కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

యడ్యూరప్ప

ఫొటో సోర్స్, facebook/BSYBJP

కర్ణాటకలో ఈనెల 5వ తేదీన 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందింది.

కేంద్ర ఎన్నికల సంఘం అందించిన తాజా సమాచారం ప్రకారం.. భారతీయ జనతా పార్టీ 12 స్థానాల్లో గెలుపొందింది. రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.

ఓట్ల శాతం పరంగా చూస్తే ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం.. బీజేపీకి 50.32 శాతం, కాంగ్రెస్ పార్టీకి 31.5 శాతం, జేడీఎస్‌కు 11.9 శాతం ఓట్లు లభించాయి.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సీట్లు 224

ఇందులో బీజేపీకి 106 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌ (66), జేడీఎస్ (34) కూటమికి 100 మంది సభ్యులు ఉన్నారు.

యడ్యూరప్ప ప్రభుత్వం కొనసాగాలంటే.. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ కనీసం 7 స్థానాల్లో గెలవాల్సి ఉంది. అయితే 12 మంది అభ్యర్థులు విజయం సాధించడంతో బీజేపీ ప్రభుత్వానికి ఇక ఎలాంటి ఇబ్బందీ లేదు.

కాంగ్రెస్, జేడీఎస్ కూటమి అధికారంలోకి రావాలంటే.. ఆ రెండు పార్టీలూ కనీసం 13 స్థానాల్లో గెలవాల్సిన పరిస్థితుల్లో ఈ ఉపఎన్నికలు జరిగాయి. అయితే జేడీఎస్ ఒక్క అభ్యర్థినీ గెలిపించుకోలేకపోగా, కాంగ్రెస్ 2 స్థానాలతో సరిపెట్టుకుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు లభించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లభించలేదు. దీంతో కొద్ది రోజులకే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కుమార స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీకి మద్దతు ఇవ్వటంతో తిరిగి యడ్యూరప్ప సీఎం అయ్యారు.

ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో గతంలో 12 స్థానాలు కాంగ్రెస్‌వి కాగా, మూడు జేడీఎస్‌వి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)