పీఎస్ కృష్ణన్: ఉద్యోగాన్ని సామాజిక ఉద్యమంలా చేసిన బడుగు వర్గాల బాంధవుడు - అభిప్రాయం

పీ ఎస్ కృష్ణన్

ఫొటో సోర్స్, Krishnan PS/Facebook

    • రచయిత, జింకా నాగరాజు
    • హోదా, బీబీసీ కోసం

బడుగు వర్గాల కోసం జీవితాంతం కృషి చేసిన రిటైర్డు ఐఏఎస్ ఆఫీసర్ పీఎస్ కృష్ణన్ శనివారం నాడు మృతి చెందారు.

ఆయన ఉద్యోగాన్ని ఉద్యమంగా మార్చుకుని విధులు నిర్వర్తించారు. అందుకే, కేంద్ర ప్రభుత్వోద్యోగం నుంచి రిటైరయినా ఆయన ఉద్యమం చివరిదాకా ఆగలేదు. విధి నిర్వహణ నుంచి ఆయనా విరమణ పొందలేదు. ఈ కారణంతోనే ఆయన చనిపోవడమనేది మాటల్లో చెప్పలేనంత లోటు.

ఎలాగంటే ఎస్‌సీ, ఎస్‌టీ, వెనకబడిన, మైనారిటీ వర్గాలతో అరవై సంవత్సరాల పాటు మమేకమై జీవిస్తూ, కేంద్రంలో వచ్చిన ప్రతి సంస్కరణ వెనక నిలబడి వాటిని నిలబెట్టిన వ్యక్తి ఒక్కసారిగా మన మధ్య లేకుండా పోవడం అనేది ఎంత లోటో చెప్పడం కష్టం.

ఈ వర్గాల హక్కుల కోసం కొందరు క్షేత్ర స్థాయిలో పని చేస్తారు. మరికొందరు పాలన స్థాయిలో పనిచేస్తారు. పీఎస్ కృష్ణన్ (ఐఏఎస్ 1956) రెండో వర్గానికి చెందిన వ్యక్తి.

గత యాభై ఏళ్ళలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీల సంస్కరణల వెనక ఆయన మేధస్సు ఉంది. ఈ సంస్కరణలు కోర్టుకు వెళ్లినప్పుడు ఆయన సలహాదారుడిగా ఉండి కేసులను గెలిపించారు. ఈ సంస్కరణలు అమలు చేయడానికి మార్గదర్శకాలు రూపొందించారు. కోర్టు సూచనల మేరకు ఈ సంస్కరణలను సవరించాల్సి వచ్చినపుడు అక్కడా ఆయనే ముందున్నారు.

అందుకే, ఆయన మరణంతో భారతదేశ బడుగు వర్గాలు ఒక కొండంత అండను కోల్పోయాయి. దీనిని పూరించడం ఎవరి తరం కాదు.

అన్నింటికంటే ముఖ్యంగా జనతా పార్టీ హయాంలో 1978 డిసెంబర్ 20న మండల్ కమిషన్ ఏర్పాటైనప్పడు, 1980లో బీపీ మండల్ తన నివేదికను అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్‌కు సమర్పించినప్పుడు, ఓబీసీలకు 27 శాతం కోటాని అమలుచేయాలని మండల్ చేసిన సిఫారసులను ప్రాసెస్ చేస్తున్నపుడు, మండల్ కమిషన్ నివేదికను అమలుచేస్తామని 1990 ఆగస్టు 7న నాటి ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ లోక్‌సభలో ప్రకటన చేసినపుడు, తర్వాత మండల్ నోటిఫికేషన్ విడుదల చేయడం, తర్వాత వచ్చి కోర్టు కేసులు, క్రీమీలేయర్ నిర్ణయించడం... ఇలా మండల్ కమిషన్ మొత్తం పరిణామానికి ఆయన కేంద్ర కార్యదర్శి గానో, జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్ మెంబర్ గానో, మానవ వనరుల శాఖ సలహాదారుగానో సాక్షిగా ఉన్నారు.

పీ ఎస్ కృష్ణన్

ఫొటో సోర్స్, Neethi Rajan/Facebook

సమాజంలో వచ్చిన దళిత స్పృహ పరిణామానికి గుర్తింపుగా కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ పేరును 1998లో సామాజిక న్యాయం, సాధికారీకరణ శాఖ అంటూ ఆ కాలం ఆకాంక్షలకు తగ్గట్టుగా మార్పు చేయించారు.

