ఆటంకాలు కలిగేవి. ఆ విషయాలను ఆమె రాసిన ఉత్తరాల ద్వారా సౌమ్య తెలుసుకుంది. భారత ప్రభుత్వం ఇంటర్నెట్, సోషల్ మీడియా పై ఎప్పటికప్పుడు విధించే ఆంక్షలు ఈ పరిస్థితిని మరింత పెంచాయి.

Presentational grey line
Presentational grey line

భారత ప్రభుత్వం గత ఏడాది ఆగష్టులో ఆర్టికల్ 370 ని సవరిస్తూ కశ్మీర్‌‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. అదే సమయంలో కశ్మీర్లో అనేక స్కూళ్ళు మూత పడ్డాయి, కొన్ని వేల మంది రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీనితో పాటు అక్కడ ఇంటర్నెట్ సేవలని, ఫోన్ లైన్లను కూడా నిలిపేసింది.

ఐదు నెలల తర్వాత ప్రభుత్వం నెమ్మదిగా ఇంటర్నెట్ సేవలని పునరుద్ధరించడం ప్రారంభించడంతో సౌమ్య, డువాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలయ్యాయి.

వారి ఉత్తరాలలో కొన్ని భాగాలు.

ఉత్తరాలు

ప్రియమైన దువా,

దిల్లీ నుంచి నీకు అభినందనలు. ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? మన మధ్య ఉత్తరాలు రాసుకోవడం ఆగిపోవడంతో మనం ఎప్పటికీ కలం స్నేహితులుగా ఉండాలన్న మాటని నిలబెట్టుకోలేకపోయాం. మళ్ళీ నీకు ఉత్తరం రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది.

నీ జీవితంలో, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో గత రెండేళ్లలో చాలా మార్పులు జరిగి ఉంటాయి. సెక్షన్ 370 సవరణ ద్వారా కశ్మీర్‌కి లభించే ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించారని విన్నాను. మీకు ఫోన్లు, ఇంటర్నెట్ పని చేయటం లేదని తెల్సింది.

ఇప్పుడు కాస్త పరిస్థితులు మెరుగుపడి ఉంటాయని అనుకుంటున్నాను. అక్కడ అందరూ క్షేమంగానే ఉన్నారని భావిస్తున్నాను.

కశ్మీర్లో ఒక వీధి నమూనా చిత్రం

ప్రియమైన సౌమ్యా,

కశ్మీర్ నుంచి ఒక వణుకుతో కూడిన అభినందన.

వణుకు ఎందుకంటే ఇక్కడ చాలా చలిగా ఉంది. నేను బాగానే ఉన్నాను. మా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ ఇంటర్నెట్ పని చేయకపోవటం వలన మనం ఉత్తరాలు రాసుకోలేకపోయాము. వ్యాలీ బయట ఉన్నవాళ్ళని సంప్రదించడం మాకు చాలా కష్టంగా మారింది.

నువ్వు కాలేజీలో చేరావని తెలిసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాలాంటి ఎంతో మంది పిల్లలు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అపుడపుడూ ఇంటర్నెట్ సహాయంతో చదువుని కొనసాగించాం. మేము పరీక్షలకు చదవాల్సిన సిలబస్ ఎలా పూర్తి చేసామో ఆ దేవుడికే తెలుసు.

ఇక్కడ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడంతో ప్రజలు అంత ఆనందంగా లేరు. కనీసం మాకు కావల్సిన వారు, బంధువులతో మాట్లాడుకోవడానికి కూడా లేకుండా చేయడం మా మానవ హక్కులని ఉల్లఘించడమే అని నా అభిప్రాయం.

సౌమ్యా... నాతొ పాటు ఇక్కడ నివసించే చాలా మందికి దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల గురించి తెలియదు. సి ఏ ఏ అంటే ఏమిటో అర్ధం చేసుకునేందుకు ఇక్కడ వార్తా మాధ్యమాలు పూర్తి సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాయి. నాకు దాని గురించి ఏమన్నా చెప్పగలవా?

నమూనా చిత్రం

భారత ప్రభుత్వం గత డిసెంబర్ లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఏళ్లుగా వేధింపులు అనుభవించి, భారత్‌లో తప్ప మరెక్కడా ఆశ్రయం పొందలేకపోయిన మైనార్టీలకు ఈ చట్టం పౌరసత్వం కల్పిస్తుంది. ఇది ముస్లింలకు వ్యతిరేకమైన చట్టమని దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. అయితే ప్రభుత్వం దీనిని ఖండిస్తోంది. సౌమ్య, హిందువు అయినప్పటికీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పాల్గొంది.

