గుజరాత్: దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించారా

ఫొటో సోర్స్, iStock
గుజరాత్‌లోని హిమ్మంత్‌నగర్ ప్రాంతంలోని మోదాసాలో పందొమ్మిదేళ్ల దళిత యువతిని అపహరించి, అత్యాచారం చేసి హత్య చేశారన్న ఆరోపణలు అక్కడ పెద్ద ఎత్తున నిరసనలకు కారణమయ్యాయి.
మోదాసా పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద సంఖ్యలో దళితులు నిరసనలు చేపట్టారు.
బాధిత యువతి జనవరి 1 నుంచి కనిపించలేదు, అనంతరం 5న ఆమె మృతదేహాన్ని గ్రామంలోని ఓ ఆలయం సమీపంలోని చెట్టుకు వేలాడుతుండగా గుర్తించారు.
అక్కడికి రెండు రోజుల తరువాత 7న పోలీసులు ఆమె మరణంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మోదసాలోని సరయా-దుధాలియా మార్గంలో ఒక చిన్నగుడి ఉంది. ఆ గుడి పక్కనున్న చెట్టుకు ఉరివేసినట్లు ఎఫ్ఐఆర్‌లో ఉంది.
చెట్టుకు మృతదేహం వేలాడుతుండడంతో ఆలయ పూజారి చూసి చుట్టుపక్కలవారిని పిలవగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అపహరణకు గురైనట్లుగా చెబుతున్న యువతి ఈ ఏడాది జనవరి 1 నుంచి కనిపించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘోరం జరిగిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

జనవరి 3నే పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పటికీ తమ నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాలి బంధువు ఒకరు చెప్పారు.
బ్యూటీ పార్లర్ కోర్సులో చేరేందుకు వెళ్లగా కొందరు యువకులు పక్కా వ్యూహంతోనే ఆమెను అపహరించి అత్యాచారం చేసి హతమార్చారని మృతురాలి బంధువులు ఆరోపించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని కోరుతున్నారు.

కాగా యువతి మృతదేహాన్ని జనవరి 5వ తేదీన గుర్తిస్తే 7వ తేదీ వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో పోలీసుల మీద ఆరోపణలు వస్తున్నాయి.
దీనిపై అక్కడి పోలీస్ అధికారి మయాంక్ సింగ్ 'బీబీసీ'తో మాట్లాడుతూ అత్యాచారం, హత్యకు సంబంధించిన సెక్షన్లపై కేసు నమోదు చేయాలని బాధితురాలి బంధువులు కోరారని, కానీ, పోస్ట్ మార్టం పూర్తయి స్పష్టత వచ్చాక 7న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణ చేపడతామని, ఆధారాలు సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపైనా విచారణ జరుపుతామన్నారు.
‘ప్రాథమిక విచారణ లేకుండా కేసు నమోదు చేయొచ్చు’
ఎస్సీలపై అత్యాచారాలు జరగకుండా పోలీసులు అడ్డుకోలేకపోతున్నారని.. చట్టాలను అమలుచేయలేకపోతున్నారని స్థానిక దళిత నాయకులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రపతి ఆర్డినెన్సు ప్రకారం ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే ఎస్సీల నుంచి వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని దళిత హక్కుల కార్యకర్త, న్యాయవాది కేవల్ సింగ్ రాథోడ్ చెప్పారు.
కానీ, పోలీసుల నుంచి సత్వర స్పందన ఉండడం లేదని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్: 'దిశ' బిల్లులకు శాసనసభ ఆమోదం
- బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి
- అత్యాచార నిందితుడిని షూట్ చేస్తే... 'సింగం' అయిపోతారా
- దళితులు: వివక్ష, కట్టుబాట్ల మీద పెరుగుతున్న ధిక్కారానికి కారణమేమిటి? ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయి?
- ‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’
- యువకుడిపై నలుగురి అత్యాచారం... ముంబైలో మూడు గంటల పాటు నరకం
- పీఎస్ కృష్ణన్: ఉద్యోగాన్ని సామాజిక ఉద్యమంలా చేసిన బడుగు వర్గాల బాంధవుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