కులాల మీద, వాటి చారిత్రక పరిణాం మీద, చట్టాల మీద,కేసుల మీద, గణాంక వివరాల మీద ఆయనకున్న పట్టు అంతా ఇంతా కాదు. ఆయన సాంంఘిక న్యాయ విజ్ఞాన సర్వస్వం. అందుకే పి ఎస్ కృష్ణన్ లేని లోటు పూరించలేనిది.

ఆయన మృతితో దేశంలోని బడుగు బలహీన వర్గాలు ఏమి కోల్పోయాయో అర్థం చేసుకోవచ్చు. పదవీ విరమణ పొందడానికి కొన్ని సంవత్సరాల ముందు మండల్ కమిషన్ నోటిఫికేషన్ మీద సంతకం చేయడం గురించి ఆయన గర్వపడుతూ ఉండే వారు.

1986లో ఆయన కేంద్ర కార్యదర్శిగా ఒకసారి మెదక్ జిల్లాను సందర్శించారు. అపుడు అక్కడ ఒక కుర్ర కలెక్టర్‌ని కలిశారు. ఈ ప్రాంతంలో గ్రామీణ హటళ్లలో రెండు గ్లాసుల వ్యవస్థ ఉందా లేదా అనే ప్రశ్నవచ్చింది. కలెక్టర్‌కు ఈ విషయమే తెలియదు. వెంటనే కలెక్టర్‌ను వెంట పెట్టుకుని కృష్ణన్ ఎక్కడికని చెప్పకుండా బయలు దేరారు.

మార్గమధ్యంలో ఒక రోడ్డు పక్కన హోటల్‌లో కారాపారు. హోటల్లోకి దూరి టీ తాగారు. రెండు గ్లాసుల వ్యవస్థ గురించి వాకబు చేస్తే హోటల్ యజమాని అలాంటిదేమీ లేదన్నారు. కృష్ణన్ హోటలంతా కలియతిరిగి చూరు కింద ప్రత్యేకమైన గ్లాసులుండటం కనుగొన్నారు. తర్వాత అక్కడికి టీ కోసం వచ్చిన కొంత మంది దళితులను అడిగితే, ఆ గ్లాసులు తమకోసం కేటాయించినవని చెప్పారు. ఇది తనకు జ్ఞానోదయమని నాటి కలెకర్ట్ (ఇపుడు రిటైరయ్యారు) ఇపుడు గుర్తుచేస్తుకున్నారు.

పీ ఎస్ కృష్ణన్

ఫొటో సోర్స్, Neethi Rajan/Facebook

ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కాంపొనెంట్, ఎస్టీ సబ్ ప్లాన్ ఏరియాలనేవి ఆయన ఆలోచనలే. కేంద్రంలోని గాని, రాష్ట్రంలో గాని ప్రతి శాఖ ఎస్సీ స్పెషల్ కాంపొనెంట్ పథకం కింద 15 శాతం నిధులు కేటాయించాలి. అలాగే ఎస్టీలకు 6 శాతం నిధులు కేటాయించాలి.

పూర్వం ఈ వర్గాల సంక్షేమం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండింది. అపుడు ఆయన హోంశాఖ జాయింట్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కాంపొనెంట్ పథకాలు రూపొందించిందపుడే. ఈ వర్గాల సంక్షేమంలో ఇదొక మైలురాయి.

ఎస్ టీ జనాభా 50 పైగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తించాలని, అక్కడ గిరిజనుల భూములు గిరిజనేతరులకు ఎట్టిపరిస్థితుల్లో బదిలీ చేయరాదని కట్టుదిట్టమయిన చట్టం తీసుకురావడం ఆయన కృషి ఫలితమే.

పీఎస్ కృష్ణన్ హైదరాబాద్ రాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ అధికారి. అయితే, అపుడు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ జరిగి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో ఆయన ఆంధ్రప్రదేశ్ అధికారి అయ్యారు.

ఆయన పుట్టినది భారతీయ సమాజంలోని అత్యున్నత కులంలో, జీవితాన్నిఅంకితం చేసింది అట్టడుగుకు కులాల సంక్షేమానికి. ఆయన బాబాసాహెబ్ అంబేడ్కర్, గాంధీ, నారాయణ గురు, వివేకానంద, పెరియార్‌ల స్ఫూర్తితో పనిచేశారు. వీరి బోధనల నుంచి తానెలా స్ఫూర్తి పొందిందీ ఆయన తన దగ్గరకు వచ్చిన ప్రతి యువకుడికీ చెబుతూ ఉండేవారు.