షహీన్ బాగ్ నమూనా చిత్రం

ప్రియమైన దువా,

ఢిల్లీలో కూడా చలి పెరిగింది కానీ చుట్టూ ఉన్న వాతావరణం మాత్రం చాలా వేడిగా ఉంది. కొన్ని రోజుల క్రితం నేను ఢిల్లీలోని షహీన్ భాగ్ లో జరుగుతున్న నిరసన చూడటానికి వెళ్ళాను. గత 26 రోజులుగా అక్కడ మహిళలు నిరసన చేస్తున్నారు. నిరసన చేస్తున్న వాళ్ళెవరూ యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్లో, ఉద్యమకారులోకాదు. వీళ్లంతా పరదా చాటున ఉండే సాధారణ గృహిణులు. వాళ్ళ పిల్లలు ప్రశాంతంగా బ్రతకడం కోసం వీళ్ళు నిరసనలు చేస్తున్నారు

అక్కడ మహిళల్లో ఉత్సాహం చూస్తే , ప్రజలు మన హక్కుల కోసం పోరాడటానికి సిద్ధమయ్యారని నాకు అన్పించింది

"కశ్మీర్‌ని భారతదేశంలా చేయాలని అనుకున్నారు. కానీ, ఇపుడు భారతదేశమే కశ్మీర్‌లా మారిపోయిందనే నినాదాలు విన్నాను" అని నువ్వు క్రితం సారి రాసిన ఉత్తరంలో రాసావు. అది నిజమే.

ఈ నిరసనలు మొదలైనప్పటి నుంచి దిల్లీ కశ్మీర్‌లా మారిపోయింది. ఇంటర్నెట్ సేవలు, ఫోన్ లైన్లు కూడా అప్పుడప్పుడూ ఆగిపోయాయి. సెక్షన్ 144 విధించారు. కొన్ని చోట్ల రాళ్లు విసరడం, పోలీస్ లాఠీ ఛార్జ్ కూడా చోటు చేసుకున్నాయి. కశ్మీర్ లో నివసిస్తున్న ప్రజల పరిస్థితి ఎలా ఉందొ నాకు ఇపుడు పూర్తిగా అర్ధం అవుతుంది.

నమూనా చిత్రం

ప్రియమైన సౌమ్యా,

సీఏఏ గురించి ఎన్ఆర్‌సీ గురించి నువ్వు చెప్పింది వింటుంటే మనం కాలంలో వెనక్కి వెళ్లిపొతున్నట్లు అన్పిస్తోంది. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇంకా కొంత మందిని మతం, కులం, లింగ బేధం పేరుతొ వివక్ష చూపిస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను.

ఈ నిరసనలు మానవత్వం ఇంకా బ్రతికే ఉందనేందుకు నిదర్శనంగా కన్పిస్తున్నాయి. ఈ విషయం మీద కశ్మీర్లో ప్రస్తుతం నిరసనలు జరగటం లేదు. మా మనస్సులో ఇది తప్పని తెలిసినప్పటికీ, మా వ్యాలీ అవతల జరుగుతున్న పరిణామాలను పట్టించుకునే స్థితిలో లేము. మా గొంతు విన్పించనివ్వకుండా మా హక్కులని గతంలో అణిచివేశారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది.

కొన్ని రోజుల క్రితం నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్, మా పై విధించిన సమాచార నిషేధాన్ని సమర్ధించుకున్నారు. కశ్మీరీలు చెత్త సినిమాలు చూడటం తప్ప వేరే పని ఏదీ ఆన్లైన్ లో చేయరని అన్నారు. తర్వాత క్షమాపణ చెప్పినప్పటికీ ఆ మాటలు ఇంకా మా మనసులోంచి చెరిగిపోలేదు. నిజంగానే అక్కడ ప్రజలు మా గురించి అలా ఆలోచిస్తారా? ఇంటర్నెట్ పని చేయకపోవడం వలన మా సమస్యల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మేము నిజంగానే మిగిలిన దేశానికి కన్పించటం లేదా?

