JNUలో దాడిపై ఓయూ విద్యార్థుల నిరసన: 'దిల్లీ పోలీసులు బీజేపీ గుప్పిట్లో ఉన్నారు'

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జేఎన్‌యూలో జరిగిన దాడికి వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
సోమవారం మధ్యాహ్నం, సాయంత్రం రెండుసార్లు నిరసనలు జరిగాయి. ఉస్మానియా విద్యార్థి సంఘాలతో పాటూ, కొందరు ఉపాధ్యాయులు, ప్రజా హక్కుల కార్యకర్తలు, ఇతర కాలేజీ విద్యార్థులు కూడా ఈ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

వామపక్ష విద్యార్థి సంఘాలు, దళిత-బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో బీజేపీ, ఏబీవీపీ, ఆర్ఎస్సెస్‌లకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.
నరేంద్ర మోదీ, అమిత్ షాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఏబీవీపీ - ఆర్ఎస్సెస్ వారే ఈ దాడి చేశారని ఆరోపించిన విద్యార్థులు, జేఎన్‌యూ, ఎఎంయూ, జామియా విశ్వవిద్యాలయాల విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. జేఎన్‌యూ యాజమాన్యం, స్థానిక పోలీసుల మద్దతు లేకుండా ఈ దాడి జరగదని వారు వ్యాఖ్యానించారు.

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా ఎన్సీసీ గేటు వైపు వెళ్లడానికి విద్యార్థులు ప్రయత్నించినప్పుడు పోలీసులు కాసేపు అడ్డుకున్నారు.
వాగ్వాదం తరువాత, చివరకు లా కాలేజీ వరకూ వెళ్లడానికి పోలీసులు అనుమతించారు. లా కాలేజీ వరకూ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు అనూహ్యంగా రోడ్డుపై బైఠాయించారు.
దీంతో ఓయూలో స్వల్పంగా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. అక్కడే వివిధ సంఘాల నాయకులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

"దేశ రాజధానిలో విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడి జరగడం అంటే ప్రజలు, విద్యార్థులపై దాడి జరుగుతున్నట్టే. బీజేపీ గూండాలు విద్యార్థులపై దారుణంగా దాడి చేశాయి. ఓటమి తట్టుకోలేకే ఏబీవీపీ ప్యానెల్, కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలపై దాడికి దిగింది. బీజేపీ అధికారంలో ఉంది కదా అని, ఏబీవీపీ ఆడుకుంటోంది. లెఫ్ట్ భావాలు ఉన్న వారిపై ప్రత్యక్ష దాడులు చేస్తున్నారు. దిల్లీ సెంట్రల్ పోలీసులను బీజేపీ తమ గుప్పిట్లో ఉంచుకుంది" అని పీడీఎస్‌యు నాయకుడు ఎల్ ఎన్ రాజు. ఆరోపించారు.

"ఈ చట్టం మైనార్టీలతో పాటూ మూలవాసులకు కూడా వ్యతిరేకం. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం. యూనివర్సిటీలోకి మాస్కులు వేసుకుని రాళ్లతో, రాడ్లతో ఎలా వస్తారు? దానికి వీసీపై చర్యలు తీసుకోవాలి. వారు బయటకు వెళ్లేంత వరకూ స్ట్రీట్ లైట్లు కూడా ఆపేశారు. అంటే ఇదే ప్లాన్ ప్రకారం చేసిందే. అత్యంత కిరాతకంగా దాడి చేశారు. హాస్టళ్లలోకి వచ్చారు. విద్యార్థులకు రక్షణ కల్పించాలి. వారి భావస్వాతంత్ర్య హక్కుకు రక్షణ కల్పించాలి" అని దళిత మైనార్టీ విద్యార్థి సంఘ నాయకుడు డి నరేశ్ అన్నారు.
చివరగా కొందరు విద్యార్థి నేతలు, లా కాలేజీలో దగ్గర అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి నిరసన ప్రదర్శనలు ముగించారు.
ఇవి కూడా చదవండి:
- నిత్య వివాదాల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
- JNU: క్యాంపస్ హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు
- దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా...
- ఈ చట్టంతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు: అమిత్ షా
- ఉరి తాడు ఒక్క బక్సర్ జైల్లోనే ఎందుకు తయారవుతోంది?
- సులేమానీ హత్యతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా.. ఎవరినైనా చంపే హక్కు అమెరికాకు ఉందా
- పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?
- ‘దేశంలో ఎక్కువగా తాగేది తెలుగువాళ్లే’
- మహిళలకు భావప్రాప్తి కలిగిందో లేదో పట్టించుకోనవసరం లేదా - అభిప్రాయం
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