ఆయనతో పనిచేయడం చాలా ఉత్తేజకరంగా ఉంటుందని ఆయనతో పనిచేసిన వాళ్లంతా ఒపుకుంటారు. బడుగుల మీద మితిమీరిన ప్రేమ కొందరికి నచ్చకపోయినా ఆయన నిజాయతీ, కార్యదక్షత ఆదర్శమని వాళ్లు ఇప్పటికీ చెబుతారు. ఎపుడూ అధికార దర్పం ప్రదర్శించేవారు కాదు. సింప్లిసిటీకి ఆయన మారు పేరు. అందరిని స్నేహితుల్లా చూస్తారు.

స్వాతంత్య్రం వచ్చిన కొత్త రోజుల్లో ఆయన ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. దళితులలో భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మీద ఈ వర్గాలలో విశ్వాసం పెంపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న రోజులవి. ఈ వర్గాలకు దగ్గిరయినపుడే ఈ సందేశాన్ని తీసుకెళ్లగలమని భావించిన కృష్ణన్ పల్లెలకు వెళ్లినపుడు వాళ్లమధ్యే ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. అంటే, ఇపుడు చెప్పుకుంటున్న పల్లె నిద్రకు ఆద్యుడాయనే.

పీ ఎస్ కృష్ణన్

ఫొటో సోర్స్, Neethi Rajan/Facebook

1957లో కుర్ర ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆయన దళిత వాడలలో ఎక్కువ సేపు గడిపేవారు. ఆయన ఈ వర్గాల మధ్య తిరిగి ప్రతి చోటా వాళ్లను వెనకేసుకురావడం పై ఆఫీసర్‌ ఒకరికి ఏమాత్రం నచ్చలేదు. తన కోపాన్ని ఏకంగా కాన్ఫిడెన్షియల్ రిపోర్టు (సీఆర్) కెక్కించారు.

"Undue partiality to depressed classes, strident advocacy of inter-caste marriages, uses his knowledge of Sanskrit to debunk religion, trusts the words of the villagers rather than village officials, acts in a manner that helps subversive elements."

వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు రామూవాలియా సోషల్ జస్టిస్ శాఖ మంత్రిగా ఉన్నారు. అపుడు ఆయన కొద్ది రోజులు అంబేద్కర్ ఫౌండేషన్ రీసెర్చ్ సెల్‌కు చైర్మన్‌గా ఉన్నారు. కొన్ని ముఖ్యమైన యూనివర్శిటీలలో బాబా సాహెబ్ అంబేడ్కర్ పీఠాలను ఏర్పాటు చేయించి దళిత ఉద్యమాల మీద, అంబేడ్కర్ మీద పరిశోధనలుచేయించేందుకు పథకం తయారు చేశారు.

ఇందులో భాగంగా బాబాసాహెబ్ రాజ్యంగ సభలో చేసిన మూడు ప్రసంగాలను అందమయిన పుస్తకంగా తీసుకువచ్చారు. దీనికి ఆయన ముందుమాట కూడా రాశారు. అయితే, తర్వాత మేనకా గాంధీ మంత్రి అయ్యాక ఈ సెల్ రద్దయింది. ఆయన పథకమేదీ కార్యరూపం దాల్చలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను ప్రకటించడం వెనక, ముస్లింలలో వెనకబడిన కులాలన గుర్తించడం వెనక, ఈ కేసు సుప్రీంకోర్టు కు వెళ్లినపుడు, రిజర్వేషన్లు చెల్లవన్న హైకోర్టు తీర్పు మీద స్టే తీసుకురావడంలో, సమచార సేకరణ పరిశోధన మొత్తం పీఎస్ కృష్ణనే చేశారు.

ఆయన్ని రంగంలోకి తీసుకురావడంలో అపుడు వైఎస్‌ఆర్ ముఖ్య కార్యదర్శి జన్నత్ హుసేన్, మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌టీ రామారావు కూడా కృష్ణన్‌ను ప్రత్యేకమైన గౌరవంతో చూసేవారని చెబుతారు.

(వ్యాసకర్త జింకా నాగరాజు సీనియర్ పాత్రికేయులు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)