నిరసనల నమూనా చిత్రం

సౌమ్య, డువా ఉత్తరాలలో మతపరమైన విషయాలు చర్చకి వచ్చాయి. 1989-90మధ్య కాలంలో కొన్ని వేల మంది హిందూ పండిట్లుతీవ్రవాదుల భయంతో కశ్మీర్ ని వదిలి రావాల్సి వచ్చింది. శతాబ్దాల నుంచి రెండు మతాల మధ్య నెలకొన్న మతసామరస్యానికి ఇది పెద్ద గండి పెట్టింది.

ప్రియమైన దువా,

కశ్మీర్ ని ఈ దేశపు ఆస్తిగా ఇక్కడి ప్రజలు భావిస్తారు, కానీ అక్కడి ప్రజల గురించి పెద్దగా పట్టించుకోరు. కశ్మీరీ పండిట్ల మీద తీసిన 'శిఖర' సినిమా గురించి గత వారం టీవీలో చర్చ వచ్చింది. వాళ్ళ పరిస్థితుల గురించి గత 30 సంవత్సరాలలో ఎటువంటి చర్చలు జరగలేదు. ఈ సినిమా చూడటానికి ప్రజలు వెళ్లడం గాని దాని గురించి ఇపుడు మాట్లాడతారని గాని నేను అనుకోవటం లేదు.

మన ఉత్తరాల ద్వారా నేను కశ్మీర్ గురించి, ముస్లింల గురించి చాలా తెలుసుకున్నాను. మాకు ఇక్కడ చాలా మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. కానీ, ఈ విషయాలు వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళని బాధపెట్టిన వాళ్లమవుతామేమో అని అన్పిస్తుంది. నేను హిందువుని అయినప్పటికీ ఈ పౌరసత్వ సవరణ చట్టం నన్ను నిరసనలో పాల్గొనేలా చేసింది.

నీ ఉత్తరాల ద్వారా కశ్మీర్ పట్ల నాకున్న అనుమానాలు తొలగిపోయాయి. నాకు కశ్మీర్ గురించి అక్కడ నివసిస్తున్న ప్రజల గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. సొసైటీ, మీడియా చిత్రీకరించిన కశ్మీర్ చిత్రం ఇంతకు ముందు నాలో భయం కల్గించేది. కానీ నీతో మాట్లాడాక నాకు కశ్మీర్ వెళ్లాలని అనిపిస్తోంది. కశ్మీర్ వ్యాలీ కి ఇపుడు ఎవరైనా వెళ్లేందుకు అవకాశం ఉందా?

నమూనా చిత్రం

ప్రియమైన సౌమ్యా,

నేను ఇపుడు ఈ ఉత్తరం సౌదీ అరేబియా నుంచి రాస్తున్నాను. ప్రపంచంలో ఉన్న ముస్లింలంతా మక్కాలో ప్రార్ధనలు చేసుకోవడానికి రావడాన్ని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది.

నీకు కశ్మీర్ గురించి నిజం తెలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వ్యాలీ ఇపుడు (అధికారికంగా) యాత్రికులకు తెరిచారు. కశ్మీర్ ప్రజలు బయట రాష్ట్రాల వాళ్ళకి వ్యాలీ ద్వారాలు ఎపుడూ తెరిచే ఉంచారు.

కశ్మీర్‌లో కన్యార్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ కొండ మీద సర్వ మత ప్రార్ధన మందిరాలు ఉన్నాయి. కొండ కింద భాగంలో గురుద్వారా, మధ్యలో ఒక మందిరం. కొండ మీద ఒక గుడి ఉన్నాయి. మా అమ్మమ్మ గారి ఇల్లు ఆ కొండ దగ్గర్లో ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్కనే ఒక పండిట్ల కుటుంబం ఉండేది. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కలిసి మెలిసి ఎలా జీవించేవారో మా అమ్మ నా చిన్నపుడు చెప్పేవారు.

కశ్మీర్ నిజంగానే ఒక సుందర ప్రదేశం. నేను మక్కా నుంచి కశ్మీర్‌ని శాంతియుత ప్రదేశంగా చేయాలని భగవంతుని కోరుకుంటున్నాను. నా కోరిక నెరవేరుతుందని, నన్ను కలవడానికి నువ్వు కశ్మీర్‌కి వస్తావనే ఆశతో ఈ ఉత్తరాన్ని ముగిస్తున్నాను.

ప్రేమతో

దువా

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)